న్యూదిల్లీ డిక్లరేషన్‌కు బ్రిక్స్ ఆమోదం: పహల్గాం దాడి, ఏకపక్ష సుంకాలు, గాజా, పాలస్తీనాపై డిక్లరేషన్ ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, Kristina Solovyova / POOL / AFP via Getty Images
భారత్‌లో జరుగుతున్న బ్రిక్స్ 2026 సదస్సు 'న్యూదిల్లీ డిక్లరేషన్'ను ఆమోదించింది. ఈ డిక్లరేషన్‌లో ఉగ్రవాదాన్ని బ్రిక్స్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. కారణం, ఉద్దేశం ఏదైనప్పటికీ ఉగ్రవాద చర్యలను ఏమాత్రం సమర్థించలేమని స్పష్టం చేశాయి.
26 మంది ప్రాణాలను బలిగొన్న '2025 ఏప్రిల్ 22 నాటి జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి'ని న్యూదిల్లీ డిక్లరేషన్ ఖండించింది.
ఉగ్రవాదం, దానికి అందుతున్న ఆర్థిక సాయం, సరిహద్దుల ఆవల నుంచి సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు వారికి ఆశ్రయం కల్పించే చర్యలను ఉమ్మడిగా ఎదుర్కొంటామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి.
ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, మానవ అక్రమ రవాణా, ఆయుధాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, సైబర్ నేరాలు, అవినీతి, డిజిటల్ మోసాల కట్టడికి పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి.
ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న వ్యవస్థీకృత ముఠాలను మట్టుబెట్టడం, నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకోవడం, బాధితులకు రక్షణ కల్పించడం లాంటి అంశాలపై డిక్లరేషన్ దృష్టి సారించింది.

పహల్గాం దాడిపై ఏమన్నారంటే..
"ఉగ్రవాద చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక నేరం. దీని వెనుక కారణం ఏదైనా, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు చేసినా దీన్ని ఏమాత్రం సమర్థించలేం" అని బ్రిక్స్ దేశాలు తమ డిక్లరేషన్‌లో పేర్కొన్నాయి.
"26 మంది ప్రాణాలను బలిగొని, మరికొందరిని గాయపరిచిన 2025 ఏప్రిల్ 22 నాటి జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని అత్యంత తీవ్ర పదజాలంతో ఖండిస్తున్నాం"
ఉగ్రవాదాన్ని ఏ మతం, జాతీయత, నాగరికత, జాతి సమూహంతోనూ ముడిపెట్టకూడదని బ్రిక్స్ దేశాలు స్పష్టం చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వారితో పాటు వారికి మద్దతు ఇచ్చే వారందరినీ జవాబుదారీ చేయాలని డిమాండ్ చేశాయి.
"ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి పాటించాలని పిలుపునిస్తున్నాం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను మేం అంగీకరించబోం. దీనిని ఎదుర్కోవడంలో ప్రాథమిక బాధ్యత ఆయా దేశాలదే" అని డిక్లరేషన్‌లో స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితి జాబితాలో ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి.

ఫొటో సోర్స్, Narendra Modi Photo Gallery/ANI
అభివృద్ధి చెందుతున్న దేశాలకు, మహిళలకు అవకాశాలు
పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం, ఐక్యత, ప్రజాస్వామ్యం, పారదర్శకత, సమ్మిళితత్వం, ఏకాభిప్రాయం అనే బ్రిక్స్ సూత్రాలను నేతలు పునరుద్ఘాటించారు.
రాజకీయ-భద్రత, ఆర్థిక, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు అనే మూడు ప్రధాన రంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని చెప్పారు.
భాగస్వామ్య దేశాల సహకారాన్ని స్వాగతిస్తూనే, వర్ధమాన మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నేతలు ఆకాంక్షించారు.
మరింత న్యాయబద్ధమైన, అందరికీ అవకాశాలు కల్పించే, జవాబుదారీతనంతో కూడిన ప్రపంచ వ్యవస్థ రూపకల్పనలో ఐక్యరాజ్యసమితి కీలక పాత్రను బలోపేతం చేసేందుకు తమ నిబద్ధతను చాటారు.
అంతర్జాతీయ నిర్ణయాల ప్రక్రియలో అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల భాగస్వామ్యం మరింత పెరగాలని వారు డిమాండ్ చేశారు. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు, మహిళలకు, ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌కు చెందిన మహిళలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలని బ్రిక్స్ స్పష్టం చేసింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1325 అమలుతో పాటు మహిళలు, శాంతి, భద్రత అజెండా అమలుకు బ్రిక్స్ దేశాలు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశాయి.

ఫొటో సోర్స్, DPR PMO/ANI Photo
బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్రను బలోపేతం చేయడానికి, మరింత న్యాయమైన, సమానమైన అంతర్జాతీయ పాలన కోసం చర్చలు, సహకారాన్ని పెంచుకోవడానికి బ్రిక్స్ దేశాలు అంగీకరించాయి.
ఆర్థిక రంగంలో.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని బ్రిక్స్ డిమాండ్ చేసింది. ఈ సంస్థల్లో వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ప్రాతినిధ్యం, పారదర్శకతను పెంచడంతో పాటు నిర్ణయాలు తీసుకోవడంలో వాటి పాత్రను విస్తృతం చేయాలని స్పష్టం చేసింది.
ఐఎంఎఫ్‌లో కోటా సంస్కరణలకు, ప్రపంచ బ్యాంకులో అభివృద్ధి చెందుతున్న దేశాల వాటాను పెంచడానికి కూడా బ్రిక్స్ మద్దతు పలికింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో సంస్కరణలు తీసుకురావాలని, అలాగే బహిరంగ, పారదర్శక, నిష్పాక్షిక, సమ్మిళిత, నియమాధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయాలని బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి.

ఫొటో సోర్స్, Chip Somodevilla/Getty Images
ఏకపక్ష సుంకాలు, ఘర్షణలకు వ్యతిరేకత
ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా విధించే ఏకపక్ష సుంకాలు, సుంకేతర చర్యలు, రక్షణవాదంపై బ్రిక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు ప్రపంచ వాణిజ్యం, సరఫరా గొలుసులపై ప్రభావం చూపడంతో పాటు, ఆర్థిక అసమానతలను పెంచుతాయని కూటమి అభిప్రాయపడింది.
అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా విధించే ఏకపక్ష ఆర్థిక ఆంక్షలు, ఇతర బలవంతపు ఆర్థిక చర్యలను బ్రిక్స్ ఖండించింది. వీటి ప్రభావం పేదలు, బలహీన వర్గాలపై తీవ్రంగా పడుతుందని తెలిపింది.
ప్రపంచ శాంతి విషయానికి వస్తే.. ఘర్షణల నివారణ, చర్చలు, దౌత్యం, మధ్యవర్తిత్వానికి బ్రిక్స్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. పెరుగుతున్న సైనిక వ్యయం, అణు ముప్పు, ఆయుధాల పోటీపై ఆందోళన వ్యక్తం చేస్తూనే.. నిరాయుధీకరణ, ఆయుధ నియంత్రణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అణ్వాయుధ రహిత ప్రాంతాల ఆవశ్యకతను కూడా ఈ కూటమి ప్రస్తావించింది.
క్యూబాపై ఏకపక్ష ఆంక్షలు, దిగ్బంధనాన్ని కఠినతరం చేయడం పట్ల బ్రిక్స్ ఆందోళన వెలిబుచ్చింది. ఆ దేశంపై ఉన్న ఆర్థిక, వాణిజ్య, లావాదేవీలకు సంబంధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.

ఫొటో సోర్స్, BASHAR TALEB/AFP via Getty Images
పాలస్తీనాకు మద్దతు
మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత దిగజార్చే చర్యలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది.
గాజాలో కాల్పుల విరమణను కొనసాగించాలని, మానవతా సాయం నిరాటంకంగా అందేలా చూడాలని బ్రిక్స్ కోరింది. పాలస్తీనియన్ల బలవంతపు తరలింపులు, గాజాలో భౌగోళిక పరిస్థితులు, జనాభాలో మార్పులు తీసుకురావడాన్ని కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది.
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి న్యాయబద్ధమైన, శాశ్వత పరిష్కారం శాంతియుత మార్గాల ద్వారానే సాధ్యమవుతుందని బ్రిక్స్ స్పష్టం చేసింది.
రెండు దేశాల సిద్ధాంతానికి (టూ-స్టేట్ సొల్యూషన్) కూటమి మద్దతు పలికింది. గాజాలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన బ్రిక్స్ దేశాలు.. పౌరులు, ఆసుపత్రులు, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడాన్ని, మానవతా సాయాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించాయి.
ఆక్రమిత జెరూసలెం చట్టపరమైన, చారిత్రక స్థితిని మార్చే ఏకపక్ష చర్యలను అంగీకరించబోమని బ్రిక్స్ దేశాలు తేల్చిచెప్పాయి. ఆ నగరంలోని అన్ని పవిత్ర స్థలాల పవిత్రతను గౌరవించాలని కోరాయి. ప్రజలందరూ ఎలాంటి ఆటంకం లేకుండా తమ మతపరమైన ప్రదేశాలను సందర్శించుకునేలా, తమ ఆచారాలను పాటించుకునేలా స్వేచ్ఛను కల్పించాలని విజ్ఞప్తి చేశాయి.
లెబనాన్‌లో కాల్పుల విరమణను స్వాగతించిన బ్రిక్స్.. సంబంధిత పక్షాలన్నీ ఆ ఒప్పంద షరతులకు కట్టుబడి ఉండాలని కోరింది. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1701ను పూర్తిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది.
సూడాన్‌లో నానాటికీ దిగజారుతున్న మానవతా సంక్షోభంపై కూటమి ఆందోళన వెలిబుచ్చింది. అక్కడ తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ పాటించాలని, చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలని సూచించింది. సిరియా సార్వభౌమాధికారాన్ని కాపాడటంతో పాటు అందరినీ కలుపుకొనే రాజకీయ ప్రక్రియకు ఈ డిక్లరేషన్‌లో మద్దతు ప్రకటించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఆర్థిక వృద్ధికి, సుస్థిర అభివృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్ప అవకాశాలు కల్పించే రంగమని బ్రిక్స్ పేర్కొంది. ఏఐని సురక్షితంగా, నమ్మకమైనదిగా, అందరినీ కలుపుకొనిపోయేలా, అందరికీ అందుబాటులోకి తెచ్చేలా చేయడానికి అంతర్జాతీయ సహకారం అవసరమని స్పష్టం చేసింది.
విద్యారంగంలో డిజిటల్ అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యా కోర్సులు, ఏఐ సురక్షిత, బాధ్యతాయుత వినియోగం, స్కాలర్‌షిప్‌లతో పాటు విశ్వవిద్యాలయాల మధ్య సహకారాన్ని పెంపొందించాలని సూచించింది.
వాతావరణ మార్పులతో పెరుగుతున్న విపత్తుల ముప్పును దృష్టిలో ఉంచుకుని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి బ్రిక్స్ దేశాలు అంగీకరించాయి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, స్థానిక, సంప్రదాయ విజ్ఞానం, విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా విపత్తులను ఎదుర్కొనే సన్నద్ధతను మెరుగుపరచాలని తీర్మానించాయి.
పారిస్ ఒప్పందం, యూఎన్ఎఫ్సీసీసీ కింద వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు చర్యలను వేగవంతం చేయాలని బ్రిక్స్ నిబద్ధత వ్యక్తం చేసింది. వాతావరణ పరిరక్షణ పేరిట తీసుకునే ఏకపక్ష, వివక్షాపూరిత చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, జీ20
బ్రిక్స్‌తో పాటు గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధికి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కీలక సంస్థ అని డిక్లరేషన్‌లో తెలిపారు. స్థానిక కరెన్సీలలో ఆర్థిక సహాయం, వనరుల సమీకరణ, మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తన సామర్థ్యాన్ని ఈ బ్యాంక్ మరింతగా పెంచుకోవాలని ఆకాంక్షించారు.
ప్రపంచ ఆర్థిక సహకారానికి జీ20 ఒక ప్రధాన వేదికని బ్రిక్స్ అభివర్ణించింది. ఇందులో వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల గొంతుక మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
న్యాయ వ్యవస్థలో సహకారంతో పాటు సరిహద్దుల ఆవల తలెత్తే వాణిజ్య వివాదాల పరిష్కారాన్ని బలోపేతం చేయాలని బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి. మధ్యవర్తిత్వం, వివాదాల పరిష్కారానికి ఇతర ప్రత్యామ్నాయ విధానాలను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























