‘గోరక్షకులకు’ జైలు శిక్ష : ముస్లిం మహిళా న్యాయమూర్తికి చంపుతామంటూ బెదిరింపులు

తీర్పును కాకుండా తబస్సుమ్ ఖాన్ మతాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఆమెపై ఆన్‌లైన్ దూషణలు జరిగాయి

ఫొటో సోర్స్, narmadapuram.dcourts.gov.in

ఫొటో క్యాప్షన్, తీర్పును కాకుండా తబస్సుమ్ ఖాన్ మతాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఆమెపై ఆన్‌లైన్ దూషణలు జరిగాయి
    • రచయిత, షెరిలాన్ మోలాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఓ వ్యక్తిపై మూకదాడి చేసి, అతని చావుకు కారణమైన 14మందికి జీవిత ఖైదు విధించినందుకు ఓ భారతీయ న్యాయమూర్తి ఆన్‌లైన్‌లో దూషణలకు, చంపుతామనే బెదిరింపులకు లక్ష్యంగా మారారు.

దాడిచేసినవారిని హత్య, హత్యాయత్నం,అల్లర్లు, అక్రమనిర్బంధం తదితర నేరాల కింద మధ్యప్రదేశ్‌లోని ఓ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తబస్సుమ్ ఖాన్ జూన్ 12న దోషులుగా తేల్చారు.

ఈ నేరం 2022లో జరిగింది. 50 ఏళ్ల నజీర్ అహ్మద్ పశువులను రవాణా చేస్తుండగా, తమను తాము 'గో రక్షకులుగా' ప్రకటించుకున్న కొంతమంది కర్రలు, రాడ్లతో అడ్డగించారు. గోవులను హిందువులు పవిత్రంగా భావిస్తారు. చాలా రాష్ట్రాలలో వీటిని చంపడం అక్రమం.

గోవులను అక్రమరవాణా చేస్తున్నారనే అనుమానంతో ఈ గుంపు అహ్మద్‌ను, అతనితోపాటు ఉన్న మరో ఇద్దరిని వాహనం నుంచి బయటకు లాగి దారుణంగా దాడి చేశారు. అనంతరం అహ్మద్ గాయాలకు చికిత్స పొందుతూ చనిపోగా, మిగిలిన ఇద్దరు ప్రాణాలతో బయటపడి ఏం జరిగిందో కోర్టుకు వివరించారు.

ఈ కేసు మూక దాడికి స్పష్టమైన ఉదాహరణ అని న్యాయమూర్తి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కానీ, ఈ తీర్పుతో ఆమె మతపరమైన విద్వేష ప్రచారానికి లక్ష్యంగా మారారు. తీర్పు వెలువడిన కొన్నిరోజుల తరువాత ఖాన్‌ ఓ ముస్లిం అంటూ బెదిరింపులకు దిగిన వీడియోలు ఆన్‌లైన్‌లోకనిపించాయి. నిందితులు హిందువులు కావడంవల్లే ఖాన్ వారికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆ వీడియోల్లో ఉంది.

తరచూ కోర్టు తీర్పులపై విమర్శలు వ్యక్తమవుతుంటాయి. కానీ ఖాన్‌పై చేస్తున్న విమర్శలు ఆమె తీర్పు వెనకున్న చట్టపరమైన కారణాలను కాకుండా మతంపై దృష్టి సారించాయి. ఆమెపై వస్తున్న దూషణల స్థాయి,న్యాయవర్గాలు ఆమెకు మద్దతుగా నిలిచేలా దారితీసింది. ఆమెకు పోలీసు రక్షణ కల్పించారు.

తీర్పు వెలువడిన తరువాత, శిక్షపడిన నిందితుల కుటుంబసభ్యులు కోర్టు వెలుపల తీర్పుకు వ్యతిరేకంగా నిరసనకు దిగినట్టు, నిందితులను జైలుకు తరలించకుండా పోలీసు కాన్వాయ్‌ను అడ్డుకున్నట్టు వార్తలు వచ్చాయి. ''ఆవులను రక్షించినందుకు'' వారిని శిక్షించారని ఆరోపించారు.

ఆవులను హిందువులు పవిత్రంగా భావిస్తారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆవులను హిందువులు పవిత్రంగా భావిస్తారు

మతపరమైన దూషణలతో వీడియోలు

ఆ తర్వాత ఖాన్‌పై ఆన్‌లైన్‌లో దూషణల ప్రచారం మొదలైంది. హిందూత్వ భావజాలానికి చెందిన పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఖాన్‌ను మతపరమైన దూషణలతో అవమానిస్తూ, ఆమెపై అత్యాచారం చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి.

ఒక వీడియోలో ఓ వ్యక్తి, దోషులుగా తేలిన వారిని 10 రోజుల్లో విడుదల చేయకపోతే దేశవ్యాప్తంగా "రక్తపాతం" జరుగుతుందని హెచ్చరించాడు. ఈ కథనం రాసే సమయానికి కూడా అలాంటి అనేక వీడియోలు ఆన్‌లైన్‌లోనే ఉండి, వేల సంఖ్యలో లైక్‌లు, షేర్లు పొందుతున్నాయి. బెదిరింపులు చేస్తూ, హింసను ప్రేరేపిస్తున్న వారి ముఖాలు, సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలు కూడా ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపించాయి.

హిందూత్వ భావజాలానికి అనుకూలంగా ఉండే హిందీ వార్తా ఛానల్ సుదర్శన్ న్యూస్‌కు చెందిన ఓ యాంకర్, దోషుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. "ఆవులను కాపాడేందుకు అన్నీ పణంగా పెట్టిన తమ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని వారు ఎప్పుడూ ఊహించి ఉండరు" అని ఆయన అన్నారు. అలాగే, "గోరక్షకుల కోసం పోరాడాల్సిన సమయం ఇదే" అంటూ ప్రేక్షకులు"గొంతెత్తాలి" అంటూ పిలుపునిచ్చారు.

తమను తాము గోరక్షణ సంస్థలుగా చెప్పుకునే అనేక సంస్థలు, హిందూత్వ సంస్థలు కూడా ఈ తీర్పుకు వ్యతిరేకంగా భారీ నిరసనలకు దిగాయి.

గోశాల

ఫొటో సోర్స్, Getty Images

‘ మతాన్ని బట్టి తీర్పుల అంచనా తగదు’

జూన్ 22న గౌ రక్షా పరిషత్‌ (స్థూలంగా చెప్పాలంటే 'గోవులను రక్షించే వారి మండలి') పంజాబ్‌లో నిర్వహించిన నిరసనలో ఆందోళనకారులు ఖాన్ దిష్టిబొమ్మను దాడి చేసి దహనం చేశారు. మూడు రోజుల తరువాత ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ బజరంగ్ దళ్ నిర్వహించిన నిరసనలో "గోరక్షకులను" విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఎక్స్‌లో చేసిన పోస్టులో, ఈ వీడియోలు, నిరసనలు కేవలం తీర్పును విమర్శించడం మాత్రమే కాకుండా, "న్యాయాధికారిగా ఖాన్ అధికారాన్ని ఆమె మతపరమైన గుర్తింపునకు పరిమితం చేసి చెల్లనిదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి" అని పేర్కొన్నారు.

"ఆమె ముస్లిం అనే గుర్తింపే తీర్పు చెల్లుబాటును ప్రశ్నించడానికి ప్రధాన ఆధారంగా మారింది. ఇది న్యాయసూత్రాలను తలకిందులు చేసినట్లే. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులను చట్టపరమైన తర్కం ఆధారంగా అంచనా వేయాలి గానీ, ఆ తీర్పు చెప్పిన వ్యక్తి మతాన్ని బట్టి కాదు" అని ఆయన రాశారు.

ఆ తర్వాత కట్జూ మాట్లాడుతూ, తనకు ఖాన్ నుంచి సందేశం వచ్చిందని చెప్పారు. తనకు మద్దతు తెలిపినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారని, తనపై జరుగుతున్న దూషణలు తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయని, తీర్పు ఇచ్చినందుకు తాను ఏదో నేరం చేసినట్టుగా అనిపించిందని ఆమె చెప్పినట్లు వెల్లడించారు.

ఖాన్‌కు ప్రముఖ న్యాయవాదుల సంస్థల మద్దతు కూడా లభించింది. సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (ఎస్‌సీఏఓఆర్‌ఏ), సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) ఆమెపై వచ్చిన బెదిరింపులను ఖండిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

ఎస్‌సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ, న్యాయమూర్తిని బెదిరించడం అత్యంత తీవ్రమైన విషయమని, ఎందుకంటే న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యపు మూల సూత్రాలతో ముడిపడి ఉందని చెప్పారు.

"ఇలాంటివి జరగడానికి అవకాశం ఇస్తే, ఏ న్యాయమూర్తి కూడా న్యాయం చేయలేరు. ప్రజాస్వామ్యంలో న్యాయమూర్తులు తమ విధిని భయం ,పక్షపాతం లేకుండా నిర్వర్తించగలగాలి" అన్నారు.

ఇదిలా ఉండగా, పోలీసు అధికారి సుధాకర్ బరాస్కర్ బీబీసీతో మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రెచ్చగొట్టే వీడియోలను పంచుతున్న వారి కోసం సైబర్ సెల్ గాలిస్తోందని, ఇలాంటి మరిన్ని పోస్టుల కోసం సామాజిక మాధ్యమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

‘ఖాన్‌ భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలి’

అయితే, సుప్రీంకోర్టు న్యాయవాది సంజయ్ హెగ్డే మాత్రం ఖాన్ భద్రతను నిర్థరించేందుకు ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మరింత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వాదించారు.

న్యాయ సంబంధిత వార్తల వెబ్‌సైట్ లైవ్ లాలో ప్రచురించిన వ్యాసంలో, మాజీ న్యాయమూర్తికి వచ్చిన బెదిరింపుల కేసును ఇటీవల ఎలా పరిష్కరించారో ఉదాహరణగా హెగ్డే ప్రస్తావించారు.

బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి గౌతమ్ పటేల్, ముస్లిం సమాజంలోని వారసత్వ వివాదానికి సంబంధించిన 2024 తీర్పు అనంతరం, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా 10 నెలలకుపైగా బెదిరింపులను ఎదుర్కొన్నారు.

అయితే ఓ మూడు న్యాయ సంస్థలు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన బాంబే హైకోర్టు, పటేల్‌కు రక్షణ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే దర్యాప్తును ముంబయి పోలీసు కమిషనర్ పర్యవేక్షించాలని, కేసు పురోగతిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

"హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తికి ప్రభుత్వ రక్షణ, ఆయన కేసుపై న్యాయపరమైన పర్యవేక్షణ అవసరమైతే, జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఓ సెషన్స్ జడ్జికి కూడా అదే వర్తిస్తుంది. ఈ సూత్రం హోదాను బట్టి మారకూడదు. మతాన్ని బట్టి మారకూడదు. ఒక నిర్దిష్ట తీర్పు చుట్టూ నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని బట్టి మారకూడదు" అని హెగ్డే రాశారు.

గతవారం మధ్యప్రదేశ్ హైకోర్టు, ఖాన్‌కు రక్షణ కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఆమెను బెదిరించిన వారి గుర్తింపుపై ఏం పురోగతి సాధించారో వివరించాలని సీనియర్ అధికారులను ఆదేశించింది. ఆమెకు పోలీసు రక్షణను కొనసాగించాలని కూడా ఆదేశించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)