జీఎస్ఎల్వీ ద్వారా కక్ష్యలోకి చేరిన ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహం

ఫొటో సోర్స్, ANI
శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.
శుక్రవారం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.ఈ రాకెట్ ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.
జీఎస్ఎల్వీ-ఎఫ్18/ఎన్వీఎస్-03 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలోనిసతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలుఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.
తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్వీఎస్-03 మూడో ఉపగ్రహం. ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్ ద్వారా అందించే నావిగేషన్ సేవలను నిరంతరాయంగా కొనసాగించేందుకు దీన్ని రూపొందించారు.
దేశానికి స్థానం, నావిగేషన్, సమయ నిర్ధరణ సేవలను స్వతంత్రంగా పొందే అవకాశం కల్పించే వ్యూహాత్మక ఉపగ్రహం ఇదని ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ అన్నారు.
నావిగేషన్ ఉపగ్రహాలను సాధారణ ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం కూడా వినియోగిస్తారని ఆయన తెలిపారు. రైళ్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడంతో పాటు వాహనాలు, సముద్ర నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. 'వన్ నేషన్ వన్ టైమ్' ప్రాజెక్టులోనూ ఈ ఉపగ్రహం కీలక భాగమని వివరించారు.
'గగన్' వ్యవస్థతో కలిసి నావిగేషన్ సేవలు అందించడం ద్వారా ప్రపంచ నావిగేషన్ వ్యవస్థలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.

