మన తాత ముత్తాతలతో పోలిస్తే మనం ఎందుకు ఎత్తుగా ఉన్నామో తెలుసా?

మనుషులు, ఎత్తు, పారిశ్రామిక విప్లవం, వ్యవసాయం
ఫొటో క్యాప్షన్, జీవన శైలి మెరుగుపడిన తర్వాత దక్షిణ కొరియా మహిళలు ఎత్తు పెరిగారు.
    • రచయిత, కేథరిన్ హీత్‌వుడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

మీ ఎత్తును మీ పూర్వీకులతో పోల్చి చూసుకుంటే, బహుశా మీరు వారికంటే పొడవుగా ఉండే ఉంటారు.

'అవర్ వరల్డ్ ఇన్ డేటా' పరిశోధన ప్రకారం వందేళ్ల క్రితం జీవించిన మన పూర్వీకులతో పోలిస్తే నేటి యువత సగటున 10 సెంటీమీటర్లు పొడవుగా ఉన్నారు.

2016లో జరిగిన ఒక అధ్యయనంలో 1896, 1996లో జన్మించిన వారి ఎత్తును పోల్చారు.

ఇందులో దక్షిణ కొరియా మహిళలు అత్యధికంగా 20 సెంటీమీటర్లు, ఇరాన్ పురుషులు 17 సెంటీమీటర్లు ఎత్తు పెరిగినట్లు తేలింది.

మెరుగైన ఆహారం, వ్యాధుల నియంత్రణ, టీకాలు వంటి కారణాల వల్లే ఎత్తులో ఈ పెరుగుదల సాధ్యమైందని స్కాట్లాండ్‌లోని అబెర్డీన్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ హెల్త్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ అరవింద గుంటుపల్లి వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, మనుషుల ఎత్తు నిరంతరంగా పెరుగుతూనే రాలేదు.

వేల సంవత్సరాలుగా ఆహారంలో మార్పులు, యుద్ధాలు, వ్యాధులు, ఇతర సామాజిక మార్పుల కారణంగా మనుషుల ఎత్తు కొన్నిసార్లు పెరిగింది.

మరికొన్నిసార్లు తగ్గింది.

మనుషులు, ఎత్తు, పారిశ్రామిక విప్లవం, వ్యవసాయం
ఫొటో క్యాప్షన్, ఎత్తుగా ఎదగడం మెరుగైన జీవన నాణ్యతకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు.

ఎత్తు గురించి చరిత్ర ఏమి చెబుతోంది?

చారిత్రక లేదా గణాంక సమాచారం అందుబాటులో లేనప్పుడు, ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి ఎత్తు మంచి సూచిక అని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి ఎత్తు మంచి సూచిక అనేది బెల్‌ఫాస్ట్‌లోని క్వీన్స్ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక చరిత్రకారుడు డాక్టర్ మథియాస్ బ్లమ్ అభిప్రాయం.

ఒక వ్యక్తి ఎత్తులో 80-90 శాతం వారి జన్యువులపై ఆధారపడి ఉన్నప్పటికీ మిగిలిన శాతం ఆహారం, వాతావరణం, వ్యాధులు, వైద్య సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది.

"కాబట్టి, సగటు ఎత్తు పెరగడం మెరుగైన జీవన నాణ్యతకు సంకేతం" అని బ్లమ్ అన్నారు

స్థూల దేశీయోత్పత్తి లాంటి ఆర్థిక గణాంకాలలో కనిపించని అసమానతలను ప్రజల సగటు ఎత్తును బట్టి అంచనా వేయవచ్చు.

మనుషులు, ఎత్తు, పారిశ్రామిక విప్లవం, వ్యవసాయం
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

వ్యవసాయం రాకతో మనుషుల ఎత్తు తగ్గిందా?

మానవ చరిత్రలో ఎత్తుపరంగా రెండు ప్రధాన మార్పులు వచ్చాయి.

మొదటిది సుమారు 10,000 - 12,000 ఏళ్ల క్రితం నియోలిథిక్ కాలంలో మనుషులు వేట నుంచి వ్యవసాయం వైపు మళ్లినప్పుడు అస్థిపంజరాల ఆధారంగా పరిశోధనలు జరిగాయి. అయితే ఆ సమాచారానికి కొన్ని పరిమితులు ఉన్నాయి.

అయినప్పటికీ, వ్యవసాయం మొదలైన తర్వాత మనుషుల ఎత్తు తగ్గిందని అనేకమంది పరిశోధకులు అంగీకరిస్తున్నారు.

2022లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, ఆ సమయంలో మనుషుల సగటు ఎత్తు 2.8 సెంటీమీటర్లు తగ్గింది.

వ్యవసాయం వల్ల ఆహారం స్థిరంగా లభించినప్పటికీ అదంత నాణ్యమైనదని చెప్పలేం.

అంతకుముందు వేటాడటం ద్వారా జంతువుల నుంచి లభించిన మాంసకృత్తులు (అమైనో ఆమ్లాలు) శరీరానికి ఎంతో మేలు చేశాయి.

వ్యవసాయంతో పాటు, స్థిర నివాసం ఏర్పరుచుకోవడం, పశువులతో కలిసి జీవించడం వల్ల అంటువ్యాధులు ప్రబలాయి.

కఠోర శ్రమ కూడా ఎత్తు తగ్గడానికి ఒక కారణమైంది.

దీర్ఘకాలంలో క్రమంగా ఎత్తు పెరగడం లేదా తగ్గడం వంటివి జరిగాయని చెప్పడానికి స్పష్టమైన సంకేతాలు లేవు.

కరవు, యుద్ధాలు సంభవించేవి. అనంతరం ప్రజలు కోలుకునేవారు.

అలా వేల ఏళ్లుగా ప్రజల ఎత్తులో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ విపత్తులు ఎదురైనప్పుడు ఊహించని పరిణామాలు జరిగాయి.

కొన్ని విపత్తులు ఊహించని ఫలితాలను ఇచ్చాయి.

14వ శతాబ్దం మధ్యలో యూరప్‌లో సగం జనాభాను బలితీసుకున్న 'బ్లాక్ డెత్' (ప్లేగు) మహమ్మారి తర్వాత ప్రజల సగటు ఎత్తు 170 సెం.మీ నుంచి 174 సెం.మీ కు పెరిగినట్లు డాక్టర్ అరవింద బృందం ఇంగ్లండ్‌లో జరిపిన అధ్యయనంలో తేలింది.

కార్మికుల కొరత వల్ల వారి వేతనాలు పెరగడం, తద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడటమే దీనికి కారణం కావచ్చని డాక్టర్ అరవింద అంచనా వేస్తున్నారు.

మనుషులు, ఎత్తు, పారిశ్రామిక విప్లవం, వ్యవసాయం
ఫొటో క్యాప్షన్, పారిశ్రామిక విప్లవం తొలినాళ్లలో మనుషులకు అనేక సమస్యలు ఎదురయ్యాయి.

పారిశ్రామిక విప్లవం ప్రభావం

బ్లమ్ ప్రకారం, మనుషుల ఎత్తులో రెండో ప్రధాన మార్పు పారిశ్రామిక విప్లవంతో వచ్చింది.

18వ శతాబ్దంలో బ్రిటన్‌లో మొదలైన పారిశ్రామిక విప్లవం క్రమంగా మిగిలిన దేశాలకూ విస్తరించింది.

ప్రారంభంలో పరిశ్రమల కారణంగా నగరాల్లో రద్దీ పెరిగి, పారిశుద్ధ్యం లోపించి ప్రజల ఎత్తు తగ్గింది.

ఫ్యాక్టరీ కార్మికులు ఒకే మంచంపై షిఫ్టుల వారీగా పడుకునేంత దుర్భర పరిస్థితులు ఉండేవి. నాటి వాతావరణం ఆరోగ్యానికి హానికరంగా ఉండేదని అరవింద చెప్పారు.

అయితే, క్రమంగా ప్రజల ఆదాయం పెరగడం, పారిశుద్ధ్యం, గృహ వసతులు మెరుగుపడటం, వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణల వల్ల మనుషుల సగటు ఎత్తు గణనీయంగా పెరగడం ప్రారంభమైంది.

దక్షిణ కొరియా దీనికి ఒక ఉదాహరణ.

పారిశ్రామికీకరణ ఆలస్యంగా మొదలైనప్పటికీ, వేగవంతమైన ఆర్థికాభివృద్ధి వల్ల అక్కడి పురుషుల సగటు ఎత్తు 15 సెం.మీ, మహిళల ఎత్తు 20 సెం.మీ పెరిగింది.

మనుషులు, ఎత్తు, పారిశ్రామిక విప్లవం, వ్యవసాయం
ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా యువత సగటు ఎత్తు వందేళ్ల క్రితం వారి పూర్వీకుల కంటే సుమారు 10 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంది.

మనుషుల ఎత్తు గరిష్ఠ స్థాయికి చేరుకుందా?

'అవర్ వరల్డ్ ఇన్ డేటా' ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1996లో జన్మించిన పురుషుల సగటు ఎత్తు 171 సెం.మీ, మహిళల సగటు ఎత్తు 159 సెం.మీ.లు

ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదాయం పెరుగుతున్నప్పటికీ ప్రజల ఎత్తు పెరగడం ఆగిపోయినట్లు కనిపిస్తోందని బ్లమ్ అన్నారు.

అందుకు గల కారణాలపై స్పష్టత లేదు. బహుశా వారి జన్యుపరమైన గరిష్ఠ పరిమితికి చేరుకోవడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, శారీరక శ్రమ తగ్గడం దీనికి కారణాలు కావచ్చని బ్లమ్ భావిస్తున్నారు.

వీగన్, శాకాహారం తినడం పర్యావరణానికి, ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అది సగటు ఎత్తు పెరగడానికి దోహదపడుతుందని చెప్పలేమని ఆయన అన్నారు.

మనుషులు, ఎత్తు, పారిశ్రామిక విప్లవం, వ్యవసాయం
ఫొటో క్యాప్షన్, ఎత్తు పెరిగే ధోరణి భవిష్యత్‌లో మారవచ్చని నిపుణులు చెబుతున్నారు(ప్రతీకాత్మక చిత్రం)

పేదరికం - అసమానతలు

భవిష్యత్తులో కూడా మానవుల ఎత్తు ఇలాగే పెరుగుతుందన్న గ్యారెంటీ లేదని డాక్టర్ అరవింద అభిప్రాయపడ్డారు.

ఆహారం, ఇంధన కొరత సహా తీవ్రమైన అసమానతలను అందుకు కారణంగా చెప్పారు.

అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లో పోషకాహార లోపం వల్ల పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోవడం తీవ్రంగా ఉంది.

ముఖ్యంగా పేదలు ఎత్తు తక్కువగా ఉంటున్నారు.

"కరవు, వరదలు లాంటి వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయంతో పాటు పాలు, జంతువుల ఉత్పత్తులు దెబ్బతింటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి కేటాయించే బడ్జెట్‌ తగ్గుతూ వస్తోంది. దీనివల్ల టీకాలు, పోషకాహారం సహా శరణార్థులకు సంబంధించిన అనేక కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోంది" అని డాక్టర్ అరవింద అన్నారు.

ఈ పరిస్థితులన్నీ కలిసి భౌతిక అసమానతలను పెంచుతాయని, భవిష్యత్తులో ధనిక, పేద దేశాల మధ్యనే కాకుండా ఒకే సమాజంలోని ప్రజల మధ్య కూడా ఎత్తు పరంగా తీవ్ర వ్యత్యాసాలు ఉంటాయని ఆమె చెప్పారు.

"మనం అసమానతలు గల సమాజంలో బ్రతుకుతున్నాం" అని డాక్టర్ అరవింద అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)