పాబ్లో ఎస్కోబార్‌కు చెందిన 80 హిప్పోలను చంపాలని కొలంబియా ఎందుకు అనుకుంటోంది? దీనిపై అనంత్ అంబానీ ఎందుకు స్పందించారు?

ఫొటో సోర్స్, Getty Images/AFP
- రచయిత, పౌలిన్ కోలా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
కొలంబియా చాలా కాలంగా ఎదుర్కొంటున్న హిప్పోల సమస్య పరిష్కారానికి భారతీయ బిలియనీర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ముందుకు వచ్చారు. ఇవి కొలంబియాకు చెందిన డ్రగ్ కార్టెల్ నేత పాబ్లో ఎస్కోబార్‌కు చెందిన హిప్పోలు.
పాబ్లో ఎస్కోబార్‌ను 1993లో పోలీసులు కాల్చి చంపారు. అప్పట్లో ఆయన అరుదైన అనేక జంతువులను చట్టవిరుద్ధంగా కొలంబియాలోకి తీసుకొచ్చారు. వాటిలో ఒక మగ, ఒక ఆడ హిప్పో కూడా ఉండేవి. ఆ రోజుల్లో వాటిని ‘కోకైన్ హిప్పోలు’ అని పిలిచేవారు.
తర్వాత వాటి సంఖ్య పెరిగింది. దాన్ని నియంత్రించడానికి కాస్ట్రేషన్ (సంతానోత్పత్తి సామర్థ్యం లేకుండా చేయడం) సహా పలు విధానాలను కొలంబియా ప్రయత్నించింది. అయినా ఫలితం లేదు. చివరకు వాటి కారణంగా పుట్టుకొచ్చిన సుమారు 80 హిప్పోలను చంపాలని కొలంబియా నిర్ణయం తీసుకుంది.
ఆసియాలో అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీకి కుమారుడైన అనంత్ అంబానీ, ఈ హిప్పోలను గుజరాత్‌లోని తన ప్రైవేట్ జంతు సంరక్షణ కేంద్రం వంతారాకు తీసుకొచ్చి సంరక్షిస్తానని చెప్పారు.
అయితే ఈ ఆఫర్‌పై కొలంబియా ఇంకా స్పందించలేదు.


ఫొటో సోర్స్, AFP via Getty Images
ఈ హిప్పోలను భారత్‌లో జీవితాంతం సంరక్షించడానికి సిద్ధంగా ఉన్నామని కొలంబియా పర్యావరణ మంత్రికి రాసిన లేఖలో వంతారా కేంద్రం సీఈఓ చెప్పారు.
'ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశం.. ప్రతి జీవితం విలువైంది. సాధ్యమైనంత వరకు జీవాలను కాపాడటం అందరి బాధ్యత అని వంతారా నమ్ముతుంది' అని అని జూ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు సంస్థ సీఈవో.
పాబ్లో ఎస్కోబార్ ఈ హిప్పోలను తన రాంచ్ (పశువులను పెంచే ప్రదేశం) హాసియెండా నాపోలెస్లో ఉంచేవారు. ఇది రాజధాని బోగోటా నగరానికి వాయువ్య దిశలో సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక విలాసవంతమైన స్థలం.
పాబ్లో ఎస్కోబార్ మరణించిన తర్వాత ఆ రెండు హిప్పోలను బయటకు వదిలేశారు. దీంతో వాటి సంఖ్య పెరిగి, కొలంబియాలోని మాగ్డలీనా నది పరివాహక ప్రాంతంలో విస్తరించాయి.
హిప్పోల సంఖ్యను నియంత్రించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్కడ వాటికి సహజ శత్రువులు లేకపోవడం, ఆఫ్రికాకు చెందిన ఈ జంతువులు పెరగడానికి అనుకూలమైన వేడి, తడి పరిస్థితులు ఉన్న ఆంటియోకియా ప్రాంతం దొరకడంతో వాటి సంఖ్య పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ హిప్పోల గుంపును ఆఫ్రికా ఆవల ఉన్న అతిపెద్ద హిప్పోల గుంపుగా భావిస్తున్నట్టు కొలంబియా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఇది స్థానిక జంతువులను అక్కడి నుంచి తరిమిమేస్తున్న విదేశీ ఆక్రమణ జాతి అని చెబుతున్నారు.
మాగ్డలీనా నది దగ్గర చేపలుపట్టేవారు నివసించే గ్రామాలపై హిప్పోలు దాడి చేశాయి.
వంతారా జూ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉంది. దీని విస్తీర్ణం 3,500 ఎకరాలు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన ముకేశ్ అంబానీ రిఫైనరీకి దగ్గరగా ఉంటుంది.
అనంత్ అంబానీ 2024లో ఘనంగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరుపుకున్న ప్రదేశాలలో వంతారా ఒకటి. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి.
వంతారా ప్రైవేట్ జూ గురించి గతంలో విమర్శలు వినిపించాయి. ఆ ప్రాంతంలోని వేడిగా, పొడిగా ఉండే వాతావరణం కొన్ని జంతువులకు అనుకూలం కాదన్న వాదనలతో వన్యప్రాణి కార్యకర్తలు, జంతు సంరక్షణ నిపుణులు విమర్శలు చేశారు.
పాబ్లో ఎస్కోబార్ మెడెలిన్ కార్టెల్ నాయకుడు. ఆయన్ని "కోకైన్ కింగ్" అని కూడా పిలిచేవారు. మయామీ, అమెరికా దక్షిణ ప్రాంతాలకు మత్తు పదార్థాలను అక్రమంగా తరలించి సుమారు అప్పట్లో 30 బిలియన్ డాలర్లు సంపాదించారని పేరుంది.
డ్రగ్ కార్టెల్ లీడర్‌గా పాబ్లో ఎస్కోబార్ పదేళ్లకుపైగా తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. అపహరణలు, వందలాది హత్యలు, లంచాలు, బాంబు పేలుళ్లు, ఇతర డ్రగ్ గ్యాంగ్‌లతో గొడవలు వంటివి ఆయన మీద నమోదైన నేరాలు. కొద్దికాలం రాజకీయ నాయకుడిగానూ ఉన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































