అమెరికా మధ్యంతర ఎన్నికలు: భారత సంతతి అభ్యర్థుల్లో ఓడింది ఎందరు, గెలిచింది ఎవరెవరు?

 పియా డాండియా, ఫ్లోరిడాలో రిపబ్లికన్ అభ్యర్థి
ఫొటో క్యాప్షన్, భారతీయ మూలాలున్న పియా డాండియా ఫ్లోరిడాలో రిపబ్లికన్ అభ్యర్థిని ఓడించారు.
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో భారతీయ మూలాలున్న పలువురు అభ్యర్థులు కూడా పోటీ చేశారు.

విజయం సాధించిన భారతీయ మూలాలున్న అభ్యర్థులందరూ డెమొక్రటిక్ పార్టీకి చెందినవారే. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన భారతీయ మూలాలున్న అభ్యర్థులందరూ ఓటమి పాలయ్యారు.

విజయం సాధించిన భారతీయ మూలాలున్న అభ్యర్థుల్లో పియా డాండియా పేరు ప్రముఖంగా నిలిచింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పియా డాండియా, ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెస్ నియోజకవర్గ స్థానాన్ని గెలుచుకున్నారు.

దక్షిణ ఫ్లోరిడాలో అత్యంత ఆసక్తికరంగా సాగిన ఎన్నికల పోరులో రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కర్‌ను ఆమె ఓడించారు.

ట్రంప్ మద్దతు ఉన్నప్పటికీ భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామి ఒహాయో గవర్నర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికాలోని ఒహాయో రాష్ట్ర గవర్నర్ పదవికి జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అమీ ఆక్టన్ విజయం సాధించారు.

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామిపై ఆమె గెలుపొందారు.

ఎన్నికల ప్రచార సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రెండుసార్లు వివేక్ రామస్వామికి మద్దతుగా ప్రచారం చేశారు.

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి సుహాస్ సుబ్రహ్మణ్యం
ఫొటో క్యాప్షన్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి సుహాస్ సుబ్రహ్మణ్యం ఎన్నికల్లో 60 శాతానికి పైగా ఓట్లను సాధించారు.

గెలిచిన భారత సంతతి అభ్యర్థులు

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డేవ్ బెక్‌విత్‌పై పోటీ చేసిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి సుహాస్ సుబ్రహ్మణ్యం గెలిచారు.

ఈ ఎన్నికల్లో సుహాస్ సుబ్రహ్మణ్యంకు 60 శాతానికి పైగా ఓట్లు లభించగా, డేవ్ బెక్‌విత్‌కు సుమారు 38 శాతం ఓట్లు వచ్చాయి.

పియా డాండియా

2026 మధ్యంతర ఎన్నికలకు ముందు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ చేపట్టిన కాంగ్రెస్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా కొత్తగా రూపొందించిన నియోజకవర్గంలో డాండియా విజయం సాధించారు. ఈ స్థానంలో డెమొక్రటిక్ పార్టీ గెలుపొందడం విశేషం.

డాండియా గతంలో హార్లెమ్‌లో ఉపాధ్యాయురాలిగా, హైస్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. వైట్‌హౌస్ ఫెలోగా కూడా సేవలందించారు. యాపిల్ సంస్థలోనూ పనిచేశారు.

భారతీయ మూలాలున్న తల్లిదండ్రులకు పామ్ బీచ్ కౌంటీలో జన్మించిన ఆమె, అక్కడే పెరిగారు. విద్య, ద్రవ్యోల్బణం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, ఆర్థిక అవకాశాలను ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశాలుగా ప్రస్తావించారు.

రో ఖన్నా

కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డెమొక్రటిక్ అభ్యర్థి రో ఖన్నా 70 శాతానికి పైగా ఓట్లు సాధించారు.

ప్రమీలా జయపాల్

వాషింగ్టన్ రాష్ట్రంలోని ఒక కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి ప్రమీలా జయపాల్ 87 శాతానికి పైగా ఓట్లు సాధించారు. దీంతో అమెరికా ప్రతినిధుల సభకు మరోసారి ఎన్నికయ్యారు.

అమీ బేరా

కాలిఫోర్నియా నుంచి పోటీ చేసిన వైద్యుడు అమీ బేరా అమెరికా ప్రతినిధుల సభలో ఎనిమిదోసారి గెలిచారు.

అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, వివేక్ రామస్వామి
ఫొటో క్యాప్షన్, అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రచారం చేసినప్పటికీ ఎన్నికల్లో ఓటమిపాలైన వివేక్ రామస్వామి (ఫైల్ ఫోటో).

భారతీయ మూలాలున్న పలువురి ఓటమి

వివేక్ రామస్వామి:

అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరిగిన గవర్నర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అమీ ఆక్టన్ విజయం సాధించారు. ఆమె భారతీయ మూలాలున్న రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామిని ఓడించారు. గత 20 ఏళ్లలో ఒహాయో గవర్నర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి గెలవడం ఇదే మొదటిసారని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.

వృత్తిరీత్యా వైద్యురాలైన అమీ ఆక్టన్, గతంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ విజయంతో ఆమె ఆ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్‌గా నిలిచారు.

వివేక్ రామస్వామికి సంబంధించిన ఒక టీవీ ప్రకటనలో ఆయన తల్లి కనిపించడం వివాదాస్పదమైనప్పుడు, డోనల్డ్ ట్రంప్ ఆయనకు అండగా నిలిచారు.

రితేశ్ టాండన్:

కాలిఫోర్నియా 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసిన రితేశ్ టాండన్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రో ఖన్నా చేతిలో ఓడిపోయారు.

మహేశ్ 'మాక్స్' గనోర్కర్:

నార్త్ కరోలినాలో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసిన మహేశ్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి వాలెరీ ఫౌషీ చేతిలో ఓటమిని ఎదుర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో మహేశ్‌కు మద్దతు చాలా తక్కువగా ఉంది. ఆయనకు 20% కంటే తక్కువ ఓట్లు రాగా, వాలెరీ సుమారు 80% ఓట్లను సాధించారు.

శివ అయ్యాదురై:

మసాచుసెట్స్ నుంచి సెనేట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శివ అయ్యాదురై ఓటమి పాలయ్యారు. ఈ స్థానాన్ని డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఎడ్ మార్కీ గెలుచుకున్నారు.

నిరవ్ షెత్:

వాషింగ్టన్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో ప్రమీలా జయపాల్‌పై రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసిన నిరవ్ షెత్ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ప్రమీలకు సుమారు 88% ఓట్లు రాగా, నిరవ్‌కు సుమారు 12% ఓట్లు లభించాయి.

ట్రంప్, రిపబ్లికన్ పార్టీ
ఫొటో క్యాప్షన్, అమెరికాలోని ఏ సభలోనూ ఇప్పుడు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ లేదు(ఫైల్ ఫొటో).

ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ఈ కథనం ప్రచురితమయ్యే సమయానికి వెలువడిన ఎన్నికల ఫలితాలు అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రటిక్ పార్టీ మెజారిటీని సాధించిందని స్పష్టం చేస్తున్నాయి. ఓటర్లు ట్రంప్ రిపబ్లికన్ పార్టీని దూరం పెట్టారు.

ప్రతినిధుల సభలో (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) మొత్తం 435 స్థానాలు ఉండగా, వాటన్నింటికీ ఎన్నికలు జరిగాయి. ఈ వార్త రాసే సమయానికి, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ 228 స్థానాలను గెలుచుకోగా, ట్రంప్ రిపబ్లికన్ పార్టీ 139 స్థానాలను దక్కించుకుంది.

ఈ సభలో మొత్తం 435 స్థానాలకుగాను, ఇప్పటి వరకు 367 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి.

మరోవైపు, సెనేట్‌లోని 100 స్థానాలకుగాను 35 స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. వీటిలో 33 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఈ సభలో డెమొక్రటిక్ పార్టీ 54 స్థానాలుండగా, రిపబ్లికన్ పార్టీ 44 స్థానాలతో ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)