జర్మనీ: ఈ దేశంలో ఫ్రెండ్స్‌తో బయటికెళితే మన బిల్లు మనమే కట్టుకోవాలి, ఎందుకంటే..

ఫొటో సోర్స్, Serenity Strull
- రచయిత, ఉట్ జుంకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
బెర్లిన్ బార్ల నుంచి బవేరియన్ బీర్ గార్డెన్ల వరకు... జర్మనీలో ఎవరు ఏం తాగారో, ఏం తిన్నారో దానికి ఎవరు ఎంత చెల్లించాలో అనే విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. బిల్లు విడివిడిగా చెల్లించడం అక్కడ స్నేహానికి సంకేతంగా కూడా భావిస్తారు.
జర్మనీలో పర్యటిస్తున్నట్టు ఊహించుకుందాం.అక్కడ కొత్తగా పరిచయమైన స్థానిక స్నేహితుల బృందంతో కలిసి డిన్నర్‌కు వెళ్లాం. అందరూ భోజనం చేశారు. ఒకటి, రెండు డ్రింక్స్ తాగారు. సరదాగా చాలా సేపు గడిపారు.
అంతలో బిల్లు వచ్చింది.
అప్పుడు "సరే, అందరం సమానంగా పంచుకుందాం" అనే మాట ఎవరూ అనరు. దానికి బదులు మొదటి వ్యక్తి తాను ఏమి ఆర్డర్ చేశారో వెయిటర్‌కు చెబుతారు. ఉదాహరణకు "స్పగెట్టి, రెండు బీర్లు" అని చెప్పి వాటికి అయిన ఖర్చును మాత్రమే చెల్లిస్తారు.
తర్వాతి వ్యక్తి తాను తిన్న పిజ్జా, తాగిన వైన్ గ్లాస్‌కు డబ్బులు చెల్లిస్తారు. ఇలా టేబుల్ దగ్గర ఉన్న ప్రతిఒక్కరూ తమ తమ బిల్లులు మాత్రమే చెల్లిస్తారు.

స్నేహితులతో సరదాగా గడిపే సందర్భాల్లో కూడా కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇచ్చే దేశం ఇది.
బిల్లును అందరూ సమానంగా పంచుకునే పద్ధతి ఇక్కడ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అలాగే ఇతర దేశాల్లో కనిపించేలా స్నేహితులంతా ఒకరి తర్వాత ఒకరు అందరికీ డ్రింక్స్ కొనిపెట్టడం కూడా ఇక్కడ అంత సాధారణమైన విషయం కాదు.
అందరూ సమానంగా డబ్బు చెల్లించే పద్ధతికి లేదా ఒకరి తర్వాత మరొకరు డ్రింక్స్ కొనిపెట్టే సంస్కృతికి అలవాటు పడిన సందర్శకులకు ఈ విధంగా ఒక్కో వ్యక్తి తన ఖర్చును విడిగా లెక్కించి చెల్లించడం కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
‘మన బిల్లు మనం కట్టుకోవడమే న్యాయం’
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిపొందిన బీర్ సంస్కృతి ఉన్న దేశంలో అసలు ఒకరికొకరు డ్రింక్స్ ఎందుకు కొనిపెట్టరనే ప్రశ్న సహజంగానే వస్తుంది.
ఎక్కడా లిఖితపూర్వకంగా లేని ఈ నియమం చాలా సాధారణ సందర్భాల్లో కూడా వర్తిస్తుంది.
బెర్లిన్ వంటి స్వేచ్ఛాయుత నగరంలో వేసవి సాయంత్రాల్లో యువత బార్లకు వెళ్లడం కంటే రాత్రి పొద్దుపోయేవరకు తెరిచి ఉండే చిన్న కన్వీనియెన్స్ స్టోర్ అయిన "ష్పేటీ" దుకాణాల బయట గుమిగూడి స్నేహితులతో సమయం గడుపుతుంటారు.
అలాంటి సమయంలో కూడా ఒక వ్యక్తి అందరి కోసం డ్రింక్స్ తీసుకురావడానికి స్టోర్ లోపలికి వెళ్లారంటే ఆయన అందరికీ ఉచితంగా కొనిపెడుతున్నాడని అనుకోవద్దు. అక్కడ కూడా ఎవరు ఎన్ని రౌండ్లకు డబ్బులు చెల్లించారనే లెక్కఉంటుంది.
''ఎవరు ఎన్ని సార్లు డ్రింక్స్ కొన్నారు అన్నది జర్మన్లు కచ్చితంగా లెక్కపెడుతుంటారు" అని బెర్లిన్‌లోని క్రూజ్బెర్గ్ ప్రాంతంలో ఉన్న లగ్జరీ హోటల్ ఒరానియా బెర్లిన్‌కు చెందిన బార్ టెండర్ జూలియన్ బెర్గర్ చెప్పారు.
న్యాయంగా ఉండాలనే భావన, పరిస్థితులపై నియంత్రణ ఉంచుకోవాలనే ఆలోచన ఈ అలవాటు వెనక ఉన్నాయని జర్మన్ మహిళను వివాహం చేసుకున్న ఆస్ట్రియన్ ట్రెండ్ పరిశోధకులు డాక్టర్ హరాల్డ్ పిట్టర్స్ అభిప్రాయపడ్డారు.
అలాగే భవిష్యత్తు గురించి స్పష్టత లేకపోతే ఇతరులకు డ్రింక్స్ కొనిపెట్టడం కొందరికి అసౌకర్యంగా అనిపిస్తుందని ఆయన చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అక్కడ మాత్రం అందరి బిల్లూ మనం కట్టొచ్చు’
"నా అత్యంత సన్నిహిత స్నేహితుల్లో ఇద్దరు జర్మన్లు. మేమంతా బయటకు వెళ్లినప్పుడు ఈ విషయం ఎప్పుడూ చర్చకు వచ్చేది.
ఎంతసేపు అక్కడ ఉంటామో, మొత్తం ఎన్ని రౌండ్లు తాగుతామో తెలియనప్పుడు ఒకరు తర్వాత ఒకరు అందరికీ డ్రింక్స్ కొనిపెట్టే పద్ధతి వారికి నచ్చేది కాదు. ఎవరికివారే తమ ఖర్చు చెల్లించుకుంటే నిరాశకు గురయ్యే పరిస్థితి ఉండదు'' అని డాక్టర్ హరాల్డ్ పిట్టర్స్ విశ్లేషించారు.
''జర్మన్లకు న్యాయం విషయంలో చాలా బలమైన భావన ఉంటుంది. అందరూ ఎవరి ఖర్చు వాళ్లు చెల్లిస్తేనే వాళ్లు సౌకర్యవంతంగా భావిస్తారు. ఒకరి ఖర్చు మరొకరిపై పడడం వాళ్లకు ఇష్టం ఉండదు'' అని బెర్గర్ అంటున్నారు.
అంటే ఖర్చుల విషయంలో ఇలా ఉండడాన్ని వాళ్లు పిసినారితనంగా భావించరు. అది స్నేహాన్ని కాపాడుకునే మార్గమన్నది వాళ్ల అభిప్రాయం
ఈ భావనను వివరించే ఒక జర్మన్ సామెత కూడా ఉంది. "లెక్కలు స్పష్టంగా ఉంటే స్నేహం కూడా బాగుంటుంది" అన్నది ఆ సామెత.
అయితే ప్రతి ఆచారంలోనూ కొన్ని మినహాయింపులు ఉన్నట్టే దీనికీ ఉన్నాయి.
దక్షిణ జర్మనీలోని బీర్ గార్డెన్లలో ఒక లీటర్ బీర్ మగ్‌లో తాగడం సాధారణమైన విషయం. ఇక్కడ ఒకరు తర్వాత ఒకరు స్నేహితులకు డ్రింక్స్ కొనిపెట్టడం ఎక్కువగా కనిపిస్తుంది.
అలాగే జర్మనీలోని సంప్రదాయ ప్రాంతాల్లో, ముఖ్యంగా బవేరియా లో ఒకరికొకరు డ్రింక్స్ కొనిపెట్టడం సాధారణంగా కనిపిస్తుంది.
ముఖ్యంగా సంప్రదాయ కమ్యూనిటీ ఉత్సవాల్లో ఈ పద్ధతి ఉంటుందని పిట్టర్స్ చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఉత్సవాలకు ఆదరణ మళ్లీ పెరుగుతోందని ఆయన అంటున్నారు.
"ఎర్న్టెడాంక్ఫెస్ట్ అనే పంటల పండుగలో ఇతరులకు డ్రింక్స్ కొనిపెట్టడం చాలా సాధారణమైన విషయం. అలాంటిచోట మీకు, మీ భాగస్వామికి మాత్రమే డ్రింక్స్ కొనుక్కుంటే మీరు చాలా పట్టింపులున్న వ్యక్తిగా కనిపిస్తారు'' అని పిట్టర్స్ చెప్పారు.
కొలోన్‌లో జరిగే కార్నివల్, హాంబర్గ్‌లో జరిగే హాఫెన్గెబుర్ట్స్టాగ్ (పోర్ట్ వార్షికోత్సవ వేడుక) వంటి ఉత్సవాల్లోనూ ఇది వర్తిస్తుంది. అంటే అందరూ కలిసి తాగుతూ, నృత్యాలు చేస్తూ ఆనందించే సామూహిక కార్యక్రమాల్లో ఒకరికొకరు డ్రింక్స్ కొనిపెట్టడం సహజం.

ఫొటో సోర్స్, Getty Images
జర్మనీ వెళ్తే ఏం చేయాలంటే...
ఎవరైనా ప్రత్యేకంగా చెప్పనంతవరకు ప్రతి ఒక్కరూ తమ ఖర్చు తామే చెల్లించుకుంటారని భావించడం మంచిదని బెర్గర్ చెప్పారు.
అంటే బిల్లు విడివిడిగా చెల్లిస్తామని వెయిటర్‌ను అడగడానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే చాలామంది వెయిటర్లు ముందుగా అడిగే ప్రశ్న "గెట్రెంట్ ఓడర్ జుసామ్మెన్?" అని. అంటే "విడివిడిగా చెల్లిస్తారా లేక కలిపి చెల్లిస్తారా?" అని
చాలామంది జర్మన్ల నుంచి వచ్చే సహజమైన సమాధానం మాత్రం ఇప్పటికీ ఒకటే..
"గెట్రెంట్, బిట్టె" అంటే "విడివిడిగానే... ప్లీజ్" అని అర్ధం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























