రష్యా నుంచి చమురు దిగుమతి: ట్రంప్ నిర్ణయంపై అమెరికన్లలో ఆశ్చర్యం, జెలియెన్‌స్కీలో ఆగ్రహం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆంథోనీ జర్చర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుని, రష్యా నుంచి మళ్లీ చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి అంగీకరించారు.
మూడు వారాల కిందటే రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై కొత్త ఆంక్షలు విధించే చట్టంపై ట్రంప్ సంతకం చేశారు.
అయితే ఇప్పుడు అమెరికాకు, ప్రపంచ మార్కెట్‌కు పెద్ద మొత్తంలో డీజిల్ సరఫరా చేయడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారని యూఎస్ ప్రెసిడెంట్ చెబుతున్నారు.
ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఇంధన ధరల సమస్యలు కూడా ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తోంది.
పెరిగిన ఇంధన ధరలు అమెరికాను ఇబ్బంది పెడుతున్నాయి. అధిక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కారణంగా ద్రవ్యోల్బణం పెరిగింది. దీని వల్ల ప్రజల్లో అసంతృప్తి ఎక్కువైంది.

మధ్యంతర ఎన్నికలకు ముందు నెలకొన్న ఈ పరిస్థితులు ట్రంప్ ప్రజాదరణపై ప్రభావం చూపాయి. అందుకే ఇంధన ధరలను తగ్గించేందుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ యుద్ధం వల్ల అమెరికాలో వ్యవసాయం ఎక్కువగా జరిగే రాష్ట్రాలు బాగా నష్టపోయాయి. ఎందుకంటే అక్కడ వ్యవసాయ యంత్రాలు నడపడానికి, పంటలను మార్కెట్‌కు తరలించడానికి డీజిల్ చాలా అవసరం.
అయోవా, కాన్సాస్, టెక్సస్, ఒహాయో వంటి రాష్ట్రాలు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఈ రాష్ట్రాల్లో వచ్చే ఫలితాలు రిపబ్లికన్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా లేదా అన్నది నిర్ణయించవచ్చు.
ఫలితం ఎలా ఉంటుంది?
ఇటీవల ట్రంప్ యూరప్ దేశాలు తమ చమురు నిల్వలను ఎక్కువగా ఉపయోగించాలని, మార్కెట్‌లోకి విడుదల చేయాలని ఒత్తిడి చేశారు.
ఇంధన ధరలు తగ్గించడానికి ఇంధనంపై ఉన్న ఫెడరల్ పన్నును తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే రైతులు ఉపయోగించే ఇంధనంలో కొంత భాగాన్ని రాష్ట్రాల మధ్య సరకు రవాణా కోసం కూడా వాడేందుకు అనుమతి ఇచ్చారు.
మిడ్‌టర్మ్ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఇరాన్‌పై మళ్లీ దాడులు చేయబోమని ట్రంప్ చెప్పారు. అంటే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం రాజకీయంగా తమకు నష్టాన్ని కలిగిస్తోందని ఆయన పరోక్షంగా అంగీకరించినట్టుగా ఈ ప్రకటన కనిపిస్తోంది.
పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ ఇబ్బందులు తగ్గించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చమురు సరఫరా ఒప్పందం చేసుకొని మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ పెట్టే సోషల్ మీడియా పోస్టుల్లో తరచూ పూర్తి వివరాలు ఉండవు. రష్యా ఈ డీజిల్‌ను ప్రపంచ మార్కెట్‌కు ఎలా సరఫరా చేస్తుంది, దానికి బదులుగా విదేశీ కరెన్సీ తప్ప మరేమైనా లాభం పొందుతుందా అనే విషయాలు ఇంకా స్పష్టంగా లేవు.

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
ట్రంప్ నిర్ణయంపై జెలియెన్‌స్కీ అసహనం
ఈ ఒప్పందం వల్ల ట్రంప్‌పై యూరప్ దేశాలు, అమెరికా రాజకీయ నాయకులు విమర్శలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడం ద్వారా అమెరికా ప్రభుత్వం పరోక్షంగా రష్యా యుద్ధ ఖర్చులకు డబ్బును సమకూరుస్తోందని వారు ఆరోపించవచ్చు.
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఈ ఒప్పందాన్ని పుతిన్‌కు ఇచ్చిన ఒక 'బహుమతి'గా విమర్శించారు. రష్యా ఉగ్రవాదం, నమ్మకద్రోహం వంటి చర్యలకు పాల్పడుతున్నప్పటికీ, ఈ ఒప్పందం వల్ల దానికి లాభం చేకూరుతోందని ఆయన అన్నారు.
"రష్యాకు చమురు ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం ఇవ్వడం అంటే ఆ యుద్ధానికి మద్దతు ఇవ్వడమే. ఆ యుద్ధాన్ని ముగించాలి తప్ప, ఇంకా ఎక్కువ కాలం కొనసాగించేలా చేయకూడదు" అని ఎక్స్‌లో జెలియెన్‌స్కీఅన్నారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రిపబ్లికన్ పార్టీకి ఎన్నికల్లో ఎంత ప్రయోజనం కలుగుతుందో ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు.
యూరప్‌లో డీజిల్ అందుబాటులోకి వస్తుందని చేసిన హామీ వల్ల ఇంధన ధరల్లో పెద్దగా మార్పు రాలేదు. అలాగే రష్యా డీజిల్ ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందో కూడా ఇంకా స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ వరుసగా చేసిన దాడుల వల్ల రష్యా డీజిల్ శుద్ధి కేంద్రాల సామర్థ్యం దెబ్బతింది. ఈ దాడులను తగ్గించాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీని ట్రంప్ కోరినట్టు చెబుతున్నారు.
అమెరికా రోజుకు సుమారు 36 లక్షల బ్యారెళ్ల డీజిల్ వినియోగిస్తుంది. కాబట్టి ఈ నెల రష్యా వాగ్దానం చేసినట్టు 3 లక్షల టన్నుల డీజిల్ సరఫరా చేసినా, అది అమెరికా రోజువారీ అవసరాల్లో సగం మేరకే సరిపోతుంది.
దీని ప్రభావం అమెరికా ప్రజలకు వెంటనే తెలియకపోవచ్చు.
నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికలకు నెల రోజులు కూడా సమయం లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. అంటే ఎన్నికల పోరు దాదాపు మొదలైందని చెప్పవచ్చు.
"అమెరికా ప్రజలకు, ముఖ్యంగా రైతులు, పశుపోషకులకు, ట్రక్ డ్రైవర్లకు ఇంధనం, ఇతర వస్తువులు తక్కువ ధరలకే అందుబాటులో ఉండేలా చేయడం నా లక్ష్యం" అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.
గత ఏడు నెలలుగా ఇంధన, ఎనర్జీ వనరులు, ఇతర వినియోగ వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ట్రంప్, ఆయన అధికారులు మాత్రం యుద్ధం సమస్య త్వరలో పరిష్కారమవుతుందని, దాని వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుతాయని ప్రజలకు పదే పదే హామీ ఇస్తూ వచ్చారు.
ట్రంప్ తాజాగా చేసిన ఈ ఒప్పందం వల్ల తాను ఇచ్చిన ఆర్థిక ఉపశమనం హామీలు కేవలం మాటలు మాత్రమే కావని అమెరికా ఓటర్లను నమ్మించగలనని ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకోసం కొన్ని దౌత్యపరమైన విమర్శలు వచ్చినా వాటిని పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























