డోనల్డ్ ట్రంప్‌ నుంచి జేడీ వాన్స్ దూరం జరుగుతున్నారా?

అమెరికా, జేడీ వాన్స్, డోనల్డ్ ట్రంప్
ఫొటో క్యాప్షన్, వాన్స్
    • రచయిత, డేనియల్ బుష్
    • హోదా, వాషింగ్టన్ కరస్పాండెంట్
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి ఇరాన్‌తో యుద్ధమే ప్రధాన కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బుధవారం బహిరంగంగా ప్రకటించడం వాషింగ్టన్ రాజకీయ వర్గాల్లో చర్చనీయమైంది.

2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు తాను దూరంగా జరుగుతున్నాననే సంకేతాలు ఇచ్చేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది.

2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటు వేసినవారు మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు దూరమయ్యారని వాన్స్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

''మేం ఓడిపోవడానికి కారణం యుద్ధమే. అధ్యక్షుడు స్వయంగా నిన్న రాత్రి ఈ విషయం చెప్పారు'' అని తెలిపారు.

బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ట్రంప్ యుద్ధాన్ని సమర్థించుకున్నారు. అయితే, అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్‌లలో డెమొక్రాట్లు తిరిగి ఆధిపత్యం సాధించడంలో ఇరాన్ యుద్ధం కూడా ఒక కారణమని అంగీకరించారు.

ఇరాన్ యుద్ధంపై వాన్స్ అభిప్రాయం వాషింగ్టన్‌లో బహిరంగ రహస్యమే.

ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి తెహ్రాన్‌పై దాడులు చేసినప్పటి నుంచి ఆయన ఈ యుద్ధానికి పలుమార్లు మద్దతు ప్రకటించారు.

అయితే, ప్రభుత్వ ఉన్నతాధికారులతో జరిగిన అంతర్గత సమావేశాల్లో ఈ యుద్ధాన్ని వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పటివరకు ఈ భిన్నాభిప్రాయాలు బహిరంగంగా బయటపడలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, జేడీ వాన్స్, డోనల్డ్ ట్రంప్
ఫొటో క్యాప్షన్, వాన్స్ తన ప్రకటనను ఎక్స్‌లో పోస్టు చేయడానికి ముందే ట్రంప్‌కు చూపించినట్లు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది (ఫైల్ ఫోటో).

రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ఓటమిని చవిచూసిన కొన్ని గంటల్లోనే వాన్స్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.

యుద్ధానికి వెళ్లాలన్న నిర్ణయం రాజకీయంగా పెద్ద తప్పిదమని ఆయన భావిస్తున్నట్లు వెల్లడైంది.

''వచ్చే ఆరేళ్ల పాటు సెనేట్‌ను కోల్పోవడం సరైన నిర్ణయమేనని మీరు భావిస్తే ఆ వాదన వినిపించండి. అందుకు చెల్లించిన మూల్యం సమర్థనీయమేనని చెప్పండి. మీరు అంగీకరించినా, లేకపోయినా, అది కనీసం నిజాయితీ అవుతుంది'' అని వాన్స్ తెలిపారు.

వాన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా ఇటీవలి రాజకీయ చరిత్రలో.. అధ్యక్షుడి ప్రధాన విదేశాంగ విధాన నిర్ణయంపై పదవిలో ఉన్న ఉపాధ్యక్షుడు ఇంత తీవ్రంగా విభేదించిన సందర్భం అరుదు.

అయితే, అంతకంటే ఆశ్చర్యకరమైన పరిణామం కూడా చోటుచేసుకుంది. తన సీనియర్ అడ్వైజర్ల నుంచి పూర్తి విధేయతను ఆశించే ట్రంప్.. మధ్యంతర ఎన్నికల్లో ఓటమికి యుద్ధం కూడా ప్రధాన కారణమని వాన్స్ చేసిన వ్యాఖ్యతో ఏకీభవించారు. అదే పరిస్థితి మళ్లీ ఎదురైతే మరోసారి యుద్ధానికి వెళ్తానని కూడా చెప్పారు.

అమెరికా, జేడీ వాన్స్, డోనల్డ్ ట్రంప్
ఫొటో క్యాప్షన్, జేడీ వాన్స్

తన అడ్వైజర్ల నుంచి విధేయతను కోరుకునే ట్రంప్.. భవిష్యత్తులో వాన్స్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకుంటే ఆయనకు స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉందనడానికి ఇది తొలి సంకేతంగా కనిపిస్తోంది.

యుద్ధంపై వాన్స్ చేసిన వ్యాఖ్యల గురించి విలేఖరులు ప్రశ్నించగా.. ''ఆయన అభిప్రాయం ఏమిటో నాకు తెలుసు. ఆయన చేసిన వ్యాఖ్యలు సరైనవేనని భావిస్తున్నాను. నేను యుద్ధానికి వెళ్లినప్పుడే ఆయన అభిప్రాయం నాకు తెలుసు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకున్నాం. ఇకపై ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదు'' అని ట్రంప్ సమాధానమిచ్చారు.

వాన్స్ ప్రకటన ట్రంప్ నుంచి తనను తాను వేరు చేసుకునే ప్రయత్నంలా కనిపిస్తోందని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన విదేశాంగ విధాన నిపుణుడు డేనియల్ బైమన్ అభిప్రాయపడ్డారు.

అయితే, వాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటే ట్రంప్‌తో విభేదాలను వ్యక్తం చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని బైమన్ అన్నారు.

వాన్స్ ఎక్స్ పోస్టులోనూ ఈ సమతూకం కనిపించింది. ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, ఎన్నికల ఫలితాలపై తన విశ్లేషణలో ఎక్కువ భాగాన్ని పేరు వెల్లడించని సర్వే నిపుణుల అభిప్రాయాలుగా పేర్కొన్నారు.

''భవిష్యత్తులో ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకునేందుకు వాన్స్ తొలుత తన అభిప్రాయాన్ని బయటపెట్టి, పరిస్థితిని అంచనా వేస్తున్నారు'' అని రిపబ్లికన్ పార్టీ వ్యూహకర్త యాష్లే డేవిస్ బీబీసీతో అన్నారు.

ఇరాన్ యుద్ధంపై విమర్శలకే పరిమితం కాకుండా.. భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాన్ని కూడా వాన్స్ వివరించారు. ఓటర్లను తిరిగి ఆకర్షించేందుకు నాలుగు అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదించారు.

  • యుద్ధాన్ని ముగించాలి.
  • జీవన వ్యయం, ద్రవ్యోల్బణంపై దృష్టి పెట్టాలి.
  • అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ఇజ్రాయెల్‌తో సంబంధాలను పునఃసమీక్షించాలి.

ఈ నాలుగు అంశాలు జాతీయ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వాన్స్ అనుసరిస్తున్న విధానాలను ప్రతిబింబిస్తున్నాయి. భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన వినిపించే ప్రధాన వాదనలకు ఇవి పునాదిగా నిలిచే అవకాశం ఉంది.

ఈ అంశంపై స్పందన కోసం వాన్స్ కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించింది.

వైట్ హౌస్
ఫొటో క్యాప్షన్, వైట్ హౌస్ (ఫైల్ ఫోటో)

అయితే, తదుపరి అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. వాన్స్ పోటీ చేస్తారని అంచనాలు ఉన్నప్పటికీ.. ఆయన ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై ఆలోచిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ట్రంప్‌తో వాన్స్ ఎంతవరకు విభేదించారన్న అంశంపైనా చర్చ జరుగుతోంది. వాన్స్ తన ప్రకటనను ఎక్స్‌లో పోస్టు చేయడానికి ముందే ట్రంప్‌కు చూపించినట్లు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

మరోవైపు, వాన్స్ లేదా మరెవరైనా తనతో విభేదించడాన్ని సహించబోనని ట్రంప్ భవిష్యత్తులో స్పష్టం చేసే అవకాశమూ లేకపోలేదు. తన వారసుడిగా 2028 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ఎవరుండాలనే విషయంలో ట్రంప్ ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు.

వాన్స్‌తోపాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియోను కూడా ట్రంప్ పలుమార్లు ప్రశంసించారు. అయితే, ఎవరికి మద్దతు ఇస్తారనే విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో, అసలు ప్రకటిస్తారో లేదో కూడా చెప్పలేదు.

తన రాజకీయ వారసుడిగా ఎవరిని నిలబెట్టాలనే అంశంపై ఊహాగానాలు కొనసాగడాన్ని ట్రంప్ ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అనుమతి లేకపోయినా.. మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగాలనే ఆలోచనను కూడా గతంలో ఆయన ప్రస్తావించారు.

మధ్యంతర ఎన్నికలపై వాన్స్ చేసిన ప్రకటన పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు లేదా 2028 అధ్యక్ష ఎన్నికల పోరుకు, ట్రంప్ తర్వాత రిపబ్లికన్ పార్టీలో ఆధిపత్యం కోసం జరిగే పోరాటానికి ఇదే నాంది కావచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)