‘ఇది ఎమర్జెన్సీ కంటే దారుణం’ : పోలీసుల అదుపులో మమత, కేజ్రీవాల్

ఫొటో సోర్స్, SaketGokhale/ArvindKejriwal
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
"మమతా దీదీ సహా మమ్మల్ని ఐదుగురిని, దీదీ నివాసం బయట దిల్లీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యాన్‌లో ఎక్కించారు. మమ్మల్ని ఏదో గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకువెళ్తున్నారు. భారత్‌లో ఇది ప్రజాస్వామ్య మరణమే" అని సాకేత్ గోఖలే పోస్ట్ చేశారు.
‘మమతా బెనర్జీతో పాటు టీఎంసీలోని ఇతర నాయకులు సౌత్ అవెన్యూలోని బస్ స్టాండ్ వద్ద నిరసన నిర్వహించారు. అనంతరం దిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు’ అని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.
"మేం జంతర్ మంతర్‌కు వెళ్లాలనుకున్నాం. కానీ మమ్మల్ని వెళ్లనివ్వలేదు. ఈ పరిస్థితి ఎమర్జెన్సీ కంటే కూడా దారుణంగా ఉన్నట్లు అనిపిస్తోంది" అని అదుపులోకి తీసుకోడానికి ముందు మమతాబెనర్జీ వ్యాఖ్యానించారు.
మరోపక్క తన పార్టీ నాయకులతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ వైపు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
"దేశ యువత మేల్కొంది. మోదీ నియంతృత్వానికి మేం భయపడబోం. ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే. ఓట్ల చోరీ ఆరోపణలను ప్రజలు ఇకపై సహించరు" అని పోలీసులు అదుపులోకి తీసుకున్నతర్వాత విడుదల చేసిన వీడియోలో అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
వీడియోలో పోలీసులు ఆయన్ను తీసుకెళ్లడం కనిపిస్తోంది.
"సిగ్గులేని దిల్లీ పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌పై దాడి చేశారు" అని సౌరభ్ భరద్వాజ్ ‘ఎక్స్’లో రాశారు.
ఈ వీడియోలో కేజ్రీవాల్‌తో పాటు రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా కనిపిస్తున్నారు.




















