అక్క చనిపోయిందంటే నమ్మని బ్యాంక్ మేనేజర్.. రెండు నెలల కిందట ఖననం చేసిన శవాన్ని తవ్వి భుజంపై మోసుకొచ్చి చూపించిన తమ్ముడు

ఒడిశా, బ్యాంకులోకి సోదరి అస్థిపంజరం

ఫొటో సోర్స్, RAKHI GHOSE

ఫొటో క్యాప్షన్, జీతు ముండా బ్యాంకులోకి ప్రవేశించిన వెంటనే, అక్కడున్న ఉద్యోగులు, కస్టమర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు.
    • రచయిత, రాఖీ ఘోష్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 3 నిమిషాలు

(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

ఒడిశాలోని కేంజర్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 52 ఏళ్ల జీతూ ముండా తన భుజంపై ఒక అస్థిపంజరాన్ని మోస్తూ బ్యాంకులోకి రావడంతో అక్కడి ఉద్యోగులు, కస్టమర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు.

పాటనా బ్లాక్ మల్లిపోషి గ్రామంలోని ఒడిశా గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. దియానాలి గ్రామానికి చెందిన జీతూ ముండా, తన అక్క ఖాతాలో ఉన్న 19,300 రూపాయలను విత్ డ్రా చేయడానికి అక్కడికి వెళ్లారు.

ఆయన అక్క పేరు కలరా ముండా (56). భర్త సుక్రు ముండా, కొడుకుతో కలిసి ఆమె ఒకప్పుడు జాజ్‌పుర్‌ జిల్లాలో ఉండేవారు.

అయితే, భర్త, కుమారుడు మరణించడంతో దియానాలికి వచ్చి కూలి పనులు చేస్తూ జీవించేవారు కలరా.

కొన్నినెలల కిందట ఆమె ఒక దూడను అమ్మి, అలా వచ్చిన రూ. 19,300ను తన బ్యాంకు ఖాతాలో జమ చేశారు.

అయితే, రెండు నెలల కిందట కలరా ముండా మరణించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విసిగిపోయా: జీతూ ముండా

"మా అక్క చనిపోయిందని మేనేజర్‌కు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఖాతాదారును తీసుకురావాలని లేదంటే మరణించినట్లు రుజువు, చట్టపరమైన వారసత్వ పత్రాలను ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో విసిగిపోయి, ఆమె చనిపోయిందనడానికి సాక్ష్యంగా అస్థిపంజరాన్నే తీసుకువచ్చాను" అని జీతూ ముండా చెప్పారు.

దీని కోసం, ఆయన మూడు కిలోమీటర్లు నడిచి ఊరి స్మశానానికి వెళ్లి, అక్క అవశేషాలను వెలికితీసి, సంచిలో వేసుకుని ఎండలో భుజాన మోస్తూ బ్యాంకుకు తెచ్చారు.

ఇది చూసి భయాందోళనలకు గురైన బ్యాంక్ సిబ్బంది వెంటనే పోలీసులు, బీడీఓలకు సమాచారం అందించారు.

వారు వచ్చి జీతూకు నచ్చజెప్పి, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో, ఆయన మళ్లీ ఆ అస్థిపంజరాన్ని తీసుకొని స్మశానానికి వెళ్లారు.

ఒడిశా, బ్యాంకులోకి సోదరి అస్థిపంజరం

ఫొటో సోర్స్, RAKHI GHOSE

అధికారులు ఏమంటున్నారు?

"జీతూ డబ్బు విత్‌డ్రా చేయడానికి వచ్చినప్పుడు, సంబంధిత వ్యక్తి ఇక్కడ ఉండాలని చెప్పాను. మొదట్లో తన అక్క పక్షవాతంతో బాధపడుతోందని, రాలేదని ఆయన చెప్పారు. బ్యాంక్ ఉద్యోగులే మీ ఇంటికి వస్తారని నేను చెప్పినప్పుడు, ఆమె మరణించారని ఆయన వెల్లడించారు" అని ఒడిశా గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సుషాంత్ కుమార్ సేథి తెలిపారు.

గత రెండు నెలల్లో జీతూ ఎప్పుడూ డబ్బు కోసం బ్యాంకుకు రాలేదని మేనేజర్ పేర్కొన్నారు. కలరాకు మరో ఇద్దరు వారసులు కూడా ఉన్నారని, వారు కూడా డబ్బు కోసం రావడంతోనే తాము చట్టపరమైన పత్రాలు అడిగినట్లు ఆయన వివరించారు.

ఏప్రిల్ 28న విచారణ అనంతరం.. జీతూతో పాటు కల్రా ఇతర వారసులైన (ఆమె సోదరుడు, సోదరి)కు ఖాతాలో ఉన్న 19,410 రూపాయలను అందజేశారు.

ఈ మొత్తాన్ని సమానంగా పంచుకోవాలని వారికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ఒడిశా రెవెన్యూ మంత్రి సురేష్ పుజారి స్పందిస్తూ.. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై విచారణ జరుపుతున్నారని, బ్యాంక్ మేనేజర్ తీరుపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)