రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు

ఫొటో సోర్స్, SCREENSHOT/UGC
అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో తరగతిగదిలో ఓ బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపినట్టు అనంతపురం ఎస్పీ జగదీశ్ మీడియాకు చెప్పారు.
‘‘నిందితుడు హేమంత్ ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నాడని సమాచారంతో రెండు పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాయి’’ అని ఎస్పీ జగదీశ్ చెప్పారు.
‘‘నిందితుడిని చూడగానే పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా, అతను సీఐ వెంకటేశ్వర్లపై కత్తితో దాడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరిపారని’’ ఎస్పీ జగదీశ్ తెలిపారు.
‘‘తొలుత పోలీసులు గాలిలో కాల్పులు జరిపినా నిందితుడు వెనక్కి తగ్గలేదని, అతను నిన్నటి నుంచి మద్యం మత్తులోనే ఉన్నాడని, కత్తితో పోలీసులపై దాడికి ప్రయత్నించాడని, అందుకే ఆత్మరక్షణకు పోలీసులు హేమంత్పై కాల్పులు జరిపారని’’ జగదీశ్ తెలిపారు.
మొత్తం ఎన్ని రౌండ్లు కాల్చారనే విషయంపై ఎస్పీ మీడియాకు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం నిందితుడితోపాటు సీఐ వెంకటేశ్వర్లు కూడా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఎస్పీ వివరించారు.

అసలేం జరిగింది?
హెచ్చరిక: ఈ కింద కొన్ని కలచివేసే అంశాలు ఉన్నాయి.
అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి జరగడం కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో పదో తరగతి గదిలో పాఠాలు జరుగుతుండగా, చెట్లను నరికేందుకు ఉపయోగించే ఎలక్ట్రిక్ రంపంతో ఓ వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి బాలికపై దాడికి పాల్పడినట్టు ఎస్పీ జగదీశ్ చెప్పారు.
ఈ దాడిలో ఆమెకు ముఖం, గొంతు, పొత్తికడుపు సహా పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయని కుడిచేయి కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు... ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడిందని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తరగతి గదిలో పాఠాలు జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి విద్యార్థినిపై దాడికి పాల్పడ్డారు. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన తోటి విద్యార్థిని కూడా గాయపడ్డారు. రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని చికిత్స పొందుతున్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి అనంతపురం కలెక్టర్ ఓ. ఆనంద్ చేరుకుని పరామర్శించారు.
బాలికకు మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జనరల్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలించినట్టు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి బీబీసీకి చెప్పారు. ప్రస్తుతం ఆ బాలికకు బెంగళూరు ఓల్డ్ హాల్ ఎయిర్ పోర్ట్ మార్గంలోని మణిపాల్ ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు.
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం బెంగళూరుకు చేరుకుని బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినికి అవసరమైన శస్త్రచికిత్సలను ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేశారని లోకేశ్ తెలిపారు.
బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వచ్చే 48 గంటల పాటు కీలకమని వైద్యులు చెప్పారని లోకేశ్ మీడియాకు వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























