ఈ లైవ్ పేజీని ఈ రోజుకు ముగిస్తున్నాం.
బీబీసీ న్యూస్ తెలుగు వెబ్సైట్లో కొన్ని ముఖ్యమైన వార్తాంశాలను చదవాలంటే ఈ కింది లింక్‌లను క్లిక్ చేయండి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘ఓట్లు చోరీకి గురవుతున్నాయని దేశమంతటికీ తెలుసు. నరేంద్ర మోదీ దీనికి సూత్రధారి. అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ దీన్ని అమలు చేస్తున్నారు. ఈ నిజాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఖండించలేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
ఈ లైవ్ పేజీని ఈ రోజుకు ముగిస్తున్నాం.
బీబీసీ న్యూస్ తెలుగు వెబ్సైట్లో కొన్ని ముఖ్యమైన వార్తాంశాలను చదవాలంటే ఈ కింది లింక్‌లను క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, ANI
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
‘ఓట్లు చోరీకి గురవుతున్నాయని దేశమంతటికీ తెలుసు. నరేంద్ర మోదీ దీనికి సూత్రధారి. అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ దీన్ని అమలు చేస్తున్నారు. ఈ నిజాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఖండించలేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఇండియా కూటమి నాయకులు రాష్ట్రపతిని కలిసి మెమొరాండం సమర్పించినట్లు చెప్పారు. దేశంలో ఓట్ల చోరీ గురించి, తాము చేస్తున్న నిరసనల గురించి తెలిపామన్నారు. అన్ని వివరాలూ రాష్ట్రపతికి చెప్పామన్నారు. ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రపతిని కోరామన్నారు.
ఓట్ల చోరీకి ఆధారాలు చూపించాలని రాష్ట్రపతి అడిగారని, త్వరలో సమర్పిస్తామని ఖర్గే చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
ఇండియా కూటమి ఎంపీలు శుక్రవారం రాత్రి భేటీ అయిన తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశానికి బయల్దేరారు.
దారిలో వారు విజయ్ చౌక్ వద్ద బైఠాయించి సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
అక్కడి నుంచి 10 మంది విపక్ష ఎంపీలు రాష్ట్రపతిని కలవడానికి వెళ్తున్నట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, ANI
సీజేపీ నిరసనల నేపథ్యంలో దిల్లీలోని నిర్దిష్ట ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జనపథ్-కర్తవ్య పథ్ కూడలి చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తారు.
అక్టోబర్ 9 రాత్రి 10 గంటల నుంచి అక్టోబర్ 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు 24 గంటల పాటు అక్కడ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవని ఈ మేరకు పోలీసులు జారీచేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల నేపథ్యంలో దిల్లీ నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను రద్దు చేయడం, 57 మెట్రో స్టేషన్లను మూసివేయడంపై సుప్రీంకోర్ట్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు... ‘రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి’ అని సూచించినట్లు లైవ్‌లా వెబ్సైట్ పేర్కొంది.
మెట్రో స్టేషన్ల మూసివేత విషయంలోనూ సుప్రీంకోర్ట్ సూచనలు చేసిందని, ప్రజలు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు ఉండాలని పేర్కొందని లైవ్‌లా వెబ్సైట్ తెలిపింది.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఒక పిటిషన్లో, "అన్ని రైళ్లను రద్దు చేశారు, మెట్రో స్టేషన్లను మూసివేశారు, మీరు ఎక్కడికీ వెళ్లలేరు. దేశంలో ఇదే జరుగుతోంది. ఇది ఒక శాంతియుత నిరసన" అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతమ్ ‘నవి’ పిళ్లైని వరించింది.
అంతర్జాతీయ చట్టాలు, శాంతిని ప్రోత్సహించేందుకు చేసిన కృషికి గాను నోబెల్ కమిటీ ఆమెను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమె పేరును నార్వే నోబెల్ కమిటీ ఛైర్మన్ జోర్జెన్ వట్నె ఫ్రిడ్సెస్ ప్రకటించారు.
భారతీయ మూలాలున్న నవనీతమ్ పిళ్లై ఐరాసలో మానవ హక్కుల కమిషనర్‌గా పనిచేశారు.
ఎంతో ధైర్యసాహసాలతో నవి పిళ్లై ప్రపంచ శాంతి భద్రతల కోసం పనిచేశారని జోర్జెన్ కొనియాడారు.
“దక్షిణాఫ్రికాలో లాయర్‌గా ఆమె కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ వివక్షపై సుదీర్ఘ కాలం పాటు పోరాడారు.” అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ సహా వివిధ పక్షాలు ఈ నెల 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఆందోళనల నేపథ్యంలో, దిల్లీ నగరంలోని 57 మెట్రో స్టేషన్లను మూసివేసే అవకాశం ఉన్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు పంపిన ఒక లేఖలో దిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఈ లేఖలో పేర్కొన్నదాని ప్రకారం దిల్లీ నగరం నడిబొడ్డున ఉన్న అనేక మెట్రో స్టేషన్లతోపాటు చుట్టుపక్కల పలు స్టేషన్లు కూడా ఉన్నాయి.
‘‘ప్రతిపాదిత నిరసన కార్యక్రమాల కారణంగా అరాచక మూకల కదలికలు ఉండే అవకాశం ఉన్నందున, శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 57 మెట్రో స్టేషన్ల ఎంట్రన్స్, ఎగ్జిట్ గేట్లు మూసేసే అవకాశం ఉంది. అక్టోబర్ 10 నాటికి పరిస్థితులు చక్కబడే వరకు ఈ మూసివేత ఉండొచ్చు’’ అని ఆ ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
దేశంలోని ఆరు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారత ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఇచ్చిన ఫలితాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో భారతీయ జనతా పార్టీకి చెందిన హసీ రాణి రథ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మిలన్ ప్రధాన్‌పై 41,937 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హసి రాణి రథ్‌కు ఇప్పటివరకు 55,665 ఓట్లు రాగా, మిలన్ ప్రధాన్‌కు కేవలం 13,728 ఓట్లు మాత్రమే వచ్చాయి.
నందిగ్రామ్ అత్యంత చర్చనీయాంశమైన స్థానాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. అందుకే అందరి దృష్టి ఈ స్థానంపైనే ఉంది.
భారత ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని రెజినగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్లా కాఫీపై బీజేపీ అభ్యర్థి శంఖరవ్ చౌదరి ఆధిక్యంలో ఉన్నారు.
అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాశిష్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ ఆయనకంటే సుమారు 45 వేల ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు.
తమిళనాడులో రెండు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో మదురాంతకం, ధరాపురం అసెంబ్లీ స్థానాలో టీవీకే అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు.
పుదుచ్చేరిలోని తట్టంచవాడి నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ ఆనంద్ విజయం సాధించారు.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజీనగర్, తమిళనాడులోని మదురాంతకం, ధరాపురం, అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
గ్రీన్ కార్డ్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ఎనిమిది టెక్ కంపెనీలను తొలగించడాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించారు.
కంపెనీలకు చౌకైన విదేశీ కార్మికుల సరఫరాకు విమర్శకులు సహాయం చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఈ నిర్ణయాన్ని డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ప్రశ్నించిన తర్వాత, వాన్స్ ' సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విమర్శలు చేశారు. ‘సోషలిజం' అంటే పెద్ద కంపెనీలకు చౌకగా కార్మికుల సరఫరా ఎప్పటికీ ఆగకుండా ఉండేలా చూడటానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడటమే అనిపిస్తోంది."
మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని అనే ఎనిమిది కంపెనీలను సస్పెండ్ చేయాలన్న నిర్ణయం చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదానికి ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది.

ఫొటో సోర్స్, Getty Images
గురువారం మెక్సికోలోని సినలోవా రాష్ట్రంలోని ఒక జైలులో జరిగిన అల్లర్లలో పది మంది మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు.
చనిపోయినవారిలో 9 మంది ఖైదీలు ఉన్నారు. జైలు సందర్శనకు వచ్చిన ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారని అధికారులు ప్రకటించారు.
హింసను అదుపు చేసేందుకు నేషనల్ గార్డ్‌ను మోహరించిన తర్వాత, పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు చెబుతున్నారు.
అల్లర్లకు కారణం ఏంటో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.
మెక్సికోలోని అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రాల్లో సినలోవా ఒకటిగా పరిగణిస్తారు. ఇది డ్రగ్ కార్టెల్‌కు నిలయంగా ఉంది.

ఫొటో సోర్స్, @IsraelMFA
ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడి చేసినప్పటికీ, ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రదానం చేయనున్నారు.
భారత పైలట్ కోలుకున్న తర్వాత ఆయన ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం అందజేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు.
"ఈ రోజు మనం గౌరవిస్తున్న ఇజ్రాయెల్ వీరులతోపాటు, భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ కూడా త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కెప్టెన్ మచ్చర్ అపారమైన ధైర్యం, అత్యుత్తమ వృత్తి నైపుణ్యం ఒక పెద్ద విపత్తును నివారించడంలో సహాయపడ్డాయి. ఆయన కోలుకున్న తర్వాత, ఇజ్రాయెల్ ప్రజల తరపున ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయడం నాకు గౌరవంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.
భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్ దాడి చేయగా, ఆయన ధైర్యంగా ఎదుర్కొని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఎన్నికల కమిషన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి' ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మాజీ న్యాయమూర్తులు ఆరోపించారు.
'ఎన్నికల సంఘాన్ని బలహీనపరిచే ప్రయత్నాలకు' వ్యతిరేకంగా 42 మంది మాజీ న్యాయమూర్తులు ఒక బహిరంగ లేఖ రాశారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ లేఖలో, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, ఇతర రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై మాజీ న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పీటీఐ వార్తా సంస్థ ప్రకారం, ఆ లేఖపై సంతకం చేసిన మాజీ న్యాయమూర్తులు, ఎటువంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండా 'ఓట్ల దొంగతనం' ఆరోపణలు చేయడాన్ని ప్రశ్నించారు.
రాజ్యాంగ సంస్థలను పదేపదే 'దొంగలు', 'కుట్రదారులు' అని ముద్ర వేయడం ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
"సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు, కానీ వాటిని అపఖ్యాతి పాలు చేయడం కాదు" అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన నిరసన అక్టోబర్ 8న మూడో రోజుకు కొనసాగింది.

ఫొటో సోర్స్, Reuters
ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమిని సహా పలు ప్రధాన టెక్నాలజీ, ఐటీ కంపెనీలను యూఎస్ కార్మిక శాఖ యూఎస్ పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి తప్పించింది.
అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ఒక ప్రకటనలో తెలిపిన ప్రకారం, ఈ ప్రోగ్రామ్ నుంచి మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను కూడా తొలగించామని చెప్పారు. ఈ రెండు కంపెనీలపై పలు ఫెడరల్ దర్యాప్తులు కొనసాగుతుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు.
"ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్జెమినిలను పర్మినెంట్ వర్కర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. పలు ఫెడరల్ దర్యాప్తుల కారణంగా యూఎస్ కార్మిక శాఖ కూడా మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను ఈ ప్రోగ్రామ్ నుంచి తప్పించింది" అని సోండర్లింగ్ అన్నారు.
ఆయన ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్‌ను కూడా ప్రస్తావించారు.
బహుశా మైక్రోసాఫ్ట్ కంటే మరే ఇతర అమెరికన్ కంపెనీ కూడా ఈ వ్యవస్థను ఇంతగా దుర్వినియోగం చేసి ఉండదని సోండర్లింగ్ ఆరోపించారు.
2025లో మైక్రోసాఫ్ట్ సుమారు 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిందని సోండర్లింగ్ ఆరోపించారు.
కొన్ని పదవులకు అర్హతగల అమెరికన్ ఉద్యోగులను కనుగొనలేకపోతున్నామని ఆ సంస్థ ఇంతకుముందు చెప్పింది.
"వీసా ప్రక్రియ దుర్వినియోగాన్ని అరికట్టడం, అమెరికన్ కార్మికులను పరిరక్షించడానికి, ఈ రోజు తీసుకుంటున్న ఈ చరిత్రాత్మక చర్య ఒక ముఖ్యమైన మొదటి అడుగు" అని సోండర్లింగ్ X లోని ఒక పోస్ట్‌లో రాశారు.

ఫొటో సోర్స్, Office of the Prosecutor General
"బస్సులను లక్ష్యంగా చేసుకుని రష్యా జరిపిన దాడుల్లో" కనీసం 30 మంది మరణించారని యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.
సరిహద్దు నగరమైన క్రమటోర్స్క్లో పౌరులతో ప్రయాణిస్తున్న రెండు బస్సులపై రష్యా గ్లైడ్ బాంబులు దాడి చేశాయని అధికారులు తెలిపారు.
ఈ దాడిలో మరో 18 మంది గాయపడ్డారని డొనెట్స్క్ ప్రాంత అధిపతి వాడిమ్ ఫిల్యాష్కిన్ తెలిపారు.
సాధ్యమైనంత ఎక్కువ మంది పౌరులను చంపేందుకు, ప్రయాణికులతో వెళ్తున్న బస్సులను రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.
స్థానిక అధికారులు పోస్ట్ చేసిన చిత్రాలలో రోడ్డుపై శిథిలాలు, మండుతున్న బస్సు కనిపించాయి.
రష్యా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న కోట ప్రాంతంలో క్రామటోర్స్క్, దాని పొరుగు నగరమైన స్లోవియాన్స్క్ ఉన్నాయి. యుక్రెయిన్‌లోని డాన్బాస్ పారిశ్రామిక ప్రాంతం మొత్తం తమదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాదిస్తున్నారు.
దేశవ్యాప్తంగా రష్యా దాడులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో జరిగిన ఈ తాజా దాడిపై రష్యా ఇంకా స్పందించలేదు.
ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు నాటికి యుక్రెయిన్‌లో మరణించిన పౌరుల సంఖ్య, 2025 సంవత్సరం మొత్తం మీద మరణించిన పౌరుల సంఖ్యను మించిపోయింది.
నేను, బీబీసీ కరస్పాండెంట్ ఖగేష్, ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి