అటకపై దాచిన పోకీమాన్ కార్డులకు వేలంలో దాదాపు రూ.20 కోట్లు వచ్చాయి

ఫొటో సోర్స్, Ewbank's
- రచయిత, జోషువా ఆస్క్యూ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఇంట్లోని అటకపై 15 ఏళ్లుగా దాచిన పోకీమాన్ కార్డులను వేలంలో విక్రయించిన రిటైర్డ్ డెకరేటర్ ఒకరు కోటీశ్వరుడయ్యారు.
ఇంగ్లండ్‌లోని వోకింగ్కు చెందిన ఈ వ్యక్తికి తన దగ్గర ఉన్న పోకీమాన్ కార్డులకు అంత విలువ ఉంటుందని తెలియదు.
అయితే, వేలంలో ఒక పోకీమాన్ కార్డు 6,000 పౌండ్ల (సుమారు 7.6 లక్షలు)కు పైగా ధర పలికిందని స్థానిక వార్తాపత్రికలో చదివిన తర్వాత ఆయనకు వాటి విలువ తెలిసింది.
బుధవారం సర్రేలోని ఎవ్బ్యాంక్స్ వేలం సంస్థ నిర్వహించిన వేలంలో ఆయన సేకరించిన కార్డులు 1.56 మిలియన్ పౌండ్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 19.8 కోట్లు) అమ్ముడయ్యాయి.
బ్రిటన్‌లో ట్రేడింగ్ కార్డుల వేలంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక మొత్తం ఇదేనని ఎవ్బ్యాంక్స్ పేర్కొంది. ఐరోపాలోనూ ఇదే రికార్డు అయి ఉండొచ్చని అభిప్రాయపడింది.
తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ వ్యక్తి మాట్లాడుతూ, ''ఇంటి అటకపై నిధి దొరికిందని చాలామంది చెబుతుంటారు. నా విషయంలో అది అక్షరాలా నిజమైంది'' అని అన్నారు.

''1990ల చివర్లో నా కుమారుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు పోకీమాన్ కార్డులను సేకరించడం ప్రారంభించాడు. స్కూల్లో తన స్నేహితులతో వాటిని మార్చుకునేవాడు. ఆ కార్డులు చూడటానికి బాగున్నాయని నాకనిపించింది. వాటిని కొనుగోలు చేయడం మంచి పెట్టుబడి అవుతుందేమోనని ఆలోచించాను. నా కుమారుడి దగ్గర అతడి కార్డులు ఉండేవి. కానీ, నేను సేకరించిన కార్డులను మాత్రం అతడు ఎప్పుడూ ముట్టుకోలేదు. ఇప్పుడు అది మంచిదైందని అనిపిస్తోంది'' అని ఆయన చెప్పారు.
పోకీమాన్ అనేది జపాన్‌కు చెందిన ప్రముఖ ఫ్రాంచైజీ. ట్రేడింగ్ కార్డులు, వీడియో గేమ్స్, యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్‌లతో ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
మలేసియాకు చెందిన ఒక వ్యక్తి నుంచి ఈబే ద్వారా కొన్ని పూర్తి పోకీమాన్ కార్డుల సెట్లను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.
అప్పట్లో 300 పౌండ్లకు కొనుగోలు చేసిన ఒక సెట్ బుధవారం జరిగిన వేలంలో ఏకంగా 75 వేల పౌండ్ల ధర పలికింది.
కార్డులన్నింటినీ ప్రత్యేకంగా తయారు చేసిన పోకీమాన్ బైండర్లలో, వాటి సీల్స్ తొలగించకుండా భద్రపరిచారు. పోకీమాన్పై కుమారుడికి ఆసక్తి తగ్గిపోవడంతో వాటిని ఇంట్లోని అటకపై పెట్టేసినట్లు చెప్పారాయన.
ప్రపంచవ్యాప్తంగా వేలంలో పాల్గొన్న కొనుగోలుదారులు
ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న 42 కార్డుల సెట్లను తీసుకొచ్చి చూపించినప్పుడు తాము ఆశ్చర్యపోయామని ఎవ్బ్యాంక్స్ తెలిపింది.
''ఆయన దగ్గర ఉన్న కార్డులను చూసి మేం నమ్మలేకపోయాం. అవన్నీ కొత్తవాటిలా అద్భుతమైన స్థితిలో ఉన్నాయి'' అని ఆ సంస్థ ట్రేడింగ్ కార్డుల విభాగాధిపతి జేమ్స్ స్పూనర్ చెప్పారు.
తమ సంస్థ 30 ఏళ్లకు పైగా నిర్వహించిన వేలాల్లో ఇదే అత్యంత విజయవంతమైనదని ఎవ్బ్యాంక్స్ పేర్కొంది.
ఈ వేలంలో అత్యధిక ధర పలికిన సెట్ 'లెజెండరీ కలెక్షన్ కంప్లీట్ మాస్టర్ సెట్'. ఇందులో దాదాపు కొత్తదానిలా ఉన్న చారిజార్డ్ కార్డు కూడా ఉంది.
ఈ సెట్ 15 వేల నుంచి 20 వేల పౌండ్ల వరకు ధర పలుకుతుందని తొలుత అంచనా వేశారు. అయితే, వేలంలో ఏకంగా లక్ష పౌండ్లకు అమ్ముడైంది.
ఎవ్బ్యాంక్స్ సంస్థను నిర్వహిస్తున్న ఆండ్రూ ఎవ్బ్యాంక్ స్వయంగా ఈ వేలాన్ని నిర్వహించారు.
''ఈ వేలంపై ముందుగానే విపరీతమైన ఆసక్తి నెలకొంది. వేలం జరిగిన రోజు కూడా ఆ అంచనాలకు తగ్గట్టుగానే స్పందన వచ్చింది'' అని ఆయన చెప్పారు.
''ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి కొనుగోలుదారులు వేలంలో పాల్గొన్నారు. వేలం జరిగినంతసేపూ ఉత్సాహభరితమైన వాతావరణం కనిపించింది. ముఖ్యంగా ఈ కార్డుల సేకరణను చూసి సేకరణకర్తలు(కలెక్టర్) ఆశ్చర్యపోయారు. ఇంత విస్తృతమైన సేకరణ, పూర్తి సెట్లు, అత్యంత అరుదైన కార్డులు.. ఇలా ఒక కలెక్టర్ కోరుకునే దాదాపు అన్నీ ఇందులో ఉన్నాయి'' అని వివరించారు.

ఫొటో సోర్స్, Ewbank's
'దాచిపెట్టడం మంచిదేమో'
''ఈ వేలం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది'' అని ఆండ్రూ ఎవ్బ్యాంక్ బీబీసీతో చెప్పారు.
ప్రస్తుతం పోకీమాన్కు విపరీతమైన ఆదరణ ఉందని ఆయన తెలిపారు.
పోకీమాన్ తొలిసారి వచ్చినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవారు ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్నారని చెప్పారు. వారిలో కొందరికి తమ ఇష్టాల కోసం ఖర్చు చేయగల ఆర్థిక స్థోమత ఉందని వివరించారు.
''చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అప్పటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకోవాలనే ఆసక్తి వారిలో ఉంది'' అన్నారు.
ఇళ్లలోని అటకలపై విలువైన వస్తువులు ఉన్నాయని భావించేవారు వాటిని బయటకు తీసి నిపుణులతో పరిశీలన చేయించాలని ఆండ్రూ ఎవ్బ్యాంక్ సూచించారు.
''ఈ వ్యక్తి విషయంలో జరిగినట్లుగానే మీరు మీ కుమారుడి కోసం ఏదైనా కొన్నప్పుడు అతడికి అది అవసరం లేదనిపిస్తే, దాన్ని భద్రంగా దాచిపెట్టడం మంచిదేమో. భవిష్యత్తులో దానికి ఎంత విలువ వస్తుందో ఎవరికి తెలుసు?'' అని అన్నారు.
ఎవ్బ్యాంక్స్ ప్రకారం, ఈ పోకీమాన్ కార్డుల సేకరణ వేలంలో వచ్చిన మొత్తం గత రికార్డును అధిగమించింది.
అక్టోబర్ 9న లండన్‌లో స్టాన్లీ గిబ్బన్స్ నిర్వహించిన వేలంలో మొత్తం 8.72 లక్షల పౌండ్ల విలువైన విక్రయాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు అదే అత్యధిక మొత్తం కాగా, తాజాగా జరిగిన వేలం ఆ రికార్డును అధిగమించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































