బ్రిక్స్: ఈ కూటమితో భారత్‌కు ఎంత ప్రయోజనం? నిపుణులు ఏమంటున్నారు....

ఫొటో సోర్స్, Getty Images
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ నాలుగోసారి ఆతిథ్యం ఇస్తోంది. అయితే ఈసారి ఈ కూటమికి నాయకత్వం వహించడం దౌత్యపరంగా భారత్‌కు చాలా కీలకమైన విషయం.
బ్రిక్స్ అధ్యక్ష పదవిని భారత్ చేపట్టిన కేవలం రెండు నెలలకే అమెరికా, ఇజ్రాయెల్ బ్రిక్స్ సభ్య దేశమైన ఇరాన్‌పై దాడి చేశాయి.
అనంతరం తెహ్రాన్ బ్రిక్స్ సభ్య దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియాపై ప్రతిదాడులు చేసింది. ఇప్పుడు ఈ మూడు దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడమనేది భారత్‌కు పెద్ద సవాలే.
అమెరికా-ఇరాన్ వివాదం బ్రిక్స్ దేశాల మధ్య తీవ్రమైన విభేదాలను బయటపెట్టింది. మే నెలలో భారత్ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఉమ్మడి ప్రకటన లేకుండానే ముగిసింది.
దీనిని భారత్‌కు దౌత్యపరమైన ఎదురుదెబ్బగా పరిగణించారు. మధ్యప్రాచ్య సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలనే దానిపై కూటమిలోని సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి.

ఇప్పుడు జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కూడా ఉమ్మడి ప్రకటన లేకుండానే ముగుస్తుందేమోనన్న ఆందోళన ఉంది.
అదే జరిగితే ఆతిథ్య దేశానికి ఇది ఒక పెద్ద దౌత్య వైఫల్యం అవుతుంది. ఈ పరిస్థితి రాకుండా ప్రయత్నిస్తోంది భారత్.
2021లో భారత్ చివరిసారిగా బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అందులో భారత్, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా అనే ఐదు దేశాలు మాత్రమే ఉన్నాయి. ఈ దేశాల పేర్ల మొదటి అక్షరాలతో బ్రిక్స్ ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు బ్రిక్స్ లో 11 దేశాలు ఉన్నాయి. అందులోనూ పరస్పర విభేదాలున్న దేశాలు కూడా భాగస్వాములయ్యాయి. అయినా సౌదీ అరేబియా అధికారిక సభ్యత్వ హోదాపై స్పష్టత లేకపోవడంతో దీనిని 10మంది సభ్యుల సమూహంగా కూడా పరిగణిస్తారు.
ఈ కూటమి సభ్యదేశాల్లో భారత్, చైనాల మధ్య మాత్రమే విభేదాలు ఉన్నప్పుడే ఏకాభిప్రాయం సాధించడం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒకరిపై ఒకరు ప్రత్యక్ష సైనిక చర్యలకు పాల్పడుతున్న దేశాలు కూడా బ్రిక్స్ లో ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఏకాభిప్రాయం కుదరడం చాలా కష్టంగా ఉండే కూటమిలో ఉండటం వల్ల భారత్‌కు ఒరిగేదేమిటి అన్న సందేహం వినిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిక్స్ చైనా ప్రయోజనాలకు ఉపయోగపడుతుందా?
‘‘ప్రపంచ రాజకీయాలలో భారతదేశం మధ్యేమార్గం అనుసరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ, అది చాలావరకు చేజారిపోయింది. అయినా భారత్ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది’’ అని దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ రాజేశ్ రాజగోపాల్ అభిప్రాయపడ్డారు.
సెప్టెంబర్ 11న 'ది ప్రింట్'లో ప్రచురితమైన ఒక వ్యాసంలో ఆయన బ్రిక్స్‌లో భారత్ పాత్ర గురించి రాశారు.
‘‘వాస్తవాన్ని గుర్తించకపోవడమే సమస్యలో ఒక భాగం. దీనికి బ్రిక్స్ ఒక ప్రధాన ఉదాహరణ. ఒకవేళ బ్రిక్స్ ఎప్పుడైనా సమర్థవంతమైన కూటమిగా మారితే చైనా దానిని తన స్వప్రయోజనాల కోసం, భారత్‌ను ఏకాకిని చేయడానికి, ఇండో-పసిఫిక్‌లో భారత్ కీలక భాగస్వాములను బలహీనపరచడానికి ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది"
‘‘చైనాతో పోలిస్తే భారత్ బలహీనమైన స్థితిలో ఉంది. దానికి ఈ భాగస్వాములే అవసరం. అందువల్ల బ్రిక్స్‌ను వీలైనంతగా బలహీనపరచడం భారత ప్రయోజనాలకు మంచిది. తద్వారా అది భారత ప్రయోజనాలను కాలరాసే శక్తివంతమైన యంత్రాంగంగా మారకుండా ఉంటుంది’’
"ఇదంతా ఊహించదగినదే. చైనా ఇప్పుడు చేస్తున్నదీ, అగ్రరాజ్యాలు ఎప్పుడూ చేసేదీ అదే. తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అంతర్జాతీయ సమూహాలను, సంస్థలను అవి ఉపయోగించుకుంటాయి"
‘‘అంతర్జాతీయ సంస్థలకు తమ సభ్య దేశాల ప్రయోజనాల కంటే ఉన్నతమైన ప్రయోజనాలు ఉంటాయని భావించడం అవివేకం. అంతేకాక వాటి నిర్ణయాలు, చర్యలు అనేవి విభిన్నమైన, పరస్పర విరుద్ధమైన జాతీయ ప్రయోజనాల రాజకీయ సర్దుబాటు ఫలితం కూడా కాదు. పైగా ఈ ప్రక్రియల్లో భాగమయ్యే దేశాల మధ్య ఉన్న వాస్తవ అధికార వ్యత్యాసాలే ఈ నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, ఈ బృందాలు మరింత శక్తివంతమైన దేశాల నియంత్రణలో ఉంటాయి’’
"దాదాపు రెండు దశాబ్దాల కిందట బ్రిక్స్ ఏర్పడినప్పుడు ఈ ఆర్థిక, సైనిక శక్తి అంతరం ఇంత పెద్దదిగా లేదు" అని రాజగోపాల్ అన్నారు.
"అంతేకాకుండా అమెరికా చేతుల్లో అధికారం ఎక్కువగా కేంద్రీకృతం కావడం వల్ల తలెత్తే అవకాశమున్న సమస్యలు, బ్రిక్స్‌లోని అసమతుల్యత నుంచి దృష్టిని మళ్లించి ఉండొచ్చు. కానీ ఈ స్పష్టమైన వాస్తవాన్ని చూసిచూడనట్టు వదిలేయడానికి ఇది సాకు కాదు. భారత్ ఈ వాస్తవంపై నిశితంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది భారత్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది" అని రాజేశ్ రాజగోపాల్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
భారత్ ముందున్న సవాళ్లు
అయితే రాజేశ్ రాజగోపాల్ అభిప్రాయంతో ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా పనిచేసిన మోహన్ కుమార్ ఏకీభవించడం లేదు.
మోహన్ కుమార్ సెప్టెంబర్ 12న 'ది హిందూ'లో ఓ వ్యాసం రాశారు.
బ్రిక్స్ కొనసాగుతూనే ఉంటుందని, అది నెమ్మదిగా అయినా క్రమంగా తన సభ్య దేశాలకు రెండు కీలక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని మోహన్ కుమార్ ఆ వ్యాసంలో రాశారు.
తమకున్న వ్యూహాత్మక అవకాశాలను పెంచుకోవడం, ప్రపంచ రాజకీయాలను నిజమైన బహుళ ధ్రువ ప్రపంచంవైపు తీసుకెళ్లడం ఆ రెండు లక్ష్యాలని మోహన్ కుమార్ పేర్కొన్నారు.
"ఈ రెండూ భారత్ విదేశాంగ విధానానికి కూడా ప్రాథమిక సూత్రాలు. భౌగోళిక రాజకీయ అనిశ్చితితో నిండిన ప్రస్తుత ప్రపంచంలో, ఈ సూత్రాల ఆధారంగా విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ఇతర దేశాలు కూడా చాలా అవకాశాలను చూస్తున్నాయి. వివిధ రంగాల్లో పరస్పర సహకారం విషయంలో బ్రిక్స్ అందించాల్సింది చాలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రిక్స్ ఇప్పుడు పెద్ద కూటమిగా మారింది. దాన్ని విస్మరించడం సాధ్యం కాదు. అలాగే అది విఫలమయ్యే పరిస్థితి కూడా లేదు'' అని మోహన్ కుమార్ విశ్లేషించారు.
బ్రిక్స్ తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే తాము సృష్టించని, తమ సభ్య దేశాలకు ఎలాంటి వ్యూహాత్మక ప్రాధాన్యతలేని భౌగోళిక- రాజకీయ పరిణామాల్లో చిక్కుకోకుండా చూసుకోవడం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
''భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి నేతలపై అందరి దృష్టి ఉండొచ్చు..ఉండాలి కూడా. కానీ అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రిక్స్ కూటమి తన పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయాలి. దిల్లీ శిఖరాగ్ర సమావేశం ఈ దిశగా స్పష్టమైన పురోగతి సాధించాలి'' అని మోహన్ కుమార్ అన్నారు.
''భారత్ ఒక బలమైన బ్రిక్స్ కూటమిని కోరుకుంటోంది. అయితే ఆ కూటమి చైనా వ్యూహాత్మక ప్రభావానికి ఒక సాధనంగా మారాలని మాత్రం కోరుకోవడం లేదు'' అని కజకిస్తాన్‌లోని అల్మాటీ లోని సులేమాన్ డెమిరెల్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన రాజ్ కుమార్ శర్మ, నిక్కీ ఆసియాతో మాట్లాడుతూ విశ్లేషించారు.
"దీనివల్ల భారత్ ఒక క్లిష్టమైన సమతుల్యతను పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకం కాదు’
నాలుగోసారి బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న భారత్ ఇందులో విజయం సాధించడం అనేది అనేక స్థాయిల్లో వారధి నిర్మించే దేశంగా తనను తాను ఎలా నిలబెట్టుకుంటుందనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.
2025లో చైనా ప్రవేశపెట్టిన గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్‌తో పాటు బ్రిక్స్ విస్తరణ కూడా జరిగింది.
ఇది బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థను ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న చర్యగా చైనా నాయకులు చెబుతున్నారు.
ఆధిపత్య రాజకీయాలకు వ్యతిరేక చర్యగా, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య అధికారాన్ని మరింత సమానంగా పంపిణీ చేసే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు.
బ్రిక్స్‌ను పాశ్చాత్య దేశాల వ్యతిరేక కూటమిగా మార్చడం భారత్ ప్రధాన లక్ష్యం కాదని విశ్లేషకులు అంటున్నారు. దానికి బదులుగా అంతర్జాతీయ వ్యవస్థలో సభ్య దేశాలకు మరింత ప్రాతినిధ్యం ఉండేలా చేయడానికి బ్రిక్స్‌ను ఒక విశ్వసనీయ వేదికగా బలోపేతం చేయడాన్ని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచస్థాయిలో ఒక ముఖ్యమైన స్వరం, ప్రభావవంతమైన దేశంగా భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడాన్నీ లక్ష్యంగా పెట్టుకుందని విశ్లేషకులు అంటున్నారు.
బ్రిక్స్‌లో సభ్యదేశంగా ఉన్నప్పటికీ పాశ్చాత్య దేశాలకు భారత్ వ్యతిరేకం కాదని ఈ ఏడాది జనవరిలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. అనేక రంగాల్లో పాశ్చాత్య దేశాలు భారత్‌కు ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నాయని అని ఆయన తెలిపారు.
భారత్ తన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా, రష్యా రెండింటితోనూ సమానంగా బలమైన సంబంధాలను కొనసాగించగలదని జైశంకర్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























