హాంగోర్: పాకిస్తాన్ కొత్త జలాంతర్గామి ఎంత శక్తిమంతమైంది?

ఫొటో సోర్స్, Pakistan Navy
- రచయిత, ముంజా అన్వర్
- హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన తొలి హాంగోర్ తరగతి జలాంతర్గామి కరాచీ ఓడరేవుకు చేరుకుంది. ఇది కేవలం ఒక కొత్త జలాంతర్గామి రాక మాత్రమే కాదు.. పాకిస్తాన్ నౌకాదళ చరిత్రలో భాగమైన ఒక పేరు తిరిగి రావడాన్ని కూడా సూచిస్తుంది.
''హాంగోర్'' అంటే ఒక రకమైన సొరచేప. ఇది తన ఎరను నిశ్శబ్దంగా వేటాడుతూ, సరైన అవకాశం కోసం ఎదురుచూసి, ఒక్కసారిగా దాడికి దిగుతుంది.
1971లో పాకిస్తానీ నౌకాదళ జలాంతర్గామి 'హాంగోర్', భారత యుద్ధనౌక 'ఐఎన్ఎస్ ఖుక్రీ' మధ్య సముద్రంలో పోరాటం జరిగింది.
ఇప్పుడు దాదాపు 55 సంవత్సరాల తర్వాత, అదే పేరుతో ఉన్న 'కొత్త , ఆధునిక' జలాంతర్గామి పాకిస్తాన్ జలాంతర్గామి నౌకాదళంలో చేరింది.
పాకిస్తాన్ నేవీ చెబుతున్న ప్రకారం.. పాకిస్తాన్, చైనా రక్షణ సహకార ఒప్పందంలో భాగంగా 'పీఎన్ఎస్ఎం హాంగోర్'ను అభివృద్ధి చేశారు.

అధునాతన ఆయుధ వ్యవస్థలు, కొత్త సెన్సర్లు, ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపి) టెక్నాలజీ, మెరుగైన ఫీచర్లతో ఈ జలాంతర్గామి రూపొందింది.
ఈ జలాంతర్గామి పాకిస్తాన్ అతిపెద్ద నౌకాదళ రక్షణ ప్రాజెక్టులలో ఒక భాగం.
దీని కింద రాబోయే సంవత్సరాల్లో పాకిస్తాన్ నౌకాదళంలో మొత్తం ఎనిమిది జలాంతర్గాములను చేర్చనున్నారు.
అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, హాంగోర్ తరగతి జలాంతర్గాములలో అంత ప్రత్యేకత ఏమిటి? పాకిస్తాన్‌కు వాటి అవసరం ఎందుకు వచ్చింది?
దీనిపై నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

ఫొటో సోర్స్, Pakistan Navy
పాకిస్తాన్ నౌకాదళంలో జలాంతర్గాముల ప్రయాణం
నిపుణులు చెబుతున్న ప్రకారం.. 1960 దశకంలో అమెరికా నుంచి టెంచ్ క్లాస్ జలాంతర్గాములను కొనుగోలు చేయడం ద్వారా పాకిస్తాన్ నౌకాదళ జలాంతర్గాముల సేవలకు పునాది పడింది.
ఆ తర్వాత, ఫ్రాన్స్ నుంచి డాఫ్ని తరగతి, అగస్తా తరగతి జలాంతర్గాములను కొనుగోలు చేశారు.
అగస్తా కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్లో రెండు జలాంతర్గాములను అభివృద్ధి చేశారు.
ఈ అనుభవమే తదనంతరం హాంగోర్ క్లాస్ కార్యక్రమానికి ఆధారమైందని పాకిస్తాన్ నేవీ తెలిపింది.
2015 ఏప్రిల్‌లో ఇస్లామాబాద్‌కి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చిన సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
2015 ఏప్రిల్‌లో ఎనిమిది హాంగోర్ తరగతి జలాంతర్గాములను అభివృద్ధి చేసేందుకు ఒక ఒప్పందంపై షీ జిన్‌పింగ్ సంతకం చేశారు.
ఈ ప్రాజెక్టు కింద చైనాలోనే నాలుగు జలాంతర్గాములను అభివృద్ధి చేస్తుండగా.. మరో నాలుగు కరాచీలోనే అభివృద్ధి చేస్తున్నారు.

హాంగోర్ తరగతిలో కొత్తగా ఏముంది?
చైనా ఆధునిక 039బీ యువాన్ తరగతి జలాంతర్గామి ఆధారంగా హాంగోర్ రూపొందించారు.
ఈ జలాంతర్గాములు అధునాతన రాడార్, సోనార్, ఎలక్ట్రానిక్ సహాయక వ్యవస్థలు, ఆప్ట్రానిక్ స్కోప్‌లతో అమర్చి ఉన్నాయి. ఇవి ఉపరితలంపై, నీటి అడుగున మెరుగైన నిఘాను అందించగలవు.
ఆయుధాల పరంగా చూస్తే, హాంగోర్ తరగతి జలాంతర్గాములు భారీ బరువు గల టార్పెడోలు, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించగలవు.
''హంగోర్ తరగతి జలాంతర్గాములు కేవలం ఆయుధాల వాడకానికే పరిమితం కాదు. అవి విస్తృత వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించడంలో కూడా సహాయపడతాయి'' అని పాకిస్తాన్ నేవీ చెప్పింది.
ఈ జలాంతర్గాములు ప్రధానంగా మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి:
- శత్రువుకు సముద్ర మార్గాలను అసురక్షితంగా మార్చడం
- శత్రు యుద్ధనౌకలు, జలాంతర్గాములను గుర్తించడం
- సమాచారాన్ని సేకరించడం
అందుకే, జలాంతర్గాములను కీలకమైన వ్యూహాత్మక ఆయుధంగా పరిగణిస్తారు. ఈ జలాంతర్గాముల కీలకమైన ఫీచర్ ఏంటంటే.. వాటి ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) సిస్టమ్.
సంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములు తమ బ్యాటరీలను రీచార్జ్ చేసుకునేందుకు క్రమం తప్పకుండా ఉపరితలంపైకి రావాలి. కానీ, ఏఐపీ జలాంతర్గాములు ఎక్కువ కాలం నీటి అడుగునే ఉండగలవు.
ఈ ప్రత్యేక ఫీచర్‌తో.. సుదీర్ఘకాలం పాటు నిశ్శబ్దంగా తమ మిషన్లను ఈ జలాంతర్గాములు నిర్వహిస్తాయి.
అంటే.. హాంగోర్ తరగతి జలాంతర్గామి శత్రువుల కంట పడకుండా, సుదీర్ఘ కాలం పాటు సముద్రంలో ఉండగలదు. ఈ విధంగా రహస్యంగా, ఎక్కువ కాలం మనుగడ సాగించగల ఈ సామర్థ్యమే దీనిని నిజంగా అత్యంత ప్రభావవంతమైనదిగా మారుస్తుంది.

ఫొటో సోర్స్, Pakistan Navy
ప్రధాన తేడా ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమే
1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన రిటైర్డ్ వైస్ అడ్మిరల్ అహ్మద్ తస్నీమ్ ఆ దేశపు మొట్టమొదటి జలాంతర్గామి 'ఘాజీ'లో నియమితులయ్యారు.
ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమే దీని అతిపెద్ద తేడా అని బీబీసీతో చెప్పారు. దీనివల్ల ఈ జలాంతర్గామి ఎక్కువ కాలం పాటు కనపడకుండా ఉండగలదని, అదే దాని అసలైన ప్రయోజనమని చెప్పారు.
తమ కాలంలో జలాంతర్గాములు తరచూ బ్యాటరీలను చార్జ్ చేయడానికి ఉపరితలానికి దగ్గరగా రావాల్సి వచ్చేదని, అయితే కొత్త హాంగోర్ తరగతి జలాంతర్గాములు ఇలా చాలా తక్కువ సార్లు రావాల్సి వస్తుందని అహ్మద్ తస్నీమ్ తెలిపారు.
''గతంలో మేం టార్పెడోలను వాడేవాళ్లం. ఆ తర్వాత హార్పూన్ క్షిపణులను వాడాం. ఇప్పుడు అధునాతన, దీర్ఘశ్రేణి ఆయుధాలు ఉన్నాయి. వాటి వార్ హెడ్లు భిన్నంగా ఉంటాయి. సెన్సర్లు మెరుగ్గా ఉన్నాయి. తక్కువ శబ్దం వస్తుంది. మొత్తంగా ఇది మరింత మెరుగైన, సమర్థవంతమైన జలాంతర్గామి'' అని చెప్పారు.
''మా ప్రస్తుత, కొత్త జలాంతర్గాముల కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది'' అని ఏఐపీ సిస్టమ్ గురించి పాకిస్తాన్ నేవీకి చెందిన రిటైర్డ్ కమోడోర్ సయ్యద్ మొహమ్మద్ ఒబైదుల్లా తెలిపారు.
పాకిస్తాన్ నేవీకి చెందిన కొన్ని జలాంతర్గాముల్లో ఏఐపీ వ్యవస్థ ఇప్పటికే ఉందని చెప్పారు.

ఫొటో సోర్స్, Pakistan Navy
ఎనిమిది కొత్త జలాంతర్గాములు ఎందుకు అవసరం?
కొత్త జలాంతర్గాములు ఎందుకు అవసరం? ఈ ప్రశ్నకు అహ్మద్ తస్నీమ్ సమాధానమిస్తూ.. "ప్రాథమికంగా, ఈ కొత్త జలాంతర్గాములు పాత వాటి స్థానాన్ని భర్తీ చేస్తాయి" అని అన్నారు.
పాత జలాంతర్గాములు సుమారు 35 సంవత్సరాల వయసు గలవి, 1960లు, 1970ల నాటి జలాంతర్గాములు వాటి ఆపరేషనల్ లైఫ్‌ను పూర్తి చేసుకున్నాయని చెప్పారు. అందువల్ల వాటిని మార్చడం అవసరమైందన్నారు.
"ఇది కేవలం ఒక రీప్లేస్మెంట్ మాత్రమే, ఎవరితోనూ పోటీ లేదు" అని చెప్పారు.
''భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నౌకాదళాలు నిరంతరం తమను తాము అప్డేట్ చేసుకుంటూ ఉంటాయి'' అని సయ్యద్ మొహమ్మద్ ఒబైదుల్లా తెలిపారు.
"మేం ప్రధానంగా డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములను, మొదట డాఫ్ని తరగతి, ఆ తర్వాత అగోస్తా తరగతిని నడుపుతున్నాం. భవిష్యత్తు ముప్పులను ఎదుర్కోవడానికి ఇప్పుడు మాకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి నౌకాదళం కూడా మెరుగైన, మరింత ఆధునిక పరికరాలను కోరుకుంటుంది" అని ఆయన అన్నారు.
"భారత జలాంతర్గాములు కూడా మాకు ఒక సవాలే. వారి వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అవి చాలా వేగవంతమైనవి కానీ, పెద్ద శబ్దం చేస్తాయి. వారి వద్ద మంచి ఆయుధాలు ఉన్నాయి. కానీ, వాటిల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి" రిటైర్డ్ వైస్ అడ్మిరల్ అహ్మద్ తస్నీమ్ చెప్పారు.
"పాకిస్తాన్లో కూడా సమస్యలు ఉన్నాయి. కానీ మా స్ఫూర్తి, అనుభవం చాలా బలంగా ఉంది'' అని తెలిపారు.
భారత్ వద్ద 20 జలాంతర్గాములు ఉన్నాయని, అయితే వాటిలో ఏఐపీ వ్యవస్థ లేదని సయ్యద్ మొహమ్మద్ ఒబైదుల్లా పేర్కొన్నారు.
ఈ జలాంతర్గాములు ఎందుకంత ముఖ్యం
హిందూ మహాసముద్రంలో చైనా, భారత్, ఇతర ప్రాంతీయ శక్తుల మధ్య నౌకాదళ కార్యకలాపాలు పెరగడం వల్ల జలాంతర్గాముల ప్రాముఖ్యం పెరుగుతోంది.
పాకిస్తాన్ నౌకాదళ వ్యూహం ప్రధానంగా రక్షణాత్మకమైనదని, దాని లక్ష్యం ఏ భూభాగాన్నీ ఆక్రమించడం కాదని, శత్రువును దాడి చేయకుండా నిరోధించడమేనని పాకిస్తాన్ నౌకాదళ మాజీ అధికారులు నొక్కి చెప్పారు.
కమోడోర్ సయ్యద్ మొహమ్మద్ ఒబైదుల్లా (రిటైర్డ్) దీనిని "ఏరియా డినయల్" వ్యూహం అని పిలుస్తారు. అంటే, శత్రువులు మనకు ముప్పు కలిగించగల స్థాయికి చేరుకోకుండా మనం వారిని నిరోధించాలనుకోవడం.
''శత్రువు దగ్గరకు రాలేకపోతే, వారు ముప్పుగా మారలేరు, అదే మా వ్యూహం'' అని చెప్పారు.
అయితే, ఎనిమిది కొత్త ఏఐపీ జలాంతర్గాముల చేరిక పాకిస్తాన్ జలాంతర్గామి యుద్ధ సామర్థ్యాలను, రహస్య కార్యకలాపాలను, సముద్ర సమాచార మార్గాల రక్షణను గణనీయంగా మెరుగుపరుస్తుందని రక్షణ నిపుణులు అంగీకరిస్తున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























