‘నువ్వు అబద్ధాలకోరువైనా అయ్యుండాలి, లేదా నీది మూర్ఖత్వమైనా అయ్యుండాలి’- అంటూ లేచి వెళ్లిపోయిన ట్రంప్

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంటర్వ్యూను మధ్యలోనే ముగించి ట్రంప్ వెళ్లిపోయారు.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ఎన్‌బీసీ చానెల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మధ్యలోనే ఆపేశారు. ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై కార్యక్రమ వ్యాఖ్యాత హోస్ట్ క్రిస్టెన్ వెల్కర్ పదేపదే ప్రశ్నలు వేయడంతో ఇంటర్వ్యూను మధ్యలోనే ముగించారు.

మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్, ప్రస్తుతం జరుగుతున్న కాలిఫోర్నియా ప్రైమరీ ఎన్నికలు, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు రెండూ 'రిగ్గింగ్' అయ్యాయని ఆరోపించారు.

కాలిఫోర్నియా ఎన్నికల్లో మోసం జరిగిందన్న ఆరోపణలకు ఆధారాలు చూపమని వెల్కర్ అడిగినప్పుడు, "నేను చూసినది, విన్నదే నాకు ఆధారం" అని ట్రంప్ అన్నారు.

"అది ఆధారం కాదు" అని వెల్కర్ బదులిచ్చారు.

ఆ తర్వాత మీడియాకు నిజాయితీ లేదు అని ఆరోపించిన ట్రంప్ "ఇక్కడితో ఇంటర్వ్యూ ముగిద్దాం..ఇక చాలు'' అని అంటూ ఆపేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వర్షం మధ్యలో రికార్డింగ్

సంప్రదాయ మీడియా సంస్థలకు, ట్రంప్‌కు మధ్య చాలా కాలంగా సంబంధాలు ఉద్రిక్తంగానే ఉన్నాయి. మీడియా తనతో పక్షపాతంగా వ్యవహరిస్తోందని ట్రంప్ ఆరోపిస్తుంటారు.

విస్కాన్సిన్‌లో ఒక రైతుల కార్యక్రమంలో భాగంగా ఒక పశువులశాలలో ఈ ఇంటర్వ్యూ రికార్డ్ చేశారు. సాంకేతిక సమస్యలు వచ్చాయి. పైకప్పుపై కురుస్తున్న వర్షం శబ్దం కారణంగా రికార్డింగ్‌కు చాలాసార్లు అంతరాయం కలిగింది.

శుక్రవారం(జూన్ 5) ఇంటర్వ్యూ ప్రారంభమైన సుమారు 50 నిమిషాలకు ట్రంప్ అక్కడినుంచి వెళ్లిపోయారు.

ఇంటర్వ్యూలో ఎక్కువ భాగం ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తత, సంఘర్షణపై సాగింది.

అణ్వాయుధాలు పొందకుండా ఇరాన్‌ను నిరోధించడానికి అమెరికా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అయితే ఇది 'అంతులేని యుద్ధం' కాదని ట్రంప్ అన్నారు.

"మేం అక్కడ కొన్ని నెలలు ఉంటాం. ఆ తర్వాత ప్రమాదం చాలా వరకు తొలగిపోతుంది" అని ఆయన చెప్పారు.

సెట్ నుంచి వెళ్లిపోవడానికి ఆరు నిమిషాల ముందు ట్రంప్ ఆయుధీకరణ నిరోధక నిధి(యాంటీ-వెపనైజేషన్ ఫండ్) గురించి వెల్కర్‌తో చర్చించారు.

ప్రభుత్వం తమపై అన్యాయంగా విచారణ జరిపిందని లేదా చర్యలు తీసుకుందని ఆరోపించే వారికి నష్ట పరిహారం అందించడానికి 1.8 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రణాళికను ఇప్పుడు ఉపసంహరించుకున్నారు.

ఈ ప్రతిపాదనను డెమోక్రాట్లతో పాటు కొంతమంది రిపబ్లికన్లు కూడా తీవ్రంగా విమర్శించారు.

2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ వద్ద జరిగిన అల్లర్లకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న వారికి కూడా దీని కింద చెల్లింపులు చేసే అవకాశముందని వారు ఆరోపించారు.

డోనల్ట్ ట్రంప్, మీడియా, అమెరికా, ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై జో బైడన్ విజయం సాధించారు.

ఇంటర్వ్యూ కొనసాగించాలని కోరినా...

తర్వాత చర్చ 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్‌పై జరిగిన అల్లరపైకి మళ్లింది. 2020 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ మళ్లీ ఆరోపించారు. క్రిస్టెన్ వెల్కర్ మళ్లీ ఆయన్ను నిలదీశారు.

తర్వాత కాలిఫోర్నియా ప్రైమరీ ఎన్నికల గురించి ట్రంప్ ప్రస్తావించారు. గవర్నర్‌తో సహా పలు పదవులకు నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను నిర్ణయించడానికి అక్కడ ఓట్లను లెక్కిస్తుండగా, నాలుగు రోజులు గడిచినా ఫలితాలు ప్రకటించలేదని, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనీ ట్రంప్ ఆరోపించారు.

"మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా?" అని వెల్కర్ అడిగారు.

"నేను చూస్తున్నాను, వింటున్నాను..అదే ఆధారం" అని ట్రంప్ బదులిచ్చారు.

"కానీ అది ఆధారం కాదు" అని వెల్కర్ మధ్యలో మళ్లీ అన్నారు.

కాలిఫోర్నియాలో పోస్టు ద్వారా వచ్చిన ఓట్లను కూడా లెక్కించాల్సి ఉండడంతో ఎన్నికల తుది ఫలితాలు ప్రకటించడానికి ఎక్కువ సమయం పడుతుంటుంది.

మెయిల్-ఇన్ ఓటింగ్‌పై చాలా కాలంగా ట్రంప్ విమర్శలు చేస్తున్నారు.

"వాళ్లు మీలాగే నిజాయితీ లేనివాళ్ళు" అని ట్రంప్ అన్నారు.

దీనికి వెల్కర్ "నేను అబద్ధం చెప్పడం లేదు. కానీ మనం సంభాషణను కొనసాగిద్దాం" అని బదులిచ్చారు.

అప్పుడు ట్రంప్ " నీది నిజాయితీ లేనితనం కావచ్చు లేదా మూర్ఖత్వం కావచ్చు" అని అన్నారు.

డోనల్ట్ ట్రంప్, మీడియా, అమెరికా, ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

‘ఇక చాలు, ముగిద్దాం’

కాసేపు వాగ్వాదం కొనసాగిన తర్వాత "దీన్ని ఇక్కడితో ముగిద్దాం. చాలు. థాంక్యూ డార్లింగ్, హావ్ ఏ నైస్ టైమ్ " అని ట్రంప్ అన్నారు.

ఇంటర్వ్యూను కొనసాగించడానికి వెల్కర్ ప్రయత్నించగా "నేను గంటసేపటి నుంచి వర్షంలో మీతో కూర్చున్నా. మీకు చాలినంత సమయం ఇచ్చా" అని చెప్పారు.

"మీరు మీ మీడియాను సంస్కరించాలి. ఎందుకంటే ఒక దేశ మీడియా నిజాయితీగా లేకపోతే ఆ దేశం ఎప్పటికీ గొప్ప దేశం కాలేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత కెమెరా వెనుక ఉన్న తన సిబ్బంది వైపు చూస్తూ 'వెళ్దాం పదండి' అని చెప్పి లేచి సెట్ నుంచి వెళ్లిపోయారు.

"నేను అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడాను. ఇంటర్వ్యూ సమయంలో వర్షం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని మేమిద్దరం అంగీకరించాం. 'మీట్ ది ప్రెస్' కోసం మరోసారి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన అంగీకరించారు" అని ఇంటర్వ్యూ ప్రసారమైన తర్వాత వెల్కర్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)