విజయ్ కారు డ్రైవర్ కొడుకు: ఎవరీ శబరినాథన్, ఎంత మెజార్టీతో గెలిచారు?

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 3 నిమిషాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు కమ్ పొలిటిషియన్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) సంచలనం నమోదు చేసింది.

ఇందులో మరో సంచలనం.. ఆయన దగ్గర సుదీర్ఘ కాలంపాటు డ్రైవర్‌గా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ విజయం.

టీవీకే పార్టీ తరఫున ఆర్. శబరినాథన్ విరుగంబాక్కమ్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. సుమారు 27 వేలకు పైగా ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి ఎ.ఎం.వి. ప్రభాకర రాజాపై గెలుపొందారు. ప్రభాకర రాజా డీఎంకే తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

టికెట్ ప్రకటన వీడియో వైరల్

విజయ్ తన పార్టీ తరఫున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను మార్చి 29న చెన్నైలో ప్రకటించారు. ఈ సందర్భంగా విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఆర్.శబరినాథన్ పోటీ చేస్తారని ప్రకటించారు విజయ్.

ఈ ప్రకటన తర్వాత విజయ్ కాళ్లకు శబరీనాథ్ నమస్కరించడం, తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటుండగా, ఆయన్ని విజయ్ హత్తుకుని ఓదార్చడం… ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆ సమయంలో శబరినాథన్ కన్నీళ్లు తుడిచి వెన్ను తట్టి ప్రోత్సహించారు. అక్కడే ఉన్న రాజేంద్రన్ భుజంపై చెయ్యి వేసి ఫొటోలకు పోజులిచ్చారు.

శబరీనాథన్ మరెవరో కాదు, విజయ్ వద్ద సుదీర్ఘకాలం డ్రైవర్‌గా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడు. రాజేంద్రన్ డ్రైవర్‌గానే కాకుండా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసినట్లుగా హిందుస్థాన్ టైమ్స్ రిపోర్టు చేసింది.

శబరినాథన్ తండ్రి రాజేంద్రన్.. విజయ్ లీడ్ రోల్‌లో నటించిన మొదటి సినిమా నాలైయ తీర్పు నుంచి ఆయనతో ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

30 ఏళ్ల వయసు.. బీటెక్ పూర్తి..

30 ఏళ్ల శబరినాథన్ 2021లో ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుంచి బీటెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసినట్లుగా ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తెలుస్తోంది.

ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు. తన పేరుతో మొత్తం ఆస్తులు రూ.25.74 లక్షలుగా ప్రకటించారు. ఇందులో సుమారు రూ.22 లక్షలు చరాస్తులు కాగా, మరో రూ.3 లక్షలు వ్యవసాయ భూమి ఉంది.

ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని శబరినాథన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు.

ఇప్పటివరకు ఆయన అఫిడవిట్ పరంగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి 1,100కు పైగా డౌన్‌లోడ్స్ జరిగాయి.

విరుగంబాక్కంలోనే శబరినాథన్ పెరిగినట్లుగా హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది.

ఖతార్‌లో ఉద్యోగం వదిలేసి వచ్చి..

తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినట్లుగా పీటీఐకు ఇచ్చిన గతంలో ఇంటర్వ్యూలో శబరినాథన్ వెల్లడించారు.

''చాలామంది తండ్రుల్లానే నా నాన్న కూడా నేను ఇంజినీర్ కావాలని అనుకున్నారు. నా చదువు కోసం లోన్లు తీసుకున్నారు. చాలామంది వద్ద అప్పులు చేశారు. వారందరికీ నేను ఇంజినీర్ అవుతాననే చెప్పారు'' అని శబరినాథన్ చెప్పారు.

2021లో బీటెక్ పూర్తయ్యాక ఖతార్‌లో ఉద్యోగం వచ్చినట్లుగా శబరినాథన్ వివరించారు.

''ఉద్యోగం బాగానే ఉండేది. కానీ, నాకు విశ్రాంతి దొరికేది కాదు. విజయ్ పార్టీ పెడుతున్నారని తెలుసుకుని చెన్నైవచ్చేసి ఆయనతో కలిసి పనిచేయాలనుకున్నా. కానీ, అందుకు నాన్న రాజేంద్రన్ ఒప్పుకోలేదు'' అని వివరించారు.

తన తండ్రి రాజేంద్రన్ మాట విన్నట్లుగా చెబుతూనే, నేరుగా విజయ్‌ను కలిసి మాట్లాడినట్లుగా శబరినాథన్ చెప్పారు.

''విజయ్ మా నాన్నతో మాట్లాడారు. నన్ను వెనక్కి వచ్చి పార్టీలో చేరి పనిచేయాలని చెప్పారు. అలా 2024 ఉద్యోగం వదిలి చెన్నైకి తిరిగి వచ్చేశా'' అని వివరించారు.

మొదట టీవీకే తరఫున విరుగంబాక్కం జిల్లా కార్యదర్శిగా ఉన్న శబరినాథన్.. తర్వాత ఎన్నికల్లో టికెట్ దక్కడంతో విరుగంబాక్కం నుంచి గెలుపొందారు.

''నాకు ఏడాది వయసు నుంచి విజయ్ తెలుసు. చాలాసార్లు మా నాన్న నన్ను షూటింగ్ జరిగే చోటకు తీసుకెళ్లారు. మిగిలిన అందరి అభిమానుల కంటే విజయ్ గురించి నాకు కొంచెం ఎక్కువే తెలుసు'' అని పీటీఐ ఇంటర్వ్యూలో శబరినాథన్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)