పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను ఎలా మారుస్తాయి? - 7 కీలకాంశాలు

ఫొటో సోర్స్, ANI
- రచయిత, సంజీవ్ శ్రీవాత్సవ, సీనియర్ జర్నలిస్ట్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 7 నిమిషాలు
భారత్‌లోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు మే 4న వస్తాయి. తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారో వెల్లడిస్తాయి.
అయితే చాలామంది రాజకీయ పరిశీలకులు ప్రధానంగా దృష్టిసారించిన అంశం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు.
ఈ ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేసింది. వనరులకు ఎలాంటి కొరతా లేదు. విస్తృత ప్రచారం నిర్వహించింది.
ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించారు.
మరి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఎందుకంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నదే అతిపెద్ద ప్రశ్న. దీనికి సమాధానం కావాలంటే దీనిని వివిధ కోణాల నుంచి చూడాలి.


ఫొటో సోర్స్, Getty Images

బీజేపీకి ఎందుకు కీలకం అని చెప్పాలంటే, జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామా ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ కావడం ఇందులో మొదటిది.
అందుకే పశ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అంతకు ముందు జన్‌సంఘ్, తర్వాత బీజేపీ దశాబ్ధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
ఈ పోరాటానికి 1950ల నుంచి చరిత్ర ఉంది. అయితే ఇప్పటివరకు వాళ్లు అందులో విజయం సాధించలేదు.

ఫొటో సోర్స్, ANI

రెండో ముఖ్యమైన కారణం హిందూ ఓట్లను ఎంతవరకు సమీకరించగలం అన్నది తెలుసుకోవడం. ఇందుకో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీజేపీకి ఒక పెద్ద లేబరేటరీగా మారింది.
వివిధ గణాంకాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో 25 నుంచి 30 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలి.
కాబట్టి అవతలి పక్షం నుంచి ఓట్ల సమీకరణ చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే బీజేపీకి ముస్లిం ఓట్లు చాలా తక్కువగా పడే లేదా అసలు పడకపోయే అవకాశం ఉండొచ్చు.
బీజేపీయే కాకుండా ప్రతిపక్షాలు కూడా పశ్చిమ బెంగాల్‌ను చివరి పోరాట ప్రాంతంగా భావిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ ఉత్తర, మధ్య తూర్పు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో విజయ పతాకాన్ని ఎగురవేసింది. కానీ బెంగాల్‌లో ఇంకా గెలవలేదు.
ప్రతిపక్షాలు బీజేపీని, పెరుగుతున్న ఆ పార్టీ ప్రభావాన్ని, దేశం మొత్తానికి విస్తరిస్తున్న వారి అధికారాన్ని అడ్డుకోవాలంటే పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ తప్పక కొనసాగాలి. ఇది టీఎంసీకే కాకుండా మొత్తం ప్రతిపక్షాలకూ అత్యంత కీలకం.
దీంతో ఇరువైపుల నుంచి పోటీ చాలా తీవ్రమవుతోంది.
ఓటు బ్యాంక్ పోలరైజేషన్ కూడా ఒక కీలకాంశం.
పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా బెంగాల్‌లో చాలాకాలంగా నివసిస్తున్న మార్వాడీలు లేదా హిందీ మాట్లాడే నాన్ బెంగాలీస్ ఇప్పటికే పోలరైజ్ అయి ఉన్నారు. వారిలో ఎక్కువమంది బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు కనిపిస్తోంది.
హిందూ-ముస్లిం అంశం నగరాల్లో ఎక్కువగా, గ్రామీణ ప్రాంతాలలో తక్కువ చర్చనీయాంశం. అయితే, బీబీసీ బృందం పశ్చిమ బెంగాల్‌లో ఏడు రోజులపాటు పర్యటించినప్పుడు ఎక్కడా మతపరమైన ఉద్రిక్తత గానీ, దాని జాడగానీ మాకు కనిపించలేదు.
చాలాచోట్ల ప్రజలు ప్రశాంతంగా జీవిస్తుంటారు. ముస్లిం ప్రాంతాలు, హిందూ ప్రాంతాలు వేర్వేరుగా ఉంటాయి. గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. అక్కడ ఒకదానికొకటి ఆనుకుని ఉన్న ఇళ్లు అరుదుగా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఎన్నికల్లో ఎస్ఐఆర్ కూడా ఒక ముఖ్యమైన అంశం. రాష్ట్ర ఎన్నికల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో ఆగ్రహం బాగా పెరిగింది. ఉద్రిక్తత నెలకొంది. ఇది ఒక సున్నితమైన అంశం కూడా.
పెద్ద సంఖ్యలో ప్రజల ఓట్లు రద్దయ్యాయి. రద్దయిన ఆ ఓట్లలో మైనారిటీ వర్గానికి చెందిన ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు.
ఈ ఓట్లర్లు మధ్య బెంగాల్, ముర్షిదాబాద్, మాల్దా, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు.
మేం పశ్చిమ బెంగాల్‌లోని ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఈ ప్రక్రియలో అక్కడ అనేక తప్పులు, పొరపాట్లు ఉన్నాయని స్పష్టంగా అర్ధమైంది.
కొన్ని కుటుంబాల్లో తండ్రికి ఓటు హక్కు ఉంటుంది, కానీ ఇతర సభ్యుల ఓట్లు ఉండవు. మరికొన్నింటిలో భర్త ఓటు హక్కు ఉంటుంది, కానీ భార్య, పిల్లల ఓట్లుండవు.
ఇక బెంగాల్ వెలుపల ఉంటూ, బెంగాల్‌కు వచ్చి ఓటేస్తున్నవారిలో ఎక్కువమంది ఎటువైపు ఉన్నారు అన్నది మరో కీలకాంశం.
ఎస్ఐఆర్ కారణంగా ఓట్లు రద్దు కావడం రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా రాష్ట్రం వెలుపల నివసిస్తున్న వారికి ఒక మెసేజ్ పంపింది. వారు ఈసారి ఓటేయకపోతే, వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండకపోవచ్చు.
ఇది కేవలం ఓటర్ల జాబితాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. తమ పౌరసత్వాన్నే ప్రశ్నిస్తారేమోనని వారు భయపడుతున్నారు. భారత పౌరులుగా తాము పొందుతున్న ఉచిత రేషన్లు లేదా ఇతర ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుందేమోనని వారు భయపడుతున్నారు.
దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటేయడానికి విదేశాల నుంచి కూడా పశ్చిమ బెంగాల్‌కు వచ్చారు. ఈ అధిక ఓటింగ్ శాతం ఎన్నికల ఫలితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

మమతా బెనర్జీ పాలన మీద పశ్చిమ బెంగాల్ వ్యతిరేకత బాగానే కనిపిస్తుంది.
అభివృద్ధిపరంగా చెప్పుకోదగ్గ మంచి పనులేమీ చేయలేదు. దేశంలోనే పశ్చిమ బెంగాల్ వృద్ధి రేటు అత్యంత నెమ్మదిగా ఉంది.
మా టీమ్‌తోపాటు ప్రయాణించిన ప్రఖ్యాత ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్యాసం రాశారు. మమతా బెనర్జీ పాలనలో పశ్చిమ బెంగాల్‌లో వృద్ధి రేటు మందగించిందని ఆయన పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాల్లో వృద్ధి రేటు పెరుగుతుంటే ఇక్కడ అందుకు భిన్నంగా ఉందని పేర్కొన్నారు.
అయితే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వ్యాసంలో పేర్కొన్నట్లుగా, అభివృద్ధిని చూపించి కచ్చితంగా తాము గెలుస్తామని ఎవరూ చెప్పలేరని మా సహచర జర్నలిస్టు రుచిర్ శర్మ తన వ్యాసంతో పేర్కొన్నారు.
అభివృద్ధిని చూపించినా ఎన్నికల్లో ఓడిపోయేవారు సుమారు 50 శాతంమంది ఉన్నారనీ, అభివృద్ధి తక్కువగా ఉన్నప్పటికీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవారు 50 శాతం మంది ఉన్నారని రుచిర్ శర్మ అభిప్రాయపడ్డారు.
దీని అర్థం రాజకీయాల్లో ఇతర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ఈసారి బెంగాల్‌లో కూడా కనిపించిన మరో ముఖ్యమైన అంశం మహిళా ఓటర్లు.
కొన్నేళ్లుగా ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించడాన్ని గమనించొచ్చు. బిహార్, మధ్యప్రదేశ్‌లలోనూ ఇదే కనిపించింది. మహిళలు తమకు సహాయపడే వారికే ఓటు వేస్తున్నారు. మహిళల్లో బీజేపీ ప్రాబల్యం కూడా పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images

బిహార్‌లో మద్యపానాన్ని నిషేధించి నితీశ్ కుమార్ ఎన్నికల్లో గెలిచారు. అప్పట్లో ఆయన ప్రవేశపెట్టిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్ ఆయన విజయానికి దోహదపడింది.
మమతా బెనర్జీ బెంగాల్‌లో 'లక్ష్మీ భండార్' అనే పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ప్రతి నెలా మహిళల ఖాతాలకు రూ. 1500 బదిలీ చేస్తారు.
దీని ప్రభావం ఎంత ఉంటుంది?
తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రూ. 3000 ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మరి, వాగ్దానాన్ని ఆదరిస్తారా, ప్రస్తుతం అందుకుంటున్న స్కీమ్‌ను విశ్వసిస్తారా అన్నది ఫలితాలలో తేలుతుంది.
అయితే, మమతా బెనర్జీ లేదా టీఎంసీ గెలిస్తే అది అద్భుతమైన పరిపాలన అందించినందుకు కాదు, బెంగాల్‌లో బీజేపీకి ఇంకా ఆమోదం లభించకపోవడం వల్ల.
ముఖ్యంగా హిందీ మాట్లాడని బెంగాలీలు, నాన్-మార్వాడీ బెంగాలీలు, బయటి నుంచి వచ్చినవారుకాని అసలైన బెంగాలీ ఓటర్లు ఇప్పటికీ బీజేపీని బయటి పార్టీగా చూస్తున్నారు.
దీనికి కారణాలు స్పష్టం. మమతా బెనర్జీకి సరితూగగల నేత బీజేపీలో లేరు. ప్రచారం కోసం రాష్ట్రానికి వచ్చే ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా హిందీలోనే మాట్లాడతారు. వారికి బెంగాలీ రాదు. దీనివల్ల ఒక గ్యాప్ అనేది అలాగే మిగిలిపోతుంది.
బీజేపీకి ప్రతిష్ఠాత్మకమైన రామ మందిరం, హిందుత్వ, అది నిర్వచించిన సాంస్కృతిక జాతీయవాదంతో బెంగాలీలు తమను తాము బలంగా ఐడెంటిఫై చేసుకోలేక పోతున్నారు.
దుర్గ, శక్తి, కాళి, శివుడు అనేవి వారికి నచ్చిన రూపాలు. రామ్మోహన్ రాయ్, సుభాష్ చంద్రబోస్, కొందరికి అమర్త్య సేన్, సత్యజిత్ రే, బిపిన్ చంద్రపాల్ వంటివారు లోకల్ బెంగాలీలకు ఆరాధ్యమూర్తులు.
అంటే, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. అదేంటంటే బెంగాలీ ప్రజలు అంటే ఓటర్లు బీజేపీ ప్రయత్నిస్తున్న లేదా కోరుకున్న రూపంలో ఆ పార్టీని అంగీకరించడం లేదు. కానీ బీజేపీ మాత్రం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫలితం ఏమైనప్పటికీ గమనించాల్సిన రెండు, మూడు విషయాలున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
మొదటగా ఒకవేళ టీఎంసీ గెలిస్తే అది ప్రతిపక్షానికి ఒక పెద్ద విజయం అవుతుంది. తాము బీజేపీకి పోటీ ఇవ్వగల స్థితిలో ఉన్నామని వారిలో నమ్మకం పెరుగుతుంది.
టీఎంసీ విజయాన్ని లౌకిక శక్తుల విజయంగానో లేదా మతతత్వ శక్తుల ఓటమిగానో ఎవరైనా భావిస్తే అది కూడా ఈ ఎన్నికల ఫలితాన్ని తక్కువ అంచనా వేయడమే అవుతుంది.
తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే అధిక సంఖ్యలో ముస్లిం ఓట్లే ఆ పార్టీకి పునాది అయ్యాయన్న విషయం గుర్తుంచుకోవాలి. చాలామంది ఈ మాట చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా టీఎంసీకి 28-30 శాతం ముస్లిం ఓటు బ్యాంక్ ఉందని బీజేపీ వాదిస్తోంది.
అయితే, బీజేపీ అధికారానికి దారులు వేయగల రివర్స్ మొబిలైజేషన్ అన్నది బెంగాల్ లో జరగడం లేదు. అంటే హిందువులందరూ ఒకపక్షం వహించాల్సి ఉంది. కానీ దానికి అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ బెంగాలీ ఐడెంటిటీ, బెంగాలీ సబ్ నేషనలిజం అన్నవి కూడా కీలకమైన విషయాలే.

ఫొటో సోర్స్, Getty Images

అత్యధిక సంఖ్యలో హిందూ ఓట్లను ఏకీకృతం చేయడంలో, బీజేపీ బాగా సఫలమైందనే విషయం స్పష్టమవుతుంది.
దీని పరిణామాలు ఏంటి? దాదాపు ఉత్తర, పశ్చిమ, మధ్య, తూర్పు భారతదేశం అంతటా బీజేపీ జెండా రెపరెపలాడుతుంది. ఒక విధంగా ఈ ప్రాంతాల్లో బీజేపీకి సంపూర్ణ అధికారం లభిస్తుంది.
ఇది ప్రతిపక్షాల మనోధైర్యాన్ని ప్రభావితం చేస్తుంది. వారు ఎలా నిరుత్సాహపడతారనేది కూడా ఒక ముఖ్యమైన విషయం.
దేశ ప్రజాస్వామ్యం కోసం దేశానికి అలాంటి ఏకపక్ష పొలిటికల్ మ్యాప్‌ను సృష్టించకూడదని చాలామంది అంటుంటారు.
మొత్తంమీద ఇది చాలా ఆసక్తికరం. హోరాహోరీ పోరు. ఈ ఎన్నికల ఫలితాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదని మేం పర్యటిస్తున్నప్పుడే అనిపించింది.
అయినప్పటికీ టీఎంసీకే పైచేయి ఉందని నేను భావిస్తున్నా. ఆ ఆధిక్యం ఎన్ని సీట్లుగా మారుతుందో, వారికి, బీజేపీకి మధ్య ఎంత అంతరం ఉంటుందో చూడాల్సి ఉంది.
అయితే ఈ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయని, పెద్దగా హింస జరగలేదని కచ్చితంగా చెప్పవచ్చు. ఎన్నికల్లో టీఎంసీ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని అనుమానాలు , ఆరోపణలు వినిపించినా, కేంద్ర భద్రతాబలగాలను మోహరించడం వల్ల ఈసారి అలా జరగలేదు.
ఇది టీఎంసీ మనోధైర్యాన్ని ఎంత మేరకు దెబ్బతీసింది లేదా వారి ఓట్లను ఎంత మేరకు తగ్గించింది అనేది కూడా ఒక అంశం. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దీనిపై చర్చించవచ్చు.
ఒక్కటి మాత్రం నిజం. ఇది కీలకమైన ఎన్నిక. హోరాహోరీగా సాగిన ఎన్నిక, దేశ రాజకీయాలపై సుదీర్ఘ ప్రభావాలను చూపే ఎన్నిక.
(ఈ వ్యాస రచయిత బీబీసీ హిందీకి ఇండియా ఎడిటర్‌గా పనిచేశారు. ఇందులో వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































