You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏంటి? దీనిని రాహుల్ గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
మోదీ ప్రభుత్వం రూ. 81వేల కోట్లతో చేపట్టిన గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.
"ఇది చాలా పెద్ద కుంభకోణం. దేశ గిరిజన, సహజ వారసత్వ సంపదకు వ్యతిరేకంగా జరుగుతున్న అతి పెద్ద నేరాలలో ఒకటి" అని రాహుల్ గాంధీ అన్నారు.
భారత ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న గ్రేట్ నికోబార్ ద్వీపంలో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు.
ఇందులో భాగంగా ఒక ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్, ఎయిర్‌పోర్ట్, టౌన్‌షిప్, విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించనున్నారు.
హిందూ మహా సముద్రంలో వ్యూహాత్మకంగా, ఆర్థికంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఇది కీలకమైన ప్రాజెక్టు అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి భారీ నష్టం కలుగుతుందని విమర్శకులు అంటున్నారు.
దీని వల్ల షోంపెన్, నికోబరీస్ తెగలపై తీవ్ర ప్రభావం పడవచ్చని వాళ్లు భావిస్తున్నారు.
'లక్షల చెట్లను నరికేస్తారు': రాహుల్ గాంధీ
"ప్రభుత్వం దీనిని ప్రాజెక్టు అంటోంది. అయితే ఇది ప్రాజెక్టు కాదు. లక్షల చెట్లను నరికివేయబోతున్నారు. 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని వర్షారణ్యాన్ని ధ్వంసం చేయనున్నారు. అక్కడున్న వారిని వెళ్లగొట్టి వారి ఇళ్లను తీసుకుంటారు" అని రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశంలో అన్నారు.
గ్రేట్ నికోబార్ ద్వీపంలోని అడవులను సందర్శించినప్పుడు అక్కడి చెట్లు "ప్రజల జ్ఞాపకాల కన్నా పురాతనమైనవి" అని ఆయన అన్నారు.
ఇక్కడి అడవులు అనేక తరాలుగా పెరుగుతూ వచ్చాయని, ఈ ప్రాజెక్టు వల్ల స్థానికులు తమ హక్కుల్ని కోల్పోతారని రాహుల్ చెప్పారు.
"ఈ ద్వీపంలో నివసిస్తున్న వారంతా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వారిని సంప్రదించలేదు. తాము కోల్పోయే భూమికి ఎంత పరిహారం అందుతుందో కూడా వారికి తెలియదు. నేను ఇక్కడకు రావడానికి ప్రభుత్వం ఎందుకు ఇష్టపడలేదో, నేను ఇక్కడకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎందుకింత పెద్ద ప్రయత్నం చేసిందో నాకు ఇప్పుడు అర్థమైంది" అని రాహుల్ అన్నారు.
"ఇది బహిరంగ దోపిడీ" అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఆ ద్వీపపు ప్రజలు తనను కోరినట్లు చెప్పారు.
"నేను ఆ పని సంతోషంగా చేస్తాను. ఎందుకంటే ఇది దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియాలి. ఎందుకంటే ఇదే వారి భవిష్యత్తు" అని రాహుల్ అన్నారు.
రాహుల్‌గాంధీ మంగళవారం నికోబార్ జిల్లాలోని క్యాంప్‌బెల్ బే చేరుకున్నారు. అక్కడ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న గిరిజన తెగ నాయకుల్ని కలిశారు.
కేంద్ర ప్రభుత్వ తీరు పారదర్శకంగా లేదని, పర్యావరణపరంగా ఏర్పడే సమస్యలను పట్టించుకోవడం లేదని, స్థానికుల హక్కుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానిక గిరిజన తెగలు ఆరోపించాయి.
హిందూ మహాసముద్రంలో చైనాకు సమాధానం?
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది.
"అండమాన్ నికోబార్ దీవుల్లో మోదీ ప్రభుత్వం రూ. 92 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇది భారత్‌కు వ్యూహాత్మక ఆయుధం. దీనికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆందోళన చేస్తున్నారు" అని బీజేపీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
"ఇది కేవలం ఒక పోర్ట్ మాత్రమే కాదు. భారత సముద్ర సరిహద్దు రక్షణకు ఉద్దేశించినది. హిందూ మహా సముద్రంలో భారత బలానికి సంబంధించినది. చైనాకు నేరుగా జవాబిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మించకూడదని చైనా కోరుకుంటోంది. ఆశ్చర్యకరంగా రాహుల్ గాంధీ కూడా అదే కోరుకుంటున్నారు" అని అందులో రాసింది.
"దేశ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తుంది. దేశం మరింత బలోపేతం కావాలని భావిస్తే రాహుల్ గాంధీ దేశ వ్యతిరేకుల వైపు నిలబడతారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ ఎవరి కోసం పోరాడుతోంది? ఎవరి ప్రయోజనాల కోసం దేశ భద్రతను బలహీన పరిచేపని చేస్తోంది?" అని బీజేపీ ‘ఎక్స్’ ఖాతా పోస్ట్‌లో ప్రశ్నించింది.
బీజేపీ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి కూడా రాహుల్ గాంధీకి ఇలాంటి ప్రశ్నలే సంధించారు.
"చైనామీద కాంగ్రెస్‌కున్న ప్రేమ మరోసారి బయటికొచ్చింది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు భారత సముద్ర భద్రత, ఆర్థిక బలానికి ప్రతీక. దీనిని వ్యతిరేకించడం ద్వారా రాహుల్ గాంధీ తన కుతంత్రాల అజెండాను బయటపెట్టారు. చైనాను బలహీనపరిచే ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ ఎందుకు పట్టించుకుంటోందన్నదే అసలు ప్రశ్న" అని సమ్రాట్ చౌదరి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
గ్రేట్ నికోబార్ గుండా వెళ్లే మలక్కా జలసంధి కీలకమైన సముద్ర మార్గం. భౌగోళికంగా ఇది వ్యూహాత్మక ప్రాంతం.
హిందూ మహా సముద్రంలో ఆధిపత్యం సాధించడం అనేది భారత్- చైనాలకు వ్యూహాత్మక లక్ష్యం.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అనేది చైనాకు చెందిన 'స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్'కు స్పందనగా భావిస్తున్నారు.
హాంగ్‌కాంగ్ వల్ల చైనా లాభపడినట్లే, గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వల్ల భారత్‌కు పెట్టుబడులు వస్తాయని, వాణిజ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ఏంటి?
అండమాన్ నికోబార్ ప్రాంతంలోని 166 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఈ ప్రాజెక్టులో ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్, ఎయిర్‌పోర్ట్, టౌన్‌షిప్ ఉంటాయి.
ఈ ప్రాంతాన్ని హిందూ మహాసముద్రం, సూయజ్ కాలువ, ఇతర కీలకమైన ప్రపంచ వాణిజ్య మార్గాలకు అనుసంధానించేలా దీనిని రూపొందించారు.
ప్రపంచంలో రద్దీగా ఉండే సముద్ర మార్గమైన మలక్కా జలసంధి సమీపంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ .. అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
ప్రాజెక్టు 30 ఏళ్లలో పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
హిందూ మహా సముద్రంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనే లక్ష్యంతోనే భారత్ ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని నిపుణులు భావిస్తున్నారు.
అండమాన్‌లో అరుదైన తెగల పరిస్థితేంటి?
అండమాన్ నికోబార్ దీవులు ప్రపంచంలోని కొన్ని అత్యంత ఏకాంత, బలహీన గిరిజన తెగలకు నిలయంగా ఉన్నాయి. ఇందులో ఐదు సమూహాలు "ప్రత్యేకంగా బలహీనమైనవి"గా వర్గీకరించారు.
ఇందులో జరవా, నార్త్ సెంటినలీస్, గ్రేట్ అండమానీస్, ఓంగే, షోంపెన్ తెగలున్నాయి.
జరవా, ఉత్తర సెంటినలీస్ తెగలు బాహ్య ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నాయి. బయట నుంచి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా గ్రేట్ నికోబార్ దీవులలోని సుమారు 400 మంది షోంపెన్ ప్రజలు తమ జీవన విధానాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు.
షోంపెన్ ప్రజలు సంచార జాతులకు చెందినవారు. వీరిలో చాలామంది అడవి లోపలి భాగంలో నివసిస్తారు. వాళ్ల సంస్కృతి గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఎందుకంటే వారిలో కొద్దిమందికి మాత్రమే బయటి ప్రపంచంతో సంబంధాలున్నాయి.
ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లుతుందనేది పర్యావరణవేత్తల ఆందోళన.
అయితే ప్రాజెక్టు నిర్మాణం కోసం ద్వీపం మొత్తం వైశాల్యంలో కేవలం130 చదరపు కిలోమీటర్లు, అంటే 14 శాతం భూమిని మాత్రమే చదును చేయనున్నట్లు భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రాజెక్టు నిర్మించతలపెట్టిన ప్రాంతంలో 9.50 లక్షల చెట్లు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
పర్యావరణవేత్తల ఆందోళన
ప్రాజెక్టు నిర్మాణం వల్ల బయటి నుంచి వచ్చే జనాభా పెరుగుతుందని, దాని వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఇది అంతిమంగా గిరిజనుల మనుగడకు ముప్పుగా మారుతుందని వాళ్లు అంటున్నారు.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది పర్యావరణవేత్తలు, పరిశోధకుల బృందం 2025 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఈ ప్రాజెక్ట్ గురించి పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ బీబీసీతో మాట్లాడారు.
"అడవిలో కొంత భాగాన్ని మాత్రమే తొలగిస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెబుతుంది. కానీ మీరు నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు మరింత కాలుష్యాన్ని సృష్టిస్తాయి. ఇది మొత్తం ఆవాసాన్ని ప్రభావితం చేస్తుంది" అని అన్నారు.
ద్వీపపు ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న గలాథియా బేపై ఈ ప్రాజెక్టు ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు.
గలాథియా అగాథం శతాబ్దాలుగా భారీ లెదర్‌బ్యాక్ సముద్ర తాబేళ్లకు గూడు కట్టుకునే ప్రదేశంగా ఉంది.
ఉప్పునీటి మొసళ్ళు, నీటి ఉడుతలు, చేపలు, అనేక అరుదైన పక్షులు కనిపించే ప్రాంతంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారని సామాజిక జీవావరణ శాస్త్రవేత్త డాక్టర్ మనీష్ చండీ బీబీసీకి చెప్పారు.
అయితే ఈ జంతు జాతులు గుడ్లు పెట్టే, సంతానోత్పత్తి చేసే ప్రదేశాలలో ఎలాంటి మార్పు చోటు చేసుకోదనిని ప్రభుత్వం ప్రకటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)