నీట్ విద్యార్థిని ఆత్మహత్య : ‘‘అమ్మా నాన్నా నన్ను క్షమించండి.. మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు, అంతా అయిపోయింది’’

- రచయిత, భాగ్యశ్రీ రౌత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
" ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండి ఉంటే నీట్ పేపర్ లీకయ్యేది కాదు, నా కుమార్తె కూడా బతికేది".
బీబీసీ న్యూస్‌తో మాట్లాడిన 18 ఏళ్ల స్నేహ చతుర్వేది తండ్రి కృష్ణకుమార్ చతుర్వేది ఆవేదన ఇది.
నాగ్‌పూర్‌లోని తన ఇంట్లో స్నేహ చతుర్వేది 2026 మే 20న ఆత్మహత్య చేసుకున్నారు.
ఆమె 2026 మే 3న జరిగిన నీట్ పరీక్షకు హాజరయ్యారు. కానీ పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు.
(ఆత్మహత్య తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు ఒత్తిడికి గురైతే భారత ప్రభుత్వ జీవన్ సాధీ హెల్ప్‌లైన్ 18002333330 సాయం కోరవచ్చు. అలాగే మీ స్నేహితులు, బంధువులతోనూ మాట్లాడండి)

ఆత్మహత్యకు ముందు తమ కుమార్తె ఒక నోట్ రాసిందని, నీట్ పేపర్ రద్దు కావడంతో ఎదుర్కొన్న ఒత్తిడి గురించి అందులో ప్రస్తావించినట్లు స్నేహ తల్లిదండ్రులు చెబుతున్నారు.
స్నేహ తండ్రి వాంగ్మూలం మేరకు నాగ్‌పూర్‌లోని అంబజారి పోలీస్ స్టేషన్‌లో స్నేహ ఆత్మహత్యపై కేసు నమోదైంది.
మరోవైపు స్నేహ ఆత్మహత్యకు సంబంధించి ‘ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని’ నాగ్ పూర్ జోన్-2 డిప్యూటీ పోలీస్ కమిషనర్ నిత్యానంద్ ఝా తెలిపారు.
స్నేహ చతుర్వేది మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాకు చెందినవారు. ఆమె తండ్రి కృష్ణకుమార్ చతుర్వేది 20 ఏళ్ల కిందట జీవనోపాధి కోసం నాగ్‌పూర్ వచ్చారు.
ఆయన నాగ్‌పూర్‌లోని అంబజారి హిల్‌టాప్ ప్రాంతంలోని అజయ్ నగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
కృష్ణకుమార్ ఇంతకుముందు చెఫ్‌గా పనిచేసేవారు. కానీ రెండు సార్లు గుండెపోటు రావడంతో ఆ ఉద్యోగం కూడా మానేశారు.
తన కూతురిని డాక్టర్ చేయాలని కలలు కన్నారు. ఆరోగ్యం సరిగా లేనప్పటికీ, తన కుమార్తె చదువు కోసం చాలా కష్టపడ్డారు.
నీట్ పరీక్షకు సిద్ధం కావడానికి ప్రముఖ సంస్థల్లో స్నేహకు కోచింగ్ ఇప్పించారు.
" మొదటిసారి నీట్ పరీక్ష రాసినప్పుడు, బాగా రాశానని, మంచి కాలేజీలో అడ్మిషన్ వస్తుందని చెప్పింది. కానీ నీట్ పరీక్ష కుంభకోణం వెలుగులోకి వచ్చి, మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుందని తెలిశాక ఆమె ముఖంలో నవ్వు మాయమైంది. సరిగా తినేదికాదు. ఎవరితోనూ మాట్లాడేదికాదు" అని స్నేహ ఆత్మహత్య గురించి బీబీసీతో మాట్లాడిన ఆయన కన్నీటిపర్యతం అయ్యారు.
"డాక్టర్ అవ్వాలన్న నా కుమార్తె కల నెరవేర్చడానికి నేను చాలా బాధలుపడ్డా. ఎంత కష్టపడైనా తనని డాక్టర్‌ని చెయ్యాలనుకున్నా. కానీ ఇప్పుడు నా కూతురు పోయింది. ఆమె కష్టపడి చదివిందంతా వృధా అయిపోయింది. ఆమె చదువుకోసం చేసిన అప్పుల్లో నిండా మునిగాను. అంతా కోల్పోయా. ఇపుడు దేనికోసం బతకాలి? ప్రభుత్వం సక్రమంగా పరీక్ష నిర్వహించి ఉంటే ఈ రోజు నా కూతురు బతికే ఉండేది" అని ఆయన అన్నారు.
స్నేహ ఆత్మహత్య చేసుకున్న రోజున ఏం జరిగిందో ఆమె తల్లి నీలం చతుర్వేది బీబీసీకి చెప్పారు.
‘‘మే 20వ తేదీన తాను, తన కుమారుడు ఇంటి బయట కూర్చున్నామని, స్నేహ ఇంట్లో ఒంటరిగా ఉందని, మధ్యాహ్నం 3గంటల సమయంలో ఎన్నిసార్లు పిలిచినా స్నేహ తలుపు తీయకపోవడంతో భయమేసిందని, తన కుమారుడిని పై నుంచి లోపలకు చూడమని చెప్పానని, తన కుమారుడు పైకి ఎక్కి చూడగా స్నేహ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది’’ అని నీలం చతుర్వేది వివరించారు.
ఈ ఘటనపై వివరాలు తెలుసుకోవడానికి బీబీసీ బృందం నాగ్‌పూర్‌లోని అంబజారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ స్నేహ తండ్రి వాంగ్మూలం ఆధారంగా ఆత్మహత్య కేసు నమోదైందని తెలిసింది.
నీట్ పరీక్ష రద్దు అయినప్పటి నుంచే స్నేహ ఒత్తిడికి గురయ్యారు.

'సూసైడ్ నోట్'లో ఏముంది?
ఆత్మహత్యకు ముందు స్నేహ ఒక నోట్ రాసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని, కానీ అలాంటిదేమీ దొరకలేదని పోలీసులు తెలిపారు.
"అమ్మా, నాన్నా మీరు నామీద నమ్మకం పెట్టుకున్నారు. నేను కష్టపడి చదువుకుని డాక్టర్ అవ్వాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు. మొదటి ప్రయత్నంలోనే మంచి మార్కులు వస్తాయి, నా కృషి ఫలిస్తుందని ఆశించా. కానీ ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాలి. ఈసారి అంత బాగా రాయగలనో, లేదో తెలియదు. దయచేసి నన్ను క్షమించండి. మీరు కోరుకున్నట్టుగా డాక్టర్ అవ్వలేకపోతున్నా. అంతా అయిపోయింది" అని స్నేహ సూసైడ్ నోట్‌లో రాసినట్టు ఆమె కుటుంబం సభ్యులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘యువత మూల్యం చెల్లిస్తోంది’’
స్నేహ మరణం గురించి రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు . ఈ ఘటనకు కారణం మోదీ ప్రభుత్వం అని నిందించారు.
రాహుల్ గాంధీ తన పోస్ట్‌లో స్నేహను 'ఆకాంక్ష' అని పేర్కొన్నారు. అయితే బీబీసీ ఆమె కుటుంబాన్ని సంప్రదించగా అసలు పేరు 'స్నేహ' అని తెలిసింది.
'ఆకాంక్ష డాక్టర్ అయి దేశానికి, సమాజానికి సేవ చేయాలనుకుంది. ఆకాంక్ష తండ్రి రైతు. తన కూతురు డాక్టర్ కావాలన్న కల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై మూడు లక్షల రూపాయల రుణం తీసుకుని నాగ్ పూర్‌లో షెఫ్‌గా ఉద్యోగం చేశాడు. దాంతో ఆమె అక్కడ కోచింగ్ తీసుకోగలిగింది. ఒక తండ్రి తాను చేయగలిగినదంతా చేశాడు. కానీ అప్పుడే నీట్ పేపర్ లీక్ అయింది. పరీక్ష రద్దైంది. ఆ అనిశ్చితిలో ఆకాంక్ష మనల్ని విడిచి వెళ్లిపోయింది" అని రాహుల్ గాంధీ పోస్ట్‌లో రాశారు.
"ఆకాంక్ష మరణం ఆత్మహత్య కాదు, మోదీ జీ అవినీతి, విచ్ఛిన్నమైన వ్యవస్థ ఫలితం. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు? ఆయనింకా పదవిలోనే ఉన్నారు. ఆ తర్వాత అదే కమిటీ. అదే బదిలీ. అదే విచారణ. సంస్కరణ లేదు, న్యాయం లేదు" అని మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
"మోదీజీ, కుర్చీ శాశ్వతం కాదు. అది వస్తుంది, పోతుంది. కానీ 12 ఏళ్లలో మీరు విద్యా వ్యవస్థను ఎంత నాశనం చేశారంటే దానికి దేశంలోని యువతరం అంతా మూల్యం చెల్లిస్తోంది" అని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ అన్నారు.
ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























