చెమ్మణి సామూహిక సమాధి: ఒకే చోట దొరికిన 583 అస్థిపంజరాలు ఎవరివి? ‘నరమేధానికి గురైన’ తమిళులవా.. అంటువ్యాధితో మరణించినవారివా?

శ్రీలంక, జాఫ్నా, చెమ్మణి
ఫొటో క్యాప్షన్, చెమ్మణి ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న అధికారులు
    • రచయిత, జే పరనీతరణ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

శ్రీలంకలోనే అత్యంత పెద్దదిగా భావించే చెమ్మణి సామూహిక సమాధి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. జాఫ్నాలోని ఈ సమాధిని 2025 ఫిబ్రవరిలో గుర్తించారు. అప్పటికే ఉన్న చెమ్మణి సిద్ధుపాథి హిందూ శ్మశానవాటికలో అభివృద్ధి పనులు చేస్తుండగా ఇది వెలుగులోకి వచ్చింది.

అనంతరం కోర్టు ఆదేశాలతో అక్కడ వరుసగా మూడు దశల్లో 110 రోజులపాటు తవ్వకాలు చేపట్టారు. ఇందులో ఆగస్టు 19 వరకు 583 అస్థిపంజరాలు బయటపడ్డాయి.

శ్రీలంకలోనే ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, ప్రొఫెసర్ రాజ్ సోమదేవ్ ఆధ్వర్యంలోని బృందం ఈ తవ్వకాలు చేపట్టింది.

ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలోనే కాకుండా ఇతర ప్రదేశాల్లోనూ అస్థిపంజరాలు ఉంటాయనే అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి.

అందుకే తవ్వకాలు కొనసాగించాలని.. యుద్ద సమయంలో అదృశ్యమైన వారి బంధువులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

తవ్వకాలు ఆపొద్దని, అనుమానాస్పదంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాలని కోరుతున్నారు.

కోర్టు ఇచ్చిన అనుమతి ఆగస్టు 19తో ముగియడం, పనులకు నిధుల కేటాయింపు లాంటి వివిధ కారణాలతో తవ్వకాలు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తవ్వకాలపై మధ్యంతర నివేదిక ఏం చెబుతోంది?

చెమ్మణి సామూహిక సమాధి కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. అక్టోబర్ 19న జరిగిన విచారణ సందర్భంగా ప్రొఫెసర్ రాజ్ సోమదేవ తన మధ్యంతర నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు.

ఆ నివేదికలో "చెమ్మణి సమాధిలో సామూహిక ఖననాలకు.. ఏదైనా అంటువ్యాధి లేదా ప్రకృతి విపత్తు కారణం కావచ్చు. ఇక్కడ మతపరమైన అంత్యక్రియలకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు కూడా లభించాయి" అని ఆయన పేర్కొన్నారు.

"ఇప్పటివరకు లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా చూస్తే, 'రెడ్ గ్రేవ్' ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో గుర్తించిన వివాదాస్పద మానవ సమాధుల కంటే భిన్నంగా ఉంది. ముఖ్యంగా, ఇది సరైన పద్ధతిలో నిర్వహించే అంత్యక్రియల మాదిరిగానే ఉన్నాయి. సమాధిలో మృతదేహాలు ఎక్కువగా ఉండటం వల్ల ఏ పరిస్థితుల్లో ఖననం చేశారనే విషయాన్ని కచ్చితంగా నిరూపించడం సాధ్యం కాదు. దీనిని ధృవీకరించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు లేవు" అని నివేదికలోని ప్రధానాంశం.

చెమ్మణి సమాధి ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో అస్థిపంజరాలు లభించడానికి అంటువ్యాధి లేదా ప్రకృతి విపత్తు కారణమై ఉండొచ్చని నివేదిక చెబుతోంది. అలాంటి పరిస్థితుల్లో మృతదేహాలను త్వరగా ఖననం చేయాల్సిన అవసరం వచ్చి ఉండొచ్చు. అంత్యక్రియలకు సంబంధించిన వస్తువులు ఎక్కువగా కనిపించకపోవడానికి కూడా ఇదే కారణం కావచ్చు. అక్కడ అసాధారణ అంత్యక్రియలు నిర్వహించినట్టు ఇప్పటివరకు లభించిన కొన్ని ఆనవాళ్లు చెబుతున్నాయి.

అయితే, చెమ్మణి సమాధిలో లభించిన వ్యక్తులు ఎప్పుడు మరణించారు? చనిపోవడానికి కారణాలేంటి? ఏ పరిస్థితుల్లో పాతిపెట్టారు? లాంటి ప్రశ్నలకు మధ్యంతర నివేదికలో సమాధానాలు లభించలేదు. అందుకే అంటువ్యాధులు లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇలా జరిగి ఉంటుందనే చర్చ మొదలైంది. అక్కడ చట్టవిరుద్ధమైన హత్యలు జరిగి ఉండే అవకాశాన్ని ఈ నివేదిక పూర్తిగా కొట్టిపారేయలేదు.

శ్రీలంక, జాఫ్నా, చెమ్మణి
ఫొటో క్యాప్షన్, పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ రాజ్ సోమదేవ

ప్రస్తుత వివాదాస్పద నివేదిక నేపథ్యం ఏంటి?

ప్రొఫెసర్ రాజ్‌ సోమదేవ్ ఆధ్వర్యంలోని పురావస్తు శాస్త్రవేత్తల బృందం జరిపిన తవ్వకాల్లో వెలికితీసిన 583 అస్థిపంజరాల్లో 150 అస్థిపంజరాలను, వాటితో లభించిన ఆధారాలను పరిశీలించి మధ్యంతర నివేదిక రూపొందించారు.

ఈ నివేదికను ఆగస్టు 19న కోర్టుకు సమర్పించారు.

గతంలో అంటే 2025 జూలై 15న ఒక మధ్యంతర నివేదికను సమర్పించారు.

చెమ్మణిలో వెలుగు చూసిన సామూహిక సమాధి ప్రదేశంలో నేరపూరిత ఘటనల ఆనవాళ్లు ఉన్నాయని నమ్ముతున్నట్టు అభిప్రాయపడ్డారు.

అక్కడ లభించిన అస్థిపంజరాలు పరిశీలిస్తే మృతదేహాలను సాధారణస్థితిలో ఖననం చేసినట్టు కనిపించడం లేదని చెప్పారు.

చెమ్మణి అస్థిపంజర అవశేషాల ప్రదేశం, వాటిని పాతిపెట్టిన లోతును బట్టి చూస్తే, చట్ట విరుద్ధమైన హత్యలు జరిగి ఉండే అవకాశం ఉందని శ్రీలంక మానవ హక్కుల సంఘం 2025 సెప్టెంబర్‌లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

అయితే, దీనిపై ఖచ్చితమైన నిర్ణయానికి రావాలంటే మరిన్ని విచారణలు అవసరమని కూడా ఆ నివేదిక నొక్కి చెప్పింది.

గతేడాది నివేదికతో పోలిస్తే తాజా నివేదికలో ఉన్న ప్రధాన వ్యత్యాసాలు అదృశ్యమైన వారి బంధువుల్లోనూ, దీనిపై పని చేస్తున్నవారిలో కలకలం రేపాయి.

ఈ విరుద్ధమైన నివేదికలు దర్యాప్తు విశ్వసనీయతపై అనుమానాలు కలిగిస్తున్నాయని, నిరాశకు కారణమవుతున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు ఈ నివేదికలు స్థానిక మీడియా, సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది.

శ్రీలంక, జాఫ్నా, చెమ్మణి
ఫొటో క్యాప్షన్, ఎంపీ శివజ్ఞానం శ్రీధరన్

ఈ నివేదికపై ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు?

"చెమ్మణి సమాధి స్థలం అనేది తమిళుల చరిత్రలోనే అతిపెద్ద నరమేధానికి నిదర్శనం. అక్కడ లభించిన అస్థిపంజరాల్లో చాలా వరకు నలిగిపోయి ఉన్నాయని, పుర్రెలు పగిలి, ఎముకలు ముక్కలై ఉన్నాయని, అంతేకాకుండా హింసకు గురైనట్లు ఆధారాలు ఉన్నాయని గత అధ్యయనాలు వెల్లడించాయి" అని ఇళంకై తమిళ అరసు కచ్చి ఎంపీ శివజ్ఞానం శ్రీధరన్ బీబీసీ తమిళ్‌తో అన్నారు.

" లభించిన అస్థిపంజరాలకు దుస్తులు, ఆభరణాలు లేవు. ప్రొఫెసర్ కొత్త నివేదికలో చెప్పినట్టు, ప్రకృతి వైపరీత్యం వల్లనో లేదా అంటువ్యాధి వల్లనో మృతులు పూడ్చిపెట్టి ఉంటే, వారందరినీ దుస్తులు లేకుండా ఎలా పూడ్చిపెడతారు? మృతదేహాలను బట్టలు, ఆభరణాలు లేకుండా పూడ్చిపెట్టడం తమిళ సంస్కృతి, ఆచారం కాదు. ఇలాంటి నమ్మశక్యంకాని, విరుద్ధమైన నివేదికల కారణంగానే సింహళ జాతీయవాద వ్యవస్థలో తమిళులకు న్యాయం జరగదని మొదటి నుంచి చెబుతూ వస్తున్నాం. అందుకే అంతర్జాతీయ దర్యాప్తును డిమాండ్ చేస్తున్నాం" అని ఆయన అన్నారు.

అస్థిపంజరాలతోపాటు దుస్తులు కనిపించకపోవడానికి కూడా ప్రొఫెసర్ రాజ్ సోమదేవ్ తన నివేదికలో ప్రత్యేక నోట్ పెట్టారు.

అంతేకాకుండా "చెమ్మణి తవ్వకాల ద్వారా బయటపడిన మానవ అస్థిపంజరాల వద్ద, దుస్తులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే, దుస్తులు లేవన్నంత మాత్రాన మరణించిన వారిని నగ్నంగానే ఖననం చేశారని భావించకూడదు. దుస్తులు సహా ఇతర వస్తువులు త్వరగానే భూమిలో కలిసిపోతాయి. ఇవి ఎంతవరకు భద్రంగా ఉంటాయనేది, చుట్టూ ఉన్న నేల స్వభావం, తేమ స్థాయి, సూక్ష్మజీవుల యాక్టివిటీ, ఖననం చేసినప్పటి నుంచి గడిచిన కాలం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది" అని ఆ నోట్‌లో ఉంది.

శ్రీలంక, జాఫ్నా, చెమ్మణి
ఫొటో క్యాప్షన్, చెమ్మణి సమాధుల తవ్వకం జరుగుతున్న ప్రదేశంలో న్యాయవాది వి.ఎస్. నిరంజన్ (మధ్యలోని వ్యక్తి)

కొన్ని కేసుల్లో మానవ అస్థిపంజరాలతోపాటు బటన్లు, బటన్‌హోల్ రింగులు, చిన్న లోహపు సాధనాలు లభించాయి. ఖననం చేసే సమయంలో కనీసం కొంతమందైనా బట్టలు ధరించి ఉన్నారని చెప్పడానికి ఇవి బలమైన సాక్ష్యాలు. అందువల్ల, చెమ్మణిలో దుస్తుల అవశేషాలు లభించకపోవడాన్ని, ఖననం చేసే సమయంలో బట్టలు లేవనడానికి కచ్చితమైన సాక్ష్యంగా పరిగణించకూడదు. కాలక్రమేణా అవశేషాలు నశించిపోవడం వల్ల ఇలా జరిగి ఉంటుంది" అని అందులో పేర్కొన్నారు.

తప్పిపోయిన వారి కుటుంబీకుల సంఘం చీఫ్.. తన కుమారుడి కోసం వెతుకుతున్న తల్లి అయిన కతిర్కామనథన్ కోకిలవాణి ఈ నివేదికపై బీబీసీ తమిళ్‌తో మాట్లాడారు. "ప్రొఫెసర్ చెప్పినట్లుగా, ఈ సామూహిక సమాధి ఒక ప్రణాళికాబద్ధమైన హత్యాకాండకు సంబంధం లేకపోతే, కొన్ని మృతదేహాలు కూర్చున్న స్థితిలో, పిల్లలు వారి పాల సీసాలతో ఎలా పూడ్చిపెట్టారు? ఇలా సహజంగా మరణించిన వారిని ఎక్కడైనా పూడ్చిపెట్టడానికి మార్గం ఉందా? ఇలాంటి నివేదికను జారీ చేసే ప్రొఫెసర్, మా బాధను పరిగణనలోకి తీసుకోవాలి. ఏదైనా ఒత్తిడి కారణంగా ఆయన ఇలాంటి నివేదిక ఇచ్చి ఉండవచ్చునని నమ్ముతున్నా" అని అన్నారు.

ఈ కేసు విచారణ నవంబర్ 19న తిరిగి ప్రారంభం కానుంది. ప్రొఫెసర్ రాజ్ సోమదేవ సమర్పించిన నివేదికల్లోని వైరుధ్యాలపై వచ్చే వారం అభ్యంతర పిటిషన్‌ను దాఖలు చేయనున్నట్లు చెమ్మణి సమాధుల కేసులో అదృశ్యమైన వారి తరపున వాదిస్తున్న న్యాయవాది వి.ఎస్. నిరంజన్ బీబీసీ తమిళ్‌తో చెప్పారు.

"ప్రొఫెసర్ రాజ్ సోమదేవ తన నివేదికలో పేర్కొన్నట్లుగా, జాఫ్నాలో అంటువ్యాధులు లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా వందలాది మందిని సామూహికంగా ఖననం చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ నిజంగానే అలా జరిగి ఉంటే, దానికి తగిన ఆధారాలతో సహా వివరించి ఉండాల్సింది. ఆయన అటువంటిదేమీ పేర్కొనలేదు" అని అభిప్రాయపడ్డారు.

"అయితే, 'ఇక్కడ అలాంటిది జరిగిందని ఆయన తన నివేదికలో ఎక్కడా చెప్పలేదు. ఎముకలకు సంబంధించి నివేదికను ఎలా రూపొందించారనే దానిపై కూడా సందేహాలు ఉన్నాయి. ఈ నివేదిక తీవ్ర నిరాశ కలిగించింది. పురావస్తు రంగ నిపుణుల సలహాలతో, దీనిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని అన్నారు.

అంతేకాకుండా, కార్బన్ డేటింగ్, DNA పరీక్షలను త్వరితగతిన, సమగ్రంగా నిర్వహించాలని అనేక పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

శ్రీలంక, జాఫ్నా, చెమ్మణి
ఫొటో క్యాప్షన్, సోమరత్నే రాజపక్స

రాష్ట్రపతికి సైనికుడు రాసిన లేఖలో ఏం ఉంది

ఇదిలా ఉండగా, గత సంవత్సరం క్రిశాంతి కుమారస్వామి హత్య కేసులో దోషిగా తేలి, మరణశిక్ష పడిన ఆర్మీ కార్పోరల్ సోమరత్నే రాజపక్స, తన భార్య ద్వారా రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు.

తాను చెమ్మణి ప్రాంతంలో విధుల్లో ఉన్నప్పుడు సైనికాధికారులు వందల మంది పౌరులను చంపేశారని, ఆ మృతదేహాలను ఖననం బాధ్యతలు తనకు అప్పగించారని తెలిపారు.

ఆ మృతదేహాలు పూడ్చిపెట్టిన ప్రదేశాలు గుర్తించడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో, ఆయన వాంగ్మూలంపై దర్యాప్తు జరిపేందుకు అక్టోబర్ 19న జాఫ్నా మేజిస్ట్రేట్ కోర్టు అందుకు అనుమతి మంజూరు చేసింది.

అంతేకాకుండా, చెమ్మణి సమాధుల ప్రాంతం నుంచి సేకరించిన ఎముకల అవశేషాలకు ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించేందుకు వచ్చే వారం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఈ అధ్యయనంలో పాల్గొన్న ఫోరెన్సిక్ వైద్య అధికారి సెల్లయ్య ప్రణవన్ తెలిపారు.

ఈ పరిస్థితిలో రాబోయే కోర్టు విచారణలు, సమర్పించే నివేదికల కోసం సంబంధిత వ్యక్తులు ఎదురు చూస్తున్నారు. వీటి ద్వారైనా ఈ అంశంపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)