'పాదాలకు బొబ్బలొస్తున్నాయి, శరీరాలు కాలిపోతున్నాయి', ఎడారి ఓడలుగా పిలిచే ఒంటెలు సైతం వేడికి తట్టుకోలేకపోతున్నాయా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
సాధారణంగా ఒంటెలను ఎడారి ఓడలను పిలుస్తారు. కానీ, ఆఫ్రికాలో పెరుగుతున్న తీవ్రమైన ఉష్ణోగ్రతలను ఇవి సైతం భరించలేకపోతున్నాయి.
భూమ్మీద అత్యంత వేడి, పొడి ప్రాంతాల్లో ఈశాన్య ఇథియోపియాలోని అఫార్ ప్రాంతం ఒకటి. ఇక్కడ సంచార జాతుల ప్రజలు ఉప్పును ఒంటెలపై మోసుకుంటూ ఎడారిలో ప్రయాణిస్తుంటారు.
''విపరీతమైన వేడి తాళలేక ఒంటెలు అల్లాడిపోవడం చూశా'' అని అఫార్లోని సెమెరా ప్రాంతానికి చెందిన అలీ ఉమర్ అనే ఒంటెల కాపరి బీబీసీతో చెప్పారు.
''వాటి పాదాలకు బొబ్బలొస్తున్నాయి. కళ్ల వెంట నీళ్లు కారుతున్నాయి. అవి కూర్చుంటున్నప్పుడు వేడి ఇసుకవల్ల వాటి శరీరాలు కాలిపోతున్నాయి. వెంట్రుకలు ఊడిపోతున్నాయి'' అని దాదాపు 500 ఒంటెలకు యజమాని అయిన 40 ఏళ్ల అలీ ఉమర్ తెలిపారు.
''గడచిన నెల రోజుల్లో తీవ్రమైన వేడి వల్ల నా ఎనిమిది ఒంటె పిల్లలు చనిపోయాయి. ఇప్పుడు వేడి మరింత తీవ్రంగా మారింది. పరిస్థితి చాలా కష్టంగా ఉంది. చల్లదనాన్ని మోసుకొచ్చే గాలి కూడా ఇప్పుడు వేడిని తీసుకొస్తోంది. గడచిన కొన్నేళ్లలో ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పులు గమనించా'' అని ఆయన చెప్పారు.


ఫొటో సోర్స్, AFP via Getty Images
‘చనిపోతున్న ఒంటెలు’
అలీ ఉమర్ ఒక్కరే కాదు. శాస్త్రవేత్తలు, జంతు సంక్షేమ కార్యకర్తలు, అనేక రకాల అధ్యయనాలు కూడా తీవ్రమైన వేడి వల్ల ఒంటెల్లో ఒత్తిడి, అలసట, డీహైడ్రేషన్, వ్యాధులు వంటి పెరుగుతున్నాయని చెబుతున్నారు.
అధిక ఉష్ణోగ్రతల వల్ల నీళ్లు లేకపోవడం, వృక్ష సంపద తగ్గిపోవడం, నీడ ఉండే ప్రాంతాలు తక్కువవడం వంటివి కూడా ఒంటెలపై పరోక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఒకే మూపురం ఉన్న డ్రోమెడరీ ఒంటెల్లో 80 శాతం ఉత్తర ఆఫ్రికా, హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతాల్లోనే ఉన్నాయి.
తీవ్రమైన వేడి, కరవు పరిస్థితులను ఒంటెలు తట్టుకోగలవన్న ఉద్దేశంతో ఈ ప్రాంత రైతులు, ఇతర పశువుల పెంపకందారులు క్రమంగా ఒంటెల పెంపకం వైపు మొగ్గుచూపారు.
అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణంలో మార్పులు ఒంటెల ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావానికి సంబంధించి దక్షిణ ఇథియోపియాకు చెందిన ఒంటెల కాపరుల అభిప్రాయాలను 2025లో ఓ అధ్యయనం ప్రచురించింది.
''ఒంటెల ఆరోగ్యం, పునరుత్పత్తి సామర్థ్యంపై వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని అధ్యయనంలో పాల్గొన్నవారు చెప్పారు'' అని ఆ నివేదిక తెలిపింది.
పొరుగుదేశమైన సోమాలియాలో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తోంది. కరవు వల్ల ఒంటెలు మరణించడం పెద్ద సంక్షోభంలా విస్తరిస్తోంది. ఒంటెలు పెంచే కుటుంబాల్లో 46 శాతం ఈ సమస్యతో ప్రభావితమయ్యాయని జూన్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన తెలిపింది.
పశువులు పెంచే దాదాపు ఆరువేల కుటుంబాల అభిప్రాయాలను ఈ అధ్యయనంలో పొందుపరిచారు. ఒంటెల మరణాలు ప్రధానంగా ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువగా నమోదైనట్టు తేలింది. సూల్ ప్రాంతంలో ఒంటెల మరణాల రేటు దాదాపు 73 శాతంగా నమోదైంది.

ఫొటో సోర్స్, Corbis via Getty Images
‘వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు’
ఈ ప్రాంతంలో కరవుకు ప్రధాన కారణం తీవ్రమైన వేడేనని నిపుణులు చెబుతున్నారు. సరైన పశువైద్య సేవలు లేకపోవడం, పశువుల నిర్వహణలో లోపాలు వంటివి పరిస్థితిని మరింతగా దిగజారుస్తున్నాయి.
2021-22లో సంభవించిన కరవుకు అధిక ఉష్ణోగ్రతలు కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. తీవ్రమైన వేడివల్ల మట్టి, నదులు, చెరువుల్లోని నీరు వేగంగా ఆవిరైపోతుంది. మొక్కలు తమలోని నీటిని ఆవిరి రూపంలో గాల్లోకి విడుదల చేస్తాయి.
తీవ్రమైన వేడి, కరవు కారణంగా అనారోగ్యానికి గురవుతున్న ఒంటెల సంఖ్య పెరుగుతోందని, చాలా ఒంటెలు మరణించడం చూశామని పశువైద్యులు చెప్పారు.
"తీవ్రమైన వేడి వల్ల ఒంటెల్లో హైపర్‌థర్మియా(శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పెరగడం)వంటి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో అవి అనేక రకాల ఇన్ఫెక్షన్లకు గురువుతున్నాయి''అని ఇథియోపియా సరిహద్దులోని ఈశాన్య కెన్యాలో మార్సాబిట్ కౌంటీ పశువైద్యాధికారి హసన్ నుయా గుయో బీబీసీతో చెప్పారు.
''గత రెండేళ్లలో మా కౌంటీలో తీవ్రమైన వేడి వల్ల ఒంటెల మరణాలు 15 శాతానికి పైగా పెరిగాయి''అని ఆయన తెలిపారు.
హార్న్ ఆఫ్రికా ప్రాంతంలో నిర్వహించిన మరో అధ్యయనంలో ఇంకో విషయం తేలింది. వాతావరణ మార్పుల ప్రభావంతో ఏర్పడుతున్న వేడి, ఒత్తిడి వల్ల ఒంటెల్లో వ్యాధులు పెరుగుతున్నాయి. పాల ఉత్పత్తి కూడా తగ్గుతోంది.
ఉత్తర ఆఫ్రికాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది అల్జీరియాలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, వేసవిలో సంభవించే తీవ్రమైన వేడిగాలుల సమయంలో ఒంటెల మరణాలు గణనీయంగా పెరిగాయి.
ప్రతి ఏడాది వేసవికాలంలో ఒంటెల మరణాలు ఎక్కువ నమోదవుతున్నట్టు స్పష్టమైంది. ప్రమాదం ఎక్కువగా ఉండే ఈ కాలంలో తగిన నీటి సరఫరా, అదనపు మేత, వ్యాధులపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ వంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధ్యయనం సూచించింది.

ఫొటో సోర్స్, Hassan Nuya Guyo
అసాధారణ ఉష్ణోగ్రతలు..
ఉత్తర ఆఫ్రికాలోని అనేక దేశాల్లో తీవ్రమైన వేడి ఇప్పుడు సాధారణంగా మారిందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తెలిపింది. 1981 నుంచి వేడి గాలులు పెరుగుతున్నాయని వెల్లడించింది.
2024లో ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్‌లోని పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయని డబ్ల్యూఎంఓ తెలిపింది.
డబ్ల్యూఎంఓ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఆఫ్రికా 2025 నివేదిక ప్రకారం, 1991 నుంచి 2025 మధ్య ఉత్తర ఆఫ్రికాలో ప్రతి దశాబ్దానికి సగటున 0.43 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత పెరిగింది.
ఒంటెలు సాధారణంగా 40 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిని సులభంగా తట్టుకోగలవని నిపుణులు చెబుతున్నారు.
బయటి ఉష్ణోగ్రతను ఎదుర్కోవడానికి వీలుగా అవి రోజంతా తమ శరీర ఉష్ణోగ్రతను కొంత మేర మారేలా చేసుకుంటాయి. దీనివల్ల వాటికి చెమటపట్టదు.
గాఢమైన రంగులో ఉన్న మూత్రం , పొడి మలం విసర్జించడం ద్వారా శరీరంలోని నీటి నష్టాన్ని తగ్గించుకుంటాయి. మందమైన చర్మం, వెంట్రుకలు సూర్యరశ్మి ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి.
ఉష్ణోగ్రతలు అవి తట్టుకోగల స్థాయికి మించినప్పుడు ఒంటెలు కూడా వేడి తీవ్రతకు గురవుతాయని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థలో పనిచేస్తున్న, ఒంటెల ఆరోగ్య నిపుణులు డాక్టర్ మహ్మద్ బెంగౌమీ తెలిపారు.
సహారా ఎడారిలోని అనేక ప్రాంతాల్లో ఇప్పడు వేసవిలో ఉష్ణోగ్రతలు తరచుగా 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. దీనికి తోడు వృక్షసంపద తగ్గడం, నీటికొరత, నీడ లేకపోవడం వల్ల ఒంటెలు తీవ్రమైన వేడి తీవ్రతకు గురయ్యే ప్రమాదం మరింత పెరుగుతోంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఒంటెల పరిస్థితి ఇలా ఉంటే ఎలా బతకాలి?
సహారా ఎడారిలో ఒంటెలపై ప్రయోగాత్మక పరిశోధనలు చేసిన అల్జీరియాలోని ఘర్దాయా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అబ్దెల్ మజీద్ చెహ్మా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
సహారా ఎడారిలోని అనేక ప్రాంతాల్లో వేసవిలో ఉష్ణోగ్రతలు తరచూ 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయని ఆయన చెప్పారు.
''పగలు, రాత్రి కలిసి చాలాసేపు 41 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కొనసాగితే అవి నేరుగా ఒంటెల కణాలపై ప్రభావం చూపుతాయని మా పరిశోధనల్లో తేలింది'' అని ప్రొఫెసర్ అబ్దెల్ మజీద్ చెహ్మా చెప్పారు.
''ఇలాంటి వేడి వల్ల తెల్ల రక్తకణాలు సహా ఇతర కణాలు దెబ్బతింటాయి. దీంతో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఒత్తిడి వల్ల కణాలు తమను తాము సరిచేసుకోలేక చివరికి నాశనమవుతాయి'' అని ఆయన తెలిపారు.
వేడి తీవ్రత మొదలైనప్పుడు ఒంటెల శరీర జీవక్రియ(మెటబాలిజం)నెమ్మదిస్తుంది. దీంతో శరీరంలో వేడి ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా అవి చాలా తక్కువ ఆహారం తీసుకుంటాయి. దీనివల్ల బద్ధకం, తీవ్రమైన అలసట వస్తాయి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడతాయి.
తీవ్రమైన వేడే ప్రధాన కారణమైనప్పటికీ వృక్ష సంపద తగ్గిపోవడం, నీటి కొరత, నీడలేకపోవడం, సరైన పశువైద్యసేవలు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు కలిస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని నిపుణులు తెలిపారు.
అందుకే ఇథియోపియాలో అనేక మంది పశుపోషకులు తమ ఒంటెలను సంప్రదాయంగా పెంచుతున్న ఉత్తర ప్రాంతాల నుంచి దక్షిణ ప్రాంతాలకు తరతలిస్తున్నారని.. అక్కడ నీళ్లు, వృక్షసంపద కొంత మెరుగ్గా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
"తీవ్రమైన వేడి, కరవు వల్ల ఉత్తర ప్రాంతాల్లో ఒంటెల పెంపకం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో వారు శాశ్వతంగా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు'' అని ఇథియోపియోలోని విజన్ యూనివర్సిటీకి చెందిన పశుపోషక అభివృద్ధి పరిశోధకులు ప్రొఫెసర్ డానియెల్ గెలాన్ బీబీసీతో చెప్పారు.
''2020 నుంచి 2023 వరకు నమోదైన అత్యంత తీవ్రమైన, దీర్ఘకాలిక కరవు నుంచి కోలుకుంటున్న సమయంలోనే హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం మరోసారి తీవ్రమైన కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది'' అని ఆక్స్‌ఫామ్ తెలిపింది.
''ఎడారి ప్రాంతాల్లో పశుపోషకులకు ఒంటెలే చివరి ఆశగా ఉన్నప్పటికీ, ప్రస్తుత తీవ్రమైన వేడిగాలుల వల్ల ఒంటెల కీలక శారీరక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ఉష్ణోగ్రతలను బాగా తట్టుకోగలిగే జంతువుగా పేరున్న ఒంటె కూడా ఇప్పుడు వాతావరణ మార్పుల బారిన పడుతోంది'' అని ప్రొఫెసర్ చెహ్మా తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























