రూ. 4 కోట్లకు పైగా ఖర్చయ్యే మందులు అతి తక్కువ ధరకే.. ఏహెచ్‌డీఎస్ బాధిత చిన్నారులకు నెదర్లాండ్స్ నుంచి మందులు ఎలా తెప్పిస్తున్నారంటే

డాక్టర్ శివరంజని
ఫొటో క్యాప్షన్, డాక్టర్ శివరంజని

''నా బిడ్డ మాట్లాడలేడు.. కానీ, తను చూసే చూపు, ఆ నవ్వు ఉన్నంతకాలం నేను ఫైట్ చేస్తూనే ఉంటాను'' అంటూ కెమెరా నుంచి పక్కకు తల తిప్పుకుని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు సురేంద్ర కుమార్.

కొన్ని సెకన్ల తర్వాత.. బాధ నుంచి తేరుకుని, మళ్లీ చెప్పడం మొదలుపెట్టారు.

''ఈ రోజు నా బేబీ ఇతర పిల్లల్లా కాదు.. తను బతకడానికి పోరాడుతున్నాడు'' అంటూ భావోద్వేగ స్వరంతో చెప్పారు.

హైదరాబాద్‌లోని మచ్చబొల్లారంలో ఉండే సురేంద్ర కుమార్‌కు 20 నెలల కుమారుడు ఉన్నాడు. ఈ బాబు అలన్ హెర్న్‌డన్ డడ్లీ సిండ్రోమ్ (ఏహెచ్‌డీఎస్)తో బాధ పడుతున్నాడు.

సురేంద్రను కలవడానికి ముందుగా నేను హైదరాబాద్ ఫిలింనగర్‌లో మాగ్నస్ క్లినిక్‌కు వెళ్లాను. అక్కడ నేను పీడియాట్రిక్ డాక్టర్ శివరంజని సంతోష్‌‌ను కలిశాను.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏహెచ్‌డీఎస్‌తో బాధ పడుతున్న పిల్లలకు సంబంధించి ఆమె వద్దకు వచ్చిన రెండో కేసు సురేంద్ర కుమార్ కుమారుడిది.

మూడు నెలల కిందట కూడా ఆమెను హైదరాబాద్‌కు చెందిన పవిత్ర శిరోల్కర్ అనే మహిళ తన కుమారుడికి ఇదే వ్యాధి ఉన్నట్లు చెబుతూ సంప్రదించారు.

''ఏదేమైనా మీ బిడ్డకు మెడిసిన్ తీసుకురావడానికి నా ప్రయత్న లోపం లేకుండా చూస్తా. డాక్టర్‌గా కాదు, ఒక తల్లిగా నా ప్రయత్నం కొనసాగిస్తానని ప్రామిస్ చేశా'' అని ఆ తల్లితో చెప్పానని డాక్టర్ శివరంజని చెప్పారు.

Skip ఎక్కువమంది చదివినవి and continue reading
ఎక్కువమంది చదివినవి

End of ఎక్కువమంది చదివినవి

ఇలాంటి 'అరుదైన' వ్యాధితో బాధ పడుతున్న పిల్లల చికిత్స కోసం మందులు భారత్‌లో అందుబాటులో లేవు.

విదేశాల నుంచి తెప్పించడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది.

అయినప్పటికీ, ఆ సవాళ్లను అధిగమించి రూ.కోట్ల విలువైన మందులను తక్కువ ఖర్చుతో తయారు చేసినవి ఉచితంగా అందించబోతున్నామని డాక్టర్ శివరంజని బీబీసీతో చెప్పారు.

డాక్టర్ శివరంజని
ఫొటో క్యాప్షన్, డాక్టర్ శివరంజని ఏహెచ్‌డీఎస్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు

మెడిసిన్ కోసం సాయం కోరుతూ 'ఇన్‌స్టా'లో పోస్టు

ఈ ఏడాది సెప్టెంబరులో డాక్టర్ శివరంజని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టారు.

ఏహెచ్‌డీఎస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కోసం మెడిసిన్ విదేశాల నుంచి తెప్పించేందుకు సాయం చేయాలని అందులో కోరారు.

ఈ వ్యాధితో ఉన్న బాబును పవిత్ర శిరోల్కర్ దాదాపు మూడు నెలల కిందట శివరంజని వద్దకు చికిత్స కోసం తీసుకువచ్చారు.

అలా ఆమె వద్దకు వచ్చిన మొదటి ఏహెచ్‌డీఎస్ కేసు ఇది.

ఈ విషయంపై ఇన్‌స్టాలో శివరంజని పోస్టు పెట్టి, ప్రధాని సహా పలువురిని ట్యాగ్ చేశారు. ఆమె పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది.

భారీ ఖర్చుతో కూడిన మందులు తక్కువ ధరకు అందించేందుకు సాయపడాలని కోరారు.

''ఈ విషయంపై తౌఫిక్ అనే జర్నలిస్టు ఫస్ట్ పోస్టులో ఒక ఆర్టికల్ రాశారు. అది చాలా మందికి చేరింది. అలా ఫార్మాస్యూటికల్ అకౌంటబులిటీ ఫౌండేషన్‌కు చేరడంతో మందులు తయారు చేసి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు'' అని చెప్పారు.

ఇదే సమయంలో మచ్చబొల్లారానికి చెందిన సురేంద్ర కుమార్ తన కుమారుడికి ఇదే సమస్య ఉందంటూ డాక్టర్ శివరంజనిని సంప్రదించారు.

ఏహెచ్‌డీఎస్ వ్యాధి
ఫొటో క్యాప్షన్, ఏహెచ్‌డీఎస్ అరుదైనది కావడంతో మెడిసిన్ ఖరీదు వివిధ దేశాలలో రూ. కోట్లలో ఉందని డాక్టర్ శివరంజని చెప్పారు.

ఏడాదికి రూ. 4 నుంచి రూ. 9 కోట్ల ఖర్చు

ఏహెచ్‌డీఎస్ అరుదైనది కావడంతో మెడిసిన్ ఖరీదు వివిధ దేశాలలో రూ. కోట్లలో ఉందని శివరంజని వివరించారు.

దేశాలను బట్టి ఏడాదికి వినియోగించే మందుల ఖర్చు సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు.

దీని కోసం టిరాట్రైకాల్ అనే మందును ఎక్కువగా వినియోగిస్తున్నారు.

నెదర్లాండ్స్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ అకౌంటబులిటీ ఫౌండేషన్ కథనం ప్రకారం, యూరప్‌లోని పలు దేశాల్లో ఈ మందులకు ఏడాదికి అయ్యే ఖర్చు భారతీయ కరెన్సీలో సుమారు రూ. 4.67 కోట్ల వరకు ఉండగా.. అమెరికాలో రూ. 9 కోట్ల వరకు ఉంది.

అసలు ఏమిటి ఈ వ్యాధి.. లక్షణాలేమిటి..?

అలన్ హెర్న్‌డన్ డడ్లీ సిండ్రోమ్ (ఏహెచ్‌డీఎస్) గురించి శివరంజని బీబీసీతో మాట్లాడారు.

''ఈ వ్యాధిని అలన్ హెర్న్‌డన్ డడ్లీ సిండ్రోమ్ లేదా ఎంసీటీ8 డెఫిషియన్సీ అని కూడా పిలుస్తారు.

థైరాయిడ్ హార్మోన్ మెదడులోకి వెళ్లడానికి ఒక రిసెప్టర్ (అంటే తలుపు వంటిది) లేకపోవడం వల్ల సమస్య ఏర్పడుతుంది. ఆ స్థితిలో థైరాయిడ్ హార్మోన్ మెదడులోకి వెళ్లదు. దానివల్ల శరీరంలోనే థైరాయిడ్ హార్మోన్ పేరుకుపోయి అధికమవుతుంది. దీంతో, ఇది పిల్లల మానసికంగా, శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది'' అని చెప్పారు.

మాట్లాడటం, నడవడం, కూర్చోడం.. వంటివి పిల్లల్లో కనిపించవని అన్నారు. అలాగే కండరాలు చాలా బలహీనంగా మారతాయని చెప్పారు.

థైరాయిడ్ గ్రంథి
ఫొటో క్యాప్షన్, థైరాయిడ్ హార్మోన్ మెదడులోకి వెళ్లడానికి ఒక రిసెప్టర్ లేకపోవడం వల్ల సమస్య ఏర్పడుతుంది.

70 వేల మంది పిల్లల్లో ఒకరికి..

ఏహెచ్‌డీఎస్ అనేది 'ఎక్స్' క్రోమో జోమ్‌లో లోపాల వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

70 వేల మంది పిల్లల్లో ఒకరికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని డాక్టర్ శివరంజని చెప్పారు. ఈ లోపం ఎక్కువగా మగపిల్లల్లోనే తలెత్తుతుందని అన్నారు.

'ఇప్పటివరకు ఉన్న అధ్యయనాల మేరకు ఎక్స్ క్రోమోజోమ్‌లో లోపం ఉండటంతో ఏహెచ్‌డీఎస్ అనేది మగపిల్లల్లోనే ఉంది. ఆడపిల్లల్లో ఇది చాలా అరుదు'' అని చెప్పారు.

''ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్న ఒక జన్యువుకు సంబంధించి.. అది కూడా జన్యువుల్లో 'డామినెంట్ రెసిసివ్' అని ఉంటాయి. రెసిసివ్ అంటే అణగిమణగి ఉండే జన్యువు. ఎక్స్, వై జన్యువులు ఉన్నప్పుడు అణగిమణగి ఉండే జీన్‌ను డామినేట్ చేయడానికి ఇంకో జన్యువు లేకపోవడం వల్ల అబ్బాయిల్లోనే ఎక్కువగా బయటపడుతుంది'' అని చెప్పారు డాక్టర్ శివరంజని.

ఈ సమస్య ఉన్న పిల్లలు మెడను కూడా సరిగా నిలపలేరని వివరించారు.

''ఈ వ్యాధికి అసలు పూర్తిస్థాయి చికిత్స లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులు కేవలం లక్షణాలను తగ్గించడానికే ఉపయోగపడుతున్నాయి'' అని శివరంజని చెప్పారు.

శరీరంలో అధికంగా ఉత్పత్తి అయ్యే థైరాయిడ్ హార్మోన్ తగ్గించడంతోపాటు దానివల్ల వచ్చే సమస్యలు రాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులు కొంతవరకు అడ్డుకుంటాయని వైద్యులు చెబుతున్నారు.

అప్పటికే మెదడులో కలిగిన నష్టాన్ని మాత్రం మందులు తగ్గించలేవని శివరంజని చెప్పారు.

సురేంద్ర కుమార్
ఫొటో క్యాప్షన్, తన కుమారుడికి అలన్ హెర్న్‌డన్ డడ్లీ సిండ్రోమ్ ఉన్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలిసిందన్న సురేంద్ర కుమార్

‘నా కొడుకు బతకడానికి పోరాడుతున్నాడు’

తన కుమారుడికి అలన్ హెర్న్‌డన్ డడ్లీ సిండ్రోమ్ ఉన్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలిసిందని సురేంద్ర కుమార్ బీబీసీతో చెప్పారు.

ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న సురేంద్ర కుమార్‌కు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చికిత్స చేయించే పరిస్థితి లేదు.

''మా బేబీ నేరుగా కళ్లల్లోకి చూడడు. ఎప్పుడూ దీపాన్ని చూస్తుంటాడు. మాటలు వినిపిస్తుంటాయా.. లేదా.. అన్నది కూడా తెలియదు'' అని సురేంద్ర కుమార్ చెప్పారు.

వెన్నెముకలో స్థిరత్వం లేక కూర్చోలేకపోవడం, బోర్లా పడటం వంటివి చేయడం లేదని చెప్పారు.

''ఈ రోజు నా బేబీ సరిగా ఆహారం కూడా మింగలేని పరిస్థితి. ఇప్పుడు తను బతకడానికి పోరాడుతున్నాడు. తన కష్టాన్ని తీర్చలేకపోతే నేను ఉన్నా లేనట్లే అవుతుంది కదా..'' అని సురేంద్ర కన్నీటి పర్యంతమయ్యారు.

''అది నయం కాదని బేబీని వదిలేయం కదా..? నాకు పెళ్లి కాకముందు అలాంటి పిల్లలను చూసినప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లలను తమ వద్దనే ఎందుకు ఉంచుకుంటున్నారని అనుకునేవాడిని. ఒక్కసారి తండ్రి అయ్యాక ఆ బాధ తెలుస్తుంది. ఆ బేబీ నవ్వు, చూపు చూస్తే, నన్ను వదిలేస్తావా.. అన్నట్లుగా ఉంటుంది. ఆ చూపు, నవ్వు ఉన్నంతకాలం నేను పోరాడుతూనే ఉంటాను'' అని సురేంద్ర కుమార్ చెప్పారు.

డాక్టర్ శివరంజనిని సంప్రదించిన తర్వాత.. మెడిసిన్ తెప్పించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకునేందుకు నాతో లేఖలు రాయించడం ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయడం చేశారని చెప్పారు.

డాక్టర్ శివరంజని, ఏహెచ్‌డీఎస్

ముందుకు వచ్చిన ఫార్మాస్యూటికల్ అకౌంటబులిటీ ఫౌండేషన్

శివరంజని ప్రయత్నంపై సోషల్ మీడియా, మీడియాలో వచ్చిన కథనాల ద్వారా విషయం యాక్సెస్ టు మెడిసిన్ ఇండియా, నెదర్లాండ్స్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ అకౌంటబులిటీ ఫౌండేషన్‌కు చేరింది.

ఫార్మాస్యూటికల్ అకౌంటబులిటీ ఫౌండేషన్.. మెడిసిన్‌ను తక్కువ ధరలోనే తయారు చేసి భారత్‌కు పంపించేందుకు అంగీకరించిందని డాక్టర్ శివరంజని చెప్పారు. ఇందుకు కేవలం రూ. 2.5 లక్షల ఖర్చు మాత్రమే అవుతోందని చెప్పారు.

టిరాట్రైకాల్‌కు కాంపౌండెడ్ మెడిసిన్ తయారు చేసి భారత్‌కు పంపిస్తున్నట్లుగా ఫార్మాస్యూటికల్ అకౌంటబులిటీ ఫౌండేషన్ ఛైర్ విల్బర్ట్ బానెన్ బర్గ్ బీబీసీతో చెప్పారు.

''కొన్ని దేశాల్లో టిరాట్రైకాల్ మెడిసిన్‌కు ప్రొటెక్షన్ రైట్స్ తీసుకుని తయారు చేస్తుండటంతో ధర బాగా ఎక్కువగా నిర్ణయిస్తున్నారు. నెదర్లాండ్స్‌లో ప్రొటెక్షన్ రైట్స్ ఉండవు. ఈ మెడిసిన్ 1974 నుంచి అందుబాటులో ఉంది. అరుదైన వ్యాధులకు చికిత్స కోసం మెడిసిన్ తక్కువ పరిమాణంలో తయారు చేస్తుంటారు. ధర ఎక్కువగా ఉండటంతో కాంపౌండెడ్ మెడిసిన్ తయారు చేస్తున్నాం'' అని చెప్పారు.

మొత్తం ఏడుగురు పిల్లలకు అందించే ఏర్పాట్లు

ఈ మెడిసిన్ కూడా ఏడాది కాలానికి ఏడుగురు పిల్లలకు ఉచితంగా ఇవ్వబోతున్నట్లుగా డాక్టర్ శివరంజని చెప్పారు.

ఇందుకోసం ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా, సీఎంసీ వైద్యులు ప్రవీణ్ జార్జ్, ఎండోక్రైనాలజిస్టు డాక్టర్ సంతోష్, పవిత్ర శిరోల్కర్ అందరూ కలిసి గ్రూపుగా ఏర్పడి పరస్పర సహకారం తీసుకున్నట్లుగా చెప్పారు.

''ఈ మెడిసిన్ కోసం నిధులు సమీకరించాం. నా వద్దకు వచ్చే తల్లిదండ్రుల నుంచి, క్రౌడ్ ఫండింగ్ ద్వారా సుమారు రూ. 6 లక్షల మేర నిధులు సమకూరాయి.

మిగిలిన నిధులు ఫార్మాస్యూటికల్ అకౌంటబులిటీ ఫౌండేషన్ భరించేందుకు ముందుకు వచ్చింది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రేడియంట్ అంటే ఏపీఐ ఉండటంతో దాన్ని తయారు చేసి పంపిస్తోంది. దానివల్ల ఎలాంటి ఖర్చు లేకుండా మందులు ఉచితంగా ఇవ్వబోతున్నాం. నవంబరు 30న తల్లిదండ్రులకు అందించనున్నాం'' అని శివరంజని బీబీసీతో చెప్పారు.

మొత్తం ఏడుగురు పిల్లల్లో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, మరో ఐదుగురు చెన్నైలోని సీఎంసీలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

''సోషల్ మీడియాలో ప్రచారం చూసి ఈ వ్యాధితో బాధ పడుతున్న మరో 12 మంది పిల్లల తల్లిదండ్రులు నన్ను సంప్రదించారు. వారికి మెడిసిన్ ఎలా ఇప్పించాలనే విషయంపై ఆలోచిస్తున్నాం'' అని శివరంజని చెప్పారు.

ఇదే విషయంపై చెన్నైలోని సీఎంసీ వైద్యులు ప్రవీణ్ జార్జ్ బీబీసీతో మాట్లాడారు.

‘‘అలన్ హెర్న్‌‌‌‌‌‌డన్ డడ్లీ సిండ్రోమ్‌కు మెడిసిన్ భారత్‌లో వినియోగానికి ఎఫ్‌డీఏ, సీడీఎస్‌సీఓ నుంచి అనుమతులు ఉన్నాయని చెప్పారు. తయారీకి మాత్రం అనుమతులు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. భారత్‌లోనే తయారైతే మరింత తక్కువ ధరకే మందులు అందుతాయి’’ అని ప్రవీణ్ జార్జ్ వివరించారు.

డాక్టర్ శివరంజని
ఫొటో క్యాప్షన్, డాక్టర్ శివరంజని సంతోష్‌‌

మరోవైపు, ప్రస్తుతం పిల్లలకు ఇవ్వబోయేది జనరిక్ మెడిసిన్(కాంపౌండెడ్) అయినప్పటికీ, ఏపీఐ ఫార్ములా ఒకటే కావడం వల్ల ఒరిజినల్ మెడిసిన్‌ను పోలిన ప్రభావం కనబరుస్తుందనే శివరంజని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ మెడిసిన్ భారత్‌లోనే ఉత్పత్తి అయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

''ఈ మెడిసిన్ వల్ల వందశాతం వ్యాధి నయం కాదు. కానీ, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఖర్చు బాగా అవుతుంది. అందుకే భారత్‌లోనే ఉత్పత్తి చేస్తే తక్కువ ఖర్చుతో వస్తుంది'' అని కోరారు సురేంద్ర కుమార్.

ఎవరీ శివరంజని సంతోష్?

శివరంజని సంతోష్ హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు.

మెడికల్ రంగంలోని వివిధ సమకాలీన, సామాజిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ నిర్వహిస్తుంటారు.

గతంలో ఓఆర్ఎస్ పేరును బ్రాండ్ల పేరుగా వాడకూడదని పోరాటం చేశారు. దాని ద్వారా ఆమె బాగా ప్రాచుర్యం పొందారు.

దీని తర్వాత ఆమెను సోషల్ మీడియాలోనూ 'ఓఆర్ఎస్ డాక్టర్'గా పిలుస్తుంటారు.

అలాగే వైద్యరంగంలోని వివిధ అంశాలపై అవగాహన వీడియోలు చేస్తుంటారు.

తాజాగా ఆమె సోషల్ మీడియాలో నిర్వహించిన క్యాంపెయిన్ ద్వారా ఏడుగురు బాధిత పిల్లలకు రూ.కోట్ల విలువైన మందులు ఉచితంగా అందబోతున్నాయని ప్రకటించారు శివరంజని.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)