You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

  2. ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది?, (మే 4 రాత్రి 10 గంటలకు)

    నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాత్రి 10 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం,

    అస్సాంలో భారతీయ జనతా పార్టీ 126 స్థానాలకు గాను 81 స్థానాల్లో ఘనవిజయం సాధించి, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 18 స్థానాలు గెల్చుకోగా, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. బి.ఓ.పి.ఎఫ్, ఏ.జి.పి చెరో 10 స్థానాలను కైవసం చేసుకున్నాయి.

    కేరళలో కాంగ్రెస్ 63 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. వామపక్ష పార్టీలైన సి.పి.ఐ(ఎం) 26 స్థానాల్లో, సి.పి.ఐ 8 స్థానాల్లో గెలుపొందాయి. ఐ.యు.ఎం.ఎల్ కూడా 22 స్థానాలతో తన బలాన్ని నిరూపించుకుంది. కేఈసీ పార్టీ ఏడు స్థానాల్లో గెలిచింది.

    తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీవీకే పార్టీ 96 స్థానాల్లో గెలిచి, మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార డి.ఎం.కె 54 స్థానాల్లో గెలిచి 6 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఏ.డి.ఎం.కె 44 స్థానాల్లో విజయం సాధించి, మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. మొత్తం 294 స్థానాల్లో ఇప్పటికే 184స్థానాలను గెలుచుకుని, మరో 23 చోట్ల ముందంజలో ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి, 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ రెండు స్థానాలు గెలిచింది.

    కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏ.ఐ.ఎన్.ఆర్.సి 30 స్థానాలకు గాను11 స్థానాల్లో గెలిచి, మరో చోట ఆధిక్యంలో ఉంది. డీఎంకే 5, భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు 3 చోట్ల, టీవీకే అభ్యర్థులు 2 చోట్ల గెలిచారు.

  3. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 176 సీట్లలో విజయం 32 స్థానాల్లో ఆధిక్యం

    పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ రాత్రి 9.30 గంటలకు ఎలక్షన్ కమిషన్ తన వెబ్‌సైట్‌లో వెల్లడించిన ఫలితాల ప్రకారం.. 176 సీట్లలో విజయం సాధించి మరో 32 చోట్ల ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 59 సీట్లలో విజయం సాధించి మరో 20 చోట్ల ఆధిక్యంలో ఉంది.

    కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలిచింది. ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ 2 సీట్లు గెలిచింది. సీపీఎం ఒక సీటు గెలిచింది. ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ ఒక స్థానం గెలిచింది.

  4. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

    తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

    స్టాలిన్ 2011 నుంచి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన తమిళనాడు నాలుగో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. 1996లో జయలలిత ఓటమి తర్వాత, పదవిలో ఉన్న ముఖ్యమంత్రి తన సీటును కోల్పోవడం ఇదే మొదటిసారి.

    తమిళనాడు రాజకీయ చరిత్రలో గతంలోనూ కొందరు ముఖ్యమంత్రులు ఇలాగే ఓడిపోయారు:

    • 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.ఎస్. కుమారస్వామి రాజా శ్రీవిల్లిపుత్తూరు సీటు నుంచి ఓడిపోయారు.
    • 1967లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం. భక్తవత్సలం కూడా శ్రీవిల్లిపుత్తూరులోనే పరాజయం చెందారు.
    • 1996 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-తమిళ మానిలా కాంగ్రెస్ కూటమి విజయం సాధించినప్పుడు, అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే ముఖ్యమంత్రి జయలలిత బర్గూర్ స్థానంలో ఓటమి పాలయ్యారు.

    దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, అధికారంలో ఉండి తన నియోజకవర్గంలో ఓడిపోయిన నాలుగో ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలిచారు. డీఎంకే పార్టీలో ఈ విధంగా ఓడిపోయిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే.

  5. పోటీ చేసిన రెండు స్థానాల్లో టీవీకే చీఫ్ విజయ్ ముందంజ

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే పార్టీ సాయంత్రం 4.30 గంటలకు 8 స్థానాల్లో విజయం సాధించగా, మరో 101 స్థానాల్లో లీడ్‌లో ఉంది.

    మరోవైపు, విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

    ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం, పెరంబూర్‌లో 13 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి విజయ్ 31,766 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, తిరుచ్చి ఈస్ట్‌లో 12 రౌండ్లు ముగిసేసరికి 15,707 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

    ఇదే సమయంలో ఎంకే స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 7,731 ఓట్లకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు.

    ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను పెంచారు. విజయ్ పార్టీ ముందంజలో ఉండటంపై నాని, నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు వెంకట్ ప్రభు వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.

  6. అస్సాం : కాంగ్రెస్ అభ్యర్థి గొగోయ్ ఓటమి

    అస్సాం ప్రతిపక్ష ముఖచిత్రంగా పేరుగాంచిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఓటమి చెందినట్టు ఈసీఐ ప్రకటించింది.

    జోర్హాట్ నియోజకవర్గంలో గొగోయ్‌పై పోటీచేసిన బీజేపీ అభ్యర్థి హితేంద్ర నాథ్ గోస్వామి 69,439 ఓట్లు సాధించగా, గొగోయ్‌కు 46,257 ఓట్లు మాత్రమే వచ్చాయి.

  7. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది?

    కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలలోని అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

    ఇప్పటిదాకా పూర్తయిన లెక్కింపునుబట్టి చూస్తే పశ్చిమబెంగాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే సగానికి పైగా స్థానాలలో బీజేపీ ఆధిక్యంలో సాగుతుండగా, నాలుగోసారి అధికారంలోకి రావాలనుకున్న మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ చతికిలపడింది.

    ఇక తమిళనాడులోనూ ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయనాయకుడిగా మారిన సినీనటుడు విజయ్, తమిళనాడులో పాతుకుపోయిన పార్టీలను పక్కకు నెట్టి, విజయం వైపు దూసుకుపోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని విజయ్ టీవీకే పార్టీ సాధించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ లో ఆయన పార్టీ వందకు పైగా స్థానాలతో ముందంజలో ఉంది.

    కేరళలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతున్నట్టు ఇప్పటిదాకా పూర్తయిన లెక్కింపును బట్టి తెలుస్తోంది. దీంతో భారత్‌లో వామపక్షాలకు మిగిలిన ఏకైక రాష్ట్రం కూడా వారి చేతుల నుంచి జారిపోనుంది.

    అస్సాంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా సాగుతోంది.

    పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి స్వల్పమొగ్గు కనిపిస్తోంది. ఇక్కడి ఫలితాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

    మొత్తంగా ఫలితాలను చూస్తే రాజకీయ పరిస్థితులలో ఓ ముఖ్యమైన మార్పుకు అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ తన సంప్రదాయ బలమైన ప్రాంతాలను దాటి, ఆధిక్యంతో ముందుకు సాగుతుండగా, దక్షిణ భారత్‌లో కొత్త ప్రాంతీయ పార్టీలు పోటీల రూపాన్ని మార్చుతున్నాయి.

  8. విజయ్ టీవీకే ఆఫీసు వద్ద భద్రత కట్టుదిట్టం

    తమిళ సూపర్ స్టార్ విజయ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ముందంజలో ఉండటంతో టీవీకే కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

    పార్టీ కార్యాలయానికి చేరుకునే మార్గాలలో పోలీసులు కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను, నాయకులను కూడా పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే అనుమతిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో కొద్దిమంది మాత్రమే కార్యకర్తలు కనిపిస్తున్నారు.

    విజయ్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉందనే వార్తలపై ఆ పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ఏ పార్టీ అయినా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 స్థానాలు దక్కించుకోవాలి.

    ప్రస్తుతం విజయ్ పార్టీ 106 స్థానాలలో ఆధిక్యంలో ఉంది.

    విజయ్‌కు మద్దతు తెలిపేందుకు విదేశాలలోని అభిమానులు కూడా తమిళనాడుకు తరలివచ్చారు.

    విజయ్ గెలుపు చరిత్రాత్మక విజయంగా భావిస్తానని మలేసియా నుంచి వచ్చిన 73 ఏళ్ల చంద్రశేఖర్ అధికేశవ్ అన్నారు.

    ‘‘మా తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. కానీ నేను మలేసియాలో పుట్టాను. మలేసియా పౌరుడిని కూడా’’ అని ఆయన బీబీసీ తమిళ్‌తో అన్నారు.

    ‘‘నాకేమీ ఇక్కడ (భారత్‌లో) ఓటు హక్కు లేదు. అలాగే నాకేమీ ప్రభుత్వ ప్రయోజనాలు కూడా అందవు. కానీ ప్రజా సంక్షేమం కోసం విజయ్ కచ్చితంగా సీఎం కావాలి’’ అని అన్నారు.

    కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ విజయ్ కార్యాలయం వద్ద పోలీసుల భద్రత పెరుగుతూ వస్తోంది.

  9. మమత ఓటమి రాజకీయాలను మలుపు తిప్పుతాయా?

    పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ అనూహ్య ఓటమి వైపు దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇది భారత్‌లోని అత్యంత ప్రభావవంతమైన ప్రాంతీయ నాయకుల్లో ఒకరికి భారీ దెబ్బ అవుతుంది.

    ఈ ఎన్నికలను దీదీగా ప్రసిద్ధి చెందిన 71 ఏళ్ల మమత ఇప్పటివరకు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పోరాటంగా చాలామంది భావిస్తున్నారు. బలమైన ప్రజా మద్దతు, పోరాటస్వభావం కారణంగా ప్రసిద్ధి చెందిన ఆమె 2011లో తన టీఎంసీ పార్టీ ద్వారా వామపక్ష పాలనకు ముగింపు పలికినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆధిపత్యం చాటుతున్నారు.

    కానీ ఈసారి భారతీయ జనతపార్టీ నుంచి దూకుడైన, క్రమబద్ధమైన ప్రచారం ఎదురవడంతో ఈ పోటీ అత్యంత కీలకంగా మారింది.

    ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ పోటీ హోరాహోరీగా ఉంటుందని ప్రకటించాయి. అంతేకాకుండా టీఎంసీ హింస, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది. అలాగే దశాబ్దానికి పైగా అధికారంలో ఉండటం ప్రభుత్వ వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. ట్రెండ్స్ ప్రకారం, బెనర్జీ తన నియోజకవర్గం భవానీపూర్‌లో కూడా వెనుకబడుతున్నట్లు తెలుస్తోంది.

    అక్కడ ఆమె బీజేపీ నేత సువేందు అధికారితో పోటీ పడుతున్నారు. బెనర్జీ ఓడిపోతే, అది బెంగాల్ రాజకీయాల్లో చరిత్రాత్మక మార్పుకు దారితీస్తుంది. కానీ, ఇవి ప్రాథమిక సంకేతాలే. తుది ఫలితం వరకు వేచి చూడాల్సింది

  10. విజిల్ వేసిన విజయ్ కుటుంబం

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌లో సినీనటుడు విజయ్ పార్టీ టీవీకే దూసుకుపోతుండటంతో ఆయన కుటుంబసభ్యులు తమ నివాసంలో ఈలలు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

    ప్రస్తుతం టీవీకే 234 స్థానాలకు గానూ 104 స్థానాలలో ఆధిక్యంలో ఉంది.

  11. పతనం అంచున కమ్యూనిస్టుల చివరి కోట

    కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మెజార్టీ స్థానాలలో ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో కేరళలో కమ్యూనిస్టుల కోట పతనం అంచున నిలబడింది. ఇది కమ్యూనిస్టు పార్టీకి చివరి కోట.

    పశ్చిమ బెంగాల్లో 2011 అసెంబ్లీ ఎన్నికలలో కమ్యూనిస్టుల ఓటమి తరువాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్కిస్ట్) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ వామపక్ష ఉద్యమానికి ఊపిరిపోసింది.

    కేరళ ప్రజలు దశాబ్దాలుగా ఒకసారి సీపీఎం మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటములను ఎన్నుకుంటూ వచ్చారు. కానీ 2021లో ఈ సంప్రదాయానికి తెరదించుతూ వరుసగా రెండోసారి ఎల్‌డీఎఫ్‌ని ఎన్నుకున్నారు.

    తాజాగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సందడిగా ఉన్నారు. వామపక్ష నేతలు వెనుకబడ్డారనే వార్తలు వచ్చినప్పుడల్లా వారు సంబరాలు చేసుకుంటున్నారు.

    ముఖ్యంగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వెనుకంజలో ఉన్నారనే వార్త అక్కడి అతిపెద్ద టెలివిజన్ తెరపై కనిపించగానే కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. 80 ఏళ్ల ఈ వృద్దనేత పరిపాలనాదక్షుడిగానూ, రాజకీయ చాణక్యుడిగానూ పేరుగాంచారు.

    ‘‘ముఖ్యమంత్రి 3,4వేల ఓట్ల తేడాతో వెనుకబడటమంటే ఎల్‌డిఎఫ్ కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో తెలుపుతోంది’’ అని బీబీసీతో కేరళ స్టూడెంట్ యూనియన్ (కేఎస్‌యూ) సభ్యుడు అలోకవరియవల్లీ అన్నారు.

    కాంగ్రెస్ సీనియర్ నేతలు వీఎస్ సతీశన్, రమేష్ చెన్నితాల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ నేతలు రాజీవ్ చంద్రశేఖర్, కె.సురేంద్రన్ కూడా ఆధిక్యంలో ఉన్నారు.

  12. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఫోకస్ అంతా ఆ సీట్లపైనే...

    పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆసక్తికరంగా సాగుతోంది. తమిళనాడులో అనూహ్యంగా విజయ్ పార్టీ టీవీకే ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు దేశప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తోన్న బెంగాల్ ఫలితాల కౌంటింగ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనావేసిన విధంగానే బీజేపీ, టీఎంసీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ట్రెండ్స్‌లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది.

    బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా చర్చనీయాంశమైన నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీచేస్తున్న భవానీపూర్ ఒకటి. మమతను ఓడించేందుకు సువేందు అధికారిని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బరిలోకి దించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్‌లో సుమారు రెండు వేల ఓట్ల తేడాతో ఆమెను ఓడించారు.

    అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. గత పదేళ్ల నుంచి అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జలూక్‌బరి నుంచి బరిలోకి దిగారు. గత ఐదు ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో హిమంత బిశ్వ శర్మ గెలుపు జెండా ఎగరవేశారు. మూడుసార్లు కాంగ్రెస్ టికెట్‌పైన, రెండుసార్లు బీజేపీ టికెట్‌పై గెలుపొందారు.

    తమిళనాడులో ఎక్కువగా చర్చనీయాంశమైన అసెంబ్లీ సీట్లలో కొళత్తూర్ నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోటీ చేశారు.2011, 2016, 2021లలో స్టాలిన్ ఈ నియోజకవర్గంలో గెలుపొందారు. కొళత్తూర్ నియోజకవర్గంలో రెండో రౌండ్ కౌంటింగ్‌లో ఎంకే స్టాలిన్‌ వెనుకపడ్డారు.

    అలాగే, రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ విజయ్ పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుచ్చి, పెరంబూర్‌లు కూడా చర్చనీయాంశంగా మారాయి.

    కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కు నాయకత్వం వహిస్తున్న పినరయి విజయన్ కన్నూర్ జిల్లాలోని ధర్మదామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. విజయన్ ఈ సీటును 2021, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. అలాగే, ప్రధాన ప్రతిపక్షమైన యూడీఎఫ్ నేత వి.డి.సతీశన్ ఎర్నాకుళం జిల్లా పరవూర్ సీటు నుంచి పోటీ చేశారు.

    కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అత్యంత హోరాహోరీగా పోటీ ఉన్న అసెంబ్లీ స్థానాలలో తట్టంచవాడి ఒకటి. ఈ స్థానం నుంచి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి పోటీ చేశారు. ఆయనకు కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి వి. వైతిలింగం నుంచి గట్టి పోటీ ఉంది.

  13. భవానీపుర్‌లో మమత ఆధిక్యమెంత?

    పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపుర్ నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత సువేందు అధికారిపై దాదాపు 2వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువగా వార్తలలో నిలిచిన స్థానాలలో మమత పోటీ చేస్తున్న భవానీపుర్ కూడా ఉంది. ఈ నియోజకవర్గాన్ని మమతకు కంచుకోటగా పరిగణిస్తుంటారు.

    అయితే ఈసారి మమతకు గట్టిపోటీ ఇచ్చేందుకు విపక్షనేత సువేందు అధికారిని బీజేపీ బరిలోకి దింపింది. కిందటిసారి ఎన్నికలలో మమత నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అప్పుడు సువేందు అధికారి 2వేల ఓట్ల మెజారిటీతో మమతను ఓడించారు.

    కానీ ఈసారి మమతకు గట్టిపట్టున్న భవానీపుర్‌లోనే సువేందు ఆమెపై పోటీకి దిగారు. దీంతోపాటు సువేందు తనకు బాగా పట్టున్న నందిగ్రామ్‌ నుంచి కూడా పోటీలో ఉన్నారు.

  14. ఆధిక్యంలో సెంచరీ దాటిన విజయ్ పార్టీ

    ప్రస్తుతానికి తమిళనాడు సినీనటుడు విజయ్ పార్టీ టీవీకే 102 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, ఏఐడీఎంకే 70 స్థానాలలోనూ, డీఎంకే 62 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి.

  15. అసెంబ్లీ ఎన్నికలు 2026 ట్రెండ్స్: ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఆధిక్యం ?

    తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ టీవీకే ఆధిక్యంలో ఉంది. ఇక్కడ అధికార డీఎంకే 63, ఏఐడీఎంకే 67 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, టీవీకే 104 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ సాధనకు కావాల్సినవి 118 స్థానాలు.

    ఇక దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న పశ్చిమబెంగాల్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. టీఎంసీ 124 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 149 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 4 స్థానాలు, వామపక్షాలు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. పశ్చిమబెంగాల్లో అధికారం దక్కాలంటే 148 స్థానాల్లో విజయం సాధించాలి.

    అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్య మెజార్టీ విషయంలో చాలా అంతరం కనిపిస్తోంది.ఇక్కడ బీజేపీ 96 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 27 స్థానాలలోనూ, ఏఐయూడీఎఫ్ 2 స్థానాలలోనూ, ఇతరులు 1 స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నారు.

    వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో ఈసారి ఆ పార్టీలు వెనకబడినట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి 48 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, యూడీఎఫ్ కూటమి 91, ఎన్డీయే 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

    కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 22 స్థానాలలో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 4 స్థానాలలో, ఇతరులు 4 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు.

  16. తొలి రౌండ్‌లో వెనుకబడిన స్టాలిన్

    తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తొలిరౌండ్ ముగిసే సరికి 886 ఓట్లతో వెనుకపడ్డారు. ఆయన కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు తొలి రౌండ్‌ ముగిసేసరికి 4130 ఓట్లు లభించాయి.

  17. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు ఏమంటున్నారు?

    పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ధీమా వ్యక్తం చేశారు.

    ‘‘ఇప్పటికే రాష్ట్ర ప్రజలు టీఎంసీని తిరస్కరించారు’’ అని ఆయన చెప్పారు.

    ‘‘మరికొన్ని గంటల్లో ప్రజలకు, మమతా బెనర్జీకి మధ్య జరిగిన పోటీలో భారీ మెజార్టీ ఎవరిదో తేలిపోతుంది. ఇప్పటికే ప్రజలు ఆమెను తిరస్కరించారు’’ అన్నారు భట్టాచార్య.

    పశ్చిమబెంగాల్లో ఉదయం 8గంటలకు 293 స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఫలితాల తొలిదశ సరళి బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరును సూచిస్తున్నాయి.

    వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ చూస్తుండగా, తొలిసారి అధికార పీఠం దక్కుతుందని బీజేపీ ఆశలుపెట్టుకుంది.

  18. అధికారం దక్కాలంటే ఏ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ ఏంటి?

    నాలుగురాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరి ఆయా రాష్ట్రాలలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజార్టీ సాధనకు ఎన్నిసీట్లు రావాలో ఇక్కడ చూడండి.

    తమిళనాడు అసెంబ్లీ స్థానాలు : 234

    మెజారిటీకి అవసరమైన సీట్లు: 118

    పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్థానాలు : 294

    మెజారిటీకి అవసరమైన సీట్లు: 148

    ( ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ కారణంగా, ప్రస్తుతం 293 స్థానాలకు మాత్రమే లెక్కింపు జరుగుతోంది)

    అస్సాం అసెంబ్లీ స్థానాలు: 126

    మెజారిటీకి అవసరమైన సీట్లు: 64

    కేరళ అసెంబ్లీ స్థానాలు : 140

    మెజారిటీకి అవసరమైన సీట్లు: 71

    పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలు: 30

    మెజారిటీకి అవసరమైన సీట్లు: 16

    ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

  19. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- అందరి దృష్టి బెంగాల్‌పైనే

    పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

    నెల్లాళ్లపాటు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. హోరాహోరీ పోరులో గెలుపెవరిదో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. పశ్చిమబెంగాల్లో అటు అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇటు భారతీయ జనతాపార్టీ చావోరేవో అన్నట్టుగా తలపడ్డాయి.

    పశ్చిమబెంగాల్‌తోపాటు దక్షణాదిన తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి,ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోనూ ఎన్నికలు జరిగాయి. కానీ దేశవ్యాప్తంగా అందరి దృష్టి పశ్చిమబెంగాల్‌పైనే ఉంది.

    ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు పతాకశీర్షికలుగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఓటర్ల జాబితా సవరణ కారణంగా దాదాపు 91 లక్షల ఓటర్లను తొలగించారు.

    ఇక నాలుగోసారి మమతాబెనర్జీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్నది కూడా మే 4వ తేదీనే తేలిపోనుంది.

    మరోపక్క ఎలాగైన పశ్చిమబెంగాల్లో పాగా వేయాలని బీజేపీ దీర్ఘకాలంగా ఎదురుచూస్తోంది. ఈసారి అధికారం చేజిక్కించుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా శ్రమించింది.

    మరికొద్ది గంటల్లోనే ఫలితాలు తేలిపోనున్న తరుణంలో కోల్‌కతా నగరం ప్రశాంతంగా కనిపిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాలలో కేంద్రబలగాలు, రాష్ట్ర పోలీసులను మోహరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల బయట భద్రతను కట్టుదిట్టం చేశారు.

    మరోపక్క తాజాగా ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ జరపనున్నట్టు ప్రకటించారు.

    ఈ నియోజకవర్గ ఫలితాన్ని మే 24న ప్రకటించనున్నారు.

    దీంతో మే 4వ తేదీ పశ్చిమబెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాలకు గానూ, 293 స్థానాల ఫలితాలు మాత్రమే వెల్లడికానున్నాయి.

  20. , గుడ్మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు స్థానిక, జాతీయ,

    అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.