ప్రేమ, అబద్ధాలు, దెయ్యాలు: భారతీయులు విపరీతంగా చూస్తోన్న ఈ 2 నిమిషాల 'మైక్రో డ్రామా'ల కథేంటి?

భారతదేశం, మీడియా, టీవీ, సినిమా, వినోదం

ఫొటో సోర్స్, Kuku TV

ఫొటో క్యాప్షన్, ఒక గొప్ప వీరుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథ 'చంద్రవంశం' అనే మైక్రో-డ్రామాకు సంబంధించిన పోస్టర్
    • రచయిత, ప్రసన్నత పాట్వా
  • చదివే సమయం: 6 నిమిషాలు

పేదవారిలా మారువేషంలో ఉండే ధనవంతుల గురించి, ప్రతీకారం తీర్చుకోవడానికి అదనుకోసం ఎదురుచూసే కోపంతో ఊగిపోతున్న దెయ్యాల నాటకాలను గంటల తరబడి చూస్తుంటారు నీతా భోజ్వానీ.

ఆమె రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన గృహిణి.

ఈ షోలలో 50కి పైగా ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ రెండు నిమిషాల కంటే తక్కువే ఉంటుంది. వీటిని 'మైక్రో-డ్రామాలు' అని పిలుస్తారు.

రోజులో ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా మొబైల్ ఫోన్‌లోనే సులభంగా చూడటానికి వీలుండే చిన్న చిన్న కల్పిత కథలు ఇవి.

చైనా, అమెరికా, దక్షిణ కొరియాల్లోనూ, ఇప్పుడు భారత్‌లోనూ విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భోజ్వానీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో ఒక ప్రకటనను చూసి ఈ మైక్రో-డ్రామాలకు ఆకర్షితులయ్యారు. ఇప్పుడు ఆమె 'స్టోరీ టీవీ' వంటి ప్లాట్‌ఫాంలలో వార్షిక సభ్యత్వం కొనుగోలు చేసి మరీ, క్రమం తప్పకుండా చూస్తున్నారు.

''టైమ్ పాస్ కోసం వీటిని చూడొచ్చు" అని 36 ఏళ్ల భోజ్వానీ చెప్పారు.

హిందీ టీవీ సీరియల్స్ మాదిరిగా ఉండే పాతకాలపు కథాంశాలు, అతిగా అనిపించే నటన ఉండే ఈ మైక్రో-డ్రామాలను నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు ఆసక్తిగా వీక్షిస్తున్న లక్షలాది మంది భారతీయుల భోజ్వానీ ఒకరు.

అదృష్టం కలిసిరాని ఒక యువకుడు కాస్త స్నేహంగా ఉండే భూతాన్ని కలవడం, వేర్వేరు స్థాయిలకు చెందిన జంట ఎన్నో అడ్డంకులను, నాటకీయ పరిణామాలను దాటుకుని పెళ్లి చేసుకోవడం వంటివి ఇందులో సాధారణంగా కనిపించే కథాంశాలు.

భారతదేశంలో మైక్రో-డ్రామాల మార్కెట్ వేగంగా పుంజుకుంటోంది. ప్రస్తుతం దీని విలువ 300 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.2,847.31 కోట్లు) కాగా, 2030 నాటికి ఇది 4.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.42,709.72 కోట్ల)కు చేరుకుంటుందని ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 'లుమికై' నివేదికలో వెల్లడించిన అంచనా.

మైక్రో-డ్రామాలను దేశంలోనే 'వేగంగా అభివృద్ధి చెందుతున్న వినోద మాధ్యమం' అని లుమికై పేర్కొంది.

2024లో 'కుకు', 'రీలైజ్' వంటి స్వదేశీ స్టార్టప్‌లతో మైక్రో-డ్రామాలు భారతదేశంలో ఊపందుకున్నాయి. సాధారణంగా సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రేక్షకులకు చేరుతున్నాయి.

అయితే ఇటీవలి వరకు, వీటిని కేవలం ఒక తాత్కాలిక ట్రెండ్‌గా మాత్రమే భావించారు కానీ, మెయిన్‌స్ట్రీమ్ వినోదంలో భాగంగా పరిగణించలేదు.

భారతదేశం, మీడియా, టీవీ, సినిమా, వినోదం

ఫొటో సోర్స్, Don Vanzara Showbiz LLP

ఫొటో క్యాప్షన్, 'మ్యాజికల్ మీరా' అనే మైక్రో-డ్రామాలో ఒక సన్నివేశం చిత్రీకరణలో పాల్గొన్న నటులు

బడా నిర్మాతలు సైతం ఆసక్తి...

దేశంలోని బడా నిర్మాతలు ఇప్పుడు మైక్రో - డ్రామాల నిర్మాణంలో పెట్టుబడులు పెడుతుండటంతో పరిస్థితి మారుతోంది.

కొత్తగా ఈ రంగంలో అడుగుపెట్టిన వారిలో ప్రైవేట్ టీవీ నెట్‌వర్క్ 'జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, ప్రముఖ టీవీ షో మేకర్ 'బాలాజీ టెలీఫిల్మ్స్' ఉన్నాయి.

మైక్రో-డ్రామాలను అభివృద్ధి చేయడానికి ఈ సంస్థలు స్టార్టప్‌లతో వేర్వేరుగా భాగస్వామ్యాలను ప్రకటించాయి.

ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీకి చెందిన మీడియా కంపెనీ 'జియోస్టార్' ఏప్రిల్‌లో 'తడ్కా' అనే మైక్రో-డ్రామా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

ఇందులో ప్రస్తుతం 100కు పైగా షోలు ఉన్నాయి. వీటి ఇతివృత్తాలు హైస్కూల్ నేపథ్యంలో సాగే యవ్వనపు కథల నుంచి, ఒక ధనిక కుటుంబ బిడ్డ, సెక్యూరిటీ గార్డు మధ్య చిగురించే ప్రేమకథల వరకు రకరకాలుగా ఉన్నాయి.

సుదీర్ఘ కాలంగా ఉన్న ఫిల్మ్ స్టూడియో 'యష్ రాజ్ ఫిలింస్', నటుడు షారుఖ్ ఖాన్‌కు చెందిన 'రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్' కూడా మైక్రో-డ్రామా పెట్టుబడులపై కన్నేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ రెండు సంస్థలు బీబీసీ అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు.

''పెద్ద మీడియా సంస్థలు ఈ మైక్రో-డ్రామా రంగంలోకి రావడం సహజం. డిస్నీ లేదా వార్నర్ బ్రదర్స్ వంటి సంస్థలు సినిమాలు, టీవీ నుంచి స్ట్రీమింగ్, థీమ్ పార్కుల వరకు అన్నింటిలోనూ అడుగుపెట్టినప్పుడు, ఇతర పెద్ద సంస్థలు కూడా మైక్రో-డ్రామాల్లో ఉండటం సమంజసమే'' అని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కంట్రిబ్యూటింగ్ ఎడిటర్, మీడియా స్పెషలిస్ట్ వనితా కోహ్లీ-ఖండేకర్ అభిప్రాయపడ్డారు.

కోవిడ్ మహమ్మారి తర్వాత బాలీవుడ్ సహా భారతీయ చలనచిత్ర, టీవీ పరిశ్రమలు మారుతున్న ప్రేక్షకుల అభిరుచులతో సతమతమవుతున్న తరుణంలోనే ఈ మైక్రో-డ్రామాల జోరు పెరిగింది.

డిజిటల్ ప్రకటనలకు ప్రాధాన్యం పెరుగుతుండటంతో టీవీ ప్రకటనల ఆదాయం తగ్గుతోంది.

బాక్సాఫీస్ ఆదాయం పెరుగుతున్నప్పటికీ, అది కేవలం కొన్ని భారీ హిట్ సినిమాలతో మాత్రమే సాధ్యమవుతోంది.

భారతదేశం, మీడియా, టీవీ, సినిమా, వినోదం

ఫొటో సోర్స్, Don Vanzara Showbiz LLP

ఫొటో క్యాప్షన్, 'కౌన్ బనేగా ట్రిలియనీర్' అనే మైక్రో-డ్రామా సెట్స్‌లో నటులు, క్రూ సభ్యులు

ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు...

మైక్రో-డ్రామాలు చైనాలో మొదలయ్యాయి. అక్కడ వీటిని 'డువాంజు' అంటారు. పరిశ్రమ నిపుణుల అంచనాల ప్రకారం, సింగపూర్ ప్రధాన కేంద్రంగా పనిచేసే డ్రామాబాక్స్, రీల్‌షార్ట్ వంటి యాప్‌ల విలువ కలిపి దాదాపు 3 నుంచి 4 బిలియన్ల డాలర్లుగా ఉంది.

చైనాలో మైక్రో-డ్రామాల ఆదాయం 2024లో అక్కడి దేశీయ బాక్సాఫీస్ ఆదాయాన్ని మించిపోయిందని నివేదికలు చెబుతున్నాయి.

ఇవన్నీ చూస్తుంటే భారతీయ కంపెనీలు కూడా మైక్రో-డ్రామాలను పురోగతికి అవకాశం ఉన్న రంగంగా చూడటానికి ఉత్సాహం చూపుతున్నాయి.

ఈ ఆసక్తిని ముందుగా గుర్తించిన భారతీయ స్టార్టప్‌లలో ఒకటైన 'కుకు' ప్రస్తుతం ఆదాయాన్ని ఆర్జిస్తోందని ఆ సంస్థలో పెట్టుబడి పెట్టిన వెంచర్ క్యాపిటల్ ఫండ్ 'ఇండియా కోషెంట్' భాగస్వామి గగన్ గోయల్ తెలిపారు.

''ఈ కంటెంట్ కోసం ప్రజలు డబ్బు చెల్లిస్తున్నారు'' అని గోయల్ చెప్పారు. అయితే, ఆయన కచ్చితమైన గణాంకాలను వెల్లడించలేదు.

వినోదం కోసం వ్యక్తిగత కంప్యూటర్లను వాడకుండా, నేరుగా టెలివిజన్ సెట్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు మారిన లక్షలాది మంది భారతీయులను చేరుకోవాలని కుకు లక్ష్యంగా పెట్టుకుంది.

''సినిమా హాళ్లు ఏర్పడినప్పటి నుంచి వీడియో కంటెంట్ పరిణామ క్రమంలో మనం ఇప్పుడు నాలుగో దశలో ఉన్నాం. అదే మొబైల్-ఫస్ట్ ప్రీమియం కంటెంట్ వీక్షణ'' అని కుకు సహ వ్యవస్థాపకుడు, సీఈవో లాల్ చంద్ బిసు అన్నారు.

ప్రస్తుతం, సుమారు 50 ఎపిసోడ్‌లు ఉండే ఒక మైక్రో-డ్రామాను సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

''ఇది ఒక భారీ హిట్ సినిమా బడ్జెట్‌తో డజనుకు పైగా 90-120 నిమిషాల నిడివి (ఒక పూర్తి మైక్రో-డ్రామా నిడివి) గల చిత్రాలను రూపొందించడం లాంటిది'' అని గోయల్ అన్నారు.

మైక్రో-డ్రామా ప్రేక్షకులు ఈ కంటెంట్‌ను ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రకటనల ద్వారానే తెలుసుకుంటున్నారు. సుదీర్ఘమైన వీడియోలకు నిలయమైన యూట్యూబ్ కంటే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లే వీరికి ప్రధాన వనరుగా మారాయి.

ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడుతున్నప్పటికీ, వారిలో ఆ ఆసక్తిని కొనసాగించడం కష్టమైన పని.

''ప్రేక్షకుడికి వినోదం లభించకపోతే కొన్ని సెకన్లలోనే, లేదంటే వెంటనే షోను లేదా ప్లాట్‌ఫామ్‌ను మార్చేస్తారు" అని బిసు చెప్పారు.

ఆఫీస్ లంచ్ బ్రేక్ లేదా ప్రయాణ సమయాల్లో దొరికే కొద్దిపాటి విరామాల్లోనే చాలామంది వీక్షకులు ఈ చిన్న వీడియోలను చూస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే, మైక్రో-డ్రామాలు చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలి, సంక్లిష్టమైన కథాంశాలు ఉండకూడదు.

ఒకవేళ ప్రేక్షకుడు ఒక పూర్తి షోను చూసినప్పటికీ, వారిని అదే ప్లాట్‌ఫామ్‌లో ఉంచి తదుపరి డ్రామాను చూసేలా చేయడం మరో సవాల్. ఈ సమస్యను అధిగమించడానికి చాలా ప్లాట్‌ఫామ్‌లు వందలాది షోలను రూపొందిస్తూ, నిరంతరం ప్రదర్శిస్తున్నాయి.

భారతదేశం, మీడియా, టీవీ, సినిమా, వినోదం

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, మైక్రో-డ్రామాల పుట్టినిల్లు చైనా

'నాణ్యమైన షోలే ప్రేక్షకుల ఆసక్తికి కీలకం'

''ఎక్కువ సంఖ్యలో షోలు ఉండటం వల్ల ప్రేక్షకులు ప్లాట్‌ఫామ్ నుంచి వెళ్లిపోయే అవకాశం తగ్గుతుంది. సోషల్ మీడియా ప్రకటనల ద్వారా వారిని మళ్లీ తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది'' అని కుకు కంటెంట్ టీమ్ హెడ్, స్క్రీన్ రైటర్ సజల్ కుమార్ చెప్పారు.

షో కాన్సెప్ట్‌లను రూపొందించడానికి ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకుల డేటాను విశ్లేషిస్తాయి. ప్రేక్షకుల ఆసక్తి కోసం ప్రతి ఎపిసోడ్‌ను ఉత్కంఠభరితమైన మలుపుతో ముగిస్తారు.

ప్రస్తుతం నెలకు 150 షోలను నిర్మిస్తున్న కుకు, రాబోయే రెండేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో ఈ సంఖ్యను నెలకు వెయ్యి షోలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ స్థాయిలో షోల నిర్మాణం జరగడం వల్ల, ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో కథలను కాపీ చేయడం లేదా ఇతర భాషల్లోకి రీమేక్ చేయడం సర్వసాధారణం అయిపోయింది.

అయితే, నాణ్యతపై దృష్టి పెట్టడమే సరైన మార్గమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

''భారతదేశంలోని చాలా స్టార్టప్‌లు తమ కంటెంట్ లైబ్రరీని పెంచుకోవడానికి చైనీస్, కొరియన్ మైక్రో-షోల రీమేక్‌లను రూపొందించాయి. కానీ మా ప్లాట్‌ఫామ్‌లోని షోలు పూర్తిగా ఒరిజినల్. మా సొంత రచయితల బృందం సృష్టించినవి'' అని ముంబయికి చెందిన క్లిప్ వ్యవస్థాపకుడు, సీఈఓ విక్కీ బహ్రీ చెప్పారు.

భవిష్యత్తులో లాభదాయకమైన మేధో సంపత్తిని సృష్టించడానికి ఒరిజినల్ కాన్సెప్ట్‌లు ఉపయోగపడతాయని బహ్రీ భావిస్తున్నారు.

అందుకే, ఆయన తన షోల బడ్జెట్‌ను రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచామని, పేరున్న నటులను తీసుకోవడంపై పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు.

కుకు కూడా తమ మైక్రో-షోల నిర్మాణ బడ్జెట్‌ను రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది.

చాలా సంస్థలకు ఆదాయాన్ని ఆర్జించడం అనేది తర్వాతి పెద్ద సవాల్.

క్లిప్ వ్యవస్థాపకుడు బహ్రీ మాట్లాడుతూ, లాభాల గురించి ఆలోచించకుండా రానున్న కొన్నేళ్లలో తమ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి రూ.200 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

''ఈ పరిశ్రమ తన పంథాను మార్చుకోవాలి. కేవలం షోల సంఖ్యను పెంచడంపైనే కాకుండా, నాణ్యమైన కంటెంట్‌పై దృష్టి సారించాలి'' అని డాన్ వంజారా ప్రొడక్షన్స్ వ్యవస్థాపకులు సంకేత్ వంజారా అన్నారు. ప్రస్తుతం ఆయన జియోస్టార్ కోసం ఒక మైక్రో-డ్రామాను రూపొందిస్తున్నారు.

''నాణ్యమైన షోలు ప్రేక్షకులను ప్లాట్‌ఫామ్‌లో ఉండేలా చేస్తాయి. మైక్రో-డ్రామాలను ఒక గౌరవప్రదమైన వినోద మార్గంగా మార్చడానికి తోడ్పడతాయి'' అని సంకేత్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)