రూ. 450.42 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన డైనోసార్ అస్థిపంజరం... ఏమిటి దీని ప్రత్యేకత?

న్యూయార్క్ నగరంలోని సోథెబీస్‌లో జరిగిన వేలంపాటల ముందస్తు ప్రదర్శనలో, "జోడి" అని పిలిచే నానోటైరానస్ డైనోసార్ అస్థిపంజరం ఉంచారు.
ఫొటో క్యాప్షన్, వేలంలో నానోటైరానస్ అస్థిపంజరం 450.42 కోట్ల రూపాయలకు అమ్ముడైంది.
    • రచయిత, ఆంగస్ థాంప్సన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

గతంలొ చిన్న టైరన్నో‌సారస్ రెక్స్ గా పొరపడి, తాజాగా ప్రత్యేక డైనోసార్ జాతిగా గుర్తించిన ఒక అస్థిపంజరం వేలంలో 47.3 మిలియన్ డాలర్లు (450.42 కోట్లరూపాయల)కు అమ్ముడుపోయింది.

'జోడి' అనే ముద్దుపేరుతో పిలిచే ఈ అస్థిపంజరం సుమారు 10 అడుగుల (3మీటర్లు) ఎత్తు ఉంది. దీనిని న్యూయార్క్‌లోని సోథెబీస్ వేలం సంస్థ విక్రయించింది. ఈ అస్థిపంజరం ఒక ప్రత్యేకమైన డైనోసార్‌ వర్గానికి చెందినదని పరిశోధకులు నిర్థరించిన ఏడాది తర్వాత ఈ విక్రయం జరిగింది.

ఈ మాంసాహార డైనోసార్ క్రెటేషియస్ యుగం చివరి కాలానికి చెందినది. వేలానికి ముందుగా దీని ధర కనీసం 9 మిలియన్ డాలర్లు పలుకుతుందని అంచనా వేశారు.

అయితే అంచనాలను మించి భారీ ధరకు ఇది అమ్ముడైంది. ఇదే సంస్థ ఈ ఏడాది జూలైలో ‘గస్’ అనే టైరన్నోసారస్ రెక్స్ అస్థిపంజరాన్ని రికార్డు స్థాయిలో 50.1 మిలియన్ డాలర్లకు విక్రయించింది.

ఈ తాజా విక్రయంతో డైనోసార్ శిలాజ అవశేషాలను ప్రైవేటుగా విక్రయించాలా, లేక ప్రజల సందర్శన కోసం బహిరంగ ప్రదర్శనశాలల్లో ఉంచాలా అనే అంశంపై శాస్త్రవేత్తల మధ్య మళ్లీ చర్చ మొదలైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జోడి ది నానోటైరనస్ అని రాసి ఉన్న ఫలకంతో ప్రదర్శనలో ఉన్న జోడి అనే నానోటైరనస్ కు చెందిన అరుదైన అస్థిపంజరం
ఫొటో క్యాప్షన్, ఈ మాంసాహార డైనోసార్ క్రెటేషియస్ యుగం చివరి కాలానికి చెందినది

జోడిని అద్భుతమైన ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న అస్థిపంజరంగా సోథెబీస్‌ అభివర్ణించింది. ఇందులో సుమారు 191 శిలాజ ఎముకల భాగాలు ఉన్నాయని, పుర్రె దాదాపు పూర్తిగా చెక్కుచెదరకుండా ఉందని పేర్కొంది.

నానోటైరానస్‌ జాతికి చెందిన ఇలాంటి అస్థిపంజరాలు శాస్త్రవేత్తలకు తెలిసినవి కేవలం మూడేనని వేలం సంస్థ తెలిపింది. అమెరికా పరిశోధకులు గత ఏడాది అక్టోబరులో ఈ జాతి ఉనికిని నిర్ధారించిన తర్వాత, వేలానికి వచ్చిన తొలి అస్థిపంజరం ఇదేనని పేర్కొంది.

దీనిని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలు వెల్లడించలేదు. ఆరుగురు కొనుగోలుదారుల మధ్య 12 నిమిషాలపాటు ఉత్కంఠభరితంగా సాగిన బిడ్డింగ్ అనంతరం ఈ విక్రయం పూర్తి అయ్యింది.

ఇప్పటివరకు విక్రయించిన డైనోసార్‌ శిలాజాల్లో అత్యధిక ధర పలికిన వాటిలో జోడి రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో గస్‌ ఉంది. మూడో స్థానంలో 'ఏపెక్స్‌' అనే స్టెగోసారస్‌ శిలాజం ఉంది. దాన్ని సోథెబీస్‌ 2024 జులైలో 4.46 కోట్ల డాలర్లకు విక్రయించింది.

2023లో లండన్‌లో తొలిసారి ప్రదర్శన

నానోటైరానస్‌ను చాలా కాలం పాటు టీ.రెక్స్‌ డైనోసార్‌ పిల్ల లేదా యుక్తవయసులో ఉన్న రూపంగా భావించేవారని యూనివర్శిటీ ఆఫ్ పోర్ట్స్ మౌత్‌కు చెందిన పురాజీవ శాస్త్రవేత్త మేగన్ జాకబ్స్ మంగళవారం బీబీసీ రేడియో 4లోని టుడే కార్యక్రమంలో చెప్పారు.

"కానీ ఇది టీ.రెక్స్‌ కంటే చాలా చిన్నది. శరీర నిర్మాణం కూడా చాలా సన్నగా ఉంటుంది. చూడటానికి నాజూగ్గా, పొడవుగా ఉంటుంది. మాంసాన్ని కోసేందుకు వీలుగా కత్తుల్లాంటి పళ్లు ఉంటాయి" అని జాకబ్స్‌ వివరించారు.

టైరానోసారస్ రెక్స్, నానోటైరానస్ రెండూ సుమారు 6.7 కోట్ల సంవత్సరాల క్రితం క్రెటేషియస్ యుగం చివరి దశలో ఒకే భౌగోళిక కాలంలో కలిసి జీవించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నానోటైరానస్‌ జాతిగా వర్గీకరించకముందు, 2023 అక్టోబరులో లండన్‌లో జరిగిన అంతర్జాతీయ కళా ప్రదర్శన 'ఫ్రిజ్‌ మాస్టర్స్‌'లో జోడిని టీ.రెక్స్‌ పిల్ల అస్థిపంజరంగా తొలిసారి ప్రదర్శించారు.

నానోటైరానస్ డైనోసార్ అస్థిపంజరం
ఫొటో క్యాప్షన్, ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన మూడు నానోటైరానస్ అస్థిపంజరాలలో ఇది ఒకటి.

అస్థిపంజరాన్ని గుర్తించిన పశువుల పెంపకందారులు

అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో పశువుల పెంపకదారురాలు జోడీ పియర్సన్ తన భూమిలో ఈ అస్థిపంజరాన్ని గుర్తించారు. ఆ ప్రాంతం హెల్ క్రీక్ ఫార్మేషన్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది డైనోసార్ శిలాజాల కోసం విస్తృతంగా అధ్యయనం చేసిన భౌగోళిక ప్రాంతం. అనంతరం వాణిజ్యపరంగా శిలాజా తవ్వకాలు చేసే పాలియోంటాలజిస్ట్‌ క్లేటన్‌ ఫిప్స్‌ దాన్ని తవ్వి వెలికితీశారు.

క్లేటన్ ఫిప్స్ గతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన "డ్యూయెలింగ్ డైనోసార్స్" శిలాజాన్ని కూడా కనుగొన్నారు. 2006లో జోడి అస్థిపంజరం లభించిన ప్రదేశానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఇది బయటపడింది. అందులో ఒక నానోటైరానస్‌, ఒక ట్రైసెరాటాప్స్‌ పరస్పరం పోరాడుతున్నట్లుగా కనిపించే అవశేషాలు ఉన్నాయి.

నానోటైరానస్‌ టీ.రెక్స్‌కు భిన్నమైన ప్రత్యేక జాతి అని నిర్థరించేందుకు లిండ్సే జానో, జేమ్స్‌ నాపోలీ ప్రచురించిన పరిశోధనకు 'డ్యూయలింగ్‌ డైనోసార్స్‌' శిలాజం కీలక ఆధారంగా నిలిచింది. ఈ పరిశోధనతో ఈ రెండు డైనోసార్లు వేర్వేరు జాతులా కాదా అనే అంశంపై దశాబ్దాలుగా కొనసాగుతున్న చర్చకు ముగింపు లభించింది.

శిలాజాల సేకరణలోకి అత్యంత సంపన్నులు భారీగా ప్రవేశించడం వల్ల కొత్త పరిస్థితులు ఏర్పడవచ్చని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో జోడి వేలం జరిగింది.

నానోటైరానస్ డైనోసార్ అస్థిపంజరం
ఫొటో క్యాప్షన్, అక్టోబర్ 27న సోథెబీస్ న్యూయార్క్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రత్యక్ష వేలంపాటలో జోడి ని విక్రయించారు.

వేలం ట్రెండ్‌గా మారకూడదంటున్న శాస్త్రవేత్తలు

గస్ అస్థిపంజరం విక్రయమైన తర్వాత, ఇలాంటి అరుదైన శిలాజాలను ప్రైవేటు సేకరణల్లో కాకుండా ప్రజలు, పరిశోధకులు అందుబాటులో ఉండే మ్యూజియంలలో ఉంచాలని పరిశోధకులు బీబీసీకి తెలిపారు.

ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త, జురాసిక్ పార్క్ చిత్రాలకు సలహాదారుగా పనిచేసిన ప్రొఫెసర్ స్టీవ్ బ్రుసాట్టే, జూలైలో బీబీసీ వరల్డ్ సర్వీస్ కార్యక్రమంతో మాట్లాడుతూ టి-రెక్స్ వేలం "ఆందోళనకరమైన విషయం" అని వ్యాఖ్యానించారు.

"అంత భారీ ధర చెల్లించే సామర్థ్యం ఉన్న మ్యూజియం లేదా విశ్వవిద్యాలయం నాకు తెలియదు. మోనాలిసా చిత్రాన్ని ఒక ధనవంతుడు వ్యక్తిగతంగా సొంతం చేసుకుని, ప్రజలకు చూపించకుండా ఉంచితే ఎలా ఉంటుందో ఊహించండి. ప్రజలు దాన్ని చూడలేరు, ఆస్వాదించలేరు" అని ఆయన అన్నారు.

ఇలాంటి విక్రయాలు ఒక సాధారణ ట్రెండ్‌గా మారకూడదని ఆశిస్తున్నానని, లేకపోతే శాస్త్రీయ పరిశోధనలు, ప్రజా విద్యపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.

నానోటైరానస్ డైనోసార్ అస్థిపంజరం
ఫొటో క్యాప్షన్, అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో పశువుల పెంపకదారురాలు తమ భూమిలో జోడిని గుర్తించారు

ఏదో దశలో మ్యూజియంకు చేరుతుందని మరికొందరి వాదన

మంగళవారం జరిగిన జోడి వేలంపై స్పందిస్తూ, "నానోటైరానస్ నిజంగా ప్రత్యేక జాతి అని మనం ఇప్పుడే నిర్ధరించాం. అలాంటి సమయంలో దానికి చెందిన అత్యుత్తమ అస్థిపంజరాల్లో ఒకటి అత్యధిక ధరకు ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. అది మ్యూజియంలో ప్రజలను, ముఖ్యంగా పిల్లలను, కుటుంబాలను ప్రేరేపించడానికి బదులుగా వ్యక్తిగత సేకరణల్లో కనుమరుగైపోవచ్చనే ఆలోచన బాధాకరం" అని బ్రుసాట్టే బీబీసీతో అన్నారు.

అయితే, ఈ అంశానికి రెండు కోణాలు ఉన్నాయని మేగన్ జాకబ్స్ చెప్పారు. ఇలాంటి శిలాజాలను కనుగొనడం, తవ్వడం, సంరక్షించడం కోసం ఎంతో సమయం, శ్రమ, ధనం వెచ్చించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

"ఇందులో భాగమైన వారు ఇంత పెద్ద మొత్తానికి దీన్ని విక్రయించాలనుకోవడాన్ని నేను తప్పుపట్టను," అని జాకబ్స్ అన్నారు.

"ఇది కొంత ఆందోళన కలిగించే విషయమే అయినప్పటికీ, ఇలాంటి శిలాజాల్లో చాలా వరకు చివరికి ప్రజల ముందుకు వచ్చాయి. వాటిలో అనేకం మ్యూజియంల్లో ప్రదర్శనకు చేరాయి. ఇవి ఏదో ఒక దశలో మ్యూజియంలోకి చేరుతాయని ఎలాంటి సందేహం లేకుండా చెప్పగలను" అని పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)