‘‘మధ్యంతర ఎన్నికల్లో గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు చెల్లిస్తాం’’ -ట్రంప్ వివాదాస్పద ప్రకటన

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, పౌలిన్ కోలా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌లోని రెండు సభలను రిపబ్లికన్లు గెలుచుకుంటే.. అమెరికాలోని ప్రతి వయోజన పౌరుడికి 5 వేల డాలర్ల చొప్పున (భారత కరెన్సీలో రూ.4.75 లక్షలకు పైగా) చెల్లిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన తొలి మధ్యంతర ఎన్నికల సదస్సులో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఈ పథకానికి ట్రిలియన్ డాలర్లకు పైగా ఖర్చవుతుంది.
ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుంది? ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అనే వివరాలను ట్రంప్ వెల్లడించలేదు. ఆ డబ్బును అమెరికాలో మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందని మాత్రమే ఆయన చెప్పారు.
ఈ ఆఫర్‌ను డెమొక్రాట్లు వెంటనే ''అసంబద్ధమైన హామీ''గా కొట్టిపడేశారు. ఇలాంటి హామీ చట్టబద్ధమేనా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
పార్టీపై తన పట్టు ఇప్పటికీ సంపూర్ణంగా కొనసాగిస్తున్న అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్, రెండు రోజుల మధ్యంతర ఎన్నికల సదస్సు ప్రారంభమైన బుధవారం రాత్రి ప్రధాన ప్రసంగం చేశారు. ఈ ఏడాది పదేపదే చెప్పిన అనేక అంశాలనే ట్రంప్ తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రస్తావించారు. అయితే కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలను కూడా ఆయన చేర్చారు.

మధ్యంతర ఎన్నికల సదస్సు ప్రాంగణం ట్రంప్ మద్దతుదారులతో నిండిపోయింది. తొలిసారి వైట్‌హౌస్ కోసం ఆయన పోటీ చేసిన దశాబ్దం తర్వాత కూడా ట్రంప్ తన మద్దతుదారుల్లో ఇప్పటికీ ఎంతో ఆదరణ కలిగి ఉన్నారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆయన పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
అయితే సదస్సులో మితవాద రిపబ్లికన్ల గైర్హాజరు స్పష్టంగా కనిపించింది. ట్రంప్ శకంలో ఆ పార్టీ ఎంతగా మారిపోయిందో ఇది గుర్తు చేసింది. అదే సమయంలో, అసాధారణంగా నిర్వహించిన ఈ మధ్యంతర ఎన్నికల సదస్సు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.
సభా ప్రాంగణంలో ఉన్నవారు, టెలివిజన్‌లో కార్యక్రమాన్ని వీక్షించినవారిలో ఎక్కువగా ట్రంప్ విధేయులే కనిపించారు. నవంబర్‌లో రిపబ్లికన్ పార్టీకి పెద్ద సంఖ్యలో మద్దతు ఇవ్వాల్సిన మితవాదులు, రాజకీయంగా తటస్థంగా ఉన్న ఓటర్లు మాత్రం ప్రధాన ప్రేక్షకులుగా కనిపించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఆచరణ సాధ్యమేనా?
అమెరికాలో సుమారు 27 కోట్ల మంది పెద్దవారు ఉన్నారు. ఒక్కొక్కరికి 5 వేల డాలర్లు చెల్లించాలంటే అమెరికా ప్రభుత్వానికి సుమారు 1.3 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. అమెరికాలో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పథకం ఆచరణ సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫిబ్రవరిలో ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించడం వల్ల కలిగిన పరిణామాల ఫలితంగా పాక్షికంగా ధరల పెరిగాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలు, మిత్రదేశాలపై ఇరాన్ దాడులు చేసింది.అయితే, అన్నింటికన్నా ముఖ్యంగా... ప్రపంచంలోని చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లో దాదాపు ఐదవ వంతు రవాణా అయ్యే హార్ముజ్ జలసంధిని చాలా వరకు మూసివేసింది.
ఈ మూసివేతతో.. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒడిదుడుకులకు గురయ్యాయి. యుద్ధాన్ని ముగించాలని తన పార్టీ నుంచే ట్రంప్‌పై ఒత్తిడి పెరిగింది.
చమురు ధరలు తగ్గవని అమెరికా అధ్యక్షుడు బుధవారం మధ్యంతర ఎన్నికల సదస్సుకు బయల్దేరేముందు చెప్పారు. ప్రజలు ధరల తగ్గింపు కోసం కొంతకాలం ఎదురుచూడక తప్పదన్నారు. ఆ తర్వాత జరిగిన కన్వెన్షన్‌లో కూడా ఇవే వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు.
తెహ్రాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడానికి స్వల్పకాలిక ఆర్థిక నష్టాన్ని భరించడం సబబేనని ట్రంప్ వాదించారు. కానీ పెరిగిన ధరలతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఇటువంటి సందేశం కష్టమైనదే. జీవన వ్యయం పెరిగిపోవడమే అమెరికన్లకు ప్రధాన సమస్యగా ఉందని ఇటీవల జరిగిన సర్వేలు వెల్లడిస్తున్నాయి.
టెక్సాస్‌లోని డల్లాస్‌లో రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ట్రంప్ చేసిన సుదీర్ఘ ప్రసంగం, వివాదానికి మూలమైన అమెరికన్ల జీవన ప్రమాణాలపై దాని ప్రభావం అనే అంశాన్ని స్పృశించింది. అమెరికన్ల కొనుగోలు శక్తిని పెంచుతానన్న ఆయన వాగ్దానానికి సభలో కరతాళ ధ్వనులు వినిపించాయి.
''హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, యునైటెడ్ స్టేట్స్ సెనేట్‌లో రెండింట్లోనూ రిపబ్లికన్లు గెలిస్తే.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న ప్రతి వయోజన పౌరుడికి 5 వేల డాలర్ల డివిడెండ్‌ను అందజేస్తాం'' అని ట్రంప్ తెలిపారు. ''ఆ డబ్బు ఖర్చు చేయడానికి మీరు కెనడాకు వెళ్లడం మాకు ఇష్టం లేదు" అని ట్రంప్ అన్నారు.
"మీరు చైనాకు గానీ, జర్మనీకి గానీ వెళ్లడం మాకు ఇష్టం లేదు. మీరు ఆ డబ్బును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే ఖర్చు చేయాలి" అని సూచించారు.
అయితే, ఈ ఖర్చును ఏ విధంగా పర్యవేక్షిస్తారనే విషయాన్ని ట్రంప్ స్పష్టం చేయలేదు.

ఫొటో సోర్స్, Reuters
ఇదే తొలిసారి కాదు
ఇలాంటి చెల్లింపులు చేస్తానని ట్రంప్ హామీ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో సుంకాల ద్వారా వచ్చే ఆదాయంతో 2వేల డాలర్ల చెక్కులను అందించాలని ఆయన ప్రతిపాదించారు.
గతంలో ఇతర అమెరికా రాజకీయ నాయకులు కూడా ఎన్నికలలో విజయం సాధిస్తే ఎకనామిక్ రివార్డులు ఇస్తామని హామీలు ఇచ్చారు.
ఉదాహరణకు.. కోవిడ్-19 మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో సెనేట్ను తమ పార్టీ చేజిక్కించుకుంటే 2వేల డాలర్ల సహాయ చెల్లింపులు చేస్తామని జార్జియాలోని డెమొక్రాట్లు హామీ ఇచ్చారు.
అమెరికాలో ఏదైనా ఖర్చు చేయాలంటే కాంగ్రెస్ ఆమోదం అవసరం. అయితే, డల్లాస్‌లో చేసిన ప్రసంగంలో "ట్రంప్ డివిడెండ్స్"పేరుతో చేస్తానని చెప్పిన చెల్లింపుల కోసం కాంగ్రెస్ ఆమోదాన్ని కోరాలని అనుకుంటున్నారా లేదా అనే విషయంపై అధ్యక్షుడు ఏమీ చెప్పలేదు.
అమెరికా ఖజానాకు అయ్యే మొత్తం ఖర్చుతో పాటు, అమెరికా అధ్యక్షుడి తాజా ప్రతిపాదన చట్టపరమైన ప్రశ్నలను లేవనెత్తవచ్చు.
ఓటింగ్‌ను ప్రభావితం చేసే ఉద్దేశంతో చేసే చెల్లింపులను ఫెడరల్ చట్టాలు నిషేధిస్తాయి.
అయితే, ట్రంప్ చేసిన వాగ్దానాన్ని పన్నుల తగ్గింపు హామీగా పరిగణించవచ్చని, అది చట్టబద్ధమేనని కొందరు నిపుణులు అంటున్నారు.
'న్యూయార్క్ టైమ్స్'తో మాట్లాడిన ఒక ఎన్నికల చట్ట నిపుణుడు, ట్రంప్ చేసిన హామీ అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణ కల్పించే భావప్రకటనా స్వేచ్ఛా రక్షణ పరిధిలోకి కూడా వస్తుందని పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























