ఎంకే స్టాలిన్ ఓటమి: డీఎంకే పరాజయానికి దారితీసిన 5 ప్రధాన కారణాలు

ఎంకే స్టాలిన్, డీఎంకే ఓటమికి కారణాలు, తమిళనాడు ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
    • రచయిత, శంకర నారాయణన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలావరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా వచ్చాయి. తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని 'యాక్సిస్ మై ఇండియా' అంచనా వేసింది.

మిగిలిన సర్వేలన్నీ డీఎంకే వైపు మొగ్గు చూపాయి. ఎప్పటిలాగే డీఎంకే - ఏఐఏడీఎంకే కూటముల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఆ అంచనాలు పేర్కొన్నాయి.

అయితే ఈ ఎన్నికల ఫలితాలు వాటికి పూర్తిగా విరుద్ధంగా వచ్చాయి. డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హ్యాట్రిక్ విజయం సాధించిన తన సొంత నియోజకవర్గం కొలత్తూరులోనే టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

డీఎంకేకు బలమైన పట్టుందని భావించే చెన్నైలోనే ఆ పార్టీ భారీ ఓటమిని చవిచూసింది.

30 మందికి పైగా మంత్రులు వెనుకంజలో ఉన్నారు. 70 ఏళ్లకు పైగా రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకేకు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతటి భారీ పరాజయానికి దారితీసిన 5 ప్రధాన కారణాలను చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎంకే స్టాలిన్, డీఎంకే ఓటమికి కారణాలు, తమిళనాడు ఎన్నికల ఫలితాలు
ఫొటో క్యాప్షన్, ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు

1. తలకిందులైన డీఎంకే అంచనాలు

2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి స్టాలిన్ తన ఇంటర్వ్యూలు, ప్రచారాల్లో మహిళలే లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రకటించిన వివిధ పథకాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ముఖ్యంగా:

  • కుటుంబ పెద్దలైన మహిళలకు నెలకు రూ. 1,000 అందించే పథకం.
  • ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే పథకం.
  • పాఠశాలల్లో ఉదయం అల్పాహార పథకం.

6 నుంచి 12వ తరగతి వరకు చదివి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు, వారి కోర్సు పూర్తయ్యే వరకు నెలకు రూ.1,000 అందించే పథకం వంటి వాటిని ప్రధానమైనవిగా ఆయన జాబితా చేశారు.

వీటితో పాటు ఉన్నత విద్య చదివే విద్యార్థుల కోసం 'తమిళ పుదల్వన్', 'నాన్ ముదల్వన్' వంటి పథకాలను, ప్రజల వద్దకే వైద్య సేవలు అందించే 'మక్కలై తేడి మరుత్తువం' వంటి కార్యక్రమాలను కూడా డీఎంకే తన విజయాలుగా ప్రదర్శించింది.

ఎంకే స్టాలిన్, డీఎంకే ఓటమికి కారణాలు, తమిళనాడు ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, MK Stalin/X page

ఫొటో క్యాప్షన్, డీఎంకే మహిళా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికలలో ఫలితాలనివ్వలేదా?

అయితే, ఈ పథకాలు ఓట్లను ప్రభావితం చేసే శక్తిగా మారలేదని పాత్రికేయులు అభిప్రాయపడుతున్నారు.

డీఎంకే మాత్రమే కాకుండా మరో ద్రావిడ పార్టీ అయిన ఏఐఏడీఎంకే కూడా మొదటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఉందని సీనియర్ జర్నలిస్ట్ మణి బీబీసీ తమిళ్‌తో చెప్పారు.

జయలలిత రాజకీయ ప్రవేశం తర్వాత 2016 వరకు ప్రజలు డీఎంకే, ఏఐఏడీఎంకేలకు మార్చి మార్చి అధికారాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాల్లో కేవలం సంక్షేమ పథకాల ఆధారిత ఓటు బ్యాంకు ఎప్పుడూ లేదని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మునుపటి ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే వస్తున్నాయని మణి వివరించారు.

మరో జర్నలిస్ట్ దివ్య చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో మహిళా ఓటు బ్యాంకు డీఎంకేకు అనుకూలంగా ఉండేది కాదని, దీనిని దృష్టిలో ఉంచుకునే 2021లో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంక్షేమ పథకాలపై డీఎంకే ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

విజయ్ సాధించిన ఓట్లలో మహిళలు, యువత ఓట్లు అధికంగా ఉండి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఒక విధంగా ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు డీఎంకే ఆశించిన దానికి భిన్నంగా, ప్రతికూల ఫలితాలను కూడా ఇచ్చాయి. బీబీసీ 'మక్కల్ కురల్' (ప్రజా గళం) క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న ఆటో డ్రైవర్లు, ఉచిత బస్సు ప్రయాణ పథకాల వల్ల తమ ఆదాయం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంకే స్టాలిన్, డీఎంకే ఓటమికి కారణాలు, తమిళనాడు ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, TVK

ఫొటో క్యాప్షన్, విజయ్‌కు ఓటు వేస్తానన్న వారిపై డీఎంకే చేసిన విమర్శలు బెడిసికొట్టాయా?

2. డీఎంకేనే ప్రత్యర్థిగా భావించిన విజయ్ - పట్టించుకోని స్టాలిన్ పార్టీ

ఈ ఎన్నికల్లో తన ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి విజయ్ డీఎంకేనే తన ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించారు. ముఖ్యంగా "ఈ ఎన్నికల్లో పోటీ కేవలం ఇద్దరి మధ్యే, ఒకటి డీఎంకే.. రెండోది టీవీకే" అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలను టీవీకే కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు.

విజయ్ దీనిని ఒక నినాదంగా మార్చుకున్నారు. తన ప్రచార వేదికలపై డీఎంకేను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా కరూర్ తొక్కిసలాట మరణాల వంటి సంఘటనలకు డీఎంకే కారణమని ఆయన ఆరోపించారు (అయితే కరూర్ ఘటనపై పోలీసు రిపోర్టులు దీనికి భిన్నంగా ఉన్నాయి, ప్రస్తుతం ఈ కేసు సీబీఐ విచారణలో ఉంది).

కానీ, డీఎంకే ప్రధాన నాయకులు విజయ్‌ను నేరుగా ఎదుర్కొనేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా మీడియా ఇంటర్వ్యూలలో విజయ్ గురించి అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.

విజయ్‌కు వ్యతిరేకంగా డీఎంకే బలమైన రాజకీయ వ్యూహాన్ని అనుసరించకపోవడం కూడా ఈ ఎన్నికల ఫలితాలకు కారణం కావచ్చని జర్నలిస్ట్ మణి అభిప్రాయపడ్డారు.

విజయ్‌ను నేరుగా విమర్శించకపోవడమే కాకుండా, విజయ్‌కు ఓటు వేస్తామని చెప్పిన ఓటర్లను సోషల్ మీడియాలో డీఎంకే మద్దతుదారులు లక్ష్యంగా చేసుకోవడం ఆ పార్టీకి నష్టం కలిగించిందని ఆయన బీబీసీతో చెప్పారు.

ముఖ్యంగా విజయ్ మద్దతుదారులను సోషల్ మీడియాలో అగౌరవపరిచే పదాలతో విమర్శించడం డీఎంకేకు వ్యతిరేకంగా మారి ఉండవచ్చని ఆయన విశ్లేషించారు. ఇతర పార్టీల వారు కూడా ఇలాంటి విమర్శలు చేసినప్పటికీ, అది డీఎంకేకే ఎక్కువగా ప్రతికూలంగా మారిందని ఆయన తెలిపారు.

ఎంకే స్టాలిన్, డీఎంకే ఓటమికి కారణాలు, తమిళనాడు ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, TVK

3. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకున్న విజయ్

ఎన్నికల్లో విజయ్ బలానికి పరీక్ష జరగకపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేకతను ఆయన ఏ స్థాయిలో ఓట్లుగా మలుచుకోగలరనే విషయాన్ని ప్రధాన పార్టీలు అంచనా వేయడంలో విఫలమై ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తమిళనాడులో టీవీకేకు పటిష్టమైన పార్టీ నిర్మాణం లేకపోయినప్పటికీ, ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని జర్నలిస్ట్ కోటీశ్వరన్ బీబీసీ తమిళ్‌తో అన్నారు.

"ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం" అని ఆయన అన్నారు.

ముఖ్యంగా వారసత్వ రాజకీయాలు, ధరల పెరుగుదల వంటి ఆరోపణల కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు విజయ్ వైపు మళ్లాయని ఆయన విశ్లేషించారు.

రాజకీయాల్లో విజయ్ ఓటు బ్యాంకు గతంలో పరీక్షకు గురికాకపోయినా, తమిళనాడు అంతటా ఆయనకు ఉన్న భారీ అభిమానగణం వల్ల "డీఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను విజయ్ తనకు అనుకూలంగా మార్చుకున్నారని" కోటీశ్వరన్ తెలిపారు.

ఉదయం పూట పోస్టల్ బ్యాలెట్లలో టీవీకే ముందంజలో ఉండటాన్ని బట్టి, "మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు వంటి డీఎంకే ఓటు బ్యాంకునే విజయ్ చేజిక్కించుకున్నారు" అని ఆయన అంచనా వేశారు.

ఎన్నికలకు ముందు డీఎంకే, ఏఐఏడీఎంకేలు విజయ్‌ను తక్కువ అంచనా వేసి ఉండవచ్చని, ఒకవేళ సరైన అంచనా ఉండి ఉంటే తమ ప్రచార వ్యూహాల్లో మార్పులు చేసేవారని కోటీశ్వరన్ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ విజయం సాధించారని జర్నలిస్ట్ మాలన్ అన్నారు. 2026 ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతం గురించి మాట్లాడుతూ, మార్పు కోసమే ప్రజలు ఉత్సాహంగా ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు.

4. కూటమి లెక్కలు తప్పడం

డీఎంకే, ఏఐఏడీఎంకే కూటముల్లోని జాతీయ పార్టీలకు కేటాయించిన స్థానాల విషయంలో సాధారణంగానే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు డీఎంకే కూటమిలో కాంగ్రెస్ పోటీ చేసిన 28 స్థానాల్లో కేవలం సింగిల్ డిజిట్ స్థానాల్లోనే ముందంజలో ఉంది. అలాగే ఏఐఏడీఎంకే కూటమిలో 27 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కూడా చాలా తక్కువ స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఆ స్థానాలన్నింటిలో టీవీకే భారీగా ఓట్లను సాధించినట్లు ప్రస్తుత ట్రెండ్స్ ద్వారా తెలుస్తోంది.

కూటమి విషయంలో డీఎంకే, ఏఐఏడీఎంకేలు వేసిన లెక్కలు తప్పాయని జర్నలిస్ట్ దివ్య చంద్రబాబు బీబీసీతో అన్నారు.

ప్రస్తుత ఎన్నికల్లో "విజయ్ అనే ఏకైక కారకం ఒక ప్రభంజనంగా మారి టీవీకేకు భారీ స్థాయిలో ఓట్లను తెచ్చిపెట్టింది" అని ఆమె వివరించారు.

ఎంకే స్టాలిన్, డీఎంకే ఓటమికి కారణాలు, తమిళనాడు ఎన్నికల ఫలితాలు
ఫొటో క్యాప్షన్, విజయ్ దళిత ఓట్లను ప్రభావితం చేశారని జర్నలిస్ట్ మణి అభిప్రాయపడ్డారు.

5. దళిత ఓట్ల మళ్లింపు

దళిత యువత ఓట్లు ప్రధానంగా విజయ్ వైపు మళ్లుతాయని తాను ముందే ఊహించానని జర్నలిస్ట్ మణి పేర్కొన్నారు.

బీబీసీ తమిళ్ ఎడిటర్ తంగవేల్ అప్పాచితో జరిగిన ప్రత్యక్ష ప్రసార చర్చలో మణి మాట్లాడుతూ.. "డీఎంకే కూటమిలో ఉన్న విడుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) భారీ ఓటమిని చవిచూసింది" అని తెలిపారు.

విడుతలై చిరుతైగళ్ కోల్పోయిన ఓట్లను టీవీకే సాధించి ఉండవచ్చని మణి అభిప్రాయపడ్డారు. యువత ఓట్లను రాబట్టడంలో టీవీకే విజయం సాధించిందని జర్నలిస్ట్ దివ్య చంద్రబాబు కూడా ఏకీభవించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)