వ్యాపారాలకు అనుకూలంగా ఉండే సింగపూర్‌కు జెన్సన్ హ్వాంగ్ వివాదం తలనొప్పిగా మారనుందా?

సింగపూర్, అమెరికా, చైనా , ఎన్విడియా, జెన్సన్ హ్వాంగ్, అలైస్ హ్వాంగ్, మెగా స్పీడ్
    • రచయిత, టెస్సా వాంగ్, ఒస్మాండ్ చియా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హ్వాంగ్ సింగపూర్‌కు చెందిన ఒక అనుమానిత చైనా గూఢచారికి సంబంధించిన పెద్ద కుంభకోణం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఈ ఉదంతం ప్రపంచ చిప్ కేంద్రంగా సింగపూర్ సాధించిన విజయంతో పాటు అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారిందన్న ఆరోపణలపై దృష్టి సారించేలా చేసింది.

వివాహేతర బంధంలో ఉన్నట్లు అంగీకరించిన తర్వాత హ్వాంగ్ గురువారం అమెరికన్ చిప్ దిగ్గజం ఎన్విడియా నుంచి తప్పుకున్నారు.

ఎన్విడియా చిప్‌లను భారీగా కొనుగోలు చేసే సింగపూర్ డేటా సెంటర్ కంపెనీ 'మెగాస్పీడ్' నిర్వహకురాలు ఆలిస్ హ్వాంగ్‌తో ఆయనకు సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

దశాబ్దాలుగా సింగపూర్ ఎంతో శ్రమతో అమెరికా, చైనా మార్కెట్లకు సులభంగా ప్రవేశం కల్పించే స్వేచ్ఛాయుత వ్యాపార అనుకూల ఆర్థిక వ్యవస్థగా పేరు సంపాదించుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో ఇటీవలి కాలంలో అధునాతన సెమీకండక్టర్ చిప్‌ల వ్యాపారానికి ఇది ప్రధాన కేంద్రంగా మారింది.

గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్విడియాకు సింగపూర్ రెండో అతిపెద్ద బిల్లింగ్ కేంద్రంగా నిలిచింది. ఈ అమెరికన్ చిప్ దిగ్గజం సంపాదించే దానిలో దాదాపు ఐదో వంతు వాటా సింగపూర్ నుంచే వస్తోంది.

అయితే గమనించదగ్గ విషయం ఏమిటంటే దాని ఆదాయంలో 1శాతం కన్నా తక్కువ మాత్రమే సింగపూర్‌లోకి ప్రవేశించిన చిప్‌ల నుంచి వచ్చింది.

సింగపూర్, అమెరికా, చైనా , ఎన్విడియా, జెన్సన్ హ్వాంగ్, అలైస్ హ్వాంగ్, మెగా స్పీడ్

'మెగాస్పీడ్' వివాదం ఏమిటి?

చాలా ఆసియా కంపెనీలు చిప్‌ల కోసం ఆర్డర్లు పెట్టి, వాటిని ఇతర ప్రాంతాలకు పంపడానికి ఈ సింగపూర్ ఒక కేంద్రంగా మాత్రమే పనిచేస్తోంది.

అధునాతన అమెరికన్ సెమీకండక్టర్లను చైనాకు ఎగుమతి చేయకుండా, చైనా కంపెనీలు కొనకుండా 2022లో అమెరికా ఆంక్షలు విధించింది.

అప్పటి నుంచి సింగపూర్ వంటి ఇతర దేశాల ద్వారా చైనా కంపెనీలు ఈ చిప్‌లను పొందే అవకాశం ఉందని అమెరికా అధికారులు ఆందోళన చెందుతున్నారు.

మెగాస్పీడ్ దీనికి ఒక ఉదాహరణ. ఆగ్నేయాసియాలో ఎన్విడియా చిప్‌లను అత్యధికంగా కొనే సంస్థగా ఇది ఎదిగింది.

మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లలోని తన డేటా సెంటర్ల ద్వారా చైనా కంపెనీలకు ఈ చిప్‌లను రహస్యంగా అందిస్తోందనే అనుమానాలు ఉన్నాయి.

అధునాతన ఏఐ చిప్‌లను విదేశీ కంపెనీలకు బదిలీ చేయడాన్ని సింగపూర్ నిషేధించలేదు. కానీ అలాంటి చర్యలు అమెరికా ఎగుమతి నియంత్రణలను ఉల్లంఘించినట్లవుతుంది.

"ఇతర దేశాలు ఏకపక్షంగా విధించే ఎగుమతి నియంత్రణలను" తాము అమలు చేయకపోయినా తమ పరిధిలోని అన్ని కంపెనీలు ఆ నిబంధనలను గౌరవించాలని ఆశిస్తున్నట్లు సింగపూర్ తెలిపింది.

దీనిని నియంత్రించడంలో ఈ దేశం కొంతమేర విజయం సాధించింది.

చైనా ఏఐ కంపెనీ డీప్‌సీక్ సింగపూర్ తదితర ప్రాంతాల్లోని థర్డ్ పార్టీల నుంచి ఎన్విడియా చిప్‌లను కొంటోందన్న అమెరికా ఆందోళనల నేపథ్యంలో సింగపూర్ చర్యలు తీసుకుంది. మోసం సహా వివిధ నేరాల కింద చైనా జాతీయులతోపాటు నలుగురు కంపెనీలు, ఐదుగురు వ్యక్తులపై అమెరికా అభియోగాలు మోపింది.

సింగపూర్, అమెరికా, చైనా , ఎన్విడియా, జెన్సన్ హ్వాంగ్, అలైస్ హ్వాంగ్, మెగా స్పీడ్
ఫొటో క్యాప్షన్, గురువారం అమెరికన్ చిప్ దిగ్గజం ఎన్విడియా నుంచి హ్వాంగ్ తప్పుకున్నారు

దర్యాప్తులో సింగపూర్‌కు ఎదురైన అడ్డంకులు

ఇందులో మెగాస్పీడ్‌పై కూడా విచారణ జరిపేందుకు ప్రయత్నించినా అనేక అడ్డంకులు ఎదురయ్యాయి.

సింగపూర్ ద్వారా కొని ఎగుమతి చేసిన డేటా సర్వర్ల విషయంలో మెగాస్పీడ్ ఇతర సంస్థలు తప్పుడు వివరాలు ఇచ్చాయా అన్నదానిపై 2025 ఫిబ్రవరి నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఆ పరికరాలు పొరుగు దేశమైన మలేషియాకు వెళ్తాయని ఆ కంపెనీలు చెప్పాయని అయితే అవి వేరే ప్రాంతాలకు చేరాయని సింగపూర్ అధికారులు అనుమానిస్తున్నారు.

విచారణ ఎదుర్కొంటున్న కంపెనీలలో ఒకటైన అమెరికాకు చెందిన 'సూపర్‌మైక్రో' నుంచి మరింత సమాచారం రాబట్టడానికి అమెరికా అధికారుల సహాయాన్ని అనేకసార్లు కోరినట్లు సింగపూర్ తెలిపింది.

ఈ సంస్థ మెగాస్పీడ్‌కు కంప్యూటర్ సర్వర్లను సరఫరా చేస్తున్నట్లు బీబీసీకి తెలిసింది.

అయితే "ఇన్నిసార్లు అడిగినా, ఇప్పటివరకు అమెరికా నుంచి పరిమిత సమాచారం, సహాయం మాత్రమే అందింది" అని సింగపూర్ తన ప్రకటనలో పేర్కొంది.

దీనిపై బీబీసీ అమెరికా విదేశాంగ శాఖ వివరణ కోరింది.

ఆలిస్ హ్వాంగ్‌పై కూడా తాము విచారణ జరిపామని సింగపూర్ అధికారులు తెలిపారు. అయితే అది గూఢచర్యం కోసం కాదని మెగాస్పీడ్ మోసానికి పాల్పడిందన్న అనుమానాల్లో ఆమె పాత్ర ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి మాత్రమేనని స్పష్టం చేశారు.

చివరకు నేరానికి సంబంధించి "తగిన ఆధారాలు దొరకకపోవడంతో" కొన్ని నెలల పాటు ఆమె పాస్‌పోర్ట్‌ను తమ వద్ద ఉంచుకున్నారు.

ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను సింగపూర్ విడిచి వెళ్లేందుకు అనుమతించారు.

దాదాపు రెండేళ్ల క్రితం దర్యాప్తు మొదలుపెట్టినా మెగాస్పీడ్‌పై గానీ ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ కంపెనీలు, వ్యక్తులపై గానీ సింగపూర్ ఇంతవరకు ఎటువంటి అభియోగాలు మోపలేదు.

మెగాస్పీడ్‌ సంస్థపై సింగపూర్, అమెరికా దర్యాప్తులు ఇంకా కొనసాగుతున్నాయి.

సింగపూర్, అమెరికా, చైనా , ఎన్విడియా, జెన్సన్ హ్వాంగ్, అలైస్ హ్వాంగ్, మెగా స్పీడ్
ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆలిస్ హ్వాంగ్‌ను సింగపూర్ విడిచి వెళ్లేందుకు అనుమతించారు.

బాక్సులలోనే చిప్‌లు.. లెక్కల్లో తేడాలు

2024లో మలేషియాలోని మెగాస్పీడ్ డేటా సెంటర్‌ను అమెరికా అధికారులు సందర్శించినప్పుడు, ఎన్విడియా టెక్నాలజీ ఇంకా బాక్సులలోనే ఉండటాన్ని గమనించారు.

మెగాస్పీడ్ ఈ హై-ఎండ్ చిప్‌లను వేరే ప్రాంతాలకు తరలిస్తోందన్న ఆందోళనలకు ఇది దారితీసిందని న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది.

గత ఏడాది ఎన్విడియా లెక్కల కంటే మెగాస్పీడ్ 50వేల అదనపు చిప్‌లను దిగుమతి చేసుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.

మరిన్ని గిడ్డంగులను సందర్శించిన తర్వాత ఎన్విడియా తన గణాంకాలను సవరించుకుంది.

తాము ఎల్లప్పుడూ చట్టబద్ధంగానే వ్యవహరించామని గతంలో అధికారులు జరిపిన తనిఖీల్లో ఎటువంటి అక్రమ కార్యకలాపాలకు ఆధారాలు దొరకలేదని మెగాస్పీడ్ స్పష్టం చేసింది.

"ప్రభుత్వ సమగ్ర పరిశీలనను తాము స్వాగతిస్తున్నామని, అమెరికా ప్రభుత్వంతో నిర్మాణాత్మకంగా, పారదర్శకంగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని" ఆ కంపెనీ గురువారం తెలిపింది.

తమ కంపెనీలు, సంస్థలు అక్రమంగా హై-ఎండ్ అమెరికన్ చిప్‌లను పొందుతున్నాయన్న ఆరోపణలను చైనా కూడా ఎప్పటినుంచో ఖండిస్తోంది.

సింగపూర్, అమెరికా, చైనా , ఎన్విడియా, జెన్సన్ హ్వాంగ్, అలైస్ హ్వాంగ్, మెగా స్పీడ్
ఫొటో క్యాప్షన్, మెగాస్పీడ్‌ను బదిలీ తర్వాత కూడా అలైస్ హ్వాంగ్ తనను తాను మెగాస్పీడ్ "ఛైర్‌ఉమెన్"గా పరిచయం చేసుకున్నారు.

ఆలిస్ హ్వాంగ్ నేపథ్యం ఏంటి?

మెగాస్పీడ్, ఆలిస్ హ్వాంగ్ సింగపూర్‌కు ఎలా వచ్చారనే అంశం ఆ దేశం బహిరంగ స్వేచ్ఛాయుత విధానం వల్ల ఉత్పన్నమయ్యే ఇతర బలహీనతలను ఎత్తి చూపుతుంది.

ఇటీవలి సంవత్సరాలలో టిక్‌టాక్, మానస్ వంటి టెక్ సంస్థలు తమ గ్లోబల్ ప్రధాన కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశాయి.

దీంతో చైనా కంపెనీలకు సింగపూర్ ప్రధాన గమ్యస్థానంగా మారింది.

వ్యాపారం చేయడం సులభం కావడంతోపాటు ఇక్కడ చైనా మూలాలు ఉన్న జనాభా ఎక్కువగా ఉండటం చైనా పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండటం దీనికి కారణం.

చైనా సంస్థలకు, ప్రధాన భూభాగానికి దగ్గరగా ఉండటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు, పెట్టుబడిదారులు అంగీకరించే ఒక "తటస్థ చిరునామా" సింగపూర్ అందిస్తుందని న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా అనుబంధ ప్రొఫెసర్ విన్‌స్టన్ మా అన్నారు.

అయితే ఇది "సింగపూర్-వాషింగ్"కు దారితీస్తోందని విమర్శకులు అంటున్నారు.

అంటే చైనా కంపెనీలు తమ మూలాలను దాచడానికి అనుమానాలను తగ్గించడానికి అనుమానాస్పద కార్యకలాపాలను కప్పిపుచ్చుకోవడానికి సింగపూర్ స్వచ్ఛమైన ఇమేజ్‌ను వాడుకుంటున్నాయని వారి ఆరోపణ.

ఆలిస్ హ్వాంగ్ మెగాస్పీడ్‌ను ఏర్పాటు చేయడం కూడా అటువంటి కేసుగానే తాము అంచనా వేస్తున్నట్లు వాషింగ్టన్ ఆధారిత భద్రతా విశ్లేషణ బృందం 'సీ4ఏడీఎస్' బీబీసీకి తెలిపింది.

2019లో హ్వాంగ్ ఒక గేమింగ్ కంపెనీని దాని అనుబంధ సంస్థలను చైనా గేమింగ్ సంస్థ 7రోడ్‌కు అమ్మినట్లు చైనా, హాంకాంగ్, సింగపూర్‌లలోని కార్పొరేట్ రికార్డులను బీబీసీ పరిశీలించగా తేలింది.

2023 మార్చిలో సింగపూర్‌లోని 7రోడ్ అనుబంధ సంస్థ హ్వాంగ్‌ను తన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది.

ఆ మరుసటి రోజే అది తన పేరును 'మెగాస్పీడ్'గా మార్చుకుంది.

కంపెనీని ఒక సింగపూర్ వ్యక్తికి బదిలీ చేయడానికి ముందు 8నెలల పాటు హ్వాంగ్ బాధ్యతల్లో ఉన్నారు.

ఈ కాలంలో, మెగాస్పీడ్ "కార్పొరేట్ పునర్నిర్మాణం, ప్రాంతీయ విస్తరణ కీలక దశ" గుండా వెళ్లిందని సీ4డీఎస్ పేర్కొంది.

ఆమె కార్పొరేట్ సంబంధాలు "మెగాస్పీడ్ సింగపూర్ గుర్తింపు నిజమైనదా లేక వాస్తవానికి చైనా నియంత్రణలో ఉందా" అనే ప్రశ్నలను లేవనెత్తాయని తెలిపింది.

మెగాస్పీడ్‌ను బదిలీ తర్వాత కూడా మరొక కంపెనీ ద్వారా మెగాస్పీడ్‌తో ఆమెకున్న సంబంధాలు సదస్సులలో ఆమె తనను తాను మెగాస్పీడ్ "ఛైర్‌ఉమెన్"గా పరిచయం చేసుకున్న లింక్డ్ఇన్ పోస్ట్‌ల ఆధారంగా కంపెనీపై ఆమె నియంత్రణ కొనసాగిందని సీ4డీఎస్ అంచనా వేసింది.

మెగాస్పీడ్ కంపెనీకి, ఆలిస్ హ్వాంగ్‌కు చైనా, చైనా ప్రభుత్వంతో ఉన్న సంబంధాలపై బీబీసీ అడిగిన ప్రశ్నలకు మెగాస్పీడ్ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు.

సింగపూర్, అమెరికా, చైనా , ఎన్విడియా, జెన్సన్ హ్వాంగ్, అలైస్ హ్వాంగ్, మెగా స్పీడ్
ఫొటో క్యాప్షన్, ఈ వివాదంలో తన సమతుల్యతను కాపాడుకోవడం సింగపూర్‌కు కత్తిమీద సాము కానుందని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా, చైనా మధ్య సింగపూర్

ఇవన్నీ సింగపూర్ ఎదుర్కొంటున్న సందిగ్ధతను మరింత పెంచుతున్నాయి.

"చాలా కాలంగా, అమెరికా, చైనా రెండింటితోనూ అద్భుతమైన సంబంధాలను కొనసాగిస్తూ సింగపూర్ రెండు వైపులా లాభపడింది" అని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ రాజకీయ అంతర్జాతీయ అధ్యయనాల లెక్చరర్ డైలాన్ లోహ్ అన్నారు.

ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య సింగపూర్ ఎప్పటినుంచో తటస్థ పక్షంగా నిలబడింది.

తాము అమెరికా లేదా చైనాకు అనుకూలం కాదని కేవలం "సింగపూర్‌కు మాత్రమే అనుకూలమని" ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్ స్పష్టం చేశారు.

అయితే చిప్‌ల విషయంలో అమెరికా-చైనా మధ్య నెలకొన్న వివాదంతో ఈ సమతుల్యతను కాపాడుకోవడం "ఇప్పుడు చాలా కష్టంగా, కొన్నిసార్లు ఉద్రిక్తంగా మారుతోంది" అని లోహ్ అభిప్రాయపడ్డారు.

మెగాస్పీడ్ కేసుతో సింగపూర్ చేస్తున్న ఈ కత్తిమీద సాము మరింత క్లిష్టంగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా ఆంక్షలకు సంబంధించిన అంశాలపై సింగపూర్ ఎందుకు దర్యాప్తు చేస్తోందని, వారు అమెరికా ప్రయోజనాలకు వత్తాసు పలుకుతున్నారా అని బీజింగ్ ప్రశ్నించే అవకాశం ఉందని సింగపూర్ రాజకీయ శాస్త్రవేత్త, కార్నెగీ చైనా నాన్-రెసిడెంట్ స్కాలర్ చోంగ్ జా ఇయాన్ అన్నారు.

మరోవైపు, సింగపూర్ విడుదల చేసిన తాజా ప్రకటనను అమెరికాపై 'నెపం నెట్టే' చర్యగా వాషింగ్టన్ భావించే అవకాశం ఉందని దీని వల్ల వైట్‌హౌస్ నుంచి ప్రతికూల స్పందన రావచ్చని ఆయన పేర్కొన్నారు.

"ఏ పక్షం వహించకూడదని సింగపూర్ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. కానీ ఏ పక్షాన్నీ ఎంచుకోకపోవడం వల్ల, ఏదో ఒక పక్షం ఎజెండాలో భాగస్వామిగా కనిపించే ప్రమాదాన్ని అది ఎదుర్కొంటోంది" అని ఆయన అన్నారు.

సింగపూర్.. అమెరికా, చైనా మధ్య చిక్కుకోవడం "ఇదే మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు" అని సింగపూర్‌లోని ఎస్ రాజరత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్, చైనా నిపుణుడు బెంజమిన్ హో పేర్కొన్నారు.

"ఒక బహిరంగ ఆర్థిక వ్యవస్థ చెల్లించాల్సిన మూల్యం ఇది. పరిస్థితులు విషమించినప్పుడు మీరు మధ్యలో చిక్కుకుపోతారు" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)