స్నేక్ రిపెల్లెంట్ స్ప్రేలు, కొన్ని మొక్కలు.. నిజంగా పాములను తరిమికొడతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కె. శుభగుణం
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఇల్లు, తోట, వ్యవసాయ భూముల్లోకి పాములు రాకుండా అడ్డుకుంటాయని చెబుతూ ఇంటర్నెట్‌లో రకరకాల స్ప్రేలు, రసాయన పదార్థాలను విక్రయిస్తున్నారు. కానీ, అవి నిజంగా పాములను తరిమికొడతాయా? శాస్త్రీయ పరిశోధనలు ఈ విషయాన్ని నిరూపించాయా?.
"స్నేక్ రిపెల్లెంట్" అని ఇంటర్నెట్‌లో వెతికితే, "పాములను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటాయి. ఒక నిర్దిష్ట ప్రాంతంలోకి పాములు రాకుండా చూస్తాయి" అని క్లెయిమ్ చేస్తూ విక్రయించే వివిధ ఉత్పత్తులు కనిపిస్తాయి.
ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచిన ఆ వస్తువుల వివరాలను గమనిస్తే.. కొన్నింటిలో ఎసెన్షియల్ ఆయిల్స్, మరికొన్నింటిలో సల్ఫర్, నాఫ్తలీన్ లాంటి రసాయనాలు వాడినట్లు రాసి ఉంటుంది. తమ ఉత్పత్తుల నుంచి వచ్చే ఘాటైన వాసన కారణంగా పాములు ఆ ప్రాంతం దరిదాపుల్లోకి కూడా రావని కొన్ని సంస్థలు ప్రకటనలు ఇస్తున్నాయి.
కానీ, ఒక వస్తువుకు ఘాటైన వాసన ఉండటం మాత్రమే పాములను తరిమికొడుతుందనడానికి నమ్మకమైన ఆధారం కాదని మదురైకి చెందిన 'ఊర్వనం' సంస్థ వ్యవస్థాపకుడు విశ్వనాథ్ చెబుతున్నారు.
పాముల జీవనశైలి, పాము-మనిషి ఎదురుపడే పరిస్థితులపై 15 ఏళ్లకు పైగా పరిశోధనలు చేస్తున్న ఆయన, పాములను రక్షించే పనిలో ఉన్నారు.

డీఆర్‌డీఓ అధ్యయనం ఏం చెబుతోంది ?
భారతదేశంలో దీనిపై జరిగిన ముఖ్యమైన పరిశోధనల్లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) పరిశోధకులు చేసిన అధ్యయనం కూడా ఒకటి.
2012 జులై 29న 'సైంటిఫిక్ రిపోర్ట్స్' అనే జర్నల్‌లో ఇది ప్రచురితమైంది. భారతదేశంలోని ప్రధాన విషసర్పాలైన నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటి కొన్ని పాములను పారదోలుతాయని చెబుతున్న (రిపెల్లెంట్) ఉత్పత్తులను వారు పరీక్షించారు.
ప్రయోగశాల వాతావరణంలో జరిగిన ఈ పరీక్షల్లో, కొన్ని ఉత్పత్తులు పాములను దరిచేరనివ్వకుండా చేశాయి. ముఖ్యంగా కొన్ని ఉత్పత్తులతో పాటు లవంగాల నూనెలో ఉండే యూజినాల్ లాంటి వాటిని పరీక్షించారు.
ఇలాంటి ఉత్పత్తులను వాడినా, వాటిని పూర్తి స్థాయి భద్రతా చర్యగా గానీ పద్ధతిగా గానీ పూర్తిగా నమ్మకూడదని ఈ అధ్యయనం హెచ్చరించింది.

ఫొటో సోర్స్, GettyImages & Flipkart/Amazon
బయటి వాతావరణంలోనూ పనిచేస్తాయా?
స్నేక్ రిపెల్లెంట్స్ పేరుతో విక్రయిస్తున్న ఉత్పత్తుల గురించి తలెత్తే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే.. అవి బయటి వాతావరణంలో పనిచేస్తాయా లేదా ?.
2008లో సరీసృపాల పరిశోధనలకు సంబంధించిన 'అప్లైడ్ హెర్పెటాలజీ' జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో, నాఫ్తలీన్, సల్ఫర్ (గంధకం) కలిపిన మిశ్రమాన్ని పాములపై ప్రయోగించి చూశారు.
సహజమైన బయటి వాతావరణాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో చాలా తక్కువ పాములు మాత్రమే రసాయనాలు వాడిన ప్రాంతం వైపు వెళ్లకుండా దారి మళ్లాయి. అదే సమయంలో, ఎన్నో పాములు ఆ రసాయనాలు ఉన్న ప్రాంతాన్ని దాటుకుని వెళ్లి ఎప్పటిలాగే సాధారణంగా ప్రవర్తించాయి.
పాములను ఇలాంటి ‘స్నేక్ రిపెల్లెంట్’ మిశ్రమాలు పూర్తిగా తరిమికొట్టలేవని పరిశోధకులు చెప్పారు.
సహజ నూనెలతో తయారైన స్ప్రేలు?
ఇంటర్నెట్‌లో అమ్ముడవుతున్న ఎన్నో కొత్త ఉత్పత్తులను "సహజ పద్ధతిలో తయారైనవి" అని ప్రచారం చేస్తున్నారు. దాల్చినచెక్క, పుదీనా, లవంగం, దేవదారు లాంటి నూనెలు వీటిలో ఉంటున్నాయి.
ఇటీవల, 'ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం, ఆఫ్రికాలో విక్రయిస్తున్న.. పాములను పారదోలే మిశ్రమ ఉత్పత్తులను పరిశీలించింది.
వాటిలో చాలా ఉత్పత్తుల్లో ఎసెన్షియల్ ఆయిల్స్‌తో పాటు రకరకాల రసాయనాలు ఉన్నాయని, అయితే అవి బాగా పనిచేస్తాయనడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెప్పారు.
బయటి వాతావరణంలో నిర్వహించిన కొన్ని పరీక్షల్లో, పరీక్షించిన ఏ ప్రోడక్ట్ మెరుగ్గా పాములను తరిమికొట్టలేకపోయిందని ఆ అధ్యయనం స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
పాములను తరిమికొట్టే మొక్కలున్నాయా?
అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ నిపుణుల మార్గదర్శకత్వంలో ఎన్నో స్నేక్ రిపెల్లెంట్లను పరీక్షించినప్పటికీ, "ఏదీ నిలకడగా ఒకే విధమైన సామర్థ్యాన్ని చూపించలేదు" అని వారు పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలను 2021 ఏప్రిల్ 2న విడుదల చేశారు.
"స్నేక్ ప్లాంట్, సర్పగంధి, కలబంద లాంటి మొక్కలు పాములను పారదోలుతాయని మన గ్రామాల్లో నమ్ముతారు. కానీ, అందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం ఇప్పటివరకు లభించలేదు. పైగా ఈ మొక్కల మధ్యే పాములు తిరగడం మేం చూశాం" అని విశ్వనాథ్ తెలిపారు.
"ఇళ్ల చుట్టూ పిల్లలు ఆడుకోవడం, తిరగడం రోజూ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా కింద పడిన బంతిని వారు తీసుకున్నప్పుడు లేదా వాళ్లంతట వాళ్లే ఏదైనా ప్రదేశాల్లో చేతులు పెట్టినప్పుడు ఆ రసాయనాలు వాళ్ల చేతులకు అంటుకోవచ్చు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాములను తరిమికొట్టే స్ప్రేలతో ప్రయోజనం లేదా?
ఇళ్ల చుట్టూ ఇలాంటి స్ప్రేలు చల్లడం వల్ల పాములు కచ్చితంగా రావని చెప్పడానికి తగిన ఆధారాలు ఇప్పటివరకు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాబట్టి, ఇంటర్నెట్‌లో విక్రయిస్తున్న స్నేక్ రిపెల్లెంట్ స్ప్రేలను పాముల నుంచి రక్షించే బలమైన భద్రతా కవచంగా భావించడం తప్పుడు విధానమని ఊర్వనం సంస్థ వ్యవస్థాపకుడు విశ్వనాథ్ స్పష్టం చేస్తున్నారు.
నివాస ప్రాంతాల్లో పాములతో పొంచి ఉన్న ప్రమాదాలను నివారించడానికి, "అవి ప్రవేశించే దారులను మూసివేయడం, ఇంటి చుట్టూ ఉన్న పొదలు, చెత్తను తొలగించడం, ఎలుకల లాంటి ఎర జంతువులను నియంత్రించడం లాంటి ఆచరణాత్మక చర్యలే అత్యంత నమ్మకమైన నివారణ పద్ధతులుగా ఉంటాయి" అని పాముల రక్షణ నిపుణుడు, వన్యప్రాణి ప్రేమికుడు సామ్సన్ కృపాకరన్ బీబీసీ తమిళంతో వివరించారు

ఇళ్లలోకి పాములు రాకుండా ఏం చేయాలి?
"గాలి కోసం వేసవిలో చాలామంది నేలపై పడుకుంటారు. ఆ సమయంలో చుట్టూ దోమతెర లాంటి రక్షణ ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. కొన్ని పాములు తలుపుల ద్వారా లోపలికి వస్తాయి. వంటగదిలో గిన్నెలు కడిగే సింక్ పైపుల నుంచి కూడా రావచ్చు. అలా వచ్చిన కొన్ని పాములను మేం పట్టుకున్నాం. ఆ పైపులకు మూతలు పెట్టడం చాలా అవసరం" అని పాముల రక్షణ నిపుణుడు విశ్వనాథ్ బీబీసీతో చెప్పారు.
"ఇంటి బయట షూస్ వదిలేయకుండా, ఏదైనా మేకుకు వేలాడదీయడం మంచిది. లేదంటే వాటిలో చిన్న పాములు దూరుతాయి. ఎంత దులిపినా బయటకు రావు. చలికాలంలో కార్ల లోపలికి చేరుతాయి. తారు రోడ్లు పగటిపూట వేడిని గ్రహించి రాత్రిపూట బయటకు వదులుతాయి కాబట్టి పాములు రోడ్ల మీదే పడుకుంటాయి. అందుకే రాత్రిళ్లు టార్చ్‌లైట్ లేకుండా బయట తిరగకూడదు" అని విశ్వనాథ్ అన్నారు.
"ఏ కాలమైనా సరే పాములు జనావాసాల వైపు రావడం సహజమే. పాములు ఇంట్లోకి వస్తే వాటిని కొట్టడానికి గానీ, తరిమికొట్టడానికి గానీ ప్రయత్నించకూడదు. వెంటనే దగ్గర్లోని అటవీ శాఖ లేదా అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడం ఉత్తమం. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం" అని చెన్నై స్నేక్ పార్క్ నిర్వాహకుడు, సరీసృపాల పరిశోధకుడు గణేశన్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























