నేటితరం తల్లిదండ్రులకు కంటినిండా నిద్ర దూరమైందా? మన పూర్వీకులు గాఢనిద్ర పోయేవారా?

    • రచయిత, అమండా రుగ్గెరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

పూర్వకాలంలో తల్లిదండ్రులు నిద్రలేమితో పెద్దగా బాధపడకపోయి ఉండొచ్చు. అందుకే నేటితరం తల్లిదండ్రులు కాస్త కునుకు తీయడానికి వీలయ్యే మార్గదర్శకాలను కొంతమంది శాస్త్రవేత్తలు పున: పరిశీలిస్తున్నారు.

తల్లిదండ్రులుగా ఉండటం ఎంత అలసట కలిగిస్తుందంటూ ఓ వ్యక్తి రెడిట్‌లోని పేరేంటింగ్ ఫోరమ్‌లో అడిగిన ప్రశ్నకు 400కు పైగా సమాధానాలు వచ్చాయి.

"ఇది చాలా చాలా అలసట కలిగిస్తుంది. దీనికి అంతం లేదు" అని ఒకరు రాస్తే, వందలాది మంది అదే భావనను వ్యక్తం చేశారు.

ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇంతగా అలసిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో అన్నీ నిద్రకు సంబంధించినవి కాకపోవచ్చు. ఉదాహరణకు అనేక కుటుంబాలు సమాజం నుంచి ఎలాంటి మద్దతు లేకుండానే పిల్లలను పెంచుతున్నాయి. ఓ పక్క ఉద్యోగం, మరోపక్క పిల్లల పెంపకాన్ని ఏకకాలంలో తల్లిదండ్రులు సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది.

మరోపక్క పిల్లలు పుట్టిన తరువాత చాలామంది తల్లిదండ్రుల నిద్రలో మార్పులు రావడం సహజమే. అది పిల్లలకు అర్థరాత్రి పాలు పట్టించాల్సి రావడం వల్ల కావచ్చు, లేదా చిన్నపిల్లలు ఉదయాన్నే 5 గంటలకల్లా నిద్రలేవడంవల్లా కావచ్చు.

మనుషుల ఉనికి మొదలైనప్పటి నుంచి పిల్లల పెంపకం ఉంది. దీన్ని బట్టి చూస్తే తల్లిదండ్రులు వేల సంవత్సరాలుగా నిద్రలేమితో బాధపడుతున్నారని అనుకోవడం సహజం.

కానీ అందుబాటులో ఉన్న ఆధారాలు చూస్తే అది పూర్తిగా నిజం కాకపోవచ్చు. మరి మన పూర్వీకులు భిన్నంగా ఏం చేశారు? నిద్ర విషయంలో వారి నుంచి మనం ఏదైనా నేర్చుకోగలమా?

నిజంగా తల్లిదండ్రులు ఎంతసేపు నిద్ర పోతున్నారు?

రోజూవారీ సంభాషణల్లో తల్లిదండ్రులుగా ఉండటం, నిద్ర లేమి ఒకటే అన్నట్టుగా భావిస్తుంటారు . పిల్లలు పుట్టిన తరువాత నిజంగా తల్లిదండ్రులు ఎంతమేర నిద్ర కోల్పోతారనే విషయంపై ఆధారాలన్నీ స్పష్టంగా ఒకేలా లేవు. అవి సంస్కృతి ఆధారంగానూ మారతాయి.

ఉదాహరణకు ఓ అధ్యయనం మేరకు జర్మనీలో తొలిసారి తల్లులయ్యే మహిళలు తమ బిడ్డ పుట్టిన తరువాత తొలి మూడు నెలల్లో గర్భధారణ ముందు కంటే సగటున ప్రతి రాత్రీ ఒక గంట తక్కువగా నిద్రపోతున్నారు.

మూడునెలల కాలంలో నిద్ర అత్యల్పస్థాయికి చేరుకున్న తరువాత కొంత మెరుగుపడినప్పటికీ ఆరేళ్ల తరువాత కూడా తల్లిదండ్రులిద్దరూ గర్భధారణకు ముందున్న నిద్రాస్థాయిని తిరిగి పూర్తిగా అందుకోలేకపోయారు.

ప్రసవానంతరం తల్లిదండ్రులైనవాళ్లు, కానివాళ్ల మధ్య నిద్రలో ఉండే మొత్తం తేడా మనం ఊహించినంత పెద్దదేమీ కాదు. 40వేలమందిపై నిర్వహించిన ఓ జర్మన్ అధ్యయనంలో ఆరేళ్ల లోపు కనీసం ఒక బిడ్డ ఉన్న తల్లిదండ్రులు ప్రతిరాత్రి సగటున 7గంటలు నిద్రపోతున్నట్లు తేలింది. వీరికంటే పిల్లలు లేని దంపతుల్లో మహిళలు 10 నిమిషాలు, పురుషులు 14 నిమిషాలు ఎక్కువగా మాత్రమే నిద్రపోయారు.

ఇక, 2024లో అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే మేరకు 6ఏళ్ల లోపు పిల్లలున్న తల్లిదండ్రులు సగటున ప్రతి రాత్రి 8 నుంచి 9 గంటలు నిద్రపోతున్నారు. ఇది ఆమోదయోగ్యమైన నిద్రా పరిమితులలోనే ఉంది.

అలాగే ఫ్రాన్స్‌లో 400కుపైగా జంటలపై పిల్లలు పుట్టిన తరువాత 36 నెలలపాటు నిర్వహించిన ఒక అధ్యయనం మేరకు తల్లిదండ్రులిద్దరూ సగటున 8 గంటలకుపైగా నిద్రపోయారు. లేదా అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోయారు. (కానీ కొంతమంది వ్యక్తులు రాత్రిపూట 4.25 గంటలే నిద్రపోగా, మరికొందరు 12గంటలసేపు నిద్రపోయారు)

ఈ డేటాలో వివరాలన్నీ వ్యక్తులు స్వయంగా వెల్లడించినవే కావడంతో వారు తమ నిద్ర కాలాన్ని ఎక్కువగా లేదా తక్కువగా అంచనావేసి ఉండవచ్చు. ఉదాహరణకు నిజంగా నిద్రపోయిన సమయం కాకుండా, మంచంపైకి చేరుకున్నప్పటి నుంచి కూడా లెక్కపెట్టి ఉండవచ్చు.

అయినా మొత్తంగా చూస్తే చాలామంది తల్లిదండ్రులు సరిపడా నిద్రపోతున్నారని, అయితే వ్యక్తిగతంగా చాలా వ్యత్యాసం ఉందని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే పరిశోధకులు, ఆధునిక, ఆహారం కోసం వేటాడే సమాజాల నిద్ర అలవాట్లను పరిశీలించినప్పుడు ఫలితాలు పెద్ద భిన్నంగా కనిపించలేదు.

ఈ మేరకు ఆహారం కోసం వేటాడే మూడు సమాజాలను పరిశీలించినప్పుడు తల్లిదండ్రుల సహా పెద్దవారు ప్రతి రాత్రి 6.9 గంటల నుంచి 8.5 గంటల వరకు మంచంపై ఉన్నారని తెలిసింది. అయితే వారు తరచూ మేల్కొనడం వల్ల నిజంగా నిద్రపోయిన సమయం సగటున 5.7గంటల నుంచి 7.1 గంటల మధ్యనే ఉంది.

ప్రజలు ఆహారం కోసం వేటాడే రోజులను పరిశీలించినప్పుడు తల్లిదండ్రులు రాత్రి ఏడు నుంచి ఎనిమిదిన్నర గంటలు నిద్రపోయారు.

అయితే ఆధునిక, పారిశ్రామిక సమాజాల్లోని తల్లిదండ్రులు, వేట సమాజాల్లోని తల్లిదండ్రులతోపోలిస్తే తాము చాలా ఎక్కువగా అలసిపోయినట్టు, శక్తిహీనులుగా అనుభూతి చెందుతున్నామని నిరంతరం చెబుతున్నారు.

ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

నిద్ర గురించి అవగాహన

ఆహార సేకరణ కోసం వేటపైన ఆధారపడిన సమాజాల్లో పెద్దవాళ్లు చాలా మంది తల్లిదండ్రులే. వాళ్లు తమ నిద్ర పట్ల సంతృప్తిగా ఉన్నారని మానవ పరిణామ శాస్త్రవేత్త డేవిడ్ శాంసన్ చెప్పారు.

ఆయన యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో స్లీప్ అండ్ హ్యూమన్ ఎవల్యూషన్ ల్యాబ్ డైరెక్టర్.

‘ది స్లీప్‌లెస్ ఏప్: ది స్ట్రేంజ్ అండ్ అన్ ఎక్స్‌పెక్టెడ్ స్టోరీ ఆఫ్ హౌ సోషల్ స్లీప్ మేడ్ అజ్ హ్యూమన్’ అనే పుస్తక రచయిత.

ఉత్తర టాంజానియాలో ఆహార సేకరణ కోసం వేటపై ఆధారపడిన హడ్జా సమాజం ప్రజలతో ఆయన మూడు నెలల పాటు నివసించారు. వారి నిద్ర అలవాట్లను అధ్యయనం చేశారు.

"మీరు హడ్జా ప్రజల వద్దకు వెళ్లి మీ నిద్ర బావుందా, బాగాలేదా అని అడిగితే వారు బాగుందని చెబుతారు" అని శాంసన్ తెలిపారు.

దీని విరుద్దంగా ఆధునిక సమాజంలో తల్లిదండ్రులను నిద్ర గురించి అడిగితే వాళ్లు తమ నిద్రకు చాలా తక్కువ మార్కులు వేస్తారు.

ఉదాహరణకు, జర్మన్ అధ్యయనంలో నిద్రా కొలమానాన్ని 0 నుంచి 10గా తీసుకుంటే తల్లులు తమ నిద్రపై 6.57గా తండ్రులు 7.03గా చెప్పారు.

ఫ్రాన్స్‌లో జరిగిన అధ్యయనంలో 3నెలల శిశువులున్న తల్లుల్లో దాదాపు మూడొంతుల మంది తమకు నిద్ర చాలడం లేదన్నారు.

ఆధునిక సమాజంలో తల్లిదండ్రులు ఎక్కువ సార్లు మేల్కొంటున్నారు. అయితే వీరితో పోలిస్తే ఆహారం కోసం వేటాడే సమూహాల్లో ప్రజలు రాత్రివేళల్లో ఎక్కువసార్లు మేల్కొంటున్నారని శాంసన్, ఇతరుల అధ్యయనంలో తెలిసింది.

పారిశ్రామిక విప్లవం తర్వాత అంతరాయం లేని నిద్ర అనే భావనపై దృష్టి పెరిగిందని యూకేలోని డర్హామ్ ఇన్ఫాన్సీ అండ్ స్లీప్ సెంటర్ డైరెక్టర్ హెలెన్ బాల్ చెప్పారు. అంతరాయం లేని నిద్ర అనేది ఇప్పటికీ సార్వజనీన భావన కాదు.

మెక్సికోలోని రెండు గ్రామాలు, మెక్సికో నగరంలోని యువకుల నిద్రను పోల్చే ప్రాజెక్టును హెలెన్ బాల్ పరిశీలించారు.

గాఢ నిద్ర గురించి గ్రామాల్లో ఎవరూ పట్టించుకోవడం లేదు. మెక్సికో సిటీలో ప్రజలకు దీని గురించి అవగాహన ఉందని ఆమె గుర్తించారు.

మన పూర్వీకులకు ఒకేసారి అంతరాయం లేని గాఢ నిద్ర పోవాల్సినంత అవసరం అంతగా లేకపోవచ్చు.

"ఎందుకంటే వాళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగాల్లో ఉండే ఒత్తిడిని ఎదుర్కోలేదు. ఇప్పుడు సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అప్పట్లో అసలు లేనే లేవు" అని హెలెన్ చెప్పారు.

నిద్ర పోయే ప్రదేశం

మనలో చాలా మందితో పోలిస్తే పూర్వకాలంలో తల్లిదండ్రులు నిద్రపోయేందుకు భిన్నమైన మార్గాలను అనుసరించారు.

శాంసన్ హడ్జా ప్రజలతో ఉన్నప్పుడు అమెరికాలో మాదిరిగా పిల్లలను వేరుగా పడుకోబెట్టాలని ప్రోత్సహించారు.

"అలా చెప్పినందుకు వాళ్లు నన్ను పిచ్చివాడిలా చూశారు. అలా చేయడం ఎందుకని వాళ్లు నన్ను ప్రశ్నించారు. ఇలా అడిగినందుకు నాకు చాలా బాధగా అనిపించింది" అని శాంసన్ చెప్పారు.

ప్రపంచంలో అనేక సంస్కృతుల మాదిరిగానే హడ్జా తల్లులు పిల్లలకు పాలిస్తూ నిద్ర పోతారు. దీన్ని 'బ్రెస్ట్ స్లీపింగ్' అంటారని అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని నోట్రేడామ్ యూనివర్సిటీలో మదర్-బేబీ బిహేవియరల్ స్లీప్ లాబొరేటరీ స్థాపకుడు జేమ్స్ మెక్‌కెన్నా చెప్పారు.

"శిశువుల నిద్ర, తల్లుల నిద్ర లేదా బ్రెస్ట్ ఫీడింగ్, నాన్ బ్రెస్ట్ ఫీడింగ్ లాంటివేమీ లేవు. ఇవన్నీ కలిసి సమగ్రంగా ఉంటాయి. తల్లి శరీరమే బిడ్డ నిద్ర పోయే ఆవాసం" అని ఆయన చెప్పారు.

తల్లి నిద్రపై బ్రెస్ట్‌స్లీపింగ్ ప్రభావం గురించి జరిగిన పరిశోధనలో ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

బిడ్డలను తమతో పడుకోబెట్టుకునే తల్లులు, వేర్వేరుగా పడుకునే తల్లుల మధ్య వాస్తవ నిద్ర సమయంలో పెద్దగా తేడా లేదని ఓ అధ్యయనం తేల్చింది. పిల్లల వద్ద పడుకునే తల్లుల నిద్రకు అప్పుడప్పుడు అంతరాయం కలిగినప్పటికీ, వేగంగా నిద్రలోకి జారిపోతారు. ఈ తేడా తల్లుల ఆలోచనల్లోనే ఉంది.

"రాత్రి పూట బిడ్డలు ఎన్ని సార్లు, ఎంత సేపు పాలు తాగుతున్నారో తల్లులు పూర్తిగా గుర్తించలేకపోవచ్చు" అని బాల్ చెప్పారు. పాలిచ్చేటప్పుడు వారు పూర్తిగా మేల్కొని ఉండకపోవచ్చు. లేదా మేల్కొన్న సందర్భాలను సులభంగా మర్చిపోయి ఉండవచ్చు. దీని వల్ల తర్వాతి రోజు వాళ్లు తాజాగా, మరింత విశ్రాంతిగా కనిపించడానికి అదొక కారణం కావచ్చు.

బిడ్డలకు స్థన్యం ఇచ్చే తల్లులలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ విడుదల కావడంవల్ల వారికి నిద్రా నాణ్యత మెరుగైనట్లు అనిపించవచ్చు.బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఈ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ హార్మోన్ వల్ల నిద్ర మత్తు వస్తుంది.

బిడ్డకు స్థన్యం ద్వారా పాలిచ్చే తల్లులు, డబ్బా పాలు పట్టే తల్లుల కంటే 40-45 నిముషాలు ఎక్కువగా నిద్రపోయినట్లు 133 మంది తల్లులపై చేసిన అధ్యయనంలో తేలింది.

పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇచ్చే మహిళలు ప్రసవం తర్వాత మొదటి నెలలో సుమారు 30 నిముషాలు ఎక్కువ నిద్రపోయినట్లు 120 మంది తల్లులపై చేసిన మరో అధ్యయనంలో వెల్లడైంది.

శాంసన్ దీన్ని బలంగా నమ్ముతున్నారు. తమకు కూతురు పుట్టిన తర్వాత మొదటి మూడు నెలల్లో సరైన నిద్ర కోసం శాంసన్ దంపతులు చాలా ఇబ్బంది పడ్డారు.

హడ్జా ప్రజల వద్ద తాను చూసిన బ్రెస్ట్ స్లీపింగ్ విధానాన్ని అనురించిన తర్వాత "మా జీవితం మొత్తం మారిపోయింది" అని చెప్పారు.

"ఆమెకు లేచి కూర్చునే అవసరం లేదు. పూర్తిగా మేల్కోవాల్సిన అవసరం లేదు. బిడ్డ పాలు తాగుతోంది" అన్న ఒక్క భావన మాత్రమే ఉండేది. ఇదే అన్నింటినీ మార్చేసింది. ఆమెకు మెలకువ వచ్చినా వెంటనే నిద్రపోయేది" అని ఆయన చెప్పారు.

అయితే మరి కొన్ని అధ్యయనాల్లో దీనికి భిన్నంగా జరిగింది. బిడ్డ పుట్టిన ఏడాది వరకు తల్లుల నిద్ర గురించి 139 కుటుంబాలపై ఓ అధ్యయనం నిర్వహించారు.

అందులో బిడ్డకు పాలిస్తూ పడుకున్న తల్లులలో చాలా మంది నిద్రకు భంగం కలిగింది. అయితే బిడ్డలు చక్కగా నిద్రపోయారు.

నిద్ర కోల్పోవడం ఫర్వాలేదా?

మిగతా జీవులతో పోలిస్తే సంతానం విషయంలో మానవ జాతిలో వైరుధ్యం ఒకటి ఉంది. మానవ జాతిలో శిశువులకు సంరక్షణ అవసరం ఉంటుందని అమెరికాలోని డేవిస్ యూనివర్సిటీలో ఆంత్రో పాలజీ ప్రొఫెసర్ సారా బ్లాఫర్ హర్డీ చెప్పారు.

మన పూర్వీకులు వేల సంవత్సరాలుగా జీవించిన ఆహారసేకరణ వాతావరణం చాలా కఠినమైనది. ఆ సమయలో మనుషులు ఆహార సంపాదనకే ఎక్కువ మొత్తంలో కేలరీలు, సమయాన్ని వెచ్చించేవారు.

తాజా పరిస్థితులకు భిన్నంగా వారు పిల్లలను కనడానికి, పెంచడానికి అవసరమైన సమయం, వనరుల్ని కేటాయించారు. అందుకు వారికి తగినంత సమయం పుష్కలంగా లభించేది.

"తల్లులు పిల్లలకు సంరక్షణ, పోషణ అందించకపోతే ఈ జీవజాలం అంతరించి పోయేది. ఈ జాతి పరిణామం వృద్ధి చెందేది కాదు" అనేది హార్డీ అభిప్రాయం.

అప్పట్లో పిల్లల పెంపకానికి తల్లిదండ్రులతో పాటు ఇతర బంధువులు, ముఖ్యంగా అమ్మమ్మలు అన్నలు, అక్కలు మాత్రమే కాకుండా, ఆ కుటుంబంతో అంతగా సంబంధం లేని సంరక్షకులు కూడా అందుబాటులో ఉండేవారు.

మధ్య ఆఫ్రికాలోని ఎఫే ప్రజలను పరిశీలించిన ఆంత్రోపాలజిస్టులు 18 వారాల శిశువులు 60% తల్లి కాకుండా వేరొకరి సంరక్షణలో గడుపుతున్నారని, తరచుగా తల్లి కాకుండా వేరొకరి చనుబాలు తాగుతున్నారని గుర్తించారు.

ఆధునిక సమాజంలో ఈ నమూనా చాలా వరకు కనుమరుగైంది. దీనికి బదులుగా డబ్బు చెల్లిస్తే శిశువుల్ని సంరక్షించే కేంద్రాలు పుట్టుకొచ్చాయి.

ప్రస్తుతం చాలా కుటుంబాలు పిల్లల సంరక్షణ, ఉద్యోగం అనే రెండు పనులను ఒకేసారి చేస్తున్నాయి. అమెరికాలో పిల్లలున్న ప్రతి పది కుటుంబాలలో ఐదింటికి పైగా కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ సంపాదిస్తున్నారు.

యూరోపియన్ యూనియన్‌ దేశాల్లో ఈ సంఖ్య ఆరుగా ఉంది. అక్కడ లింగ వివక్ష కూడా కొనసాగుతోంది. పిల్లల సంరక్షణ, ఇంటి పనులలో అధిక భాగం మహిళలపైన పడుతోంది. దీనివల్ల తల్లులు మరింత అలసిపోతున్నారు.

తల్లిదండ్రులుగా మారిన తొలినాళ్లలో నిద్రలేమి వల్ల కలిగే ఒత్తిడిని తట్టుకునేలా మనం మారిపోయాం. ఎందుకంటే మన జాతి మనుగడకు ఇది ఒక పరిణామపరమైన సర్దుబాటు.

"మనకు సానుకూలత, సౌలభ్యాన్ని ఉండేలా, సంక్షోభాలను ఎదుర్కోనేలా పరిణామం చెందాం" అని శాంసన్ చెబుతున్నారు.

అయితే జీవితంలో నిద్ర కోల్పోవడం ఫర్వాలేదనిపించే సందర్భాలు ఉంటాయా?

మానవశాస్త్ర పరిణామక్రమం నుంచి చూస్తే ఇది నూటికి నూరు శాతం అవుననిపిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)