You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ఎస్ఐఆర్' ప్రక్రియను సమర్థించిన సుప్రీంకోర్టు, అధికార ప్రతిపక్షాలు ఎలా స్పందించాయంటే...
ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (ఎస్ఐఆర్) ప్రక్రియను సుప్రీంకోర్టు సమర్థించింది. స్వతంత్ర, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యాంగ సూత్రాల పరిధిలోనే ఎన్నికల సంఘం ఈ చర్యలు చేపట్టిందని బుధవారంనాడు కోర్టు అభిప్రాయపడింది.
'నకిలీ ఓటర్లను' తొలగించే నెపంతో ఎన్నికల సంఘం పౌరసత్వ తనిఖీలు చేస్తోందన్న వాదనను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించలేదు.
అయితే, ఎన్నికల సంఘం ఏకపక్షంగా పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారాలను తన చేతుల్లోకి తీసుకుంటోందని, పార్లమెంటు చేసిన చట్టాలు, నిబంధనల పరిధులను దాటి వ్యవహరిస్తోందని పిటిషనర్ ఆరోపించారు.
బిహార్‌లో 'ఎస్ఐఆర్' రాజ్యాంగ బద్ధతను సమర్థిస్తూ ఇచ్చిన ఈ తీర్పు ప్రభావం భవిష్యత్తులో జరగబోయే ఎస్ఐఆర్‌లపై కూడా పడనుంది.
సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఎస్ఐఆర్ రెండో దశ కూడా ప్రారంభమైంది. ఈ ప్రక్రియ జరుగుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
ఈ తీర్పుపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ.. ఇది న్యాయవ్యవస్థలో 'చీకటి రోజు' అని అభివర్ణించారు.
ఈ తీర్పు తనకు ఆశ్చర్యం కలిగించలేదని పిటిషనర్లలో ఒకరైన యోగేంద్ర యాదవ్ అన్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
'పౌరసత్వంపై తుది నిర్ణయం కాదు'
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి తీర్పునిస్తూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఓటర్ల జాబితాలో పేరు చేర్చడానికి పౌరసత్వాన్ని తనిఖీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని చెప్పారు.
అయితే, ఈ తనిఖీ అనేది ఒక వ్యక్తి పౌరసత్వంపై తుది నిర్ణయం కాబోదని కోర్టు స్పష్టం చేసింది.
ఒకవేళ ఓటరు వద్ద అవసరమైన పత్రాలు లేకపోయినా లేదా తనిఖీల్లో విఫలమైనా.. ఆ వ్యవహారాన్ని పౌరసత్వ చట్టం ప్రకారం తుది నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికార యంత్రాంగానికి ఎన్నికల సంఘం పంపించవచ్చని తెలిపింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం, ఓటర్ల నమోదు నిబంధనల ప్రకారం సాధారణ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పరిధులను ఎస్ఐఆర్ కొంతవరకు విస్తరించిన మాట వాస్తవమేనని, అయితే అంతమాత్రాన దానిని రాజ్యాంగ విరుద్ధమని చెప్పలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
అసాధారణ పరిస్థితుల్లో ఈ ప్రక్రియను చేపట్టినప్పటికీ, ఇది అధికార పరిధిని దాటి చేసిన పని కాదని కోర్టు అభిప్రాయపడింది. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన విధానపరమైన రక్షణలను ఇందులో పాటించినట్లు కోర్టు గుర్తించింది.
ఈ కేసులో 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' (ఏడీఆర్) ఒక పిటిషనర్. వారి తరఫున ప్రశాంత్ భూషణ్, నేహా రాఠీ హాజరయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పౌరసత్వాన్ని నిరూపించుకునే భారాన్ని ఓటర్లపైనే నెట్టివేసిందన్న వారి వాదనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
అయితే, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆమోదించే పత్రాల ఎంపిక విషయంలో సమతుల్యతను పాటించడం అవసరమని కోర్టు స్పష్టం చేసింది.
'న్యాయవ్యవస్థకు చీకటి రోజు'
సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ తీర్పును భారత న్యాయవ్యవస్థలో ఒక 'చీకటి రోజు'గా అభివర్ణించారు.
"ఎట్టకేలకు ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఎస్ఐఆర్ ఆధారంగానే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన కొన్నినెలల తర్వాత ఈ తీర్పు రావడం గమనార్హం. పక్షపాతంతో కూడిన ఎన్నికల సంఘం అత్యంత అపారదర్శకంగా ఈ ప్రక్రియను నడిపింది. దీనిద్వారా 10 శాతానికిపైగా ఓటర్ల పేర్లు తొలగించారు. ఈ తీర్పు భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఒక చీకటి రోజు" అని ప్రశాంత్ భూషణ్ ఎక్స్ లో పేర్కొన్నారు.
ఈ తీర్పు తనకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదని ఎస్ఐఆర్ ప్రక్రియను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న పిటిషనర్ యోగేంద్ర యాదవ్ అన్నారు.
"ఎస్ఐఆర్ వల్ల ఓటర్ల జాబితాలో వచ్చిన తీవ్ర లోపాలను సరిదిద్దకుండానే, బిహార్ ఎన్నికలను ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చిన రోజే ఈ కేసు ఫలితం ఖరారైపోయింది" అని ఆయన అన్నారు.
'ప్రాథమిక ప్రశ్న ఇంకా మిగిలిపోయింది'
సీనియర్ జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయ్ ఎక్స్ పోస్టులో "ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ, ఒక ప్రాథమిక ప్రశ్న ఇంకా మిగిలిపోయింది. ఎస్ఐఆర్ ప్రక్రియ నుంచి వెలుపల మిగిలిపోయిన లక్షలాది మంది నిజమైన భారతీయ పౌరుల పరిస్థితి ఏమిటి? తొందరపాటుగా చేసిన ఎస్ఐఆర్ వల్ల, అందులో వాడినట్లు చెబుతున్న లాజికల్ డిస్క్రిపెన్సీ ఆల్గారిథమ్ వల్ల వారు తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును, సంక్షేమ పథకాల లబ్ధిని కోల్పోవాలా?" అని ప్రశ్నించారు.
"సుప్రీంకోర్టు తీర్పు కేవలం బిహార్ కేసుకే పరిమితమైంది. విచారణ సమయంలో కూడా కోర్టు తన వ్యాఖ్యలు కేవలం బిహార్ ఎస్ఐఆర్ సందర్భంలోనే చేస్తున్నట్లు పదేపదే చెప్పింది. బిహార్ కేసులో లేవనెత్తిన విధానపరమైన అక్రమాలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు’’ అని తీర్పు అనంతరం టీఎంసీ నాయకుడు, న్యాయవాది కల్యాణ్ బెనర్జీ మీడియాతో అన్నారు.
టీఎంసీ నాయకురాలు మహువా మోయిత్రా 'ఎక్స్' పోస్టులో.. "ఈ రోజు బిహార్ ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎన్నికల సంఘం అవ్యవహారిక, తొందరపాటు, వివక్షతో కూడిన చర్యలకు ఆమోదం తెలపడం లాంటిదే" అని పేర్కొన్నారు.
'నిష్పక్షపాత ఎన్నికలకు ఇది అవసరం'
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని బీజేపీ విమర్శించింది. రాహుల్ గాంధీ మొదటి నుంచి ఎస్ఐఆర్‌ను వ్యతిరేకించడానికి కారణం ఆయన చొరబాటుదారులు, నకిలీ ఓటర్ల పక్షాన నిలబడటమేనని పార్టీ ఆరోపించింది.
ఓటర్ల జాబితాను అవకతవకల నుంచి రక్షించడానికి ఎస్ఐఆర్ అవసరమని, సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికల సంఘం ప్రక్రియకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపునిచ్చిందని బీజేపీ పేర్కొంది.
భారతీయ జనతా పార్టీ ఎంపీ సుధాంశు త్రివేది ఈ తీర్పును స్వాగతిస్తూ.. "స్వతంత్ర, నిష్పక్షపాత ఎన్నికలను నిర్ధరించడానికి ఈ ప్రక్రియ ఎంతైనా అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ఇటీవలి సంవత్సరాలలో పట్టణీకరణ, వలసలు, డూప్లికేషన్, కొత్త నివాసితుల రాక వంటి కారణాల వల్ల ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున పేర్ల చేర్పులు, తొలగింపులు జరిగాయి" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)