వియత్నాంలో బోటు ప్రమాదం : ‘కిషోర్‌కు 85 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులున్నారు.. వారికి ఇంకా ఈ విషయం చెప్పలేదు’

ఫొటో సోర్స్, UGC
వియత్నాంలోని ప్రముఖ పూ క్వాక్ దీవి వద్ద పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు చనిపోయారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం అందించిన అధికారిక సమాచారం ప్రకారం.. ప్రమాదానికి గురైన టూరిస్టు స్పీడ్ బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు.
మృతులలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యటకులు కూడా ఉండటంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మొత్తంగా ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు చనిపోయారు.
మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, కేరళకు చెందిన ఇద్దరు ఉన్నారు.
బోటులోని మిగిలిన ప్రయాణికులను వియత్నాం రక్షణ సిబ్బంది కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

‘జయలక్ష్మి మృతదేహం తీసుకురావడానికి 3 రోజులు’
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మచిలీపట్నానికి చెందిన గెల్లి కిషోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గెల్లి కిషోర్ భార్య జయలక్ష్మితో కలిసి సెల్‌ఫోన్ కంపెనీ ఏర్పాటు చేసిన వియత్నాం టూర్‌కు వెళ్లారు.
‘‘కిషోర్ నా బాల్య స్నేహితుడు. ట్రిప్‌కు వెళ్లడానికి ముందు మా ఇంట్లో జరిగిన ఓ శుభ కార్యానికి హాజరయ్యారు’’ అని బందరుకు చెందిన న్యాయవాది బాలాజీ మీడియాకు చెప్పారు.
ఈ ప్రమాదంలో జయలక్ష్మి మృతి చెందగా, కిషోర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
‘‘జయలక్ష్మి మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు చెప్పారు’’ అని బాలాజీ తెలిపారు
కిషోర్ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏడాది క్రితం కూతురికి పెళ్లి చేశారు.
‘‘ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో ఉన్న వారి కుమారుడు ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే వియత్నాం బయలుదేరి వెళ్లారు’’ అని బాలాజీ వివరించారు.
'కంపెనీ అందించిన టూరిజం ప్యాకేజీలో భాగంగా సెల్‌ఫోన్ డీలర్లు అందరూ వియత్నాం వెళ్లారు. అందులో నా స్నేహితుడు గెల్లి కిషోర్, ఆయన భార్య కూడా ఉన్నారు. కిషోర్‌కు 85 ఏళ్ల వయస్సున్న తల్లిదండ్రులు ఉన్నారు. వారికి ఈ విషాద ఘటన గురించి ఇంకా చెప్పలేదు. కిషోర్ ఐసీయూలో ఉన్నారు’’ అని బాలాజీ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, PTI
ఏపీకి చెందిన మృతుల వివరాలు
ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నల్లపేట ఆదిశేషయ్య రవితేజ (హిందూపూర్), ముడియం శ్రీధర్ (కడప), గెల్లి జయలక్ష్మి (మచిలీపట్నం) చనిపోయినట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, UGC
‘ ఆ వార్త నిజం కాకూడదనుకుంటున్నాం’
లావా డిస్ట్రిబ్యూటర్స్ ఏర్పాటు చేసిన ట్రిప్‌లో భాగంగా హిందూపురానికి చెందిన తన తమ్ముడు రవితేజ, జులై 8న వియత్నాంకు వెళ్లారని ఆయన సోదరుడు బీబీసీతో చెప్పారు.
'పడవ ప్రమాదంలో దురదృష్టవశాత్తు రవితేజ చనిపోయారని చెబుతున్నారు. కానీ, మాకు నమ్మకం కుదరడం లేదు . దీని గురించి మాకు అధికారిక సమాచారం ఏమీ అందలేదు. ఈ వార్త నిజం కాకూడదని మాత్రం దేవుడిని కోరుకుంటున్నాం' అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























