ఎస్బీఐ డేటా లీక్: ఏం జరిగింది, ఇప్పుడు ఖాతాదారులు ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'కి చెందిన వేల మంది ఖాతాదారుల సమాచారం డార్క్ వెబ్‌లో లీక్ అయింది.
ఈ డేటా ఉల్లంఘనపై బ్యాంకు విచారణను ప్రారంభించినట్లు బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. డార్క్ వెబ్‌లో లీక్ అయిన డేటాలో, 3,897 మంది ఖాతాదారుల వ్యక్తిగత గుర్తింపు సమాచారం (పీఐఐ) ఉన్నట్లు బ్యాంకు తెలిపింది.
దీనివల్ల వారు మోసాలకు గురయ్యే అవకాశం ఉందని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కి సమర్పించిన ఫైలింగ్‌లో బ్యాంకు పేర్కొంది. అయితే, దీనిని ఎదుర్కోవడానికి, దాని ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలు ప్రారంభించినట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఘటన వల్ల తమ వ్యాపార కార్యకలాపాలపై, ఆర్థిక పనితీరుపై లేదా లావాదేవీలపై ప్రభావం పడలేదని స్పష్టం చేసింది.
డార్క్ వెబ్‌లో లభించిన సుమారు 3.75 లక్షల రికార్డులను ప్రాథమికంగా పరిశీలించగా, అందులో 3,897 రికార్డుల్లో ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు గుర్తించామని బ్యాంకు పేర్కొంది. డార్క్ వెబ్‌లో లీక్ అయిన సమాచారంలో కస్టమర్ డేటాలో వారి పేరు, లింగం, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడి, ఇంటి చిరునామా, బ్యాంకు శాఖ ఐఎఫ్ఎస్సీ కోడ్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ నంబర్లు, లీడ్ ఐడీలు, రుణాలు లేదా లీడ్‌లకు సంబంధించిన మెటాడేటా ఉన్నాయి.
అక్టోబర్ 16న తమ 'థ్రెట్ ఇంటెలిజెన్స్' సర్వీస్ ప్రొవైడర్, 'డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ' 'CERT-In' నుంచి డార్క్ వెబ్‌లో డేటా అందుబాటులో ఉండవచ్చనే హెచ్చరికలు అందాయని ఎస్బీఐ తెలిపింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు 'CERT-In' గుర్తింపు పొందిన ఒక స్వతంత్ర సైబర్ భద్రతా సంస్థను బ్యాంకు నియమించింది.
డార్క్ వెబ్‌లో లభించే సమాచారం ఆధారంగా, మోసగాళ్లు బ్యాంకు ఉద్యోగిగా నటిస్తూ కస్టమర్‌కు ఫోన్ చేయవచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కస్టమర్ సమస్య పరిష్కరిస్తామని చెప్పి, వారి వివరాలు అడగవచ్చు. కస్టమర్‌కు పేరు, చిరునామా, రుణానికి సంబంధించిన సమాచారం లేదా మొబైల్ నంబర్‌తో ఫోన్ చేస్తే, ఆ వ్యక్తి బ్యాంకు ఉద్యోగి అయి ఉండవచ్చని ఖాతాదారులు భావించవచ్చు.
అందుకే కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి, కానీ తమ బ్యాంకు ఖాతాలు హ్యాక్ అయిందని ఆందోళన వద్దని నిపుణులు చెబుతున్నారు. కస్టమర్లు ఓటీపీలు, పిన్లు, పాస్‌వర్డ్‌లను పంచుకోకూడదు. అనుమానాస్పద కాల్స్ లేదా లింక్‌ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి మోసాలను నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని చర్యలు సూచించింది. దీని ప్రకారం-
- ఓటీపీ, పిన్ లేదా పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ పంచుకోవద్దు.
- ఏదైనా లావాదేవీ జరిగినప్పుడు మీకు తక్షణ నోటిఫికేషన్ అందేలా ఎంఎంఎస్, ఇమెయిల్ అలర్ట్‌లను ఎనేబుల్ చేసి ఉంచుకోండి.
- మీకు తెలియకుండా ఏదైనా లావాదేవీ జరిగితే, వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయండి.
- ఎల్లప్పుడూ ఎస్బిఐ అధికారిక సైట్, యాప్, అప్డేట్ చేసిన కస్టమర్-సర్వీస్ ఛానెల్‌లను ఉపయోగించండి.
- తెలియని వ్యక్తి పంపిన ఏ లింక్‌పైనా క్లిక్ చేయవద్దు.
- మీ రుణ ఖాతాపై నిఘా ఉంచండి.
- క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని ట్రాక్ చేయండి.
- ఏదైనా మోసం జరిగితే, భారత ప్రభుత్వ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయండి.

