తెలంగాణ: కొండా సురేఖ, చిన్నారెడ్డి.. గ్రూపు రాజకీయాలు వీరి పదవులకు ఎసరు తెస్తాయా?

ఫొటో సోర్స్, Konda Surekha/fb
కొండా సురేఖ వర్సెస్ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, చిన్నా రెడ్డి వర్సెస్ మేఘా రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇదే చర్చ. ఒకరు మంత్రి కాగా.. మరొకరు మంత్రి హోదాలో ఉన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ఒకసారి గ్రూపు రాజకీయాలు వేడెక్కాయి. కొన్ని రోజులుగా పార్టీ నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోందని చెప్పవచ్చు.
అటు కొండా సురేఖ, ఇటు చిన్నారెడ్డికి తెలంగాణ క్రమశిక్షణ కమిటీ తరఫున షోకాజ్ నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ. వారి నుంచి వివరణ కోరిన తర్వాత ఆ నివేదికను పీసీసీకి, ఏఐసీసీకి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జికి అందించింది.
''షోకాజ్ నోటీసుకు ఇద్దరూ ఇచ్చిన వివరణను పరిశీలించాం. గత విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని మా పరిశీలనతో కూడిన నివేదికను అధిష్టానానికి అందించాం'' అని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌లో చూస్తున్న రాజకీయాలు కొత్తేమీ కాదని, ఆ పార్టీలో సహజమేనని అభిప్రాయపడ్డారు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్.

కొండా సురేఖ వివాదం ఎక్కడ మొదలైందంటే..
ఆగస్టు 16న పరకాలలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్జప్తి చేశారు.
ప్రస్తుతం కూడా రేవూరి ప్రకాశ్ రెడ్డే పరకాల నుంచి ఎమ్మల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగానే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల నుంచి మళ్లీ పోటీ చేస్తారని సంకేతాలు ఇచ్చారు.
అయితే, గీసుకొండలో ఆగస్టు 19న జరిగిన కొండా సురేఖ పుట్టిన రోజు వేడుకల్లో సురేఖ కుమార్తె కొండా సుస్మిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
''రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కాగానే కళ్లు నెత్తికెక్కాయా..?'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి కొండా మురళి ఎంతో సాయం చేశారన్నారు.
''వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డిని గెలిపించాలని ఎలా ప్రకటిస్తారు. అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. అయినా రెండేళ్ల వరకు ఎందుకు, ఇప్పుడే రేవూరి ప్రకాశ్ రెడ్డిని రాజీనామా చేసి రమ్మనండి, ఉప ఎన్నికల్లో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు.
పరకాల స్థానంలో కొండా కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారని.. రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా రేవూరి ప్రకాశ్ రెడ్డిని గెలిపించుకోలేరని సుస్మిత వ్యాఖ్యానించారు.
మరోవైపు, తనపై చేసిన వ్యాఖ్యల విషయంలో లండన్ పర్యటనకు వెళ్లే ముందు దిల్లీలో మంత్రులు, కాంగ్రెస్ నేతల వద్ద రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, facebook
కొండా సురేఖకు షోకాజ్ నోటీసు
రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యల విషయంలో కొండా సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసు జారీ చేసింది.
అయితే, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ వివరణ ఇచ్చారు.
''నా కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయం. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదు. నా కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం'' అని పేర్కొన్నారు సురేఖ.
అయితే, ఇదే సమయంలో కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని లేదా ఆమెను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు గాంధీ భవన్లో మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
ఆ తర్వాత పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మరో లేఖ రాశారు కొండా సురేఖ.
''నన్ను నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి'' అని కొండా సురేఖ రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/kondasurekha/ktr
కొండా సురేఖ చుట్టూ గతంలోనూ వివాదాలు
2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సందర్భంలో మహబూబాబాద్‌లో ఓదార్పు యాత్రకు వైఎస్ జగన్ వచ్చిన నేపథ్యంలో పెద్దఎత్తున హింస చెలరేగింది.
అప్పట్లో తెలంగాణవాదులపై దాడులు జరగడంపై ఇప్పటికీ చర్చ సాగుతుంటుంది. తెలంగాణవాదులపై కొండా సురేఖ కుటుంబం అండతోనే దాడులు చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే, దాడులను అప్పట్లో కొండా దంపతులు ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2024 సెప్టెంబరులో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు (కేటీఆర్) సినీ తారల ఫోన్లు ట్యాప్ చేయించి, వారి వ్యక్తిగత సంభాషణలు వారికే వినిపించి బెదిరించారని.. ఓ కుటుంబంలో విడాకులకు కేటీఆర్ కారణమయ్యారని కొండా సురేఖ ఆరోపించారు.
దీనిపై పెద్దఎత్తున వివాదం రేగింది. ఈ విషయంపై కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. కేసు కోర్టులో పెండింగులో ఉంది.
ఆ తర్వాత సమంత, నాగార్జున కుటుంబాల గురించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా కొండా సురేఖ చెప్పారు.
నిరుడు అక్టోబరులో కొండా సురేఖకు ఓఎస్డీగా ఉన్న సుమంత్ అప్పట్లో ఓ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను బెదిరించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత ఆయన్ను మంత్రి పేషీ నుంచి ఓఎస్డీగా తొలగించింది.
అప్పట్లో సుమంత్‌ను కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇంట్లో ఉంచడం, పోలీసులు నుంచి తప్పించేందుకు సుమంత్‌ను తన కారులో సుస్మిత తరలించడం వివాదం రేగింది.
మరోవైపు సుమంత్‌పై తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తిపై దాడి చేశారన్న ఫిర్యాదుతో ఆయనపై కేసు పెట్టి గాలిస్తున్నారు.
మేడారం టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలగజేసుకుంటున్నారంటూ సురేఖ గతంలో సీఎంకు, అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వివాదం రేగింది.
అయితే, తమకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య ఎలాంటి విభేదాలు లేవని తర్వాత కొండా మురళి చెప్పారు.
ఫైళ్ల క్లియరెన్స్‌ల విషయంలోనూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
ఇక తనకు చెప్పకుండా దేవాదాయ శాఖాధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష చేయడంపై కొండా సురేఖ బహిరంగంగానే విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
అయితే, తన నియోజకవర్గానికి సంబంధించి సమీక్షించానని కడియం శ్రీహరి చెప్పారు.

ఫొటో సోర్స్, Konda Surekha/fb
ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపు
కొండా సురేఖ దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆమె భర్త కొండా మురళీధర్ రావు రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు.
1999, 2004లో శాయంపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు, 2009లో పరకాల నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు కొండా సురేఖ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి వైఎస్ కేబినెట్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు.
తర్వాత అప్పటి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పార్టీలో చేరి 2014లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
2018లో కాంగ్రెస్ పార్టీలో చేరి పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచి అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఫొటో సోర్స్, megha reddy tudi/Chinna Reddy
చిన్నారెడ్డి వర్సెస్ మేఘా రెడ్డి
వనపర్తి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు చిన్నారెడ్డి.
1989, 1999, 2004, 2014లో విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలుత చిన్నారెడ్డిని పేరును ప్రకటించింది అధిష్టానం.
అయితే, తర్వాత అభ్యర్థిని మార్చి తూడి మేఘారెడ్డికి అక్కడ టికెట్ కేటాయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ హోదాలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి చేపట్టారు చిన్నారెడ్డి.
ప్రజావాణి కార్యక్రమానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
అయితే, మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య ముందు నుంచీ ప్రోటోకాల్ వివాదం కొనసాగుతున్నట్లుగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఆగస్టు 16న మండల పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఏళ్ల తరబడిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బులకు ఆశపడి టికెట్లు ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు.
చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు.
''డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చారనే వ్యాఖ్యలు ఖండిస్తున్నా. కార్యకర్తలకు పార్టీలో సముచిత న్యాయం జరుగుతోంది'' అంటూ మేఘారెడ్డి చెప్పారు.
అలాగే ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేయగా, ఆగస్టు 19న వివరణ ఇచ్చారు చిన్నారెడ్డి.
''నేనెవర్నీ వ్యక్తిగతంగా అనలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నాకు దేవాలయాలు వంటివి'' అని చెప్పారు.
షోకాజ్ నోటీసుకు వెనక్కి తీసుకోవాలని తన వివరణలో కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
''కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కనిపించేదే''
తెలంగాణ కాంగ్రెస్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్న మల్లు రవి.. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక అందించినట్లుగా చెప్పారు.
''మా నివేదికను పీసీసీ చీఫ్, ఏఐసీసీ పెద్దలకు పంపించాం. కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి. నివేదికలో అన్ని విషయాలు పొందుపరిచాం'' అని చెప్పారు మల్లురవి.
అయితే, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు సహజమేనని సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ బీబీసీతో అన్నారు.
''కాంగ్రెస్ పార్టీలో 1970, 80వ దశకం నుంచే గ్రూపు రాజకీయాలు చూస్తుంటాం. అప్పట్లో ముఖ్యమంత్రుల మార్పులు కూడా పెద్ద ఎత్తున జరిగేవి. అయితే, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా కనిపించలేదు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు పెద్దగా బయటకు రాలేదు'' అని చెప్పారు.
''ఇప్పుడు అధికారంలో ఉండటంతో మరోసారి గ్రూపు రాజకీయాలు తరచూ చూస్తున్నాం. ఇదే కాకుండా కోర్ కాంగ్రెస్, వేరే పార్టీల నుంచి వచ్చిన నేతలు.. ఇలాంటివి కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వింటున్నాం. కాంగ్రెస్‌లో ఎప్పటికప్పుడు గ్రూపు రాజకీయాలు తెరపైకి వస్తుంటాయి'' అని చెప్పారు దేవులపల్లి అమర్.
''ప్రస్తుత వ్యవహారంపై ఏమీ మాట్లాడదలచుకోలేదు. ఈ విషయంపై అధిష్టానం చూసుకుంటుంది'' అని కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























