You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పశ్చిమ బెంగాల్: పోలింగ్ తర్వాత కూడా రాజకీయాలు ఎందుకు ఉద్రిక్తంగా ఉన్నాయి?
- పశ్చిమ బెంగాల్‌లో మే 4న కౌంటింగ్
- కౌంటింగ్ పర్యవేక్షణకు 165 మంది అదనపు పరిశీలకులు, 77 మంది పోలీసు పరిశీలకుల నియామకం
- పార్టీ కౌంటింగ్ ఏజెంట్లతో మమత, అభిషేక్ బెనర్జీ సమావేశం
- రహస్య పత్రం ఆధారంగా ఓ వాదన చేసిన పార్టీ నేత కుణాల్ ఘోష్
- 78 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నట్టు ఓ పార్టీ గుర్తించినట్టు రహస్య పత్రం ఉందన్న కుణాల్ ఘోష్
- కుణాల్ వాదనను తోసిపుచ్చిన బీజేపీ
- టీఎంసీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే కుణాల్ ఘోష్ ఇలాంటి మాటలు చెబుతున్నారని ఆరోపణ
పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమించాలనే అంశంపై శనివారం బీజేపీ, టీఎంసీల మధ్య ఘర్షణ జరిగింది.
అదే సమయంలో రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కోసం అదనపు పరిశీలకులను నియమించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
మరోవైపు కేంద్ర ఉద్యోగుల అంశంపై శనివారం(మే 2) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీఎంసీ తమ విజయంగా అభివర్ణిస్తుండగా, బీజేపీ దానిని మమతా బెనర్జీ ఓటమిగా పేర్కొంటోంది.
పశ్చిమ బెంగాల్‌లోని 294 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్‌తో సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన జరగనుంది.
అయితే ఓట్ల లెక్కింపుకు ముందు కూడా పశ్చిమ బెంగాల్‌లోని రాజకీయ గందరగోళం సద్దుమణిగేలా కనిపించడం లేదు.
పోలింగ్ తర్వాతా వివాదాలు
సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల తర్వాత, ఓట్ల లెక్కింపుకు ముందే రాజకీయ పార్టీలు తమ విజయాన్ని ప్రకటించుకోవడం కనిపిస్తుంటుంది.
ఈ ఎన్నికల సమయంలో బెంగాల్‌లోని రాజకీయ గందరగోళం ఆ రాష్ట్రంపై అందరి దృష్టి మరింత పెరిగేలా చేస్తోంది. రాజకీయ పార్టీల వాదనలే కాకుండా ప్రతిరోజూ కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి.
ఈ వివాదాలు కేవలం మాటలకే పరిమితం కావడంలేదు. మొదట హైకోర్టుకు చేరి ఆ తర్వాత శనివారం సుప్రీంకోర్టులోనూ ప్రతిధ్వనించాయి.
ఓట్ల లెక్కింపులో కేంద్ర ఉద్యోగుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును టీఎంసీ తమ విజయాన్ని ప్రకటించుకుంటుండగా, బీజేపీ దీనిని టీఎంసీ ఓటమిగా అభివర్ణిస్తోంది.
రాష్ట్రంలో అదనపు పరిశీలకులను నియమించే విషయంపై కూడా ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పర్యవేక్షకులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ప్రధాన ఎన్నికల అధికారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ టీఎంసీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
శనివారం ఈ విషయంపై జరిగిన విచారణ సందర్భంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కౌంటింగ్ పరిశీలకుల నియామకానికి సంబంధించిన సర్క్యులర్‌ను పాటిస్తామని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
ఎన్నికల సంఘం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సమక్షంలో మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పినట్టు బార్ అండ్ బెంచ్ వెబ్‌సైట్ తెలిపింది.
పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పి.ఎస్. నరసింహ, జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ నిర్ణయం ప్రకారం కౌంటింగ్ పర్యవేక్షకులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమించాలి. దీనిపై టీఎంసీ కోల్‌కతా హైకోర్టులో అప్పీల్ చేయగా గురువారం(ఏప్రిల్ 30) హైకోర్టు ఆ అప్పీల్‌ను కొట్టివేసింది.
శనివారం ఎన్నికల సంఘం వాదన విన్న తర్వాత టీఎంసీ అప్పీల్‌పై ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
"స్పెషల్ లీవ్ పిటిషన్‌లో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదు. ఎన్నికల కమిషన్ సర్క్యులర్‌ను పూర్తిగా పాటిస్తామని నాయుడు చెప్పిన విషయాన్ని మేము నమోదు చేస్తున్నాము" అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.
పశ్చిమ బెంగాల్‌లో మే 4న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండడంతో ఈ పిటిషన్‌ను వెంటనే విచారించారు.
టీఎంసీ-బీజేపీ ముఖాముఖి
'సుప్రీంకోర్టులో మా పిటిషన్‌ను తిరస్కరించారన్న వార్త అవాస్తవం' అని సుప్రీంకోర్టులో టీఎంసీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చెప్పారు.
సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది టీఎంసీకి కాదని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు అని టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ విమర్శించారు.
" కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులను ఓట్ల లెక్కింపు సిబ్బందిగా ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ ఉద్యోగులకే పరిమితం కాకూడదు. దీనిని పాటిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది" అని ఆమె 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
"పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం రాజ్యాంగబద్ధంగా సరైనది. ఇది టీఎంసీ రాజకీయ, నైతిక ఎజెండాపై ప్రశ్నలను లేవనెత్తుతోంది" అని బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేది అన్నారు.
"ప్రజల ముందు ఓడిపోయిన వారు ఎక్కడా గెలవలేరు" అని ఖరగ్‌పూర్ బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై రాష్ట్రీయ జనతా దళ్ ఎంపీ మనోజ్ ఝా స్పందించారు .
"సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలించి ఉండాల్సింది. కోర్టు అధిక సంఖ్యలో ఉన్న ఓటర్ల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఓట్ల లెక్కింపు రోజునే ఆ సందేహాలను నివృత్తి చేసి ఉంటే బాగుండేది" అని ఆయన అన్నారు.
ఎన్నికల సంఘం కీలక ప్రకటన
పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు సురక్షితంగా, శాంతియుతంగా, పారదర్శకంగా జరిగేలా చూసేందుకు 165 మంది అదనపు పరిశీలకులను, 77 మంది పోలీసు పరిశీలకులను నియమించినట్లు ఎన్నికల సంఘం శనివారం తెలిపింది .
"రాజ్యాంగం కల్పించిన అధికారాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ పరిశీలకులందరూ ఎన్నికల సంఘంలో డిప్యుటేషన్ ప్రాతిపదికన పనిచేస్తారు. ఈసీ నియంత్రణలో ఉంటూ ఆదేశాలు పాటిస్తారు'' అని ఎన్నికల సంఘం తెలిపింది.
ఒకటి కంటే ఎక్కువ కౌంటింగ్ హాళ్లు ఉన్న 165 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ 165 మంది అదనపు కౌంటింగ్ పరిశీలకులను నియమించినట్టు కమిషన్ పేర్కొంది. పోలీసు పరిశీలకులు కౌంటింగ్ కేంద్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారు. వారిని కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించడానికి అనుమతించరు.
ఎన్నికల సంఘం ప్రకారం పోలీసు పరిశీలకులు, ఓట్ల లెక్కింపు పరిశీలకులు సమన్వయంతో పనిచేస్తారు.
శనివారం పార్టీ కౌంటింగ్ ఏజెంట్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీలు 294 అసెంబ్లీ స్థానాలకు గాను తమ పార్టీ 200కు పైగా సీట్లు గెలుస్తుందని చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.
రహస్య పత్రాల ఆధారంగా టీఎంసీ నాయకుడు కుణాల్ ఘోష్ ఒక వాదన చేసినట్టు సమాచారం .
"మా దగ్గర ఒక పత్రం ఉంది. అది ఏ పార్టీ పత్రమో నేను చెప్పను. కానీ అది ఓ పార్టీకి చెందిన రహస్య పత్రం" అని ఆయన అన్నారు.
‘‘ఆరుగురు నాయకులు హాజరైన సమావేశంలో ఆ పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్న 78 స్థానాలను గుర్తించింది. మొత్తం 294 స్థానాలపై ఇది వారి తుది అభిప్రాయం’’ అని ఆయన తెలిపారు.
కుణాల్ ఘోష్ వాదనపై బీజేపీ ఎంపీ రాహుల్ సిన్హా మాట్లాడారు.
"కుణాల్ ఘోష్ ఈ వాదన చేయడానికి ఆధారంగా చూపిన పత్రాలన్నీ నకిలీవి. తమ కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని పెంచడానికే ఆయన ఇలా చేస్తున్నారు. టీఎంసీ అధికారానికి దూరం కాబోతోంది. మమతా బెనర్జీ, కుణాల్ ఘోష్ తమ కార్యకర్తలలో మనోస్థైర్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు" అని రాహుల్ సిన్హా వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)