ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో దశాబ్దాల తర్వాత అతిపెద్ద ముందడుగు.. రోజువారీ మాత్రతో ప్రతి 12 మందిలో ఒకరిలో పూర్తిగా నయమైన కణితులు

ఫొటో సోర్స్, Dr Michael May/Dr Wungki Park/Memorial Sloan Kettering Cancer Center/Press Association
- రచయిత, మిచెల్ రాబర్ట్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కొందరు రోగుల్లో రోజూ వేసుకునే ఒక మాత్ర కణితులను చిన్నవిగా మార్చడమే కాకుండా, వాటిని పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఈ వ్యాధి చికిత్సలో దశాబ్దాల తర్వాత ఇదే అతిపెద్ద ముందడుగు అని నిపుణులు చెబుతున్నారు.
అత్యంత ప్రమాదకరమైన, చికిత్స చేయడం కష్టమైన క్యాన్సర్లలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి.
ప్రాథమిక వైద్య పరీక్షల్లో కీమోథెరపీతో పాటు డారాక్సన్రాసిబ్ ఔషధం తీసుకున్న ప్రతి 12 మందిలో ఒకరికి స్కానింగ్‌లో క్యాన్సర్ ఆనవాళ్లు కనిపించలేదు.
శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించిన, ముదిరిన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 61 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
చికిత్స తర్వాత, వీరిలో దాదాపు అందరికీ క్యాన్సర్ కణితుల పెరుగుదల ఆగిపోయింది.
అయితే, ఈ చికిత్సతో క్యాన్సర్ ఎంతకాలం అదుపులో ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదని వైద్యులు చెబుతున్నారు.
దీన్ని వ్యాధికి పూర్తిస్థాయి నివారణగా భావించకూడదని చెబుతున్నారు.

'ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పురోగతి'
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో ఇది దశాబ్దాల తర్వాత వచ్చిన అతిపెద్ద ముందడుగని క్యాన్సర్ రీసెర్చ్ యూకే సంస్థ పేర్కొంది. ఈ ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని ఆ సంస్థకు చెందిన డాక్టర్ సామ్ గాడ్ఫ్రే బీబీసీ న్యూస్‌తో చెప్పారు.
"మందులతో చికిత్స చేయడం అసాధ్యమని భావించిన లక్ష్యాన్ని చేరుకునే మార్గాన్ని ఈ కొత్త ఔషధం కనుగొంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పురోగతి ఇప్పుడు కనిపిస్తోంది" అన్నారు.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు చికిత్స చేయడం చాలా కష్టం. బ్రిటన్‌లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లతో పోలిస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధితులు బతికే అవకాశాలు తక్కువ.
కీమోథెరపీతో కణితులు కొంతవరకు చిన్నవిగా మారినప్పటికీ, కొంతకాలానికి క్యాన్సర్ మళ్లీ పెరుగుతుంది.
వ్యాధి ముదిరిన దశలో ఉన్న చాలామంది రోగులు ఏళ్లపాటు కాకుండా కొన్ని నెలలు మాత్రమే జీవిస్తున్నారు.
కొత్త చికిత్సతో క్యాన్సర్‌ను పూర్తిగా అడ్డుకోలేకపోయినా, రోగులకు మరికొంత కాలం జీవించే అవకాశం లభిస్తుందని వైద్యులు ఆశిస్తున్నారు.
ఈ అధ్యయనంలో భాగంగా రోగులను సగటున ఏడాదిన్నర పాటు పరిశీలించారు. ఈ సమయంలో కొందరిలో క్యాన్సర్ మళ్లీ కనిపించలేదు.
అయితే, క్యాన్సర్ పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? అలా జరిగితే ఎంతకాలం ఆ పరిస్థితి కొనసాగుతుంది? అనే విషయాలు తెలుసుకోవడానికి మరింత సుదీర్ఘ అధ్యయనాలు అవసరం.
ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైన వివరాలు:
- 90 శాతం మంది రోగుల్లో క్యాన్సర్ కణితుల పెరుగుదల ఆగిపోయింది.
- 60 శాతానికి పైగా రోగుల్లో కణితులు చిన్నవయ్యాయి లేదా పూర్తిగా మాయమయ్యాయి.
- దాదాపు 8 శాతం మంది రోగుల్లో (ప్రతి 12 మందిలో ఒకరు) సీటీ స్కాన్లలో క్యాన్సర్ ఆనవాళ్లు కనిపించలేదు.
ఎక్కువ కాలం జీవించే అవకాశం
అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన డాక్టర్ వూంగ్కీ పార్క్ ఈ అధ్యయనంలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
"చికిత్సకు స్పందిస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా, కణితులు గతంలో కంటే ఎక్కువగా తగ్గుతున్నాయి. వ్యాధి అదుపులో ఉండే సమయం కూడా దాదాపు రెట్టింపైంది. దీనివల్ల భవిష్యత్తులో రోగులు మరింత ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది" అని వూంగ్కీ పార్క్ తెలిపారు.
డారాక్సన్రాసిబ్ ఒక లక్షిత చికిత్సా ఔషధం. దీనికి ఇప్పటికే అమెరికాలో అనుమతి లభించింది. కణితుల పెరుగుదలకు కారణమయ్యే ఆర్ఏఎస్ అనే జన్యు మార్పులను గుర్తించి, వాటి కార్యకలాపాలను నిలిపివేయడం ద్వారా ఈ ఔషధం పనిచేస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లలో చాలావాటికి ఈ జన్యు మార్పులే కారణం.
ఊపిరితిత్తులు, అండాశయ క్యాన్సర్లతో సహా మరికొన్ని క్యాన్సర్లలోనూ ఇలాంటి జన్యు మార్పులు కనిపిస్తాయి. దీంతో ఈ ఔషధం ఇతర క్యాన్సర్లతో బాధపడుతున్న రోగులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది.
"ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో ఇప్పుడు కనిపిస్తున్న ప్రారంభ విజయాలు ఇతర క్యాన్సర్ల చికిత్సలోనూ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను" అని డాక్టర్ గాడ్ఫ్రే చెప్పారు.
అయితే, మరింత సుదీర్ఘంగా నిర్వహించే పరీక్షలు, వాటి ఫలితాలు చాలా కీలకమని ఆయన అన్నారు.
"క్యాన్సర్ మళ్లీ రావచ్చు. స్కాన్లలో ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోయినా, మరికొంత కాలం గడిచే వరకు రోగికి క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయిందని కచ్చితంగా చెప్పలేం" అన్నారు.
2026 యూరోపియన్ క్యాన్సర్ సదస్సులో ఈ అధ్యయన వివరాలను ఇతర వైద్యుల ముందు ప్రదర్శిస్తున్నారు.
ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న ప్రొఫెసర్ ఎలెనా గారాల్డా మాట్లాడుతూ.. ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు.
"ఈ రెండు చికిత్సలను కలిపి అందించడం వల్ల రోగులు మరింత ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది. అలాగే, క్యాన్సర్ కణితులు మళ్లీ వృద్ధి చెందడానికి పట్టే సమయం కూడా పెరగవచ్చని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి" అని ఎలెనా గారాల్డా అన్నారు.
అమెరికాలో నమోదయ్యే మొత్తం క్యాన్సర్ కేసుల్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వాటా దాదాపు 3 శాతం. క్యాన్సర్ కారణంగా సంభవించే మరణాల్లో ఈ వ్యాధి వాటా సుమారు 8 శాతం. అమెరికాలో ఏటా దాదాపు 53 వేల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు.
బ్రిటన్‌లో ఏటా సుమారు 11,500 మందికి ఈ క్యాన్సర్ నిర్ధరణ అవుతుండగా, దాదాపు 10,200 మంది ప్రాణాలు కోల్పోతున్నారని క్యాన్సర్ రీసెర్చ్ యూకే వెల్లడించింది.
నటుడు అలన్ రిక్మన్ 2016లో ఈ వ్యాధితో మరణించారు. క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయిన ఐదు నెలలకే ఆయన కన్నుమూశారు.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు:
- చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం (కామెర్లు)
- చర్మంపై దురద
- మూత్రం ముదురు రంగులో రావడం
- మలం లేత రంగులో రావడం
- ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం
- అలసట
- శరీర ఉష్ణోగ్రత పెరగడం (జ్వరం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































