శుభేందు అధికారి: ఆరేళ్లలో బెంగాల్‌లో బీజేపీని అగ్రస్థానానికి చేర్చిన నాయకుడు

ఫొటో సోర్స్, Sanjay Das
- రచయిత, ప్రభాకర్ మణి తివారి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి బీజేపీ అధికారంలోకి రావడంలో శుభేందు అధికారి కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ మెజారిటీ మార్కును దాటడంతో, ఆ రాష్ట్రంలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా కనిపిస్తోంది.
రాజకీయ చురుకుదనం, దూకుడు వైఖరితో పార్టీ కేంద్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న శుభేందు.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి ప్రధాన రేసులో నిలిచారు.
2020 వరకు టీఎంసీలో మమతా బెనర్జీ తర్వాత పార్టీలో ఆయనే నంబర్ టూగా ఉండేవారు. అయితే అభిషేక్ బెనర్జీ ప్రాభవం పెరగడంతో క్రమంగా ప్రాధాన్యం కోల్పోయిన ఆయన, 2021 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.
బీజేపీలో చేరిన నాలుగు నెలలకే జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని 3 సీట్ల నుంచి 77 సీట్లకు చేర్చడంలో శుభేందు అధికారి కీలక పాత్ర పోషించారు. అప్పట్లో కేంద్ర నాయకత్వం 'అబ్‌కీ బార్ దో సౌ పార్' (ఈసారి రెండు వందలు దాటాలి) అనే నినాదం ఇచ్చినప్పటికీ, ఆ లక్ష్యం నెరవేరలేదు. కానీ, 3 నుంచి 77 స్థానాలకు పెరగడం పార్టీకి పెద్ద విజయంగానే నిలిచింది.
ఇప్పుడు ఐదేళ్ల తర్వాత, బెంగాల్‌లోని మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి.. బీజేపీ తన పాత లక్ష్యానికి చేరువ కావడంతో పాటు తొలిసారి అధికార పీఠాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.


ఫొటో సోర్స్, Sanjay Das
క్షేత్రస్థాయిలో పట్టున్న లీడర్
ప్రస్తుత ఫలితాలతో 'అంగ-బంగ-కళింగ' (బిహార్, బెంగాల్, ఒడిశా) ప్రాంతాల్లో పాగా వేయాలన్న బీజేపీ కల నెరవేరింది. వీటిలో అంగ, కళింగ ప్రాంతాల్లో పార్టీ ఇదివరకే అధికారంలో ఉన్నప్పటికీ, బంగ (బెంగాల్) గడ్డపై పట్టు సాధించడం మాత్రం ఇదే తొలిసారి.
పార్టీ కలను నిజం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి దిగ్గజ నేతలు కృషి చేసినప్పటికీ, బెంగాల్ క్షేత్రస్థాయిలో పార్టీకి దారి చూపడంలో శుభేందు అధికారి పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది.
2021 ఎన్నికల విజయం తర్వాత ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తూ, తృణమూల్ కంచుకోటలుగా భావించే ప్రాంతాల్లో సైతం తన ఉద్యమాలతో బీజేపీని బలోపేతం చేస్తూ వచ్చారు.
రెండుసార్లు ఎంపీగా, ఆ తర్వాత నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మమతా బెనర్జీ రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన శుభేందు అధికారి పేరు.. 2020 డిసెంబర్‌కు ముందు పశ్చిమ బెంగాల్ బయట పెద్దగా ఎవరికీ తెలియదు.
అయితే, అదే నెలలో బీజేపీలోకి చేరి, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానంలో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగడమే కాకుండా పార్టీ అగ్రనేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
శుభేందు అధికారి పనితీరుపై పార్టీలో కొన్ని ప్రశ్నలు తలెత్తడంతో పాటు, కేంద్ర నాయకత్వం ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యంపై పలువురు పాత నాయకుల్లో అసంతృప్తి కూడా పెరిగింది. అయితే, విజయం అన్ని లోపాలను కప్పివేస్తుందని అంటారు. గడిచిన ఐదేళ్లలో కేంద్ర నాయకత్వం ఆయనకు నిరంతరం ప్రాధాన్యతనిస్తూ వచ్చింది, బెంగాల్‌కు సంబంధించిన పార్టీ విధాన నిర్ణయాల్లో ఆయన అభిప్రాయం కీలకంగా మారింది.

ఫొటో సోర్స్, Sanjay Das
టీఎంసీలో నంబర్ టూ
శుభేందు 2006 అసెంబ్లీ ఎన్నికల్లో కాంతి సౌత్ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి గెలిచారు. ఆ తర్వాత 2009లో తమ్లుక్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కూడా అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి విజయం సాధించిన ఆయన, మమతా బెనర్జీ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. క్రమంగా ప్రభుత్వంలో ఆయన నంబర్ టూగా గుర్తింపు పొందారు.
శుభేందు రాజకీయ ప్రస్థానం కాంతిలోని పీకే కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే విద్యార్థి రాజకీయాలతో మొదలైంది. 1989లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం 'ఛాత్ర పరిషత్' ప్రతినిధిగా ఎన్నికయ్యారు. 2006లో 36 ఏళ్ల వయసులో శుభేందు కాంతి సౌత్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఏడాది కాంతి మున్సిపాలిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
2009, 2014 ఎన్నికల్లో తమ్లుక్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారాయన. ఆయన రాజకీయ ప్రస్థానం 1990ల్లోనే మొదలైనప్పటికీ, 2007 నాటి నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమమే శుభేందును ఒక బలమైన నాయకుడిగా నిలబెట్టింది.

ఫొటో సోర్స్, Sanjay Das
నందిగ్రామ్ ఉద్యమ రూపశిల్పి
లో ప్రొఫైల్ ఎంపీగా ఉన్న శుభేందు తన సంస్థాగత నైపుణ్యంతో అతి తక్కువ కాలంలోనే తృణమూల్ కాంగ్రెస్‌లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు. ఈస్ట్ మేదినీపుర్ జిల్లాను శుభేందు కుటుంబం కంచుకోటగా భావిస్తారు. శుభేందు తండ్రి, సోదరుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు.
తృణమూల్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన నందిగ్రామ్ ఉద్యమానికి శుభేందు ప్రధాన రూపశిల్పి అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. 2007లో కాంతి సౌత్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. అప్పటి వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'భూమి ఉచ్ఛేద్ ప్రతిరోధ్ కమిటీ' బ్యానర్‌పై స్థానికులను ఏకం చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకం.
అప్పట్లో నందిగ్రామ్‌లో కెమికల్ హబ్ కోసం భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైన దశలో.. ఆ ప్రాంతంలో సీపీఎం నేత లక్ష్మణ్ సేథ్ హవా నడిచేది. అయితే తన వ్యూహాలతో శక్తిమంతుడైన లక్ష్మణ్ సేథ్‌ను ఓడించడంలో శుభేందు విజయం సాధించారు.
'జంగల్‌మహల్'గా పిలిచే పశ్చిమ మేదినీపుర్, పురూలియా, బాంకురా జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్ పటిష్టంగా మారడానికి శుభేందు కృషి చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.
శుభేందు తన రాజకీయ ఆకాంక్షల కోసమే తృణమూల్ కాంగ్రెస్‌ను వీడారని విశ్లేషకులు భావిస్తారు.
అయితే, అవినీతి కేసుల్లో ఈడీ, సీబీఐ చర్యల నుంచి తప్పించుకోవడానికి ఆయన బీజేపీలో చేరారని ప్రత్యర్థులు వాదిస్తుంటారు. కానీ, గత ఐదేళ్లుగా ఆయన చూపిన చొరవ వల్ల తృణమూల్ కంచుకోటలను బద్దలు కొట్టి అనేక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇందులో శుభేందు అధికారిది కీలక పాత్ర.
ఆరేళ్ల కిందటి వరకు మమతా బెనర్జీ ప్రభుత్వంలో నంబర్ టూగా ఉన్న శుభేందు.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో నంబర్ వన్ (ముఖ్యమంత్రి) అవుతారా? అనే ప్రశ్నకు బహుశా ఈ వారమే సమాధానం దొరకవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































