అమెరికాతో ఒప్పందానికి దగ్గరగా వచ్చామన్న ఇరాన్, హార్ముజ్ జలసంధిపై ఏం చెప్పిందంటే..?

ఏప్రిల్‌లో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత తెహ్రాన్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఏప్రిల్‌లో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత తెహ్రాన్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి
    • రచయిత, గానీ ఎ డొనోగ్యూ,
    • హోదా, సీనియర్ నార్త్ అమెరికా కరస్పాండెంట్
    • నుంచి, వాషింగ్టన్ డీసీ
    • రచయిత, ఒలివియా ఐర్లాండ్
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఇరాన్‌లో యుద్ధం ముగింపునకు అమెరికాతో ఒప్పందానికి దగ్గరగా వచ్చామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం కూడా ఈ ఒప్పందంలో ఒక భాగమని ప్రభుత్వ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

ఇరాన్‌పై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడం కూడా ఈ ఒప్పందంలో భాగమేనని పేర్కొన్న ఆయన.. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు తర్వాత ప్రారంభమవుతాయన్నారు.

ఈ డీల్‌లోని కొన్ని వివరాలను ధృవీకరించిన అమెరికా అధికారులు ఇరాన్ తన మాటను నిలబెట్టుకుంటేనే ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని స్పష్టం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

డీల్‌లోని 14 అంశాలపై అమెరికా స్పందన..

ఇరాన్‌పై ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులతో ఈ యుద్ధం మొదలైంది. ఇది ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలపై దాడులు చేయడానికి పురిగొల్పింది. ప్రపంచవ్యాప్తంగా చమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడింది.

ఇరాన్, అమెరికా ఏప్రిల్‌లో కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయినప్పటికీ ఈ రెండు దేశాల మధ్య అప్పుడప్పుడు పరస్పర కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ వారంలో కూడా రెండు రౌండ్ల పాటు ఒకరిపైకొకరు ప్రతీకార దాడులు చేసుకున్నారు.

'చర్చల ప్రతినిధులు ఇప్పుడే ఒక గొప్ప సెటిల్‌మెంట్‌ సాధించారు', అందుకే ఇరాన్‌పై జరపాల్సిన 'దాడులను' తాను రద్దు చేసినట్లు గురువారం ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఒప్పందంపై త్వరలోనే సంతకాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

అయితే, సెటిల్‌మెంట్‌లో భాగంగా కుదిరినట్లుగా చెబుతున్న 14-అంశాలపైన ఇరాన్ మీడియా శుక్రవారం కొన్ని వివరాలను ప్రచురించింది.

తాము అంగీకరించిన నిబంధనలకు ఇరాన్ మీడియాలో పేర్కొన్న అంశాలకు అసలు సంబంధమే లేదని ఇవి వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని ట్రంప్ అన్నారు.

డోనల్డ్ ట్రంప్, అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images

డీల్‌కు ఇరాన్ సుప్రీం కౌన్సిల్ అంగీకరించిందా?

ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత, ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, ''అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. కేవలం తుది రూపం దాల్చడమే మిగిలి ఉంది'' అని చెప్పారు.

తాజా ఒప్పంద నిబంధనలపై ఇరాన్ అత్యున్నత భద్రతా సంస్థ 'సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్'లో ఏకాభిప్రాయం కుదరలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీని ఉటంకిస్తూ అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

'ఒప్పందంపై ఇంకా ఒక ఉమ్మడి నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతానికి మనం వేచి చూడాలి. ఒకవేళ ఒప్పందానికి ఆమోదం లభిస్తే, ఈ ఒప్పందంపై ఆన్‌లైన్ ద్వారా సంతకాలు జరుగుతాయి' అని అరాగ్చీ తెలిపారు.

ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న ఈ దౌత్య చర్చల్లో ఇజ్రాయెల్‌కు భాగస్వామ్యం లేదు. కాల్పుల విరమణను పొడిగించడం, ఇరాన్ అణు కార్యక్రమంతో సహా కీలక అంశాలపై చర్చలు జరుపడం ఈ దౌత్య చర్చల ముఖ్య ఉద్దేశం.

ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడానికి ప్రయత్నిస్తోందని పాశ్చాత్య దేశాలు దశాబ్దాలుగా ఆరోపిస్తున్నాయి. ఇరాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. కేవలం విద్యుత్ ఉత్పత్తి, పరిశోధనల వంటి శాంతియుత ప్రయోజనాల కోసమే తమ అణు కార్యక్రమమని ఇరాన్ చెబుతూ వస్తోంది.

హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Getty Images

తాజా డీల్‌లో ఏముంది?

అమెరికా తన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే, ఇరాన్ హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని శుక్రవారం జర్నలిస్టులతో మాట్లాడుతూ అమెరికా అధికారులు చెప్పారు. ఈ చర్యలు దాదాపు తక్షణమే అమలులోకి వస్తాయని అన్నారు.

'దీని తర్వాత 60 రోజుల పాటు చర్చల కాలం ఉంటుంది. ఈ కాలంలో ప్రధానంగా ఇరాన్ శుద్ధిచేసిన యురేనియంపై దృష్టి సారిస్తాం. శుద్ధి చేసిన ఈ యురేనియాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేసి, దేశం నుంచి తరలించడంపై చర్చలు జరుగుతాయి. దీనికి సంబంధించిన కచ్చితమైన విధానాన్ని ఇంకా ఖరారు కావాల్సి ఉంది' అని జర్నలిస్టులకు అమెరికా అధికారులు వెల్లడించారు.

ఈ చర్చలు మొదలుకాకముందే అమెరికా స్తంభింపచేసిన ఆస్తులను విడుదల చేస్తారని ఇరాన్ మీడియా ప్రచారం చేస్తోందని చెప్పిన అధికారులు అలా జరుగదని స్పష్టం చేశారు.

'ఒప్పందంలో పేర్కొన్నట్లుగా ఇరాన్ తమ మాట నిలబెట్టుకుంటే దశల వారీగా ఇరాన్‌పై ఉన్న ఆంక్షల్ని తొలగించడం, ఆస్తుల విడుదల ఉంటుంది. అలా క్రమక్రమంగా ఇరాన్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కలుపుతాం' అని వారు అన్నారు.

హిజ్బొల్లాతో పాటు మిడిల్ ఈస్ట్‌లోని ఇతర ఇరాన్ అనుకూల గ్రూపులకు ఇరాన్ నిధులు ఇవ్వడం ఆపాలని కూడా ఈ ఒప్పందం కోరుతోంది.

ట్రంప్

ఫొటో సోర్స్, EPA

'మాట నిలబెట్టుకుంటేనే ఆర్థిక ప్రయోజనాలు'

నమ్మకం, హామీ వంటి అంశాలపై కాకుండా 'పూర్తిగా పనితీరు'పైనే ఈ అవగాహన ఒప్పందం ఆధారపడి ఉంటుందని అమెరికా అధికారులు నొక్కి చెప్పారు. ఇరాన్ తాము కట్టుబడి ఉంటామని అంగీకరించిన చర్యలను అమలు చేసినట్లు నిర్థరణ అయినప్పుడే వారికి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని వారు స్పష్టం చేశారు.

ఈ ఒప్పందం అంగీకారానికి వస్తుందనే విషయంలో అమెరికా, ఇరాన్, పాకిస్తాన్, ఖతార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ డీల్ పూర్తవ్వడానికి ఇంకా కొన్ని అడుగుల దూరం మిగిలే ఉంది.

గత రెండు నెలల్లో ఇలాంటి ఒప్పందాలు దాదాపు చివరి నిమిషంలో చాలాసార్లు విఫలమయ్యాయి. కానీ, ఈసారి ఇరుపక్షాల్లో మునుపటి కంటే ఎక్కువ నమ్మకం, స్పష్టత కనిపిస్తున్నాయని అమెరికా అంటోంది. తుది దశ చర్చలు పూర్తికాగానే ఒప్పందంపై సంతకాలు చేసి అధికారికంగా ప్రకటిస్తామని అబ్బాస్ అరాగ్చీ అన్నారు.

''రాబోయే రోజుల్లోనే ఒప్పందం కుదరొచ్చు. నేనైతే చాలా నమ్మకంతో ఉన్నాను' అని ప్రభుత్వ టీవీతో అరాగ్చీ అన్నారు.

ఇరాన్‌పై అమెరికా నౌకదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడమే ఈ అవగాహన ఒప్పందంలోని మొదటి అంశమని ఆయన చెప్పారు.

హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Reuters

'హార్ముజ్ నిర్వహణ ఇకపై మునుపటిలా ఉండదు'

అయితే, ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా ఉన్న హార్ముజ్ జలసంధి నిర్వహణ ఇకపై మునుపటిలా ఉండదని ఇరాన్ అంటోంది.

హార్ముజ్ గుండా వెళ్లే నౌకలు ఫీజు చెల్లించాలని ఇరాన్ పట్టుబడుతుండగా, అన్ని రవాణా నౌకలకు హార్ముజ్‌లో ఉచిత ప్రవేశం ఉండాలని అమెరికా వాదిస్తోంది.

ఇక లెబనాన్‌లోని ఇజ్రాయెల్-హిజ్బొల్లా మధ్య ఘర్షణకు ముగింపు పలకడం కూడా ఈ ఒప్పందంలో ఉందని అరాగ్చీ తెలిపారు. అయితే, లెబనాన్ అంశానికి ఈ ఒప్పందంలో చోటు ఉండకపోవచ్చని గతంలో అమెరికా నివేదికలు సూచించాయి. కానీ ఇరాన్ మాత్రం దీని కోసం గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

అదనపు సమాచారం: బెర్నాడ్ డెబస్మాన్, వైట్ హౌజ్ రిపోర్టర్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)