మురసు తుపాను: సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన రద్దు, అధికారులతో సమీక్ష

ఫొటో సోర్స్, AP CMO
పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశమున్న ‘మురసు’ తుపాను ప్రభావంపై ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంపై తుపాను ప్రభావం, వర్షాలు, గాలుల అంచనా, జలాశయాల పరిస్థితిపై చర్చించారు. మురసు తుపాను నేపథ్యంలో ఆయన తన దిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.
విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకారం..నవంబరు 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా. నవంబరు 3న ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం
- తీరం దాటే సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో గాలులు
- నవంబరు 2న దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు.
- నవంబరు 3, 4 తేదీల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
- అత్యంత భారీ వర్షాల అంచనా ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలో 9, కృష్ణాలో 5, ఎన్టీఆర్‌లో 5, బాపట్లలో ఒక మండలం ఉన్నాయి.
- నవంబరు 3న జిల్లా సగటు వర్షపాతం ఏలూరులో సుమారు 179 మిల్లీ మీటర్లు, కృష్ణాలో 163, ఎన్టీఆర్‌లో 161, పశ్చిమ గోదావరిలో 147, గుంటూరులో 119, బాపట్లలో 104 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండవచ్చని అంచనా
- బుడమేరు వద్ద నవంబరు 3న సుమారు 32,500 క్యూసెక్కుల ప్రవాహం రావచ్చని అంచనా. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర జలాశయాల్లో భారీ వరదకు అవకాశం
- బలమైన గాలుల వల్ల 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉన్నట్లు ముందస్తు అంచనా






