బంగ్లాదేశ్‌లో వస్త్ర కార్మికుల సమ్మె, ఫ్యాక్టరీల మూసివేత.. ఇండియాలో రెడీమేడ్ దుస్తుల ధరలు పెరగనున్నాయా

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, డాన్ సేల్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
బంగ్లాదేశ్‌లోని ప్రధాన వస్త్ర తయారీ కేంద్రాల్లో మెరుగైన కనీస వేతనం కోసం కార్మికులు సమ్మెకు దిగడంతో డజన్ల కొద్దీ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.
వారాంతంలో దేశవ్యాప్తంగా దాదాపు 150 ఫ్యాక్టరీలను మూసివేశారు.
ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకు కేంద్రాలైన సావర్, అషులియా, గాజీపూర్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది.
బంగ్లాదేశ్‌కు వస్త్ర పరిశ్రమ ప్రధాన ఆదాయ వనరు. ఏటా దాదాపు 40 బిలియన్ డాలర్ల (రూ. 3.7 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులు ఈ రంగం ద్వారా జరుగుతున్నాయి. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) 10 శాతం వాటా ఈ పరిశ్రమదే.
నెలకు కనీస వేతనాన్ని 30 వేల టాకాలకు (రూ. 22,600) పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలవారీ కనీస వేతనం 12,500 టాకాలుగా ఉంది. అయితే పెరుగుతున్న జీవన వ్యయాలను తట్టుకోవడానికి ఈ మొత్తం సరిపోవడం లేదని కార్మికులు చెబుతున్నారు.
ఆదివారం ఉదయం గాజీపూర్‌లోని ఢాకా-టాంగైల్ జాతీయ రహదారిపై కార్మికులు పెద్ద సంఖ్యలో గుమిగూడి రాకపోకలను అడ్డుకున్నారు. వారి ఆందోళనతో దాదాపు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు.

ఉత్పత్తి కార్యకలాపాలకు ఆటంకం కలిగినప్పుడు ఫ్యాక్టరీల యజమానులు కార్యకలాపాలను నిలిపివేసి, కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఉండేందుకు బంగ్లాదేశ్ కార్మిక చట్టాల్లోని 'పని లేకపోతే.. వేతనం లేదు' (నో వర్క్.. నో పే) నిబంధన వీలు కల్పిస్తోంది.
కార్మికులు విధులకు హాజరుకాకుండా సమ్మెకు దిగడంతో నగరంలోని ఫ్యాక్టరీలను మూసివేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ మొహమ్మద్ అమ్జద్ హుస్సేన్ బీబీసీకి తెలిపారు.
శనివారం రాత్రి 13 ఫ్యాక్టరీలను మూసివేశామని, ఆదివారం ఉదయం జరిగిన ఆందోళనల సమయంలో మరో 16 ఫ్యాక్టరీలు మూతపడ్డాయని ఆయన చెప్పారు.
రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో రెండో స్థానం
బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో దాదాపు 40 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. హెచ్ అండ్ ఎం, ప్రైమార్క్, జారా వంటి అంతర్జాతీయ బ్రాండ్ల కోసం వీరు దుస్తులు తయారు చేస్తున్నారు.
చైనా తర్వాత ప్రపంచంలోనే రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుత ఆందోళనలు ఎక్కువ కాలం కొనసాగితే అంతర్జాతీయ కొనుగోలుదారులపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఫ్యాక్టరీలకు రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్ గార్మెంట్ తయారీదారులు, ఎగుమతిదారుల సంఘం (బీజీఎంఈఏ), బంగ్లాదేశ్ నిట్‌వేర్ తయారీదారులు, ఎగుమతిదారుల సంఘం (బీకేఎంఈఏ) ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
వేతనాల నిర్ణయానికి సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నప్పటికీ, ఫ్యాక్టరీలకు రక్షణ కల్పిస్తామనే హామీ లేకపోవడంపై బీజీఎంఈఏ, బీకేఎంఈఏ అభ్యంతరం వ్యక్తం చేశాయని ఆ సంస్థ అధ్యక్షుడు మొహముద్ హసన్ ఖాన్ తెలిపారు.
"ఆందోళనల కారణంగా ఉత్పత్తిని కొనసాగించలేకపోతున్న వస్త్ర పరిశ్రమ ఫ్యాక్టరీలను రేపటి నుంచి నిరవధికంగా మూసివేస్తాం. ఇందుకు బంగ్లాదేశ్ కార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని ఆయన చెప్పారు.
'కార్మికుల ప్రయోజనాలు బలిచేస్తున్నారు'
అయితే, తక్కువ ధరలకు ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో పోటీ పడే క్రమంలో కార్మికుల ప్రయోజనాలను బలిచేస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
ఫ్యాక్టరీ యజమానులు, అంతర్జాతీయ రిటైలర్లు లాభాలు పొందుతుంటే, ఏళ్ల తరబడి కార్మికులే ఆ భారాన్ని మోస్తున్నారని గార్మెంట్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఉపాధ్యక్షురాలు జోలీ తాలూక్దార్ బీబీసీ న్యూస్‌అవర్‌తో అన్నారు.
"తాము బతకడానికి సరిపడా వేతనం ఇవ్వాలని మాత్రమే కార్మికులు కోరుతున్నారు. ఇంత ప్రాథమికమైన, న్యాయమైన డిమాండ్‌ను ఏ మానవత్వం ఉన్న వ్యక్తి వ్యతిరేకించగలరు?" అని ఆమె ప్రశ్నించారు.
కార్మికుల కనీస వేతనాన్ని సవరించేందుకు సిఫార్సులు చేయడానికి నవంబర్ 1న ప్రభుత్వం ఒక వేతన మండలిని ఏర్పాటు చేసింది.
సీనియర్ జిల్లా న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన ఈ మండలి.. నవంబర్ నెలాఖరులోగా కొత్త వేతన విధానంపై సిఫార్సులను ఖరారు చేస్తామని తొలి సమావేశంలో వెల్లడించింది.
కొత్త వేతన విధానం అమల్లోకి వస్తే డిసెంబర్ 1 నుంచి అది అమలవుతుందని భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























