You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విజయ్: సినిమాలే కాదు రాజకీయాల్లోనూ 'హీరో'గా ఎదిగారా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో సినీ నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు.
అభిమానులు ఆయన్ను ప్రేమగా 'దళపతి 'గా పిలుచుకుంటారు. ఆయన స్థాపించిన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే), ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ డీఎంకేను వెనక్కి నెట్టింది.
డేటానెట్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి టీవీకే 110 సీట్లలో ఆధిక్యం కనబరుస్తుండగా.. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) 60 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
విపక్ష అన్నాడీఎంకే కూడా డీఎంకేను అధిగమించి, 64 సీట్ల ఆధిక్యంలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇది మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉన్న పరిస్థితి.
పెరంబూర్ స్థానంలో విజయ్ తన సమీప ప్రత్యర్థి ఆర్.డి. శేఖర్‌పై సుమారు 3 వేల ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.
విజయ్ ఫేమ్
తమిళనాడులోనే కాక, హిందీ మాట్లాడే ప్రాంతాల్లో కూడా విజయ్ కొంత వరకు పాపులర్.
ఎగ్జిట్ పోల్స్ కూడా ఆయన ఎన్నికల ఫలితాల్లో మంచి పోటీ ఇస్తారని అంచనా వేశాయి. ఈ అంచనాలను మించి విజయ్ ఆశ్చర్యపరిచారు.
అనేక సినిమాల్లో సక్సెస్ సాధించిన విజయ్.. రెండేళ్లుగా రాజకీయాల్లో కూడా చురుగ్గా మారారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించడంతో ఆయన పేరు వార్తల్లో నిలిచింది.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు విజయ్.
బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారాన్ని, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి, చిన్నతనంలోనే నటనను మొదలుపెట్టి, ఎన్నో ఇబ్బందుల తర్వాత ఒక స్టార్‌డమ్‌ను సాధించారు విజయ్.
తండ్రితో విభేదాలు, భార్యతో వివాదం ఆ తర్వాత రాజకీయ ప్రవేశం.. ఇలా పలు కోణాల్లో విజయ్ జీవితం సినీ స్క్రిప్ట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.
బాల నటుడిగా విజయ్
విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. చెన్నైలో 1974లో జూన్ 22న పుట్టారు.
తండ్రి ఎస్.ఏ చంద్రశేఖర్, తమిళ సినిమాలకు డైరెక్టర్‌గా పని చేశారు. తల్లి శోభ గాయని.
సినీ వాతావరణంలోనే పెరిగిన విజయ్, చిన్న వయసులోనే నటనలోకి దిగారు.
''వెట్రి'' సినిమాలో బాల నటుడిగా పనిచేసే అవకాశం ఆయన తండ్రే ఇచ్చారు. తన భవిష్యత్తు సినిమాలతోనే ముడిపడి ఉందని చిన్న వయసు నుంచే విజయ్ భావించే వారు.
కాలేజీలో విజువల్ మీడియా చదువుతూనే, నటనపై ఉన్న అభిరుచి కారణంగా మధ్యలోనే దాన్ని మానేశారు.
ఆ తర్వాత తన తల్లి శోభ స్క్రిప్ట్ రాయగా.. తండ్రి ఎస్.ఏ చంద్రశేఖర్ తీసిన సినిమా 'నాలైయ తీర్పు' (1992)లో లీడ్ రోల్‌తో విజయ్ అరంగేట్రం చేశారు.
ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించనప్పటికీ, విజయ్ కెరీర్‌కు ఇదే పునాది.
తొలి గుర్తింపు నుంచి 'దళపతి' వరకు..
విజయ్ తొలినాళ్లలో కెరీర్.. యాక్షన్, రొమాంటిక్ పాటల కలయికతో 'ఫార్ములా ఫిల్మ్స్'గా సాగింది.
కానీ, కాలక్రమేణా ఆయన ఐడెంటిటీ మారింది. కామెడీ, యాక్షన్, సామాజిక దృక్పథం ఉన్న చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
మెల్లగా ఒక సాధారణ హీరో నుంచి దళపతిగా (కమాండర్‌గా) మారారు.
'గిల్లి' వంటి సూపర్‌హిట్ చిత్రాలు ఆయనకు 'మాస్ హీరో' ఇమేజ్‌ను ఇచ్చాయి. చిన్నపిల్లలను సైతం ఆయన నటనకు అభిమానులుగా మార్చాయి.
'కత్తి' ఆయన నటనను సామాజిక, రాజకీయ సందేశాలతో ముడిపెట్టగా, 'తేరీ', 'మెర్సల్', 'బిగిల్' వంటి చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను సృష్టించాయి.
నటనతోపాటు, విజయ్ మంచి డ్యాన్సర్‌గా కూడా పేరొందారు.
వ్యక్తిగత జీవితం
విజయ్ వ్యక్తిగత జీవితంలో అత్యంత కీలకమైన టర్నింగ్ పాయింట్ సంగీత. లండన్‌లో పెరిగిన సంగీత, విజయ్ సినిమాలు చూసి ఆయన అభిమానిగా మారారు.
వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఆ తర్వాత ఆ బంధం మరింత ముందుకెళ్లింది.
కుటుంబ సభ్యుల ఆమోదంతో 1999 ఆగస్టు 25న సంగీతను విజయ్ పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత... సంగీత ఆయన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారారు.
రాజకీయాల్లోకి ప్రవేశం
2024 ఫిబ్రవరిలో విజయ్ అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే)ను పరిచయం చేశారు.
2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఏ పార్టీకీ మద్దతు ప్రకటించనని స్పష్టం చేసిన విజయ్, తన దృష్టంతా 2026 అసెంబ్లీ ఎన్నికలపైనేనని తెలిపారు.
ఆ ప్రకటనతో పాటు, తాను సినిమాలను వీడుతున్నట్లు చెప్పారు.
తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవండిలో 2024 అక్టోబర్ 27న టీవీకే తొలి ర్యాలీ నిర్వహించగా.. దానికి భారీ సంఖ్యలో ప్రజలు పోటెత్తారు.
విభజన రాజకీయాలు చేసే పార్టీలను వేదికపై నుంచే విమర్శిస్తూ, అటువంటి శక్తులు తమ పార్టీకి సైద్ధాంతికంగా వ్యతిరేకమని అన్నారు.
ద్రవిడ నమూనా పేరుతో ప్రభుత్వం మోసానికి పాల్పడుతోందని, 'ఒకే కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది' అని కూడా ఆయన ఆరోపించారు.
విజయ్ రాజకీయాల్లోకి రాకముందే.. తన కుటుంబంతో ఉన్న వివాదం వెలుగులోకి వచ్చింది.
విజయ్ తండ్రి ఎస్.ఏ చంద్రశేఖర్ 2020లో 'ఆల్ ఇండియా దళపతి విజయ్ పీపుల్స్ మక్కల్ ఇయక్కం' పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.
అయితే తన తండ్రి ప్రారంభించిన పార్టీతో తనకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని విజయ్ చెప్పారు. ఏ రాజకీయ సంస్థ అయినా తన ఫొటోనుగానీ, పేరునుగానీ వాడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
రాజకీయ కార్యకలాపాల్లోనూ, బహిరంగ సభలలోనూ తన ఫొటోలను, పేరును వాడకూడదంటూ తల్లిదండ్రులతోపాటు, ఇతరులపై విజయ్ చెన్నై కోర్టులో కేసు వేశారు.
సినిమాలు వీడుతున్నట్లు ప్రకటన
పార్టీ ప్రకటన తర్వాత ఓ బహిరంగ సభలో మాట్లాడిన విజయ్.. తాను నటనను, సంపాదనను వీడి, రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు.
రాజకీయాల్లో యాక్టివ్‌గా మారిన తర్వాత.. నటనను వీడి, తన జీవితాన్ని పూర్తిగా సామాజిక సేవకు అంకితం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
2024 సెప్టెంబర్‌లో.. 'దళపతి 69' విజయ్ చివరి సినిమాగా ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ అధికారికంగా ప్రకటించింది.
పార్టీ సిద్ధాంతం గురించి ఏం చెప్పారు?
తన తొలి ర్యాలీలో టీవీకే సిద్ధాంతం గురించి విజయ్ విస్తృతంగా మాట్లాడారు. ''ద్రవిడ, తమిళ జాతీయవాదాన్ని వేరు చేయం. ఈ నేలకు ఇవి రెండు కళ్లు లాంటివి. ఏదైనా ఒక్క నిర్దిష్ట గుర్తింపుకే మేం పరిమితం అవ్వం'' అని తెలిపారు.
లౌకిక వాదం, సామాజిక న్యాయం సిద్ధాంతాలపై తమ పార్టీ ఆధారపడి ఉంటుందని విజయ్ తెలిపారు.
మహిళల సాధికారత, సామాజిక న్యాయంతో పాటు పెరియార్ చూపించిన మార్గాన్ని టీవీకే అనుసరిస్తుందని చెప్పారు. అయితే, పెరియార్ నాస్తికవాద అభిప్రాయాలను తాను అంగీకరించనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ద్విభాషా విధానానికి టీవీకే మద్దతు ఇస్తుందని విజయ్ చెప్పారు. ప్రభుత్వ పనులు తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో సాగుతాయన్నారు. కుల గణనకు కూడా తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)