తిరుప్పరంకుండ్రం-కార్తీక దీపం: సుప్రీం కోర్టు చెప్పినా ఇక్కడ దీపం ఎందుకు వెలగలేదు? పోలీసులు ఏం చేశారు?

ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపోత్సవం సందర్భంగా దీపం వెలిగించారు.
కొండపై ఉన్న ఉచ్చిప్పిళ్ళైయార్ ఆలయానికి చెందిన దీప మండపంలో ఒక పెద్ద దీపపాత్రలో మహా దీపాన్ని వెలిగించారు. భక్తులు "హరోంహరా" అని నినాదాలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ కొండపై ఉన్న ఓ స్తంభంపై మాత్రం దీపం వెలిగించలేదు.
దీనికి నిరసనగా హిందూ సంఘాలకు చెందిన వ్యక్తులు ఆలయం ముందు ఆందోళన నిర్వహించారు.
ఆలయంలోని దీప మండపంలో దీపం వెలిగించిన అనంతరం కొండ చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులు పూజలు చేశారు.

కొండపై ఉన్న స్తంభంపై కూడా దీపాలు వెలిగించాలని బీజేపీ కార్యకర్తలతోపాటు, హిందూ సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసులు 50 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న స్తంభంపై మంగళవారంనాడు (నవంబర్ 24) దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రత కోసం ఐదువేల మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.

ఆలయానికి చాలా దూరంలో వాహనాలు నిలిపివేత
తిరుప్పరంకుండ్రంలోని సన్నిధి వీధి ప్రాంతంలో బాంబు స్క్వాడ్, పోలీసు జాగిలాల సాయంతో విస్తృతంగా తనిఖీలు జరిగాయి. కొండ, చుట్టుపక్కల పట్టణ ప్రాంతాలు, ప్రదక్షిణ మార్గంతో పాటు అనేక ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
తిరుప్పరంకుండ్రంలోకి ప్రవేశించే రహదారులకు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు నిఘా పెట్టారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ప్రజలను ఆ ప్రాంతంలోకి అనుమతించారని ఘటనాస్థలంలో ఉన్న బీబీసీ జర్నలిస్ట్ సిరాజ్ చెప్పారు.
సాధారణంగా తిరుప్పరంకుండ్రం ఆలయం ముందున్న రాతి మండపం వరకు ద్విచక్రవాహనాలు, కార్లను అనుమతిస్తారు. కానీ ఈసారి వాహనాలను అక్కడి వరకు వెళ్లనివ్వలేదు. చాలాదూరంలోనే వాటిని నిలిపివేశారు. ఆలయంలో పూజలు చేయడానికి వచ్చిన భక్తులను మాత్రమే లోపలికి అనుమతించారు.
తిరుప్పరంకుండ్రం కొండ, దాని చుట్టుపక్కల ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించి, డ్రోన్లు ఎగరవేయడాన్ని నిషేధించారు.
తిరుప్పరంకుండ్రంలోని కాశీ విశ్వనాథ ఆలయం, సుల్తాన్ సికందర్ బాదుషా ఔలియా దర్గాకు వెళ్లే మార్గం మొత్తాన్ని పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు.
రథం వీధిలో ఉన్న సికందర్ బదుషా ఔలియా మసీదు చుట్టుపక్కల కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాలేంటి?
మదురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ సోమవారం ఆంక్షలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 23 రాత్రి 9 గంటల నుంచి నవంబర్ 25 ఉదయం 10 గంటల వరకు అనుమతి లేకుండా ప్రజలు గుమిగూడటం, నిరసనలు చేపట్టడం, ర్యాలీలు నిర్వహించడం, బహిరంగ సభలు జరపడం నిషేధం.
కొండపైకి ఎక్కడంపైనా ఆంక్షలు విధించారు.
అయితే, ప్రతిరోజూ జరిగే పూజలు, కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి సంబంధించిన కార్యకలాపాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఫొటో సోర్స్, ANI
పోలీసుల అదుపులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, పార్టీ పదాధికారులు, కార్యకర్తలతో కలిసి తిరుప్పరంకుండ్రం వెళ్లేందుకు తిరునల్వేలి నుంచి కారులో బయలుదేరారు. మదురై రోడ్డులోని గణపతి మిల్ చెక్‌పాయింట్ వద్దకు ఆయన వాహనం చేరుకోగానే పోలీసులు దానిని ఆపారు.
"తిరుప్పరంకుండ్రంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆదేశాలున్నాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్లలేరు. మేం మిమ్మల్ని వెళ్లనివ్వం" అని చెప్పారు.
అందుకు వాళ్లు నిరాకరించడంతో నైనార్ నాగేంద్రన్‌తో పాటు ఉన్న 100 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని ఒక ఫంక్షన్ హాల్‌కు తరలించారు.
"చట్టపరమైన ఆంక్షలు ఏమీ లేనప్పుడు పోలీసులు నన్ను పూజలు చేయడానికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? అరెస్టు చేస్తామని బెదిరించి మమ్మల్ని ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా నిరోధించడం ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే" అని నైనార్ నాగేంద్రన్ అన్నారు.
‘‘భారత రాజ్యాంగంలోని 25, 26 అధికరణల ప్రకారం ప్రతి పౌరునికి తన ఇష్టానుసారం దేవుడిని పూజించడానికి, మతపరమైన కార్యకలాపాలను స్వేచ్ఛగా ఆచరించడానికి హక్కు ఉంది. కానీ తమిళనాడులో ఈ ప్రాథమిక హక్కులను ప్రజలకు దూరం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తిరుప్పరంకుండ్రం వంటి పుణ్యక్షేత్రాల్లో దీపాలు వెలిగించడాన్ని, ప్రార్థనలు చేయడాన్ని నిషేధించడం ఎంత మేరకు సమర్థనీయం?’’ అని ఆయన ప్రశ్నించారు.
"నేను చెన్నై నుంచి మదురైకి బయలుదేరినప్పుడే తిరుప్పరంకుండ్రం వెళ్లవద్దని పోలీసులు నాకు చెప్పారు. కానీ నేను వారి మాట వినకుండా మదురైకి వచ్చాను. నేను నేరుగా తిరుప్పరంకుండ్రం ఆలయానికే వెళ్తున్నాను. అక్కడ పోలీసులు నన్ను ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకోవచ్చని నాకు తెలుసు. అయినప్పటికీ నేను వెళ్తున్నాను" అని చెన్నై విమానాశ్రయం నుంచి బీబీసీతో మాట్లాడిన తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ ఇలా చెప్పారు.
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి ఎల్. మురుగన్‌ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కోయంబత్తూరు నుంచి తిరుప్పరంకుండ్రం వెళ్తుండగా అన్నూర్ వద్ద పోలీసులు ఆయనను ఆపారు. పోలీసులతో ఆయనకు జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ విడుదల చేసింది.

ఫొటో సోర్స్, ANI
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
కార్తీక దీపోత్సవం రోజు అంటే నవంబర్ 24 మంగళవారం నాడు తిరుప్పరన్కుండ్రం కొండపై ఒక్క దీపాన్ని మాత్రమే వెలిగించాలని నవంబర్ 20న సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్‌లు అరవింద్ కుమార్, విపుల్ ఎం. పంచోలి నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.
అయితే దీపాలు వెలిగించడానికి అనుమతించిన మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించిందని లైవ్ లా కథనం తెలిపింది.
ఒకసారి దీపాలు వెలిగించడానికి అనుమతి ఇవ్వడం అంటే, కొండపై దీపం వెలిగించే సంప్రదాయాన్ని కోర్టు శాశ్వతంగా గుర్తించినట్టు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అక్కడ దీపాలు వెలిగించడం అనేది ఒక సంప్రదాయంగా కొనసాగుతోందని చెప్పడానికి ఈ అనుమతిని ఆధారంగా ఎవరూ చూపించకూడదని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పూజలు నిర్వహించడానికి అనుమతి కోరేందుకు ఈ ఆదేశాలను ఆధారంగా ఉపయోగించకూడదని కోర్టు స్పష్టంచేసింది.
దీపం వెలిగించడానికి కొండ శిఖరంపైకి ఆలయ అధికారిక సిబ్బంది, ప్రభుత్వ అధికారులు మాత్రమే వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాధారణ ప్రజలకు అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఉండదని తెలిపింది. భద్రతా ఏర్పాట్లు చేయాలని న్యాయమూర్తులు అధికారులను ఆదేశించారు. అవసరం, సాధ్యాసాధ్యాలను బట్టి కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బందిని కూడా మోహరించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
దీపం వెలిగించే సమయం, అక్కడికి చేరుకునే మార్గాన్ని నిర్ణయించే బాధ్యతను జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. దీపం వెలిగించిన తర్వాత సంబంధిత వ్యక్తులు వెంటనే అక్కడి నుంచి తిరిగి రావాలని కోర్టు పేర్కొంది. అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకూడదని, నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయకూడదని స్పష్టం చేసింది.
కొండపై ఉన్న ఇతర ప్రార్థనా స్థలాలు, సికందర్ బాదుషా దర్గా, మసీదుల్లో పూజలు, ప్రార్థనలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిని అధికారులు నిర్ధరించాలని ఆదేశించింది. దీపం వెలిగించిన మూడు రోజుల్లోగా దీనికి సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని కోర్టు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు నవంబర్ 25న సెలవు కావడంతో ఈ పిటిషన్‌పై విచారణ జరగలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























