You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సినీ హీరో టు చీఫ్ మినిస్టర్.. ఎవరెవరు?
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
తమిళనాడులో సినీ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అత్యధిక సీట్లలో ఆధిక్యంతో విజయం దిశగా సాగుతున్నట్లు ఎన్నికల ఫలితాల సరళి చెబుతోంది.
234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో 118 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) సాధిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయచ్చు. టీవీకే అధినేత విజయ్ ప్రస్తుతం ఆ దిశగానే వెళ్తున్నారు.
దీంతో తమిళనాట ఎంజీఆర్, జయలలిత, తెలుగునాట ఎన్టీఆర్, తరహాలోనే ప్రభుత్వంలో ఉన్నత స్థానం దిశగా పయనిస్తున్నారు.
సినీ హీరో కానప్పటికీ తమిళ సినిమా రంగం నుంచే రాజకీయాలలో అడుగుపెట్టిన కరుణానిధి సుదీర్ఘకాలం తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
‘విజయ్’ దరహాసం...
రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి అగ్రహీరోలు తమిళ సినిమాను ఏలుతున్న 1990ల ప్రారంభంలో హీరోగా ప్రస్థానం ప్రారంభించిన విజయ్, తనదైన నటనతో పెద్దఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు.
తన సమకాలీనుడైన మరో హీరో అజిత్, సీనియర్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ వంటివారూ తమిళనాట క్రేజ్ కొనసాగిస్తుండగా, విజయ్ కూడా సమాంతరంగా తన అభిమాన గణాన్ని పెంచుకున్నారు. మాస్ హీరోగా పేరు సంపాదించుకున్నారు.
30 ఏళ్ల సినిమా ప్రయాణం తరువాత విజయ్ 2024 ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ప్రారంభించారు. అనంతరం ఆ ఏడాది చివరి నాటికి రాజకీయ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం మొదలుపెట్టారు.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతూ వచ్చారు. అన్నాడీఎంకే, బీజేపీ వంటి పార్టీలతో పొత్తుల ప్రస్తావనలు వినిపించినా విజయ్ ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
ఏప్రిల్ 23న పోలింగ్ తరువాత మెజారిటీ ఎగ్జిట్ పోల్స్‌లో ఆయన విజయాన్ని అంచనా వేయలేదు. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రమే విజయ్ పార్టీ 98 నుంచి 120 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది.
అయితే, సోమవారం (మే 4) వెల్లడవుతున్న ఫలితాలలో టీవీకే సమీప పోటీదారులైన డీఎంకే, అన్నాడీఎంకే కూటముల కంటే ఎక్కువ సీట్లలో అధిక్యంలో ఉంది.
దీంతో విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆయన సీఎం పదవి చేపడతారని టీవీకే వర్గాల్లో సంబరాలు మొదలయ్యాయి.
ఎంజీఆర్‌తో మొదలు...
సినిమా పాపులారిటీతో రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించింది విజయ్ ఒక్కరే కాదు. గతంలో సినిమా హీరోల నుంచి రాజకీయ పార్టీలు స్థాపించి ముఖ్యమంత్రి పదవులు చేపట్టినవారున్నారు. డిప్యూటీ సీఎంలుగా పనిచేస్తున్నవారు ఉన్నారు.
ముఖ్యంగా తమిళనాడులోనే ఇంతకుముందు ఇలాంటి ఉదాహరణలున్నాయి.
ఎంజీఆర్: ఎంజీ రామచంద్రన్.. ఎంజీఆర్‌గా ప్రసిద్ధిపొందిన ఈయన కూడా సినిమా హీరో నుంచి సీఎం అయినవారే. తమిళనాట విపరీతమైన ప్రజాదరణతో సినీ హీరోగా కొనసాగుతున్న ఆయన మొదట డీఎంకేలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు.
అయితే.. డీఎంకే నుంచి బహిష్కరణకు గురికావడంతో 1972లో అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. ఆ తరువాత 1977 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
దేశంలో ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సినిమా హీరో ఎంజీ రామచంద్రనే.
తెలుగు నాట ఎన్‌టీఆర్
తమిళనాడులో ఎంజీఆర్ సొంత పార్టీ పెట్టిన పదేళ్లకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీ పుట్టింది. ఆ పార్టీని స్థాపించింది కూడా సినిమా హీరోనే. ఆయనే ఎన్‌టీఆర్‌గా అందరూ పిలుచుకునే నందమూరి తారక రామారావు.
ఎన్‌టీఆర్ 1982 మార్చి నెలలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే పార్టీ స్థాపనకు, ఎన్నికలకు మధ్య ఉన్న సమయం కేవలం 9నెలలు మాత్రమే.
1983 జనవరిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
తమిళనాడులో ఎంజీఆర్ సృష్టించిన ప్రభంజనం తరహాలోనే ఏపీలో ఎన్‌టీఆర్ కూడా భారీ ప్రభంజనంతో గెలిచి, సీఎం అయ్యారు.
‘అమ్మ’ జయలలిత
ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేలోనే కొనసాగారు అలనాటి హీరోయిన్ జయలలిత. 1987లో ఎంజీఆర్ మరణించిన తరువాత రాజకీయాల్లో మరింత క్రియాశీలమయ్యారు. 1991లో ముఖ్యమంత్రి అయ్యారు.
తమిళ రాజకీయాల్లో 'అమ్మ'గా పేరొందిన జయలలిత ఆరు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 14 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగారు.
2016లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జయలలిత కన్నుమూశారు.
ఏపీ ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ తరువాత సినిమా హీరోలెవరూ ఇంతవరకు మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టకపోయినా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమా హీరోగా కొనసాగుతూ, రాజకీయాల్లోకి వచ్చినవారే.
పవన్ కల్యాణ్ సినీ ప్రయాణం 1996లో మొదలైంది. ఆయనకు తెలుగునాట పెద్ద ఎత్తున అభిమానగణం ఉంది. ఈ క్రమంలోనే ఆయన సోదరుడు, సినీహీరో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోనూ పనిచేశారు.
ప్రజారాజ్యం ఒకే ఒక్క ఎన్నికల్లో పోటీ చేసి, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఈ విలీనం తరువాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్, వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు.
తదుపరి 2014 మార్చిలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆ పార్టీ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.
అయితే, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలతో కలిసి పోటీ చేసిన జనసేన పార్టీ 21 సీట్లలో పోటీచేసి అన్ని స్థానాలనూ గెలుచుకుని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.
చిరంజీవి...
ఎన్‌టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ వంటి హీరోల తరువాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరో చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ తరువాత వచ్చిన 2009 ఎన్నికల్లో పోటీ చేశారు.
18 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీని అనంతరం 2011లో కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరంజీవి. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి, మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర పర్యటక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
విజయకాంత్...
తమిళ సినిమాలలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్‌కాంత్ 2005లో డీఎండీకే పార్టీని ప్రకటించారు. తమిళనాడులో జరిగిన కొన్ని ఎన్నికల్లో ఒంటరిగా, మరికొన్నిసార్లు ఏఐఏడీఎంకే కూటమితోపాటు పోటీ చేసింది డీఎండీకే.
విజయ్‌కాంత్ తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 2023లో ఆయన మరణించారు.
రజినీకాంత్, కమల్‌హాసన్, ఉపేంద్ర...
తమిళనాడులోనే మరో ఇద్దరు పేరున్న హీరోలు రాజకీయాలపై ఆసక్తి చూపారు. రజినీకాంత్ పార్టీ పెడతానంటూ పలుమార్లు ఆసక్తి వ్యక్తం చేసినా చివరకు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.
కమల్‌హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీ స్థాపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా సీట్లేమీ గెలవలేదు. అనంతరం డీఎంకేకు మద్దతిచ్చారు. 2025లో డీఎంకే సహకారంతో కమల్‌హాసన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
కర్ణాటకలో హీరో ఉపేంద్ర 2018లో 'ఉత్తమ ప్రజాకీయ పార్టీ'ని స్థాపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోటీచేసింది. కానీ, సీట్లేమీ గెలవలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)