వేలానికి ప్రిన్సెస్ డయానా 'రివెంజ్ డ్రెస్', బలమైన సందేశంగా మారిన ఈ దుస్తుల కథేంటి?

ఫొటో సోర్స్, Martin Keene/PA Wire
- రచయిత, బ్రాండన్ లివ్సే, అలెక్స్ ఫిలిప్స్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ప్రిన్సెస్ డయానా ధరించిన ‘రివెంజ్ డ్రస్’గా పేరొందిన దుస్తులు వేలానికి రానున్నాయి.
దివంగత ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ ఈ స్ట్రాప్ లెస్ నల్లటి సిల్క్ ఈవెనింగ్ డ్రెస్‌ను ధరించి 1994లో లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటికే ఆమె తన భర్త ప్రిన్స్ చార్లెస్‌తో విడిగా ఉంటున్నారు.
తమ వైవాహిక జీవితంలో తాను మరో మహిళతో సంబంధం పెట్టుకున్నట్టు చార్లెస్ అంగీకరించిన కొన్ని గంటల తరువాత డయానా ఈ నల్లటి దుస్తులతో కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆమె ఈ దుస్తులతో 1994లో సర్పెంటైన్ గ్యాలరీకి వచ్చిన తీరు పాప్ సంస్కృతిలో ఓ గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచిపోయింది.
డిసెంబర్ 9న జరగనున్న వేలంలో ఈ డ్రెస్ గరిష్ఠంగా 2,20,000 పౌండ్ల (సుమారు రూ. 2.86 కోట్లు) వరకు పలుకుతుందని వేలం సంస్థ సోత్‌బైస్ అంచనా వేస్తోంది. డయానా మరణానికి కొన్నినెలల ముందు, 1997లో స్వచ్ఛంద సంస్థలకు నిధులు సేకరించడానికి ఆమె తన 79 దుస్తులను విక్రయించారు. వాటిల్లో ఈ నల్లటి దుస్తులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఈ బ్లాక్ డ్రెస్ వేలానికి రావడం ఇదే తొలిసారి.

దుస్తులు కూడా ఒక ప్రత్యేకమైన భాషలా పనిచేస్తాయని డయానా సహజంగానే అర్థం చేసుకున్నారని సోత్‌బైస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ హ్యాండ్‌బ్యాగ్స్ అండ్ ఫ్యాషన్ మోర్గాన్ హలీమి ఒక ప్రకటనలో తెలిపారు.
డయానా తన జీవితం అత్యంత చర్చనీయాంశమై, భావోద్వేగభరింగా మారిన సమయంలో ఈ దుస్తులను ఎంచుకోవడం ద్వారా తన గురించి ఇతరులు చెబుతున్న కథనాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు.
"ఈ డ్రెస్‌ను తన అత్యంత శక్తిమంతమైన సందేశాల్లో ఒకటిగా డయానా మార్చుకున్నారు" అని ఆమె చెప్పారు.
తన జీవితంలోని ఒక ముఖ్యమైన సందర్భాన్ని ఇతరులు తమకు అనుకూలంగా చెప్పుకుంటున్న సమయంలో, డయానా తానేం చెప్పాలనుకుంటున్నది తన దుస్తుల ద్వారానే చెప్పారని హలీమి తెలిపారు.

ఫొటో సోర్స్, Martin Keene/PA Wire
చార్లెస్ ప్రకటన.. డయానా స్టైలిస్ డ్రెస్
సెర్పెంటైన్ గ్యాలరీలో ఆ కార్యక్రమం జరిగిన అదే రాత్రి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గురించి రూపొందించిన ఓ డాక్యుమెంటరీ ప్రసారమైంది. అందులో ఆయన, తమ వివాహ జీవితంలో తాను డయానాకు నమ్మకంగా ఉండలేదని అంగీకరించారు. అప్పటికే ఆయనకు మరో మహిళతో సంబంధం ఉందనే వార్తలు, పుకార్లు కొన్నేళ్లుగా మీడియాలో వస్తూనే ఉన్నాయి.
అయితే ఐటీవీ ఇంటర్వ్యూలోని విషయాలు ప్రసారం కావడానికి కొన్నిరోజుల ముందే లీకయ్యాయి. దీంతో అది ప్రసారమైన తరువాత డయానా తొలిసారి బహిరంగంగా కనిపించడం ఆ ఇంటర్వ్యూకు ఆమె ఇచ్చిన సమాధానంగా చాలామంది భావించారు.
ప్రిన్సెస్ "చాలా గొప్పగా కనిపించాలనుకున్నారని" ఆ సమయంలో డయానా స్టైలిస్ట్‌గా ఉన్న అన్నా హార్వీ చెప్పినట్లు కథనాలు వచ్చాయి.
కార్యక్రమానికి బయలుదేరే ముందు చివరి నిమిషంలో డయానా తన దుస్తులు మార్చుకున్నారు. ముందుగా ఎంచుకున్న అంతగా ఆకట్టుకోని వాలెంటినో గౌన్‌ను పక్కనపెట్టి, గ్రీకు డిజైనర్ క్రిస్టినా స్టాంబోలియన్ రూపొందించిన ఆఫ్-ది-షోల్డర్ డ్రెస్‌ను ధరించారు.. ఆ దుస్తులకు ఒక వైపు పొడవుగా, మరో వైపు తక్కువగా ఉండే అంచుతో పాటు వెనుకభాగం వస్త్రం నేలను తాకేలా షిఫాన్ట్రైన్ డిజైన్ చేశారు. దీనికి ఆమె రాచరికపు నెక్లెస్, నల్లటి క్లచ్ బ్యాగ్, నల్లటి హీల్స్‌ను జత చేసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శన
విక్రయానికి ముందు ఈ 'రివెంజ్ డ్రెస్' ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనకు వెళ్లనుంది. సెప్టెంబర్ 18 నుంచి 24 వరకు సోత్‌బైస్ లండన్ షోరూంలో ప్రదర్శించిన తర్వాత, అక్టోబర్ ప్రారంభంలో హాంకాంగ్‌కు, నవంబర్ ప్రారంభంలో జెనీవాకు, ఆపై న్యూయార్క్‌కు తీసుకువెళతారు. అక్కడే డ్రెస్‌ను వేలం వేస్తారు.
క్యాన్సర్, ఎయిడ్స్ స్వచ్ఛంద సంస్థల కోసం నిధుల సేకరణకోసం 1997లో డయానా విక్రయించిన డజన్ల కొద్దీ వస్తువుల్లో ఈ డ్రెస్ కూడా ఒకటి.
అప్పట్లో గ్లాస్గోలో నివసిస్తున్న బ్రీజ్ మెకెంజీ, ఆమె భర్త గ్రేమ్ ఈ డ్రెస్‌ను 39,098 పౌండ్లు చెల్లించి కొనుగోలు చేశారు.
ఆ దుస్తులు "నాకు సరిపోవు" అని బ్రీజ్ మెకెంజీ అప్పట్లో ది ఇండిపెండెంట్ వార్తాసంస్థతో చెప్పారు. ఈ డ్రెస్‌కు చెల్లించిన డబ్బులు చిల్డ్రన్ ఫస్ట్ అనే స్వచ్ఛంద సంస్థకు వెళతాయనే కారణంతోనే కొనుగోలు చేశామని ఆమె తెలిపారు.
"ఈ డ్రెస్ చాలా ప్రత్యేకమైనదని నాకు, నా దివంగత భర్తకు తెలుసు'' బ్రీజ్ మెకెంజీ చెప్పినట్టు గురువారం సోత్‌బైస్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
"ప్రిన్సెస్ డయానా తన జీవితంలో అత్యంత కష్ట సమయాన్ని ఎదుర్కొంటూ ఆ కార్యక్రమానికి వెళ్లారు. కానీ, ఆమెను చూస్తే మీకు అలా అనిపించదు. ఆమెను ఫోటోలు తీసే సమయానికే అది పార్టీ డ్రెస్ స్థాయి నుంచి ఒక బలమైన వ్యక్తీకరణగా మారిపోయింది''
"ముప్పై ఏళ్లు గడిచినా, ప్రపంచంలో ఎక్కడైనా ఈ మాటలు చెబితే, ఏ డ్రెస్ గురించి మాట్లాడుతున్నారో అందరూ వెంటనే ఇట్టే అర్థం చేసుకుంటారు’’
తన భర్త మెకంజీ మరణించిన తర్వాత ఆ డ్రెస్‌ను అమ్మాలని నిర్ణయించుకున్నట్లు బ్రీజ్ మెకెంజీ తెలిపారు. ఆయనతో కలిసి ఆ డ్రెస్‌ను వేలంలో కొనుగోలు చేయడం "తమ జీవితంలో అత్యుత్తమమైన రోజుల్లో ఒకటి" అని ఆమె అభివర్ణించారు.
ప్రిన్స్ విలియం ఆలోచనే..
డయానా, డిజైనర్ క్రిస్టినా స్టాంబోలియన్ సంతకం చేసిన 1997 వేలం కేటలాగ్ కాపీని కూడా డ్రెస్‌తో పాటు విక్రయించనున్నట్లు సోత్‌బైస్ తెలిపింది. ఈ డ్రెస్‌ను వేలం వేయాలనే ఆలోచన ప్రిన్స్ విలియందేనని ఆ కేటలాగ్‌లో పేర్కొన్నారు.
ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఎన్హెచ్ఎస్ లోథియన్ చారిటీ ద్వారా రాయల్ ఎడిన్బర్గ్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వనున్నారు.
సర్పెంటైన్ గ్యాలరీ కార్యక్రమానికి డయానా వెళ్లిన పాతకాలపు జాగ్వార్ ఎక్స్‌జే40 కారును ఈ ఏడాది ప్రారంభంలో వేలం వేశారు. ఆ కారు 66,250 పౌండ్లకు అమ్ముడుపోయింది.
అయితే ఈ డ్రెస్ అంతకంటే భారీ ధర పలుకుతుందని భావిస్తున్నారు. ప్రిన్సెస్ డయానా వార్డ్‌రోబ్‌కు చెందిన ఏదైన వస్తువు భారీ ధరకు అమ్ముడవడం ఇదే తొలిసారి కాదు.
న్యూయార్క్‌లో సోత్‌బైస్ 2023లో నిర్వహించిన వేలంలో తెల్లగొర్రెల మధ్య నల్లగొర్రె బొమ్మ ఉన్న స్వెటర్ 9,20,000 పౌండ్ల (సుమారు రూ.11.89 కోట్లు)కు అమ్ముడైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























