‘మంటల నుంచి తప్పించుకునేందుకు అందరూ టాయిలెట్లోకి చేరారు’.. బ్యాంకాక్ బార్ అగ్ని ప్రమాదంలో 27 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, డాన్ సేల్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
బ్యాంకాక్‌లోని ఒక బార్లో అగ్నిప్రమాదంలో 27 మంది మరణించినట్లు థాయిలాండ్ ప్రధాన మంత్రి తెలిపారు.
మంటల్లో చిక్కుకున్న బార్ ముందు ద్వారం నుంచి ప్రజలు బయటకు పరుగులు తీస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు.
అర్ధరాత్రి బార్లో మంటలు చెలరేగిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది.
బార్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతుండగా ప్రజలు బయటకు పరుగులు తీస్తున్నట్లు ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వీడియోల్లో కనిపిస్తోంది.
కొందరు కేకలు వేస్తుండగా, మరికొందరు కింద పడిపోయారు. ఇద్దరు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలున్న వీడియోలు ఆన్ లైన్లో కనిపించాయి.

ఇప్పటివరకు 27 మృతదేహాలను వెలికితీశామని, మరికొందరిని ఆసుపత్రికి తరలించామని ప్రధాన మంత్రి అనుటిన్ చార్న్విరాకుల్ తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
అగ్నిమాపక సిబ్బంది సుమారు అరగంటలో మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే చాలా నష్టం జరిగింది.
మరణించిన 27 మందిలో తొమ్మిది మంది పురుషులు, 18 మంది మహిళలు ఉన్నారని 60 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మీడియా కథనాలు వెల్లడించాయి.
కొంతమంది ఆచూకీ తెలియలేదని థాయ్ వార్తా సంస్థ థైరాత్ తెలిపింది.

ఫొటో సోర్స్, Fire & Rescue Thailand
బార్లో ప్రదర్శన ఇస్తున్న ఒక సంగీతకారుడిని మంటలు ప్రారంభమైనప్పుడు ఏమి జరిగిందని తాను అడిగానని ప్రధానమంత్రి చెప్పారు.
"అతను, కట్-అవుట్ స్విచ్ వద్ద మంటలు చెలరేగాయని ఆ తర్వాత పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయని చెప్పారు. పేలుళ్లు జరిగాయి. పొగ, మంటల నుంచి తప్పించుకోవడానికి అందరూ పారిపోవడానికి ప్రయత్నించారు" అని అతను చెప్పారని ప్రధానమంత్రి అన్నారు.
"వారిలో చాలామంది బయటకు రాలేకపోయారు. ఎందుకంటే వాళ్లు భవనం వెనుక భాగానికి వెళ్లి మంటల నుంచి కాపాడుకునేందుకు టాయిలెట్లో దాక్కునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఎక్కువ మృత దేహాలు కనిపించాయి" అని అనుటిన్ వివరించారు.
స్థానికంగా రోంగ్ బీర్ నా లాట్ ఫ్రావోగా పిలిచే ఈ బార్ బ్యాంకాక్‌లోని చాటుచాక్ జిల్లాలో ఉంది. అది ఆ ప్రాంతంలో ప్రముఖ రెస్టారెంట్, వినోద కేంద్రమని థాయ్ వార్తా సంస్థ డైలీ న్యూస్ నివేదించింది.
మంటలను అదుపులోకి తీసుకువచ్చిన తర్వాత తీసిన దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయి. బార్ వెలుపల అనేక మృతదేహాలను వరుసగా ఉంచారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
బార్ లోపల ఫర్నిచర్, గోడలు పైకప్పు పూర్తిగా కాలిపోయి నల్లగా మారిపోయాయి. పైకప్పులోని కొన్ని భాగాలు ఊడిపోయాయి.

ఫొటో సోర్స్, APTN
బ్యాంకాక్ గవర్నర్ చట్చార్ట్ సిట్టిపుంట్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. బార్లో డెకరేషన్స్ వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని ఆయన చెప్పారు.
"మిఠాయిలు, ఇతర వస్తువులను విక్రయించేందుకు టేబుళ్లను ఏర్పాటు చేశారు. మంటలు చెలరేగాక లోపల ఉన్న వాళ్లు త్వరగా బయటకు వెళ్లేందుకు వీల్లేకుండా అవి అడ్డుగా ఉన్నాయి" అని ఆయన డైలీ న్యూస్‌కు తెలిపారు.
"ఈ విషయంపై ఫోరెన్సిక్ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 23:30 సమయంలో అటు వైపుగా వెళుతున్న ఓ డ్రైవర్ బార్లో మంటలు ఎగసిపడుతుండటాన్ని చూసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
మంటలు చూసిన వెంటనే కిటికీలను పగులగొట్టానని, ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చేందుకు సాయం చేశానని ఆయన డైలీ న్యూస్‌కు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























