సంక్షోభాలు వస్తే ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎలా సిద్ధమవుతున్నారు? ఏం చేస్తున్నారు?

బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, సంక్షోభం, సంసిద్ధత, నిత్యావసర వస్తువులు
ఫొటో క్యాప్షన్, స్వీడన్‌కు చెందిన ఆండ్రియాస్ ప్రభుత్వ సలహా‌తో నిత్యావసర వస్తువుల్ని భద్రపరిచారు.
    • రచయిత, గ్రేస్‌ డీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

జాతీయ అత్యవసర పరిస్థితి వస్తే ఇంట్లో ఏమేమి దాచుకోవాలో బ్రిటన్ ప్రభుత్వం కొన్ని సలహాలు ఇచ్చింది.

ఆ తర్వాత కొన్ని షాపుల్లో డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారం, రేడియోలు, టార్చ్ లైట్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.

ఇలాంటి వస్తువులను ముందే దాచి పెట్టుకోవడం బ్రిటన్ ప్రజలకు కొత్త కావచ్చు, కానీ ప్రపంచంలో చాలా చోట్ల ఇది సర్వసాధారణం.

విపరీతమైన వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్న దేశాలు తమ ప్రజలను ముందే సిద్ధంగా ఉండమని చెబుతుంటాయి.

కొన్ని దేశాలైతే ఇందుకు సంబంధించిన పుస్తకాలను నేరుగా ఇళ్లకే పంపుతాయి. మరి ఈ వస్తువులు ఎలా ఉంటాయి? ప్రజలు వీటిని ఎలా చూసుకుంటారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, సంక్షోభం, సంసిద్ధత, నిత్యావసర వస్తువులు
ఫొటో క్యాప్షన్, ఆండ్రియాస్ తన ఇంటి నేల మాళిగలో అత్యవసర పరిస్థితులకు అవసరమైన వస్తువుల్ని సిద్ధం చేసుకున్నారు.

"నాకంత భయమేమీ లేదు" ఆండ్రియాస్ (స్వీడన్)

ముప్పై ఏళ్ల ఆండ్రియాస్‌కు అత్యవసర పరిస్థితుల కోసం వస్తువులు దాచాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు.

కానీ రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఒక పుస్తకం ఆయన ఇంటికి పంపింది.

స్వీడన్‌లోని ప్రతి ఇంటికి పంపిన ఆ పుస్తకంలో "సంక్షోభం లేదా యుద్ధం వస్తే" ఏమేమి దాచుకోవాలి, ఎక్కడ ఎలా ఉండాలి" అనే వివరాలు అందులో ఉన్నాయి.

ఆండ్రియాస్ తన ఇంటి కింద (బేస్‌మెంట్‌లో) ఒక చిన్న నిల్వ ఏర్పాటు చేసుకున్నారు. అందులో క్రాంక్ రేడియో (చేత్తో తిప్పే రేడియో), 10 లీటర్ల నీళ్ల ట్యాంక్, 2,230 స్వీడిష్ క్రోనాల (సుమారు రూ. 21 వేలు) నగదు ఉన్నాయి.

ఇది తనను ఆలోచింపజేసిందని అయితే ప్రభుత్వం చెప్పినవన్నీ తాను చేయలేదని ఆయన చెప్పారు.

"నేను ప్రశాంతంగానే ఉన్నాను. నాకంత భయమేమీ లేదు" అని ఆయన అన్నారు.

బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, సంక్షోభం, సంసిద్ధత, నిత్యావసర వస్తువులు
ఫొటో క్యాప్షన్, డాన్ 3 నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకుంటున్నారు.

'ఆహారం ఉండాల్సిందే' డాన్ (అమెరికా)

డాన్ ఒక ఫిజియోథెరపిస్ట్. ఆయన తండ్రైన తర్వాత ఈ వస్తువులను భద్రపరచడం మొదలుపెట్టారు. వాటి కోసం 6వేల డాలర్లు ( రూ. 5.69 లక్షలు) డబ్బు ఖర్చు చేశారు.

ఆ వస్తువులను తన బేస్‌మెంట్‌లో పెట్టుకున్నారు.

"తండ్రిగా ఇది నా బాధ్యత" అని పదేళ్ల లోపు వయసున్న ఇద్దరు పిల్లలుగల 38 ఏళ్ల డాన్ చెప్పారు.

కొన్నేళ్ల క్రితం చలికాలంలో వారి ఇంటికి మిగతా ప్రాంతంలో సంబంధాలు తెగిపోయాయి.

రెండు రోజుల పాటు కరెంట్ లేదు. అంతకుముందే తాను కొన్ని వస్తువులు దాచినప్పటికీ తన సంసిద్ధతలో చాలా లోపాలు ఉన్నాయని అప్పుడు తెలిసిందని ఆయన చెప్పారు.

డాన్ నిల్వల్లో ఇప్పుడు 150 గ్యాలన్ల నీరు ఉంది. బాత్‌టబ్‌లో ఉంచి నీళ్లు నింపుకునే పెద్ద ప్లాస్టిక్ కంటైనర్లు ఉన్నాయి.

నదుల నీటిని తాగే నీరుగా మార్చే టాబ్లెట్లను కూడా ఆయన భద్రపరిచారు.

ఆయన ఒక పద్ధతి ప్రకారం ఓట్స్, పీనట్ బటర్ వంటి ఎక్కువ కాలం ఉండే ఆహారాన్ని వాడుతూ వాటి స్థానంలో కొత్త వాటిని తెస్తున్నారు.

దీనివల్ల ఆహారం పాడైపోదు. తన కుటుంబానికి మూడు నెలలకు సరిపడా ఆహారం ఆయన వద్ద ఉంది.

డాన్ దగ్గర సోలార్ ప్యానెళ్లు, క్యాంపింగ్ స్టవ్, టెంట్, కట్టెలు ఉన్నాయి. కరెంట్ లేకపోయినా పనిచేసే ఒక పొయ్యిని కూడా కొన్నారు.

రక్తస్రావాన్ని ఆపే వైద్య సామాగ్రిని కూడా భద్రపరిచారు.

అమెరికాలో అత్యవసర పరిస్థితి కిట్‌ను సిద్ధం చేసుకోవాలని కుటుంబ అత్యవసర ప్రణాళికను రూపొందించుకోవాలని వివిధ రకాల ప్రమాదాలు లేదా సంఘటనలు జరిగినప్పుడు ఎలా స్పందించాలో తెలుసుకోవాలని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రజలకు సలహా ఇస్తుంది.

అత్యవసర ప్లాన్ అనగానే "ప్రజలు ఎక్కువగా భయపడతారు" అని డాన్ అంటారు.

కానీ ఆయన దృష్టిలో ఇది కేవలం "బాధ్యతాయుతమైన ఇంటి యజమాని"గా ఉండటమే.

బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, సంక్షోభం, సంసిద్ధత, నిత్యావసర వస్తువులు
ఫొటో క్యాప్షన్, జపాన్‌లో 2024లో వచ్చిన భూకంపం నోటో ద్వీపకల్పానికి నష్టాన్ని కలిగించిన తర్వాత ఆయుమి కిట్‌లో చేరే వస్తువుల సంఖ్య పెరిగింది.

'ప్రతీయేటా నా కిట్‌ మారుతుంది' ఆయుమి (జపాన్)

టోక్యోలో నివసించే ఆయుమి, భూకంపాలు, తుపానులు, తీవ్రమైన వేసవిని తట్టుకునేందుకు కొన్నేళ్లుగా ఒక బ్యాగ్‌ను సిద్ధంగా ఉంచుకుంటున్నారు.

2024 లో జపాన్‌లో వచ్చిన ఒక పెద్ద భూకంపం వల్ల భారీ నష్టం జరిగింది. ఆ తర్వాత ఆయుమి తన నిల్వలను మరింత పెంచారు.

టోక్యో ప్రభుత్వం 68 పేజీల విపత్తు నివారణ గైడ్‌ను ఇచ్చింది. అత్యవసర బ్యాగ్‌లో ఏమేమి ఉంచుకోవాలో అందులో చెబుతుంది.

ఆయుమి తన బ్యాగ్‌లో బట్టలు, టవల్స్, మాస్క్‌లు, డిస్పోజబుల్ చాప్‌స్టిక్స్, క్యాంపింగ్‌లో వాడే డిస్పోజబుల్ టాయిలెట్‌ను ఉంచారు.

"ఇందులో చాలావరకు నేను ఇప్పుడు వాడని పాత వస్తువులే" అని 27 ఏళ్ల ఆయుమి చెప్పారు.

ప్రతియేటా జనవరి 1న ఆమె కుటుంబం ఈ వస్తువులను తనిఖీ చేసి గడువు ముగిసిన ఆహారాన్ని తీసేసి కొత్తవి పెడుతుంది.

బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, సంక్షోభం, సంసిద్ధత, నిత్యావసర వస్తువులు
ఫొటో క్యాప్షన్, నికోల్ బాండ్ అట్లాంటాలో లీడర్‌షిప్ కోచ్‌గా పని చేస్తున్నారు.

'అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా కొన్నాను' నికోల్ (అమెరికా)

"అత్యవసర పరిస్థితి వస్తే ఏం చేయాలి? అనే ఆలోచన నా మనస్సులో ఐదేళ్ల నుంచి ఉంది" అని నికోల్ చెప్పారు.

మారుతున్న వాతావరణం, తుపానులను చూసి ఆమె ఈ నిర్ణయానికి వచ్చారు.

"ఆందోళన పడకండి. సిద్ధంగా ఉండండి" ఇదే తన నినాదమని ఆమె చెప్పారు.

ఆమె క్లీనింగ్ వస్తువులతో పాటు బ్యాటరీలు, పవర్ బ్యాంక్, ఫస్ట్-ఎయిడ్ బాక్స్, రీచార్జ్ ఫ్యాన్లు, దుప్పట్లు కొన్నారు.

భారం కాకుండా ఉండటానికి ఆమె ఒకేసారి కాకుండా "అప్పుడప్పుడు కొంచెం కొంచెం" వస్తువులను కొంటూ తన స్టాక్‌ను పెంచారు.

ఆమె వీటిని బెడ్ కింద, కిచెన్ అరల్లో దాచారు.

బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, సంక్షోభం, సంసిద్ధత, నిత్యావసర వస్తువులు
ఫొటో క్యాప్షన్, తీవ్ర వాతావరణ పరిస్థితులు, యుద్ధాలను ఎదుర్కోవాల్సి రావచ్చని మైకేల్ స్టూట్ ఆందోళన చెందుతున్నారు.

'నా భార్యకు ఇప్పుడు అర్థమైంది' మైకేల్, నెదర్లాండ్స్

మైకేల్ నివసించే ప్రాంతం సముద్ర మట్టం కంటే కింద ఉంది.

వాతావరణ మార్పులతో పాటు యుద్ధాల గురించి కూడా తాను ఆలోచిస్తుంటానని ఆయన చెప్పారు.

తన భార్య, ఐదేళ్ల కొడుకుతో నివసిస్తున్న 39 ఏళ్ల మైకేల్ కొన్నేళ్ల క్రితమే తన కిట్‌ను సిద్ధం చేయడం ప్రారంభించారు. మైకేల్ తన వద్ద ఆహారంతో పాటు కరెంట్ ఇచ్చే పరికరాలను భారీగా ఉంచారు.

ఇంటర్నెట్ కోసం ఆయన దగ్గర 'స్టార్‌లింక్ మినీ' అనే చిన్న శాటిలైట్ పరికరం కూడా ఉంది. ఆయన ఈ వస్తువులను తన ఇంటి అటకమీద ఇంటి కింద ఉండే ఖాళీ స్థలంలో భద్రపరిచారు.

అక్కడ 120 లీటర్ల నీరు, నగదు, ఫస్ట్-ఎయిడ్ కిట్, ఒక జనరేటర్ ఉన్నాయి. ఆహార నిల్వలు ఎప్పుడు పాడవుతాయో తెలుసుకోవడానికి మైకేల్ ఒక యాప్‌ను కూడా తయారు చేసుకున్నారు.

"సిద్ధంగా ఉండటం అంటే భయపడటం కాదు. కరెంట్ పోయినప్పుడు అందరికంటే ప్రశాంతంగా ఉండటమే దీని ఉద్దేశం" అని ఆయన చెప్పారు.

ప్రతి ఇంట్లో కనీసం 72 గంటలకు (మూడు రోజులకు) సరిపడా అత్యవసర నిల్వలు ఉండాలని నెదర్లాండ్స్ అధికారులు కూడా చెప్పారు.

మైకేల్ మొదట్లో వస్తువులు దాచడం చూసి ఆయన భార్య వద్దని చెప్పారు. కానీ ఇప్పుడు ఆమెకు దీని ప్రాముఖ్యత తెలిసింది.

అయితే తమ ఐదేళ్ల కొడుకు భయపడకూడదనే ఉద్దేశంతో షాపుకు వెళ్లడం వీలు కుదరనప్పుడు ఇవి వాడుకోవడానికే దాచి ఉంచినట్లు అతనికి చెప్పారు.

"ప్రతి ఇంట్లో కొన్ని ప్రాథమిక వస్తువులు ఉంటే అత్యవసర సేవల సిబ్బంది నిజంగా సాయం అవసరమైన వారిపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు" అని మైకేల్ అన్నారు.

(హనే తకహషి, రిచర్డ్ ఫ్రాస్ట్ అదనపు సమాచారంతో..)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)