దిల్లీ నిరసనలు: పెల్లెట్ గన్ అంటే ఏంటి, ఎందుకు వివాదాస్పదంగా మారింది?

పెల్లెట్ గన్, దిల్లీ నిరసనలు
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

కాక్రోచ్ జనతా పార్టీ 'పార్లమెంట్ మార్చ్' సమయంలో సోమవారం జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాల చేసిన లాఠీచార్జ్‌లో పలువురు నిరసనకారులు గాయాలు పాలయ్యారు.

మరోవైపు, నిరసనకారులు చేసిన హింసలో చాలామంది పోలీసులు కూడా గాయపడ్డారని దిల్లీ పోలీసులు చెప్పారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 21 ఏళ్ల విద్యార్థిని ప్రస్తుతం దిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందారు, రెండు రోజుల కిందటే దీన్ని తొలగించారు.

ఆస్పత్రి విడుదల చేసిన మెడికల్ బులిటెన్‌ ప్రకారం.. ఆమె స్పృహలోకి వచ్చారు, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది. అయితే, ఇంకా క్రిటికల్ కేర్ అవసరమని బులిటెన్ తెలిపింది.

ఈ వార్తలన్నింటినీ నేపథ్యంలో.. నిరసనకారులకు వ్యతిరేకంగా పెల్లెట్ గన్‌లు వాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గాయపడ్డ వ్యక్తికి సంబంధించిన ఒక వీడియోను కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ జూలై 20 రాత్రి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు.

''దిల్లీ పోలీసుల దుశ్చర్య. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పెల్లెట్ గన్‌లు వాడుతున్నారు'' అని సౌరవ్ దాస్ 'ఎక్స్'లో రాశారు.

రాహుల్ గాంధీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

రాహుల్ గాంధీ, దిల్లీ నిరసనలు, పెల్లెట్ గన్, సాహిల్

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, సాహిల్‌తో పాటు రాహుల్ గాంధీ

సమస్యను లేవనెత్తిన రాహుల్ గాంధీ

సాహిల్ అనే యువకుడిని శుక్రవారం మీడియా ముందుకు తీసుకువచ్చారు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

‘‘జూలై 20న దిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న 19 ఏళ్ల సాహిల్‌పై దిల్లీ పోలీసులు పెల్లెట్ గన్‌తో ముఖంపై దాడి చేశారు" అని ఆయన అన్నారు.

''దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సాహిల్. కానీ, తన కుటుంబాన్ని పోషించేందుకు పార్ట్-టైమ్‌గా కారును కూడా నడుపుతున్నారు. 2025లో ఎస్ఎస్‌సీ దిల్లీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌ పేపర్ లీక్‌లో ఈయన బాధితుడు'' అని రాహుల్ గాంధీ తెలిపారు.

''మేం సాహిల్ తరఫున నిలబడతాం. జవాబుదారీతనం కోరుతున్న ప్రతి విద్యార్థి కోసం మేం అండగా నిలుస్తాం. మోదీ జీ, మీ పాపానికి ఈ దేశ పిల్లలకు క్షమాపణ చెప్పండి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి, ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే తొలగించండి'' అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

దిల్లీ నిరసనలు, పెల్లెట్ గన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, 2019 మే నెలలో ఒక శుక్రవారం రోజు శ్రీనగర్ ఓల్డ్ సిటీలోని జామా మసీదు వెలుపల జరిగిన ఘర్షణల సమయంలో నిరసనకారులపైకి ఒక పోలీసు పెల్లెట్ గన్‌ను గురిపెట్టారు (ఫైల్ ఫోటో).

పెల్లెట్ గన్ అంటే ఏంటి?

సౌరవ్ దాస్ చేసిన పోస్టుపై స్పందించిన డీసీపీ (న్యూదిల్లీ),''శాంతియుతంగా నిరసన చేస్తోన్న వారిపై పోలీసు బలగాలు పెల్లెట్ గన్‌లు వాడుతున్నారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం, తప్పుదోప పట్టించేవి'' అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.

''ధృవీకరించని సమాచారాన్నిషేర్ చేయవద్దని, వ్యాప్తి చేయవద్దని ప్రజలకు సూచిస్తున్నాం. సమాచారాన్ని పోస్ట్ చేసే లేదా ఫార్వార్డ్ చేసే ముందు, దయచేసి అధికారిక సోర్సుల నుంచి వాస్తవాలను ధృవీకరించుకోండి'' అని సూచించారు.

అయితే, సోమవారం జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో పెల్లెట్ గన్‌లను ఉపయోగించినట్లు ఇప్పుడు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

పెల్లెట్ గాయాలతో కనీసం ముగ్గురు వ్యక్తులు దిల్లీ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు ఆ కథనాలు చెబుతున్నాయి.

అయితే, పెల్లెట్ గన్ అంటే ఏమిటి? దాని చుట్టూ ఎందుకింత వివాదం?

ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహంతో ఉండే గుంపులను నియంత్రించడానికి పోలీసులు, సైన్యాలు ఉపయోగించే ప్రాణహాని లేని పద్ధతులలో పెల్లెట్ గన్‌లు ఉన్నాయి.

ఇతర చర్యలలో టియర్ గ్యాస్, నీటి ఫిరంగులు, పెప్పర్ స్ప్రే, టేజర్ గన్‌లు ఉన్నాయి.

పెల్లెట్ గన్ అనేది ప్రాథమికంగా గాలితో పనిచేసే ఒక ఆయుధం. ఇది చిన్న లోహపు లేదా ప్లాస్టిక్ గుళ్లను పేలుస్తుంది.

వీటిని కొన్నిసార్లు జన సమూహాలను నియంత్రించడానికి భద్రతా సిబ్బంది ఉపయోగిస్తారు. వీటిని సాధారణంగా క్రీడలలో, కీటక నియంత్రణలో కూడా వాడతారు.

మూడు రకాల పెల్లెట్ గన్‌లు ఉంటాయి.

మొదటిది ఎయిర్ పిస్టల్స్. ఈ హ్యాండ్‌గన్‌లు స్ప్రింగ్‌లను, గ్యాస్‌ను, కార్బన్ డయాక్సైడ్‌ను వాడతాయి.

ఇక రెండోది ఎయిర్ రైఫిల్. మెరుగైన కచ్చితత్వంతో ఉండే పొడవైన గొట్టం ఉన్న తుపాకులు. చిన్న చిన్న జంతువుల వేటకు లేదా ఇతర క్రీడలకు ఉపయోగిస్తారు.

మూడోది గుంపును నియంత్రించే షాట్‌గన్‌లు. భద్రతా బలగాలు ఉపయోగించే 12 గేజ్ పంప్-యాక్షన్ ఆయుధాలు ఇవి. చిన్న చిన్న పెల్లెట్లతో నింపిన కాట్రిడ్జ్‌లను పేల్చుతాయి.

సాధారణంగా వాడే తుపాకులకు ఇవి భిన్నంగా ఉంటాయి. గన్‌పౌడర్‌ పేలుడుకు బదులుగా కంప్రెస్డ్ ఎయిర్‌ను వాడతారు.

ఈ మార్పులు చేసిన 'పంప్-యాక్షన్' ఆయుధాల నుంచి సీసం, లోహం లేదా రబ్బరుతో తయారు చేసిన చిన్న పెల్లెట్స్ కూడిన కాట్రిడ్జ్‌లను కాల్చుతారు.

ఇవి దేనినైనా తాకినప్పుడు వేగంగా ముక్కలవుతాయి, తీవ్రమైన గాయాలను కలిగిస్తాయి. ఆ పెల్లెట్ వ్యక్తికి తగిలితే అంధత్వానికి కూడా దారితీయవచ్చు.

ఇవి 500 గజాల వరకు స్వల్ప దూరంలో బాగా పనిచేస్తాయి. కానీ, చాలా దగ్గర నుంచి కాల్చితే, ముఖ్యంగా కళ్ల వంటి సున్నితమైన అవయవాలకు తగిలితే ప్రాణాంతకం కావచ్చు. ఈ పెల్లెట్లు శరీరంలోని మృదువైన కణజాలాల్లోకి చొచ్చుకుపోగలవు.

జూలై 20న ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీఆర్‌పీఎఫ్ విచారణకు ఆదేశించిందని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' రిపోర్టు చేసింది.

రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలు నిజంగా నిరసనకారులపై పెల్లెట్ గన్‌లను వాడాయా? లేదా? అన్నది విచారిస్తోంది.

ఆర్ఏఎఫ్ అనేది సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఒక ప్రత్యేక విభాగం. అల్లర్లను ఎదుర్కొనేందుకు 1992లో దీన్ని ఏర్పాటు చేశారు.

పెల్లెట్ గన్

పెల్లెట్ గన్‌ల వల్ల ప్రజలకు గాయాలు

జూలై 20 నిరసనల తర్వాత, భద్రతా బలగాల చర్యలతో పెల్లెట్ గన్‌ల బారిన పడి ముగ్గురు వ్యక్తులు గాయాలు పాలయ్యారని తెలిసింది.

వారిలో గురుగావ్‌లో పనిచేసే 25 ఏళ్లు ఇర్షాద్‌ షేక్ ఒకరు. ప్రస్తుతం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. మరొకరు 19 ఏళ్ల దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సాహిల్ లోచాబ్. మూడో వ్యక్తి అవుట్‌లుక్ మ్యాగజీన్‌లో పనిచేసే 28 ఏళ్ల జర్నలిస్ట్.

నిరసనకారులపై పెల్లెట్ గన్‌లు వాడారనే ఆరోపణలను దిల్లీ పోలీసులు ఖండిస్తున్నారు. కానీ, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సామాగ్రిలో పెల్లెట్ గన్‌లు, షాక్ బ్యాటన్లు ఉన్నాయి.

ఈ సీఆర్‌పీఎఫ్ యూనిట్‌కు చెందిన భద్రతా సిబ్బందిని జూలై 20న పోలీసులతో పాటు మోహరించారు. వీరు ఇప్పటికీ జంతర్ మంతర్ వద్ద మోహరించి ఉన్నారు.

ది హిందూ పత్రికలోని ఒక నివేదిక ప్రకారం, సోమవారం పాలికా బజార్ సమీపంలో ఇర్షాద్‌పై ఒక ఆర్‌ఏఎఫ్ అధికారి దాడి చేశారు. ఆయన ముఖం, శరీరంపై సుమారు 30-40 గాయాలయ్యాయని ఆయన స్నేహితుడు తెలిపారు. వీటిలో మెడపై ఉన్న గాయంతో సహా నాలుగు గాయాలు చాలా తీవ్రంగా ఉండటంతో ఆయనకు సర్జరీ అవసరమైంది.

ది హిందూ పత్రికలోని మరో నివేదిక ప్రకారం, పంజాబ్-హరియాణా సరిహద్దులోని ఖనౌరి, శంభు సరిహద్దుల వద్ద 2024లో జరిగిన రైతుల నిరసనల సమయంలో చివరిసారిగా పెల్లెట్ గన్‌లను ఉపయోగించారు.

పోలీసులు అప్పట్లో పెల్లెట్ గన్‌ల వాడకాన్ని ఖండించినప్పటికీ, చాలా మంది గాయపడ్డారని రైతు నాయకులు ఆరోపించారు.

2023లో, మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ విషయంలో పోరాడిన నిరసనకారులపై ఈ తుపాకులను ఉపయోగించడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో, 2016లో జమ్మూ కశ్మీర్‌లో పెల్లెట్ గన్‌లను ఉపయోగించడం వల్ల చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.

సౌరవ్ దాస్

ఫొటో సోర్స్, ANI

సాహిల్ లోచాబ్ ఎలా ఉన్నారు?

దిల్లీ నిరసనల్లో పెల్లెట్ గన్‌ వల్ల గాయపడిన మరో వ్యక్తి సాహిల్ లోచాబ్. ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో చేరిన సాహిల్ లోచాబ్ తన కుడి కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఆయనకి మంగళవారం సర్జరీ జరిగింది.

లోచాబ్ శరీరంలోని కుడి భాగమంతా ''పెల్లెట్ గాయాలతో'' ఇబ్బంది పడుతోందని సీనియర్ ఎయిమ్స్ అధికారులు చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.

''ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి నిలకడగా ఉంది. పెయిన్ కిల్లర్లు ఇస్తున్నాం. ఆయన దృష్టి లోపం విషయానికొస్తే, ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితిలో ఏదైనా ఒక నిర్ధరణకు రావడం తొందరపాటు అవుతుంది. ఆయనకు సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందిస్తున్నాం'' అని అధికారులు తెలిపారు.

దిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్‌లో విద్యార్థి అయిన లోచాబ్, పేపర్ లీక్ కారణంగా రద్దు అయిన 2024 దిల్లీ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యారు. ఆ పరీక్ష రద్దు కావడంతో తీవ్ర "నిరాశకు" గురయ్యానని, అందుకే జూలై 20 నిరసనలో చేరానని చెప్పారు.

పెల్లెట్ల దాడిలో గాయపడిన మూడో వ్యక్తి అవుట్‌లుక్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. జంతర్ మంతర్ వద్ద జరిగిన పెల్లెట్ దాడిలో ఆయన గాయపడినట్లు జూలై 22 నాటి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి మెడికల్ రిపోర్టు పేర్కొంది.

ఈ రిపోర్టు ప్రకారం ఆయన కుడి చేయి, ఛాతీ, వీపుపై చిన్న గాయాలు ఉన్నాయని, వైద్యులు ఈ గాయాలను "పెల్లెట్ గాయాలను పోలి ఉన్నాయని" పేర్కొన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)