వైభవ్ సూర్యవంశీ మరో మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే.. అసలు విషయమిదీ..

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, లొరైన్ మెక్కెన్నా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఓ కారు గెలుచుకున్నాడు. కానీ దాన్ని నడిపేందుకు సూర్యవంశీ మరో మూడేళ్లు ఎదురుచూడాల్సి ఉంటుంది.
లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్లో 16 ఇన్నింగ్స్‌లో 237.30 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు చేశాడు.
సూర్యవంశీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఫైనల్స్‌కు చేరుకోకపోయినప్పటికీ 2026 ఐపీఎల్లో అతను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచాడు.
ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న సూర్యవంశీ, ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన వారికి లభించే ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నాడు.
వాటన్నింటితో పాటు భారత్‌లో ప్రఖ్యాతిగాంచిన మోడల్ టాటా సియెరా కారు కూడా సూర్యవంశీకి బహుమతిగా లభించింది. అయితే, భారత్‌లో వాహనం నడిపేందుకు కనీస వయసు 18 ఏళ్లు. దీంతో ఈ వాహనాన్ని డ్రైవ్ చేసేందుకు 15 ఏళ్ల సూర్యవంశీ మూడేళ్లు ఎదురుచూడక తప్పదు.


ఫొటో సోర్స్, Reuters
సూర్యవంశీకి వ్యక్తిగతంగా 38 లక్షల రూపాయలకు పైగా ప్రైజ్ మనీ వచ్చింది.
''ఇది గర్వించదగ్గ క్షణం. చాలా ఆనందంగా ఉంది. వచ్చే సీజన్లో మరింత మెరుగ్గా ఆడడానికి ప్రయత్నిస్తా'' అని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు. ప్రస్తుతం అతను అండర్ -19 భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
గత ఏడాది 14 ఏళ్ల వయసులో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు సూర్యవంశీ. ఇంత చిన్నవయసులో ఐపీఎల్ ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ సీజన్లో చివరి రెండు ఇన్నింగ్స్‌లో సూర్యవంశీ ఒక మ్యాచ్‌లో 97, మరో మ్యాచ్‌లో 96 పరుగులు చేశాడు.

ఫొటో సోర్స్, Reuters
ఈ సీజన్లో సూర్యవంశీ మొత్తం 72 సిక్సర్లు బాదాడు. అంటే, సూర్యవంశీ సిక్స్‌ల సగటు ఒక్కో ఇన్నింగ్స్‌కు నాలుగు కన్నా ఎక్కువే. టోర్నమెంట్లో రెండో అత్యుత్తమ ఆటగాడి కంటే 29 సిక్సర్లు ఎక్కువ బాదాడు.
గత వారం రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది.
గత ఏడాది జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ కోటి 10 లక్షల రూపాయలకు సూర్యవంశీని సొంతం చేసుకుంది.
అహ్మదాబాద్‌లో ఆదివారం(మే 31)న జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























